Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – నలబయ్యవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

స్తోత్రం నిరూపణం

ఆ తరువాత కధను వ్యాసమహర్షికి బ్రహ్మ ఇలా చెప్పాడు.

“ఓ వ్యాసమునీంద్రా! ఈరకంగా దేవతాస్థానాలనన్నింటినీ ఆక్రమించి త్రిపురుడు బ్రహ్మలోకానికి దండెత్తివెళ్ళాడు. దేవతలవల్ల అతడి పరాక్రమం గురించి విన్న బ్రహ్మ విష్ణువు యొక్క నాభికమలంలో లీనమైనాడు. విష్ణువుకూడా, ఆ రాక్షసుడి కంటబడకుండా క్షీరసముద్రానికి వెళ్ళాడు. తన మానసపుత్రుడైన ప్రచండుని బ్రహ్మలోకానికి అధిపతినిచేసి, రెండో కుమారుడైన చండుని వైకుంఠానికి అధిపతిగా చేశాడు.

తాను స్వయంగా కైలాసానికి వెళ్ళి తన బాహువులతో కైలాసాన్ని కంపింపచేసాడు! ఆ భయానికి గిరిజ శివుని గట్టిగా ఆలింగనం చేసుకున్నది. తరువాత బైటకువచ్చిన శంకరుడితో ఆ రాక్షసుడిలా అన్నాడు.

‘నీకు ప్రాణాలమీద ఆశఉంటే మందరాద్రికి పోయి తలదాచుకో!” నాకు తృప్తి గలిగేదాకా నీవుఅక్కడేఉండు!” అని కోరిన ఆ రాక్షసుడికి గల అల్పాయుర్దాయాన్ని గుర్తుపెట్టుకున్న శంకరుడు అతడి కోరికను అనుసరించి మందరపర్వతానికి వెళ్ళిపోయాడు. అప్పుడా అసురుడు కైలాసశిఖరాన్ని అధిరోహించి అమిత సంతోషాన్ని పొందాడు.

అలా దేవలోకాలన్నీ ఆక్రమించి, రసాతలంవైపుకు వచ్చాడు. ఆ త్రిపురాసురుడు. భూమండలాన్ని ఆక్రమించిన భీమకాయుడు బలాత్కా రంగా రాజుల రాజ్యాలనన్నింటినీ కబళించి, ఋషులందరినీ బంధించాడు. దేవతలకు తృప్తినొసగే అగ్నిహోత్రాదులనన్నీ భగ్నం చేశాడు. ఆశ్రమాలనూ తీర్ధాలనూ పాడుచేసి, తాపసులందరినీ కారాగారాలలో బంధించాడు. గర్వోన్మత్తుడై ”స్వాహాకారా”లను, ”స్వధాకారా”లనూ ద్వేషిస్తూ ఉండి బ్రహ్మవేత్తలైన భూసురులను బాధించసాగాడు.

ఇక వజ్రదంష్టుడు సప్తపాతాళలోకాలను వశపరుచుకున్నాడు. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన నాగులనందరినీ వశపర్చుకున్నాడు. ఆ నాగుల తలలపైనున్న రత్నాలనన్నిటినీ తీసుకొనివచ్చి త్రిపురునికి సమర్పించాడు. ఆరకమైన పరాక్రమం చూపిన వజ్రదంష్టుడిని త్రిపురుడు అభినందించాడు.

ఈవిధంగా లోకకంటకుడైన ఆ త్రిపురుని దుష్టతకు మిక్కిలి వ్యాకులత చెందుతూన్న హిమవత్పర్వత గుహలలోని దేవతలకు నారద మహర్షి ప్రత్యక్షమైవారి బాధా నివారణకై గణేశానుగ్రహం పొందటమే సరైన మార్గమని ఉపదేశించగా సమస్త దేవతలూ భక్తితో గద్గదకంఠంతో తమకు సంప్రాప్తించిన ఈ ఘోరమైన సంకటాన్నుంచి రక్షించమని సాష్టాంగనమస్కారంచేసి భక్తితో పరిపూర్ణ శరణాగతితో ఈవిధంగా ప్రార్ధించారు సంకటమోచన గణేశ్వరుని గురించి భక్తితో!

దేవతలు:-

నమోనమస్తే! – ఓ పరబ్రహ్మ పరతత్త్వ స్వరూపా! ఈ సమస్త – సృష్టికి కారణభూతుడవైన నీకిదే నమస్కారం!!!

సర్వేంద్రియములకు అధిష్టాన దైవమై మా మనస్సూ, ఇంద్రియములు పనిచేయించే ప్రాణస్వరూపుడవై అఖిల కారణుడవైన అంతర్యామి స్వరూపుడవైన నీకు నమస్కారము.

పంచభూతాత్మకుడవై సమస్త సృష్టిగా వెలుగొందు ఓ దేవా! అట్టి పంచభూత స్వరూపమునకు ఆదిభూతమైన నీకిదే నమస్కారము! పంచ భూతములనూ సృష్టించిన భూతస్రష్టకు, పరమేష్టికిదే మా నమస్కారం! మా సర్వేంద్రియములనూ మేల్కొలిపి, మా మనస్సూ, ఇంద్రియములనూ పనిచేయించే అంతర్యామి స్వరూపా! సమస్త సృష్టికీ అధిభూతుడైన నీకు, సృష్టిస్దితి ప్రళయాధినాధుడైన పరమాత్ముడైన గణేశునకిదే నమస్కారము.

ఓ సమస్త విశ్వ స్వరూపా! ఈ సృష్టికి కారణభూతుడవై సమస్త భూతములకు మూలకారణుడవైన నీకిదే ఓ కారణకారణా నమస్కారము!

ఓ వేదస్వరూపా! వేదస్వరములన్నీ చేరి ప్రాణస్వరూపుడైన ఏ పరమాత్మునిలో లీనమౌతున్నాయో అట్టి వేదాంతవేద విరామరూపుడైన నీకివే మా నమోవాకములు రక్షించు!మమ్ములను వరములనుగ్రహించి.

ఓ వాక్కులకూ, మనస్సునకు అందని పరతత్వ స్వరూపుడా! మా విఘ్నములను నివారించు! మేమిదే నీకు శరణు పొందుతున్నాము. భక్తుల మనోరధములు సంకల్ప మాత్రములో తీర్చే ఓ భక్తమనోహరా! మా మనోరధములు సిద్ధింపజేయి! సమస్త రాక్షసవినాశకుడా! మా సర్వ సంకటములను నివారించి అసురుల బారినుంచి రక్షించుము! ఓ పరమ కారుణికుడా! కరుణామయుడా! జ్ఞానమయుడా! అపరిమిత దయా స్వరూపుడైన నీకిదే మా నమోవాకములు! ఓ పరమాత్ముడా! సమస్త జ్ఞానమునూ నశింపచేసే సుఖములనూ, భోగములనూ ప్రసాదించి భక్తుల జ్ఞానమును నీమాయచే హరించే యోగమాయాస్వరూపా! నమస్కారము!

భక్తిహీనులైన పాషండుల సంపదలను హరించే పరమాత్ముడా! నిజభక్తులకు ముక్తిని ప్రసాదించే భవబంధవినాశకుడా! నీకివే మా నమో వాకములు. నమస్తే! నమస్తే!! సమస్త సృష్టియంతా వ్యాపించి విభాగము లేని ఏకాత్మస్వరూపుడా! విభక్తమైనట్లుగా సృష్టిరూపంలో గోచరించే అవిభక్త మూర్తీ! నీకిదే మా శరణాగతి!

ఓ పరమ పరతత్వ జ్ఞానబోధకుడా! పరబ్రహ్మ తత్త్వవిధుడా! గురు స్వరూపుడవైన నీకు తత్త్వవిబోధకునకు మా నివాళులు! ఓ సమస్త భక్తుల బహుజన్మములు కర్మలకు సాక్షీభూతుడవైన కర్మసాక్షీ! జీవుల గుణస్వరూపుడవై వారి స్వభావాన్ని నడిపించే గుణ నాయకా! నమస్కారము!

పరమాత్ముడైన గణేశా! సుముఖుడా! సంకష్ట వినాశకుడా! మా సంకటములను నశింపచేయి. నమో నమస్తే! నమో నమః” అంటూ స్తోత్రంచేశారు దేవతలు! అంతట బ్రహ్మ మొదలైన దేవతలు ఈవిధంగా స్తోత్రంచేయగా పరమేశ్వరుడైన గణపతి దయార్ద హృదయుడై అనుగ్రహం తో వారిని చూస్తూ ఇలా చెప్పాడు.

గణేశ ఉవాచ

ఓ దేవతలారా! మీ భక్తికీ, తపస్సుకూ, మీ మిక్కిలి ఆర్తితో చేసిన ఈ స్తోత్రమునకు నేను చాలాసంతుష్టుడనైనాను! మీ కోరికలేవో కోరుకుంటే తప్పక అనుగ్రహించగలను. అనగా దేవతలు.

ఓ పరమాత్ముడా! మీకు మాయందు దయకలిగితే చాలు! త్వరగా ఈ ఘోరరాక్షసుడైన త్రిపురాసురుని సంహరించు! మా సమస్త దేవతల అధికారాలన్నీ కబళించిన ఈ దురహంకారిని నిర్మూలించు! మా సమస్థ దేవతలకూ నీవు ఒక్కడవే అభయప్రదానమిచ్చి మా ఆత్మలకు కలిగిన సంకటములను నివారించగలవాడివి! ఓ సంకటమోచన గణేశా! నీకిదే మా భక్తిపూర్వక శరణాగతి చేస్తున్నాము! మాకు నీకన్నా పరదైవము లేదు! నీవే మాకు దిక్కు!” అని ప్రార్ధించగా గణేశుడు వారితో.

గణేశ ఉవాచ:-

ఓ దేవతలారా! తప్పక నీకు కలిగిన ఈ రాక్షసబాధను నివారిస్తాను! ఘోరమైన ఈ ఆపదనుండి రక్షింపచేయగల ఈ మీరుచేసిన స్తోత్రం శాశ్వతముగా నిలుచుగాక ”సంకటనాశన గణపతిస్తోత్ర”మని! – భవిష్యత్ కాలాలలో ఎవరైతే దీనిని పఠించి నాకు ప్రార్ధనచేస్తారో వారందరికీకూడా సమస్త సంకటములునివారించగలను. సమస్త కోరికలనూ అనుగ్రహించగలను.

అంతేకాదు ఏమానవుడైనాసరే మూడు సంధ్యలలోనూ భక్తితో అనుష్ఠానపరుడై ఈ సంకటమోచన గణేశస్త్రోత్రాన్ని పఠిస్తారో అట్టివానికి ఎట్టి సంకటములు కలుగవని నేనిదే అనుగ్రహిస్తు న్నాను!” అంటూ అమోఘమైన వరాన్ని దేవతలకు భగవంతుడైన గణపతి అనుగ్రహించి చూస్తుండగానే మెరుపు మెరిసినట్లు అంతర్ధానం చెందాడు!

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”స్తోత్ర నిరూపణం” అనే నలబయ్యవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment