Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – ఎనభై ఐదవ భాగము

బాలకృష్ణచరితే అక్రూర ఆగమనవర్ణనమ్‌

వ్యాసులిట్లనిరి.

అక్రూరుడు గమన వేగముగల రథమున వెడలి కృష్ణదర్శనాసక్తిచే నందగోకులమున కేగెను. ఏగుచు త్రోవలో నాకన్న ధన్యతముడు లేడు. హరియంశమున అవతరించిన ఆ చక్రప్రాణి నెమ్మోము చూడనున్నాను. ఇపుడు జన్మము సఫలమైనది. ఈరాత్రి సుశోభనముగ తెల్లవారినది. విచ్చిన తామరరేకులట్లు కన్నులుగల ఆ విష్ణుముఖమును దర్శింపనున్నాను. దీనిని తలచికొన్న భావము పోవునో అట్టి పుండరీకనయనుని నెమ్మోము నిప్పుడు జూడనున్నాను. ఎందుండి ఎల్లవేదములు వేదాంగములు వెలువడినవో దేవతలకెల్ల ఏది పరంధామమో అట్టి భగవంతుని ముఖము చూడబోవుచున్నాను. యజ్ఞములందు యజ్ఞపురుషునిగా పురుషులచే పురుషోత్తముడుగనే సర్వాధార మూర్తి పూజింపబడునో అట్టి జగద్భర్తను చూడనున్నాను. నూరు యజ్ఞములయందు ఎవ్వని ఉపాసించి ఇంద్రుడు దేవేంద్రపదవిని పొందెనో అట్టి అంతువడని ఆదిగల స్వామిని కేశవుని కననున్నాను. బ్రహ్మ, ఇంద్ర,రుద్ర, అశ్వినీ,వసు,ఆదిత్య మరుద్గణములెవ్వని రూపమెరుగరో అట్టి హరి నన్ను తాకుచున్నాడు. సర్వమును తానై సర్వభూతములందుండి సర్వమగు సర్వవ్యాపి ఇపుడు నాకు కనబడుచున్నాడు. మత్స్య,కూర్మ,వరాహ,నారసింహా, ఆద్యవతార యోగము చేత ఒనరించిన ఆ దేవుడు నన్నిపుడు పలుకరింప నున్నాడు. అవ్యయుడైన హరి జగత్ర్పభువు ఇపుడు వ్రేపల్లెయందు ఉనికిజేయ స్వేచ్ఛా శరీరధారియై మనుష్యరూపమొంది స్థితికార్య నిర్వహణమునకు వచ్చియున్నాడు. ఏ అనంతుడు శిఖరాది విశిష్ట పృథివిని ధరించునో ఆ దేవుడు జగత్కార్య నిర్వహణమునకు అవతరించిన మహానుభావుడు అక్రూరాయని నోరార నన్ను పిలువనున్నాడు. తండ్రి బంధువు చెలి తమ్ముడు అన్నయను చుట్టరికములతో అల్లుకొని ఉన్న జగత్తు ఎవ్వని మాయచే దాట శక్యము కాదో అట్టి మాధవునికి నమస్కారము. ఎవ్వడు హృదయముమందు ప్రవేశించినంతట మర్త్యులు (మరణ స్వభావం గలవారు) సువిస్తరమైన అవిద్యను యోగమాయను దాటుదురో అట్టి కేవల జ్ఞానస్వరూపుడైన వానికి నమస్కారము. యజ్ఞభోక్త యజ్ఞపురుషుడు వాసుదేవుడు అని ఎవ్వడు వేదాంత మెరిగిన వారిచేత కీర్తంపబడునో అట్టి విష్ణువునకు నేను వినతుడనయ్యెదను. జగధాధారుడగు ఆ పరమాత్మయందు నిలుపబడి సరసద్రూప జగత్తు ధరింప బడుచున్నది. అట్టి స్వామి నా యెడల ప్రసన్నుడగుగాక! నరుడెవ్వని స్మరణమాత్రమున సకల కల్యాణ భాజనమగునో అట్టి పురుషోత్తముని హరిని నిత్యము శరణోందెను.

అని ఇట్లు భక్తినమ్రమైన తన మనస్సుతో విష్ణువుని తలచుచు అక్రూరుడించుక పొద్డుండగనే గోకులముంజేరెను. అతడచట ఆవుల పాలు బిదుకుచునున్న కృష్ణుని దూడల మధ్యనున్న వానిని ప్రపుల్ల పద్మపత్రాక్షుని శ్రీవత్సాంకిత వక్షుని ఆజానుబాహుని నెత్తైన వెడదఉరముగలవాని ఉన్నతవాసుని సవిలాస మందహాస భరిత వదనారవిందుని నెత్తై మెరుపుజిందునఖములతో పీతాంబరము ఉత్తరీయముందాల్చి వనమాలాభూషితుడై తెల్ల తామరపూవు శిరమునందాల్చియున్న హరిని అక్రూరుడు సందర్శించెను. హంసవలె చందమామవలె మొల్లలవలె తెల్లనై నల్లని వలువదాల్చిన యదునందనుని బలభద్రుని ఆ కృష్ణుని వెనుక జూచెను. అతడున్నతుడు ఉన్నత బాహువులుగలవాడు సవికాసమైన ముఖారవిందముగలవాడునై మేఘముల గుంపుతో నలముకొన్న మఱొక కైలాస పర్వతమట్లున్న బలరామమూర్తినిగాంచెను. ఆ ఇద్దరిని జూచి అమ్మతిమంతుడు ముఖపద్మము విప్పార మేనెల్ల గగుర్పోడువ అక్రూరుడు ఇది పరంధామము. ఇదియే ఆ పరముపదము. ఇదే ఆ వాసుదేవుడు ఇరుతెరగులై ఇచటనున్నాడు.

ఆ జగద్విధాత దర్శనమున నా కనుగవ సాఫల్యమందుగాక! నన్ను కౌగిలించికొని నించు ఆ అవ్యాజమైన ఆ నవ్వు అ భగవంతుని ప్రసాదమే అది నా సర్వార్థ సిద్దికి మార్గమగుగాక!

ఎవ్వడు కొనవేల స్పృశించిన మాత్రన సర్వపాపములు తూలిపడునట్టి ఆ అనంతమూర్తి నా హస్తపద్మమును శ్రీమంతమును శోభావంతమును జేయును. ఇంద్రమరుద్రుద్రాశ్విని దేవతలందఱు నాయెడ ప్రసన్నులై వరమ్ములిత్తురా? ఎవ్వడు దైత్యరాజ బలమును చంపి భార్యల కనుల కాటుకలను ఎల్ల తుడిచివైచె, ఎవ్వని చేతిలో దానధార వోసి అవనిపై నుండియే అమరలోకేంద్రభోగముల నందెనో,ఎవ్వనిని గొలిచి ఇంద్రుడు మన్వంతరము దాకా స్థిరమైయుండు స్వర్గ సామ్రాజ్యాధిపత్యము నందెనో అట్టి సాక్షాత్ భగవంతుడు కంసుని పరిగ్రహముచే (నన్నుతన వానిగా మిత్రకోటిలోనికి స్వీకరించుటచే) దోషమునకు స్థానమైనట్టియు నిర్దోషినై అత్మ బహిష్కరింపబడినట్టి దురభిమానినినగు నన్ను గూర్చి నిందయగుగాక!(నన్ను నేనే ఛీ అనుకొనవలసి యున్నదన్నమాట) కేవలం జ్ఞానమై సత్వనిధియై అదోషియై అందరును సులభముగా తేటపడక అందరి హృదయములందు ఉండెడి ప్రభువునకీ జగమునందు తెలియనిది ఏమున్నది? అందువల్ల భక్తిచే మోమువంచి ఈశ్వరులకెల్ల ఈశ్వరుడైన ఆ విశ్వేశ్వరుని అనాది మధ్యావసానుడు అజుడునగు విష్ణువుయొక్క ఆ అంశావతార మూర్తిని దర్శింపనేగెదను.

ఇది బ్రహ్మ పురాణము నందు అక్రూర ఆగమన వర్ణనము ఎనభై ఐదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment