అక్రూరుని తిఱిగిరాక
వ్యాసుడిట్లనియె.
ఇట్లా యాదవుడు అక్రూరుడు గోవిందుని తలచుచువచ్చి నేను అక్రూరుడనని పేరు చెప్పికొని తలవంచి హరికి నమస్కరించెను. (గోత్రనామములు చెప్పుకొని నమస్కరించుట విశిష్టగౌరముపాత్రులగురువులకు దైవసమానుల యెడ చేయవలసిన లక్షణము శాస్త్రీయము.) శ్రీహరియు ధ్వజవజ్రపద్మచిహ్నములుగల హస్తముచే అక్రూరును తాకి దరికి తీసికొని ప్రీతితో గాఢాలింగనము చేసుకొనెను. బలరామకృష్ణులు ఆతనితో కుశల సంభాషణాదులు నెఱిపి వెంటనే అతనింజేకొని తమమందిరమునందు ప్రవేశించిరి. అతడును వారితో ముచ్చటలాడుచు విందారగించి సముచితముగ వారికి తా వచ్చిన విశేషమును తెలిపెను. కంసుడు దేవకీవసుదేవులను బెదరించుట తనతండ్రియగు ఉగ్రసేమనియెడ అతడు వర్తించుతీరు తన్నెందులకు కంసుడు పంపెనో ఆ విషయము నెల్లను నాతడు తెలుప విని కేశిసంహారకుడగు భగవంతుడు దానపతీ! (ఓ అక్రూరా)ఇదెల్ల నాకు తెలిసినది. ఇందేమి ఉచితమో అది ఆలోచించి చేసెదను. ఓ మహానుభావా ! నీవింకొకలాగున అనుకొనకుము. నాచే కంసుడు హతుడయినట్లే తెలియుము. నేనును అన్నయ్య బలరాముడును నీతో రేపు మథురకు వత్తుము. గోపవృద్ధులు కూడ యుపాయనములం బెక్కింటినిగొని వత్తురు. ఈరేయి విశ్రమింపుము. చింతింపంబనిలేదు మూడేరాత్రులలోగా కంసుని పరివారముతో సంహరింతునని కృష్ణుడు పల్కెను.
అక్రూరుడు ఆ రాత్రి గోపకులకు చెప్పి కృష్ణునితో బలభద్రునితో నందుని మందిరమున నిదురించెను. బలశాలురగు రామకృష్ణులు అవ్వల సుప్రభాతము నందు అక్రూరునితో మధురకు ఏగ సన్నద్ధులైరి. గోపికలది చూచికన్నులనీర్నిండగా దుఃఖమునంజిక్కి ముంజేతుల కంకణములుజార నిటూర్పుపుచ్చుచు నొండొరులతో నిట్లనుకొనిరి. గోవిందుడు మధురకేగి మరివ్రేపల్లె కెట్లు రాగలడు. ఆ నాగరిక సుందరుల అవ్యక్త మధురభాషణయధుధారల వీనులం గోలును. ఆ నగరకాంతల మెరమెచ్చుల ముచ్చటలందిరపుకొన్న ఈతని చిత్త మిక నీపల్లెంగల గొల్ల పడుచుల వంక కెట్లు తిఱుగును. ఈగోష్ఠముయొక్క (వ్రేపల్లెయుక్క) సమగ్రసారమైన హరినిట్లు హరించుకొని పోవు ఆ పాడు దైవము నిర్థయమై గోపాంగనల సర్వస్వము దోచుకొన్నాడు. పరిహాస భావ గర్భితమైన ఆ పలుకులు ఒయ్యారపు నడకలా నెఱజాణలు మధురాపురీ సుందరుల ఆ వాల్చూపులం జిక్కి ఈ పల్లెటూరి దేవయ్య మీప్రక్కకు మఱి ఏ యుక్తిని రాగలడు. పేరుమాత్రము అక్రూరుడయిన ఈ క్రూరునిచే ఈ హతాశునిచే మోసగింపబడి ఇదే మాధవుడు రథమెక్కి మధురకేగుచున్నాడు. ఈ నీచుడింత ఎరుగడా ఈతని పై వలపుగొన్న ఈ జనమును తఱుగని తఱితీవుగొని మఱగిన మనసామిని హరిని గొంపోవుచున్నాడు. ఇతడో! దయమాలి రమ్మన్నదే తడవుగా నివ్వనమాలి హరితో వీని వెంటబడి రథమెక్కి (ఎన్నడునెక్కని రథమెక్క ను ఉబలాటవడి కాబోలు) చనుచున్నాడు. వలదని వారింప త్వరపడుదము? పెద్దలయెదుటంబడి మా కేదిగతి ఏమందువని మొరవెట్టుదము. ఆ పెద్దవాండ్రు మాత్రము విరహాగ్నిచే గ్రాగుమన కేమిసేయగలరు? నందగోపుడు మున్నుగానిచె వీరును ప్రయాణ సన్నద్దులగుచున్నారు. గోవిందుని మఱలింప నొక్కరే నిందు యత్నించుట లేదు. మథురావాసులగు విలాసినుల కీరేయి ఇపుడు సుప్రభాతము. అచ్యుతుని ముఖారవిందమునకా సుందరుల కనుగవలు భోగ్యవస్తువులు కాగలవు.(అనగా కృష్ణుడా పడతుల వాల్చూపులసొంపులననుభవించు నన్నమాట)ఇటనుండి కృష్ణుడేగుచుండ దారిలో నిలిచి ఎవ్వరు వలదువలదని వారింపబడక స్వేచ్ఛగా నా సొగసుగాని సొగసుగని నెమ్మేనంబులకింతురో ఆ ఇంతులు ధన్యులుగదె. గోవిందవదనారవింద సందర్శనమున ఇపుడు మధురాపుర పౌరుల నయనముల కిదియొక మహోత్సవము గానున్నది. కనులంతంతలు చేసికొని ఏ అభ్యంతరము లేకుండా భాగ్యవతులగు ఆ పుర యువతులు అధోక్షజుని చూడనున్నారిది ఒక కలగాదుగదా? ఈగోపికల కొక పెన్నిధిం జూపించిన ఆ విధి (బ్రహ్మ) ఇంతలో జాలిమాలి మన కన్నులందిగ నడచినాడు. మాధవునెడ అనురాగమున అతడేగుటకు మనయందు శైథిల్యమేర్పడ(ఏకీలునకాలుపట్టువిడుచుండ)మాతోబాటు మా ముంజేతులనున్న వలయములును (కంకణములు) పట్టుదప్పి జారిపోవుచున్నవి. అక్రూరుడు క్రూరహృదయుడు, అల్లదె గుఱ్ఱములను త్వరత్వరగా తోలుచున్నాడు. ఇట్లార్తలై అలమటించు అబలలపై ఎవ్వనికి దయ పుట్టదు? ఓ కృష్ణా! అల్లదె రథచక్రములరేగిన రేణువరదముపై గ్రమ్మినదిచూడుడు. దానహరిదూరము సేయబడినాడు ఆరేణువుగూడ గనబడుబలేదు అని యిట్లు హార్దమైన భావముతో గోపికలు అలమటింప ఎవరికీ జాలి కలుగదు!
జవనాశ్వమ్మగురథమునం జని బలరామకృష్ణులు అక్రూరుండును మధ్యాహ్నమునకు యమునా తీరమును జేరిరి. అంతట అక్రూరుడు తామిద్దరు నిట గూర్చుండుడు. నేనీకాళిజలములం దాహ్నికకృత్యము నొనరింతుననియె. వారట్లేయన నతడు యమునా జలములం జొచ్చి ఆచమించి స్నానముసేసి పరబ్రహ్మామును ధ్యానించెను. అ నీటిలో నతడయ్యెడ జ్, వేయిపడగలతో నున్న శేషునిగా బలరాముని దర్శించెను. అతడు మల్లెదండవంటి శరీరము ధరించి తామరరేకులట్లున్న కన్నులలో వాసుకిగన్నడింభకులు పవనభక్షులు చుట్టునుండి స్తుతింప వనమాలం దాల్చి నల్లనివస్త్రముందాల్చి చక్కని అవతంసముతో (శిరోభూషణముతో) నింపైన కుండలములు దాల్చి నీటిలోనుండ గనెను. ఆతని ఒడిలో మేఘశ్యాముని అంతటనెఱ్ఱనగు కన్నులు గలవానిని నాల్గుచేతులు గలవానిని ఉన్నత శరీరుని చక్రాద్యాయుధధారిని పీతాంబరోత్తరీయముల రంగరంగుల పూలమాలలదాల్చి ఇంద్రధనుస్సు మెఱపుదీగలతోడి విచిత్రమగు తోయదము(మేఘము) వలె నున్న వానిని శ్రీవత్సాంకిత వక్షుని చక్కని భుజకీర్తులు కీరీటము దాల్చి మిఱుమిట్లు గొల్పుచున్న వానిని తెల్ల తామరపువ్వు సిగపూవు ధరించియున్న ఆనందమూర్తిని కృష్ణుని పుణ్యులగు సనకసనందనాది సిద్దయోగులు ముక్కుగొనం చూపు నిలిపి మనస్సుచే ధ్యానించు వానిని కృష్ణునిం గనెను.
అయ్యెడ అక్రూరుడు వీరు బలరామకృష్ణులని తెలిసికొని ఆశ్చర్యపడి ఆ వెంటనె వీరెట్లిచ్చటికి వచ్చినారని ఆలోచించెను. పలుకబోయిన ఆతని వాక్కును హరి స్తంభింపజేసెను. అంతట నాతడు నీరువెడలి వెలికేగుదెంచి రథమునందుమ ఆ ఇరువురిని దర్శించెను. మునుపటియట్లే వారు మానవులట్లు ప్రాకృతరూపమున గోచరించురి. తిరిగి అతడు నీటను మునిగి మున్నట్లవ్రాకృతదివ్యమూర్తుల నందుగనియె. గంధర్వులు మునులు సిద్ధులు నాగులు ఆ ఇద్దరి నయ్యెడ స్తుతించుచుండం జూచెను. అంత నద్దానపతి (అక్రూరుడు) సర్వసత్తా స్వరూపము నెఱింగికొని సర్వవిజ్ఞానమయుడగు నచ్యుతు నీశ్వరుని స్తుతించెను.
అక్రూర స్తవము
పంచతన్మాత్ర రూపుడు, ఊహింపనలవిగాని మహిమ గలవాడు, సర్వవ్యాపకుడు, అనేక రూపుడు నైనవాడునగు పరమాత్మకునమస్కారము. శబ్దరూపము,హవిస్స్వరూపము, విజ్ఞానరూపము, నైనవానికి ప్రకృతికంటె పరునికి నమస్కారము. భూతాత్మయు, ఇంద్రియాత్మయు, ప్రధానాత్మయునీవే. ఆత్మయు (జీవుడు) పరమాత్మయునీవే. ఇట్లు నీవోక్కడవే ఐదుగా నున్నావు. క్షరము (సర్వభూతము) అక్షరము (కూటస్థుడు) సర్వధర్మ మూర్తిని బ్రహ్మవిష్ణు శివాది నానావిధ కల్పనలచే బిలువబడు నీవు ప్రసన్నుడవుకమ్ము. నీ స్వరూపము పలుక నలవిగానిది. నీవేమి ప్రయోజనము గలవాడనో తెలుప శక్యముగాదు. నీయభిదాన మిదియని చెప్పవశముగాదు. అట్టి పరమేశ్వరుని నిన్ను గూర్చి వినతుడనయ్యెదను. నామము జాతి మొదలైన కల్పన లెందులేవో అట్టి పరబ్రహ్మము నిత్యము అవికారి అజమునైనది నీవే. కల్పనగాకుండ సకల పదార్ధము అందదు గావున కృష్ణఅచ్యుత విష్ణునామములచే (కల్పనలచే) నీవు స్తుతింపబడుచున్నావు.
నీవు సర్వమునకాత్మవు. వికల్పనములచే నీవే దేవతలు విశ్వమును. ఓవిశ్వాత్మ! నీవు వికారభేదము లేనివాడవు. అంతట నీకంటే వేరొకటి యించుకయులేదు. నీవు బ్రహ్మవు, పశుపతివి, అర్యముడవు (సూర్యుడు) విధాతవు,ధాతవు,ఇంద్రుడవు, వాయువు,అగ్నివి. జలాధిపతి వరుణుడవు. ధనేశుడవు (కుబేరుడు) నీవు. అంతము చేయువాడు (యముడు) నీవు. ఒక్కడయ్యు భిన్న భిన్న శక్తులచే భిన్నభిన్న రూపుడవై జగత్తును రక్షించుచున్నావు. కిరణ రూపమున నీవు జగత్తును సృజించి హరింతువు. ఈవిశ్వము పంచభూత వికారము. గుణమయము. సత్‌అను శబ్దమున కర్ధమైన పరము స్వరూపము అక్షరమునై సదసద్రూప జ్ఞానరూపునగు నీకు నమస్కారము. వాసుదేవుడవు సంకర్షణుడవు ప్రద్యుమ్నుడవు అనిరుద్దుడవునగు నీకు నమస్కారము(చతుర్వ్యూహాత్మాకమైన పరమాత్మకు నమస్కారము) . అని ఇట్లు నీళ్లలో కృష్ణునిం బొగడి ఆ యాదవుడు మనస్సుచేత గల్పింపబడిన ధూపదీప పుష్పాదులచే షోడశోపచారములచే శ్రీహరి నర్చించెను. మానసిక పూజచేసెనన్నమాట. ఇతర విషయముల విడిచి మనస్సును కృష్ణరూప పరబ్రహ్మ మందునిలిపి చిరకాలమునకు సమాధినుండి విరమించెను. తనును కృతార్ధునిగ భావించి యమునా జలములనుండి వెడలి మరల రథముదరికి వచ్చెను. వచ్చి రామకృష్ణులను మునుపటి వలె నున్నవారిని గాంచెను. ఆశ్చర్యమున జూచుచున్న అక్రూరునితో కృష్ణుడు యమునాజలమున నీవేమి వింత చూచితివి నీకన్నులాశ్చర్య వికసితములైనవని అనగా అక్రూరుండిట్లనియె.
అచ్యుతా! నీళ్ళలో నేనేమి వింత గన్గొంటినో అది ఇచటనే రూపొంది నాముందర గలదు. ఈ జగచ్చిత్రమే మహాత్మునిచే ఆశ్చర్యరూపమై యున్నదో అట్టి ఆశ్చర్యములకు అవధియైన నీతో నేనిపుడు గూడికొన్నాను. ఈవింతతో మనము మధురకు వెళ్ళుదమా! కంసునకు నేను జడియుచున్నాను. ఛీ!ఛీ! పరులు పెట్టిన పిండముచే బ్రతుకువాని జన్మమేమి జన్మము. అని వాయువేగమున రథాశ్వములను దోలెను. సాయంకాలమునకు అక్రూరుడు మధురను ప్రవేశించెను. మధురను గని బలరామకృష్ణులతో నాతడు ఇట్లనియె.
మీరిరువురు నడచిరండు. నేను రథమున నొక్కడనే నగరము ప్రవేశింతును. మీరు వసుదేవు గృహమున కేగకుడు. మీ నిమిత్తమున నా వృద్ధుని కంసుడు లేవగొట్టును. అని అక్రూరుండొక్కడే మధురను జొచ్చెను. రామకృష్ణులు రాజమార్గమున వచ్చిరి. స్త్రీ పురుషుల ఆనంద భరితములైన చూపులచే చూడబడుచు వారు ఉల్లాసముగా ఏనుగు గున్నలట్లు రాజవీధిలో నడచిరి. అచట నట్టిట్టు తిరుగుచు వారొక చాకలింజూచి చక్కని చలువ మడతల నిమ్మని యడిగిరి. వాడు కంసుని చాకలి గావున మిగుల విస్మయమంది రామకృష్ణులం గూర్చి ఆక్షేపవాక్యములు పెక్కులు బిగ్గఱగా నరచెను. అంతట గినుకగొని కృష్ణుడు అరచేతంగొట్టి వాని తలను బుడమింబడ గొట్టెను. వానిం జంపి పీతనిలాంబరులు కృష్ణుడు రాముడును ఆ బట్టలంగొని ముదమున మాలాకారుని ఇంటికింజనిరి. చక్కని వారింగని వాడు దేవతలు అవనికి దిగిరని యెంచి మోములు వికసింపవారు పువ్వులిమ్మని అడిగినంతట చేతులంబుడమిందాతలతో నేలనంటి ప్రసన్న సుముఖులై ప్రభువులు నా ఇంటికి వచ్చితిరి నేను ధన్యుడను. మిమ్మర్చించెదనని ఆమాల్యజీవిగండు పలికి హర్షవదనుడై పరమళించు చక్కని పువ్వులేరియేరి మురిపించుచు మఱిమఱి మ్రొక్కి ఆ పెద్దమపిషి కోరి వారికి కాన్కవెట్టెను. కృష్ణుడును ప్రసన్నుడై మాలాకారునికి వరమిచ్చెను. ఓభద్రుడా! (శుభలక్షణాయన్నమాట) నన్నాశ్రయించిన సిరి నిన్నెప్పుడును విడువదు. నీ బలమునకు హానిగలుగదు. ఓ మంచివాడ! ధనహానియు నీకుగలుగదు. నీవు విపులము లైన భోగములను అనుభవించి తుదకు నాప్రసాదము వలన నా అనుస్మరణమంది దివ్యలోక మందెదవు. నీమనసెల్ల వేళల ధర్మమునందుండగలదు. నీసంతతికి పుట్టినవారికి దీర్ఘాయువు గల్గును. నీ సంత సూర్యుడున్నంత కాలమెట్టి యిబ్బందులకు లోనుగాదు అని యిట్లుపల్కి మాలాకారుని పూజగొని వాని యింటినుండి కృష్ణుడు బలదేవునితోడుగా బయలు వెడలెను.
ఇది శ్రీబ్రహ్మపురాణమునందు అక్రూర ప్రత్యాగమనము అను ఎనభై ఆరవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹