Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – నలబై ఒకటవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

బ్రాహ్మణాభీష్ట ప్రదానం

ఆ తరువాత పరాశర నందనుడైన వ్యాసమహర్షి “ఓ చతురాననా! అలా దేవతలకు వరప్రదానం చేశాక సకల గణాలకు అధిపతియైన గణపతి వరదుడై ఏమేమి లీలలను గావించాడో వినాలని కుతూహలంగా వున్నది. ఆ వివరాలను కనుక నాకు తెలియజేయవలసింది!” అన్న వ్యాసుని అభ్యర్ధనకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు.

“ఓ వ్యాసమునీంద్రా! దేవతలకందరికీ వరప్రదానం చేసిన గజాననుడు తానొక బ్రాహ్మణవేషం దాల్చి త్రిపురుని సన్నిధికి వెళ్ళాడు.. దేవేంద్రుని ఐశ్వర్యాన్నే మరపించేలా వెలలేని రత్నాలతో పొదగబడిన దివ్యసింహాసనాన్ని అధిష్టించి వున్న ఆ దానవుడిని చూశాడు.

అప్పుడు దిగ్గున సింహాసనంనుండి లేచి త్రిపురుడా బ్రాహ్మణుని ఎంతో ఆదరంగా తన ఆసనంపై కూర్చుండచేసి భక్తిశ్రద్ధలతో సపర్యలను చేసి పూజించి యిలా ప్రశ్నించాడు.

“ఓ బ్రాహ్మణోత్తమా! నీవెవరు? ఎక్కడినుండి వచ్చావు? నీకు ఎందులో పాండిత్యమున్నది? నీవిలా రాజసభకు ఏ కార్యార్థివై వచ్చావు? నీ కోరికేదైనా సరే సంకోచించకుండా చెప్పు!నా శక్తిమేఱకు నెరవేరుస్తాను..

అప్పుడా బ్రాహ్మణుడు “ఓ దానవశ్రేష్టా!సాయంతన గృహం కలవాడిని, నా పేరు కళాథరుడు. త్రికాలవేదిని! నీ సంపదలను గూర్చి విని పేరు, ఖ్యాతి విని చూద్దామని వచ్చాను. నీకు గల భోగభాగ్యాలను అఖిలమైన సంపదలను చూచి సంతుష్టుణ్ణయ్యాను. నీ సంపదా, ఐశ్వర్యమూ కైలాసంలోగాని, వైకుంఠంలోగాని సత్య, స్వర్గలోకాలలో ఎక్కడా కానరాదు!”

ఆ మాటలకు ఆ దైత్యుడిలా అన్నాడు

“ఓ బ్రాహ్మణోత్తమా! నీవు పేరుకే కళాధరుడివి గాని, అన్ని లోకాలలోని విశేషాలనూ నీవెరిగున్నట్లే మాట్లాడుతున్నావే! నా సంపదనంతగా పొగుడుతున్నావే అలాటి విశేషాలేమైనా నీవెరిగుంటే అలాంటి వాటిలో గొప్పదేదో నాకూతెలియజేయి! నీ ప్రజ్ఞను నిర్ధారించుకుని నీ వాంఛితార్ధములనన్నిటినీ తీరుస్తాను. ఆడినమాట తప్పను! చివరికి నా ప్రాణాన్నైనా సమర్పిస్తాను. ఇదిమట్టుకు యదార్ధంసుమా!”

“ఓ దానవా! పరుల ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకోవడంవల్లా వాటిని చూడటంవల్లా నీకేమిటి ఉపయోగం? విధేయతలకు ఎంతో ప్రసన్నుడనైనాను! నాకు కల్గినవి నీకు అనుగ్రహం అయినా నీకు వినయంగా ఇస్తాను. బాణాలపైన నిర్మింపబడిన, బంగారు, వెండి, లోహముల ప్రాకారాలతో తయారైన త్రిపురాలనూ నీకు ప్రసాదిస్తాను. ఆ పట్టణాలలో సుస్థిరంగా సుఖంగా నివసించు.

ఆ పురములు దేవతలకు గాని, మనుష్యులచేతగాని గంధర్వులు చేతగాని భేదింపబడరానివి కోరుకున్న తావుకు వెళ్ళగల ‘కామ – గమనం’ గలవై ఉండగలవు! సకలలైశ్వర్యాలూ ఆ పురములలో తాండవమాడతాయి. ఐతే ఏ నాడైతే రుద్రుడు ఆ మూడింటినీ ఒకే బాణంతో భేదిస్తాడో అప్పుడు వాటితోపాటూ నీవూ నశిస్తావు!”

ఇలా అభయప్రదానం చేసిన కళాధరుడు ఒక ధనుస్సును పాతి దానిమీద త్రిపురాలనూ నిర్మించాడు. నానా చిత్ర విచిత్ర భవనములతో, రకరకాల దిగుడుబావులూ, ఉద్యానవనాలతోనూ అలరారుతూ, సకల పక్షిగణముల కిలకిలారావాలతో అంతరిక్షంలో వ్రేలాడే ఆ పురత్రయాన్ని తన మాయతో నిర్మించి యిచ్చాడు.

అలా తనని ఆ బ్రాహ్మణుని మాయ కప్పేయగా ఆ పురంలో తన నివాసమేర్పరుచుకొని నివసిస్తూ సంతోషంగా ఆ దానవప్రభువు కాలం గడపసాగాడు. ఆ సంతోషంతో, బలగర్వంతో గర్వోన్నతుడై మూడు లోకాలనూ గడగడ లాడించేలా గర్జించేవాడు. ఇలా మదగర్వంతో సకల లోకవాసులకూ కంటకప్రాయుడై, త్రిపురుడు ఆ మాయా బ్రాహ్మణునితో ఇలా అన్నాడు.

“ఓ బ్రాహ్మణోత్తమా! నీవు ఎట్టి దుర్లభతరమైన దాన్నైనా సరే కోరుకో! ఇస్తాను!” అనగానే – ఆ బ్రాహ్మణుడు నిష్కాముడై ఉండీ మాయావి గనుక ఇలా వరాన్ని కోరుకున్నాడు.

“ఓ దానవా! నేను నీవద్దకు వస్తూ, మార్గమధ్యంలో కైలాసశిఖరానికి వెళ్ళి అక్కడ పరమశివునిచేత అర్చించబడుతూన్న సకల కామప్రదుడైన గణపతిమూర్తిని చూశాను. నీకు సామర్ధ్యం ఉంటే ఆ మూర్తిని తెచ్చి నాకివ్వు! అసలలాంటి మూర్తి మూడు లోకాలలోనూ నాకెక్కడా తటస్థపడలేదు! అందుచేతనే నా మనస్సు దానిపై పూర్తిగా లగ్నమై యున్నది.

అలాంటి మూర్తిని పొందటంవల్ల నేనూ కృతకృత్యుడనౌతాను! నీకూ అడిగినవారికి లేదనకుండా యిస్తావన్న ఖ్యాతి లభిస్తుంది!”

ఆ మాటలకు గర్వంతో వివశుడైన త్రిపురాసురుడు “ఓ బ్రాహ్మ ణోత్తమా! ఆ శంకరుడు నాకు కింకరుడే! నేను ఏ దేవతనీ లెక్కచేయను! నీవు కోరిన ప్రకారంగానే కైలాసమునకు వెళ్ళి ఆమూర్తి నీకు తెచ్చి స్తాను!” ఇలాఅని ఆ బ్రాహ్మణుని అత్యంత ఆదరంతో పూజించాడు. అతడికి లెక్కకుమీరిన ఆవులను, వస్త్రభూషణాలనూ, పదిగ్రామాలనూ, విలువైన ముత్యాలహారాలతోపాటూ, రత్నాలు, పగడాలు, తివాసీలు, దాసదాసీలు, బంగారు ఇరుసులతో ఒప్పే వెండిరధాలూ, ఉత్తమాశ్వములు మొదలైనవన్నీ సమర్పించాడు.

అప్పుడా కళాధరుడు బలాత్కారంగా తనకు సమర్పించబడిన సపర్యల నందుకొని తన ఆశ్రమానికి వెళ్ళి తన భార్యను ఇతర ఆశ్రమ వాసులను సంతోషపరిచాడు.

ఓ వ్యాసమునీంద్రా! ఈ జరిగిన యావద్వృత్తాంతాన్నీ నారదుడు దేవతాగణాలకు తెలియచెప్పాడు. అప్పుడు దేవతలు కూడా తగుకాలం కోసం నిరీక్షిస్తూ కాలం గడపసాగారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనా ఖండంలోని”బ్రాహ్మణాభీష్టప్రదానం” అనే 41వ అధ్యాయం.సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment