ఉపాసనా ఖండము మొదటి భాగము
త్రిపురవిజయం
అప్పుడు బ్రహ్మ పరాశరాత్మజుడైన వ్యాసమునీంద్రునితో యిలా యుద్ధవర్ణనం చేయసాగాడు.. “త్రిపురుడు నేరుగా శంకరుడితో తలపడ్డాడు. ప్రచండునితో షణ్ముఖుడు పోరసాగాడు. చండుని శివవాహనమైన నందీశ్వరుడెదుర్కున్నాడు. పుష్పదంతుడు భీమకాయునితోనూ, భ్రుశుండుడు కాలకూటునితోనూ, వీరభద్రునితో వజ్రదంష్ట్రుడును, ఇంద్రుడు దైత్యామాత్యునితోనూ జయంతుడు దైత్యకుమారునితోనూ, సకల అస్త్రాలను ఎరిగివున్న బృహస్పతి శుక్రాచార్యునితోనూ ఇలా అనేకమంది దేవతాగణాలు రాక్షసులతో ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు.
రధికులు రధికులతోనూ గజారోహకులు గజారోహకులతోనూ, అశ్వికులు అశ్వారోహకులతోనూ పదాతులు పదాతిదళములతోనూ, ఘోరంగా ఆ రణ రంగంలో తలపడ్డారు. కొందరు అస్త్రశస్త్రాలను విడిచి పెట్టి మల్లయుద్ధానికి దిగారు. ప్రచుండుని తొమ్మిది బాణాలనూ దేవసేనాపతియైన కుమారస్వామి మార్గమధ్యంలోనే త్రుంచివేశాడు. అప్పుడు కుమారుడు తన ఐదు వాడిశరాలలో ప్రచండుని మూర్ఛిల్లచేయగా అతడు నేలకొరిగాడు.
భీమకాయుని బాణాలను పుష్పదంతుడు తృంచివైచి, అతనిని తిరిగి తన మూడు వాడి బాణాలతో నేలకూల్చాడు. అలాగే భ్రుశండుని చేతిలో కాలకూటుడు పడగొట్టబడ్డాడు. వీరభద్రుడు, వజ్ర దంష్ట్రుడూ పరస్పరం బాణాలను ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు.
ఇంద్రుని వజ్రాయుధం వ్రేటుకి దైత్యామాత్యుడు మరణించాడు. జయంతుడు విజృంభించి దైత్యకుమారుని తన బాణాలతో వధించాడు. అతడు వెంటనే నెత్తురుక్రక్కుతూ మరణించాడు. ఇలా అనేకవిధాలుగా రాక్షససైన్యమంతా వధింపబడటం చూసిన ఆ అసురరాజు క్రోధోద్రిక్తుడై నేరుగా శంకరునితోనే యుద్ధం చేయమొదలెట్టాడు. ముందుగా శస్త్రాలతోనూ ఆ తరువాత అస్త్రాలతోనూ, ఆ ఉభయులూ భీకరమైన యుద్ధం ఆరంభించారు.
శివునిపై ఆ అసురుడు వారణాస్త్రం ప్రయోగించి, వర్షవృష్టిని కురిపించాడు. తన దేవతా సైన్యమంతా అలా వర్షంతో పీడింప బడటం గమనించిన శంకరుడు వెంటనే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘాలను చెల్లాచెదురు చేసేశాడు.
ఆ ఝంఝామారుతానికి తెగిపడ్డ వీరుల శిరస్సులు అన్ని వైపులా ఎగురు కొట్టబడ్డాయి! రధాలతో ఢీకొట్టబడిన రధాలు, ఏనుగులతో ఏనుగులు, గుఱ్ఱములతో గుఱ్ఱాలు ఢీకొని, చూర్ణం కాసాగాయి! ఆ మహావాయువుచేత వృక్షాలూ, లతలూ పెకలించబడి రణరంగాన్నంతటినీ కప్పవేశాయి.
ఇలా రాక్షససేనను పీడిస్తున్న వాయవ్యాస్త్రాన్ని పన్నగాస్త్రం వైచి త్రిపురుడు మరలగొట్టాడు. చెవిదాకా వింటినారిని సారించి, మంత్రించిన ఆగ్నేయాస్త్రాన్ని దేవతాసైన్యాలపై ప్రయోగించాడు! ఏదో అగ్ని ప్రళయమే సంభవించిందేమోనన్న భయంతో అందరు కంపిస్తూండగా, ఆ మండుతున్న జ్వాలలలోంచి ఒక భీకరాకారుడు ఉద్భవించి, ఘోరంగా విజృంభించి దేవతాసైన్యాల నన్నింటినీ కబళించసాగాడు. ఆ భయానికి శివ సేనలన్నీ శివుని వెనుకదాగి ‘రక్ష! రక్ష!’ అంటు మొదలుపెట్టారు!
శివుడు తన సైన్యాన్ని భయపడవలదంటూ ఆశ్వాసించి, పర్జన్యాస్త్రం ప్రయోగించి ఆ పెనుభూతాన్ని వెనక్కి మరల్చాడు! ఒక బాణంతో ఆ అఘోర పురుషుని పడవేయగా అతడు వెంటనే లేచి శివుని సైనికులను ఆరగించసాగాడు. ప్రమధగణాలన్నీ భయభ్రాంతులై నలుదెసలకూ పారి పోగా శివుడు నిస్సహాయుడై పర్వతగుహలో తలదాచుకోవాల్సి వచ్చింది.
త్రిపుర విజయం
దేవ సేనాధిపతియైన కుమారస్వామి మొదలైన వారందరూ శివుని అనుసరించారు. ఒంటరిగావున్న పార్వతిని చెరపట్టదలచి, మేరుపర్వతానికి దండెత్తినట్లు వెళ్ళాడు త్రిపురుడు. అతణ్ణి అల్లంతదూరాన్నే గమనించిన గిరినందన తన తండ్రియైన హిమవంతుని చెంత గుహలో తలదాచు కున్నది!
అప్పుడామెను ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా యత్నించి విఫలుడై, అంతటా ఆ పార్వతిని అన్వేషిస్తూ వస్తున్న త్రిపురునికి మార్గ మధ్యంలో కోటిసూర్య ప్రకాశమానమై, అన్ని అలంకారాలతోనూ శోభిస్తున్న ‘చింతామణీగణేశ విగ్రహాన్ని’ చూడటం జరిగింది!
ఆ విగ్రహాన్ని సంగ్రహించి తన స్వస్దానానికి చేరుకున్నాడు. వందిమాగధులు జయజయ ధ్వానాలు చేస్తుండగా, త్రిపురుడు పురప్రవేశం చేసి అక్కడినుండి పాతాళంలో తన విజయాన్ని చాటుకోదలచి వెళ్ళసాగాడు! ఇంతలో అకస్మాత్తు గా అతని చేతిలోని వినాయకమూర్తి అంతర్థానమైంది!
త్రిపురుడు ఈ హఠాత్ పరిణామానికి మ్రాన్పడి, ఇదొక అపశకునంగా భావించి, మూర్తియొక్క వియోగానికి చింతిస్తూ, తన నగరాన్ని చేరు కున్నాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘త్రిపురవిజయం’ అనే 43-వ అధ్యాయం.సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹