Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – నలబై నాల్గవ అధ్యాయము

ఉపాసనా ఖండము మెదటి భాగము

నారదాగమనం – గణేశదర్శనం

“త్రిపురాసురునిచేత పరాజితుడైన శివుడు ఆ తరువాతేమి చేశాడు? పరాక్రమంతోనూ, వరబలగర్వంతోనూ మత్తుడైన ఆ రక్కసుని ఎలా చిత్తుచేశాడు?’ ఆ వివరం నాకు తాము దయతో తెలుపవలసింది” అంటూ ప్రార్ధించిన ఆ పరాశరనందనునితో చతుర్ముఖుడిలా బదులిచ్చాడు.

“నాయనా! ఆ రకంగా త్రిపురునిచేత ఓడించబడి కొండగుహలో తలదాల్చుకోవాల్సి వచ్చినందుకు శంకరుడు ఎంతగానో నొచ్చుకుని ‘తిరిగి భూలోకంలో దేవతలకై ధర్మస్వరూపాలైన యజ్ఞాలు ఎప్పుడు నిర్వహించబడతాయో? నాచెవులకు ‘స్వాహా’, ‘స్వధా’ మంత్రాలెప్పుడు వినబడగలవోకదా? తిరిగి దేవతాగణాలకు తమతమ స్వస్థానాలు లభించే దెన్నడోకదా? ఈ రాక్షసుణ్ణి చూస్తే అజేయుడై వున్నాడే? ఎలా ఇతణ్ణి ఓడించటం?”

అనుకుంటూ మధన పడుతూండగా అక్కడికి యాదృచ్ఛికంగా దేవర్షియైన నారదమహర్షి రావటం జరిగింది! అందుకు పరమానందభరితుడై ఆ యోగీశ్వరుడైన శంకరుడు నారదునికి ఎదురేగి ఆహ్వానించి ఉచితాసనమిచ్చి, ఆతనిని యధావిధిగా సత్కరించి, ఎంతో ఆదరంతో, ఆలింగనం చేసుకున్నాడు.

“ఓ దేవర్షీ! త్రిపురునితో జరిగిన ఘోరసంగ్రామంలో దేవతలు పరాజితులై పారిపోయారు! ఎంతో శక్తివంతాలైన నా దివ్యాస్త్రాలన్నీ ఆ అసురుని ధాటికి వమ్మైపోయాయి! ఎందువలన నా ప్రతాపం కొర గాకుండా పోయింది? దీనికేదైనా ఉపాయం సూచించవలసింది!” అంటూ అర్ధించిన శంకరునితో బ్రహ్మమానసపుత్రుడూ త్రిలోకసంచారీ దేవర్షియైన నారదుడు యిలా అన్నాడు.

శివ వరదానం

“ఓ సదాశివా! నీవు సర్వమూ ఎరిగినవాడివి, సకల విద్యలకూ అధిపతివి, అందరినీ రక్షించేదీ. చివరకు హరుడవై సర్వాన్నీ లయం – చేసేవాడవూ, అన్నిటికీ సమర్ధుడవు, ఐశ్వర్యప్రదుడవు, అందరకూ అన్నీ ఉపదేశించగలవాడూ అయిన నీకు చెప్పగలగినంతటి వాడను కాక పోయినా, నీ ఆజ్ఞమేరకు నాకు తోచిన సలహానిస్తాను” అంటూ క్షణకాలం ధ్యానమగ్నుడై శివునితో యిలా అన్నాడు.

ఓ శంకరా నీవు మూడోకంటితో మన్మధుడంతటి వాడిపై అగ్నినే వర్షించగలవాడవైనా, ”పినాక”మనే దివ్యధనుస్సును నీ చేతపూనినప్పటికీ, ఇంకా నిన్ను విజయం వరించలేదంటే కన్పడుతున్నది అందుకు కారణం ఒక్కటే యుద్ధసన్నద్ధుడవై నీవు రణరంగానికి తరలివెళ్ళే ముందు సకలార్ధప్రదుడూ, సకల విఘ్న నివారకుడూ ఐన గణేశుని ప్రార్ధించి, పూజించి ఆయనయొక్క అనుగ్రహాన్ని బడయలేదు! అందు వల్లనే విజయం నిన్ను వంచించింది!

ఇప్పటికైనా నీవు చేసిన తప్పిదాన్ని గుర్తెరిగి, ఆ గజాననుని మనసా, వాచా, కర్మణా అర్చించి, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకో! అప్పుడు నీకు గెలుపు సుగమమౌతుంది.

ఇంకో ముఖ్యవిషయం… ఆ త్రిపురుడు కూడా సామాన్యుడు కాదు! వినాయకుని ఘోరతపస్సుతో ప్రసన్నుని చేసుకొని వరాలను పొందాడు. అన్యులెవరికీ అతడిని వధించడం సాధ్యంకాదు. అది నీవల్లనే జరగాల్సివుంది. వినాయకుని దివ్య అనుగ్రహం పొందటంచేత అతడు కేవలం నీ శరముచేతనే అదీ నీవు ఒకే శరంతో అతడి మూడు పురాలనూ నీవు భేదించినప్పుడే, ఆనాడే వధించబడతాడని గణనాధుడు అతడిని ఆశీర్వదించాడు. అందువల్ల నీవా విఘ్నహరుని ప్రసన్నుని చేసుకుని మరలాప్రయత్నించు. విజయం నీకు అవశ్యం సిద్ధించగలదు!

అప్పుడు ఆమాటలతో తన అంతరంగానికి స్వాంతన కలుగగా శంకరుడు తనకు లోగడ గణేశునిచేత ఉపదిష్టములైన ఏకాక్షరీ, షడక్షరీ గణేశ మంత్రాలు గుర్తుకువచ్చాయనీ, ఆ మంత్రానుష్టానం సర్వ సంకష్టాలనుంచీ విముక్తిని ప్రసాదిస్తుందన్న విషయం నారదమహర్షితో చెప్పి, ఆ ప్రకారంగా తపస్సు చేయడానికి ఉద్యుక్తుడై, దండకారణ్యమే అందుకు తగిన స్దలమని భావించి వెంటనే అక్కడకు చేరుకున్నాడు.

పద్మాసనంలో కూర్చుని, ఇంద్రియములన్నింటినీ వశపర్చుకుని, ఏకాగ్రతతో నిశ్చలధ్యానతత్పరుడై, నూరుసంవత్సరాల కాలం ఘోర తపస్సు ఆచరించాడు. అలా చిరకాలం మహోగ్రతపస్సును ఆచరించిన పరమశివుని ఎదుట మరోశివుడా? అన్న భ్రాంతికలిగేలా గణేశుడు తన దివ్యదర్శనాన్ని ప్రసాదించాడు.

ఐదు ముఖాలతోనూ, పది బాహువులతో శిరస్సున చంద్రకళను ధరించి మెడలో పుర్రెలమాల,సర్పాలంకారాలతో, కిరీట కుండలాలతో సూర్య కాంతినే తలదన్నేటటువంటి దివ్యకాంతితో విరజిమ్మే ఆయుధాలు ధరించి, మహాతేజస్సుతో, మహోగ్ర రూపుడై సాక్షాత్కరించాడు.

ఆ హఠాత్సంఘటనకు విభ్రమచెందిన శంకరుడు ఇది కలయా? నిజమా? లేక ఇతడు మరో శంకరుడా? ఐతే ఈయనకు ఐదు శిరస్సు లెలా సంభవించాయి? నేను తపస్సు చేస్తున్నదెవరికోసమో అట్టి ఆ విఘ్నేశుడితడు కాదుకదా? అనుకుంటూ తర్కించుకుంటూండగా, సర్వజ్ఞు డైన ఆ గజాననుడిలా అన్నాడు.

“ఓ! నీ హృదయ కమలంలో ఎవర్ని నీవు అనన్యచిత్తంతో ధ్యానిస్తున్నావో, అట్టి గజాననుడనే నేను! నా అనుగ్రహంతో తప్ప నా ఈ స్వరూపాన్ని బ్రహ్మాదులు సైతం గుర్తించలేరు! అంతెందుకు? వేదాలు, వేదశిరస్సులూ కూడా నా స్వరూపాన్ని వివరించలేక మౌనమే వహించాయి! ఇక మానవుల సంగతి గురించి వేరేచెప్పాలా? ఓ శంకరా! ఈ సకల జగత్తుకూ, ఇంకా వీటికావలగల అనేక కోట్లబ్రహ్మాండాలకు సృష్టి, స్థితి, లయ కారకుడను నేనే సుమా!

సమస్త జగత్తులకూ నేనే ప్రభువును! ఓ మహాదేవా! నీ మనోభీష్టాన్ని అది ఎటువంటిదైనాసరే అనుగ్ర హిస్తాను! నీకేమేం వరాలు కావాలో కోరుకో!”

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘నారదాగమనం – గణేశదర్శనం’ అనే 44 వ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment