Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – ఎనభై తొమ్మిదవ అధ్యాయము

జరాసంధేన సహ రామజనార్దన యుద్ధవర్ణనము

వ్యాసుడిట్లనియె.

మగదాధిపతి జరాసంధుని కూతుండ్రను అస్తి, ప్రాప్తి అనువారిని కంసుడు పెండ్లాడెను. వారిభర్తను జంపినాడని యాదవుడైనహరిని తానుజంపుటకు జరాసంధుడు కోపముగొని వచ్చెను. వచ్చి మథురను ముట్టడించెను. వానితో ఇరువది మూడు అక్షౌహిణులసేన యుండెను. బలరామకృష్ణులు అల్పపరివారముతో వాని బలముతో బోరిరి. కొంతసేపటికి హలియు,హరియు తమ పురాణాయుధములను చేకొనవలెనని సంకల్పించిరి. సంకల్ప మాత్రమున చక్రము శార్జము (విష్ణుధనస్సు) అక్షయ బాణములుగల అమ్ముల పొదులు రెండు కౌమోదకి అను గదయు నింగినుండి ఆ వీరుల దరికేతెంచెను. బలరాముని నాగలి కూడ గగనము నుండి ఆతని చేతికందెను. మరియు అతని కిష్టమైన సునందమను ముసలాయుధము (రోకలి) గూడ బలరాముని కరమునం జేరెను. అవ్వల యుద్ధమున సేనతో మగధరాజునోడించి ఆ వీరులు వారిపురముం జొచ్చిరి.

ఆ దుష్టుడు ఓడిపోయెను గాని బ్రతికిపోయెనని కృష్ణుడు వానిని గెలిచినట్లు కాదనుకొనెను. వాడు బలముంగూర్చికొని మఱలవారిపై తిఱుగబడెను. అప్పుడు వారి చేతిలోవాడు పరాజితుడయ్యె. దుర్మదమున ఆతడిట్లు పదునెన్మిది దండయాత్రలు చేసి మాగధుడు కృష్ణ ముఖ్యులతో యాదవులతో బోరి అల్పావశిష్టమైన సైన్యముతో వెనుదిరిగి పోవుచుండెను. అన్నింటను యాదవసైన్యము పెక్కుతీరుల సురక్షితమగుట కేవలము చత్రియగు విష్ణునంశముయొక్క సాన్నిధ్యప్రభావమే. అది ఆ జగత్పతి యొక్క మానుషావతార లీలా విలాసమే. మనసుచేతనే జగమ్ముల సృష్టి సంహారములు చేయు భగవంతుడు శత్రువులపై అనేకములయిన అస్త్రములను విడచుట శత్రుపక్ష క్షయమునకై సేయు ప్రయత్నవిస్తరమది యెంత పాటిది? అయినను మానవులకు మానవ ధర్మానువర్తనము ధర్మము కావున ఈ కృష్ణుడును బలవంతులతో సంధియు తక్కినవారితో నిగ్రహమును ఈ మహనుభావుడు చేయును.

సామదాన భేదోపాయములు ప్రదర్శించి తుదకు దండోపాయము ఉపయోగించి ఒకప్పుడు పలాయనమును (పారి పోవుటను) గావించును. లీలా మానుషమూర్తియగు ఆ జగత్ప్రభువు స్వేచ్చానుసారము వర్తిచును. మానవ శరీరుల చేష్టను గూడా ఇట్టులే వర్తించును.

ఇది బ్రహ్మపురాణమున కృష్ణచరిత్రలోని ఎనభై తొమ్మిదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment