ఉపాసనా ఖండము మొదటి భాగము
శివస్య వరదానం
ఈ కధనాన్ని అంతటినీ శ్రద్ధగా వింటున్న సత్యవతీనందనుడు ఇలా అడిగాడు.
“ఓ చతురాననా! సర్వజనుల విఘ్నాల అంధకారాన్ని పారద్రోలే అవిఘ్నకరుడనే సూర్యుడు ఆ భక్తవత్సలుడు ప్రత్యక్షమై శంభునికి ఏయే వరాలను ప్రసాదించాడు? శివుడేమేం వరాలను అర్ధించాడు? ఆ వివరం చెప్పవలసింది!” అన్న ఈ మాటలకు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు.
“భక్తవత్సలుడైన గజవదనుడు చెప్పిన అనుగ్రహ వచనాలకు శివుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు. ‘ఓ గజాననా! నిన్ను దర్శించటంచేతనే నా పదినేత్రాలూ ధన్యతచెందాయి! పరమ పావనములైన నీ పాదారవిందాలకు ప్రణమిల్లడంతో నా ఐదుశిరస్సులూ ధన్యతచెందాయి. నిన్ను స్తుతించటంచేత నా జిహ్వకూడా ధన్యమైంది!
సమస్త సృష్టి, అందులోని పంచస్థూలభూతాలు, సూక్ష్మభూతములూ, గంధర్వ, యక్ష, భూతసంఘాలూ, బ్రహ్మ, ఇంద్ర రుద్రాదులూ వీరితోపాటూ సమస్త చరాచర జగత్తంతా నీవల్లనే సృష్టించబడుతోంది!
బ్రహ్మగా రజోగుణ ప్రభావంతో సమస్త సృష్టినీ రచిస్తున్నదీ, సత్య గుణం ఉద్దీపించగా స్థితికర్తగా జగద్రక్షణాభారం వహిస్తున్నదీ, చివరికి అంత్యములో తమఃస్వరూపుడవై రుద్రుని అంశగా యావత్సృష్టినీ లయం చేస్తున్నదీ, అద్భుతమైన నీ లీలావిభూతేతప్ప అన్యమేమీ కాదు!
వాస్తవానికి నీవు గుణాతీతుడవు! ఎట్టి కోరికలూ లేనివాడవు! సాక్షిస్వరూపుడవై సకల జీవులలోనూ అంతర్యామివై ప్రవర్ధిల్లుతావు! సకల మంత్రాలకు ముందుగా నీ స్వరూపమైన ప్రణవమే ఉచ్చరించబడును గాక! ఏ కారణంవల్ల నీవు సకల గణములకు అధిపతివో, ఆ కారణం చేతనే నీవు గణేశుడవని ప్రసిద్ధుడవవుదువుగాక!
ఓదేవా! ఎవరైతే తమ సకలకార్యముల ఆరంభంలో నిన్ను స్మరిస్తారో వారి సర్వకార్యములు నిర్విఘ్నమౌనుగాక! ఎట్టివారికైనా నిన్ను స్మరించనిదే కార్యములు సానుకూలంకావు!
ఓ గజాననా! శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, సౌరమతస్థులు ఎవరికైనా శుభాశుభాది లౌకిక, వైదిక కర్మారంభములలో ముందుగా నీవు అర్చించతగినవాడవు!
సకల జీవులకు కలిగే సమస్త శుభాలకూ కూడా నీవే అధిపతివి! మంగళకరుడవు, మంగళస్వరూపుడవు! నీ భక్తులకు సకల మంగళ ములూ కలుగజేసేవాడవు! ఓదేవా! అజ్ఞానంతో ముందుగా నిన్ను అర్చించకుండా యుద్ధం చేయబూనడం వల్లనే దైత్యునివద్ద ఘోరంగా పరాజితునైనను…
నీ చరణారవిందాలకు మొక్కనిదే నిన్ను స్మరించని జయం కలగడమన్నది అసంభవం! అందుచేత అవిద్యనూ, విఘ్నాంధకారాన్నీ పోగొట్టే ఓ భాస్కరా! నాయొక్క సమస్త అపరాధాలను క్షమించి నాకు విజయాన్ని అనుగ్రహించు!
నిన్ను విముఖులై తమ కార్యారంభంలో అర్చించి సేవించని వారు జడులై, దరిద్రులౌతారు! ఎవరికైతే నీ చరణాలపట్ల తరగని అనురక్తి ఉంటుందో, వారే సకలకార్య సిద్ధినీ, ఐశ్వర్యాన్నీ కరతలామలకంగా పొందగలరు!”ఈ మాటలకు అత్యంత ప్రసన్నుడైన గజాననుడు శివునితో యిలా అన్నాడు..
“ఓ శంకరా! నీవెప్పుడెప్పుడు నన్ను శరణుపొందనిచ్చగిస్తావో అప్పు డప్పుడు నీ ఎదుటే ప్రత్యక్షమౌతాను. నీకు నామబీజంతో అభిమంత్రించి ఇప్పుడొక బాణాన్ని ప్రసాదిస్తాను!” అంటూ తన సహస్రనామాలనూ ప్రణతుడైన శివునికి ఉపదేశించాడు!
‘’దీన్ని యుద్ధకాలంలో పఠించటంవల్ల దైత్యులనందన్నీ అనాయాసంగా వధించగలవు! త్రిసంధ్యలలోనూ దీన్ని పఠించటంవల్ల మానవులకు సర్వాభీష్టములూ సిద్ధిస్తాయి.”అన్న గణేశుని అనుగ్రహవచనాలను విన్న శివుడు పరమానంద భరితుడైనాడు. అప్పుడు శివుడు ఒక గణేశ మహాప్రాసాదాన్ని నిర్మించి సకల దేవతలనూ, మునిసిద్ధ సంఘాలను తన దానధర్మాలతో తృప్తి పరచాడు. భూసురులైన బ్రాహ్మణులకు అనేక భూరి దానాలనుచేసి తిరిగి వరద గణేశుని పూజించి”ఓ దేవతలారా! ఇది మణిపురమన్న పేరుతో విఖ్యాతిచెందుగాక!’ అంటూ అనుగ్రహవచనాలను పలికి, సమస్తదేవతలూ, శంకరుడూ కూడా వినాయకునితో అంతర్హితులైనారు.
ఆ తరువాత శంకరుడు కైలాసానికి వెళ్ళి, యక్ష గంధర్వ సమూహాలతోనూ దేవతాంగనల మధ్యనా ఉన్న పార్వతికి ఈ విశేషాలనన్నింటినీ వివరించాడు. అవి విన్న దేవతలు, మునులు, యోగీశ్వరులు, దేవతాంగనలు ఎంతో సంతోషించారు. అందరూ శివుని అనుగ్రహంచేత తమతమ స్వస్థానాలను తిరిగి సంపాదించుకున్నట్లుగా భావించారు!
ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని”శివస్య వరదానం” అనే నలబై ఐదవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹