ఉపాసనా ఖండము మొదటి భాగము
శంకర విజయం
లోకకళ్యాణాన్ని అపేక్షించే కృష్ణద్వైపాయనుడైన వ్యాసభగవానుడిలా ప్రశ్నించాడు.
‘ఓ చతురాననా! అలా ప్రసన్నుడైన గణపతి ప్రపన్నుడైన శంకరుని విజయసంసిద్ధికై నామసహస్రాన్ని స్వయంగా ఉపదేశించాక, శంకరుడేమిచేశాడో ఆ వివరం నాకు తెలుపవలసింది!”
బ్రహ్మ యిలా చెప్పసాగాడు. “పేదకు దొరికిన పెన్నిధిలా, కింకర్తవ్యతామూఢుడై ఖిన్నుడైవున్న ఉమాపతికి గణేశుని వరప్రదానం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషంతో పరమ ఉత్సాహవంతుడై ఆనందతాండవం చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా బిగ్గరగా గర్జించాడు. శంకరుడు! వెంటనే దేవతాసైన్యాలనన్నిటినీ తిరిగి సమీకరించుకుని వారందర్నీ యుద్ధసన్నద్ధులవమంటూ ఆజ్ఞాపించాడు.
ద్విగుణీకృత ఉత్సాహంతో పునరుజ్జీవితులైన దిక్పాలకులూ, బ్రహ్మాది దేవతలూ శివునకు నమస్కరించి తమ ఆపన్నివారకుడైన పినాకపాణినిలా స్తుతించసాగారు.
“ఓ మహాదేవా! జగదానందకారకా! నీవల్లనే నిర్జించబడవలసినట్టి ఘోరదైత్యుడైన త్రిపురుని అంతాన్ని, మా ఉల్లములు రంజిల్లగా ఎన్నడు కన్నులారా చూస్తామోగదా? విశ్వానికే విఘాతకుడై వాడు చేసిన అకృత్యాల వల్లనేకదా మాకు మా నిజస్థానాలనుంచి స్థానభ్రష్టత సంప్రాప్తమైంది?”
దేవతల దైన్యమైన ఈ పలుకులకు ఉత్తేజితుడై కర్తవ్యోన్ముఖుడైన గిరిజాపతి అత్యంత సంతోషముతో గజాననుని ధ్యానించి, యుద్ధోన్ముఖుడై బయలుదేరాడు. శివుడు యుద్ధసన్నద్ధుడై వస్తున్నాడన్న వార్త ముందుగానే చారులవల్ల తెలుసుకున్న త్రిపురుడు తన దివ్యమైన కవచకుండలాలను ధరించి, అసుర సైనికులందరినీ తగు పారితోషికాలతో సంతోషపరచి, వివిధ వాహనాలపై అధిరోహించిన సైన్యమంతా వెంటరాగా తాను స్వయంగా త్రిపురాన్నధిరోహించి, నలుదెసలా మారు మ్రోగే ధ్వనిని చేస్తూ బయలుదేరాడు.
వెంటనే ఇరుసైన్యాలూ సంకుల సమరానికి తలపడ్డాయి! తమ తమ శస్త్రాస్త్రాలతో, శరములతో, ఖడ్గములతో ఇరుపక్షాల వీరులమధ్యా భీకరమైన యుద్ధము సాగుతుండగా వారి రక్తం నదులుకట్టి ప్రవహించ సాగింది!
ఓ మునీంద్రా! అలా వైరి శస్త్రాల దెబ్బలచే గాయపడ్డ ఇరుపక్షాల సైనికులూ ఎఱ్ఱగా, పుష్పించిన మోదుగవృక్షాల్లా కన్పించసాగారు. ఆ గందరగోళంలో ఇరు పక్షాలలోనూ స్వపరభేదము తెలుసుకోలేనంత ఘోరంగా పోరు కొనసాగింది. ఇదిలా ఉండగా వాయువు చేత పెనుగాలి దుమారంలా చెలరేగి ఆ ధూళి ముఖమంతా కొట్టపడ్డ దేవతాసైన్యం అధికంగా పడిపోయి, మిగిలినవారు పారిపోసాగారు.
అప్పుడు దేవరాజైన ఇంద్రుడు విజృంభించి తన వజ్రప్రహారములతో దైత్యసైన్యాలను చూర్ణము చేయసాగాడు! ఆ భయానికి కొందరు చచ్చినవారిలా పడు కున్నారు. ఆ భీకరయుద్ధంలో దైత్యుల కాళ్ళుచేతులూ, శిరస్సులు తెగిపడి రక్తం కాలువలై ప్రవహించసాగింది!
ఈ దృశ్యాన్ని చూసిన త్రిపురుడు మండిపడి, సింహనాదములు చేస్తూ ముందుకు చొచ్చుకువచ్చి ఇంద్రుడితో తలపడ్డాడు.
‘నీకు ప్రాణాలమీద ఏమైనా తీపివుంటే వెంటనే పారిపో! రణభూమినుంచి వెన్నిచ్చి పారిపోయేవాడిని నేనేమీ చేయను!’ అంటూ కవ్వించిన త్రిపురుడి మాటలకు రోషాన్వితుడై శచీపతియైన ఇంద్రుడు నిలచి శౌర్యంతో యుద్ధంచేశాడు. ఒక్కో బాణాన్నీ త్రిపురుడు అభిమంత్రించి ప్రయోగించగా అది వెంటనే అనేక బాణాలుగా రూపొంది ఆకాశాన్నంత టినీ కప్పివేస్తూ దేవతాసైన్యాలను బాధించసాగింది. వెనువెంటనే ప్రయో గించిన ఆ దైత్యుని మరో శరానికి ఇంద్రుడు మూర్చిల్లాడు. ఆ అద్భుత పరాక్రమానికి అచ్చెరువొందిన శంకరునికి నారదుడు దర్శనమిచ్చి ఆతనికి రాక్షసవధోపాయాన్నిలా చెప్పసాగాడు.
నారదుడు త్రిపురాసుర వధోపాయం చెప్పుట
“ఓ శంకరా! ఈ రాక్షసుడు గతంలో గణేశుడిని గురించి ఘోర తపస్సుచేసి మూడు అభేద్యమైన పురాలను, అశేషవరాలనూ పొందాడు. అప్పుడు గజాననుడే ”ఎన్నడైతే ఒకే బాణంతో ఈ మూడు పురాలూ భేదించబడతాయో, అప్పుడే, అలా భేదించిన వెంటనే అతని చేతిలో నీకు మృత్యువు సంభవిస్తుంది!” అంటూ వరమిచ్చాడు! కనుక నీవు ఆ ప్రకారమే చేయవలసింది!” అంటూ దేవరహస్యం తెలిపి నారద మహర్షి అంతర్ధానం చెందాడు.
శంకరుడు ఆనందంతో, మూర్ఛిల్లిన దేవసైన్యాలను స్వస్థపరచి, గజాననుని వాక్యమును స్మరించి దైత్యవధకు మహాప్రయత్నాన్ని చేసాడు. మహాప్రభావశాలియైన ఆ గరళ కంఠుడు భూమిని రధంగానూ, సూర్యచంద్రులనే రధచక్రాలుగానూ, బ్రహ్మదేవుని రధసారధిగా చేసుకున్నాడు.
మేరువును ధనుస్సుగానూ, అచ్యుతుని అస్త్రంగానూ, అశ్వినీ దేవతలనే రథాశ్వాలుగా చేసి, ఆచమించిన శంకరుడు గజాననుని తన హృదయంలో ధ్యానించి, ఆయన ఉపదేశించిన సహస్రనామాలనూ ఉచ్ఛరించి, ఏకాక్షర గణపతిమంత్రంతో తన బాణాన్ని అభిమంత్రించాడు.
ఆ ఉదృతానికి భూమి శేషుడూ, పర్వత శిఖరాలతో నదీవనాలతో సహా గడగడా వణికింది!ఆ ప్రభావవంతమైన బాణాన్ని శంకరుడు వింటినారి సారించి విడువగానే ఆకాశమంతా దగ్ధమైంది! భూ పాతాళలోకాల్లో కూడా మంటలు వ్యాపించసాగినాయి!
త్రిపురాధిష్టితుడైన ఆ రాక్షసుడు ఆ బాణాన్ని చూడటంతోటే వెలవెల బోయాడు! అప్పుడా ఆ అఘోరాస్త్రము మహావేగంతో వచ్చి త్రిపురాలనూ భస్మంచేసి, దానవశ్రేష్టుడైన అసురుని కూడా భస్మం చేసింది!అప్పుడు అందరు చూస్తుండగా ఆ రాక్షస్సుని శరీరంలోంచి తేజస్సు వచ్చి శంకరుని శరీరంలో లయించింది!
“శివునిచేత హతుడైన లోకకంటకుడైన రాక్షసుడు ముక్తిని పొందాడు!” అంటూ ఆకాశవాణి పలికింది! దేవతలు, మునులూ విజయుడైన శంభుని స్తుతించారు. గంధ ర్వులు గానం చేశారు! అప్సరలు ఆనందంతో నాట్యం చేశారు. కిన్నెరలు వాద్యములను వాయించారు. నారదాది దేవర్షులు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు!
దేవతలంతా శివుని అనుజ్ఞగైకొని నిర్భయంగా తమతమ నెలవులకు వెళ్ళారు. త్రిపురాంతకుడైన ఈశ్వరునికి నమస్కరించి మునీశ్వరులు సైతం తమ అనుష్టానాదులను చేసుకోడానికి తరలి వెళ్ళారు. అప్పటినుంచి వేదవిదులైన బ్రాహ్మణులు అగ్నిహోత్రాది కర్మలను నిరాటంకంగా కొనసాగించారు.
అప్పుడు స్కందుడు మొదలైన శివగణాలు అభివాదం చేయగా శంకరుడు తిరిగి ఆ రధాన్ని విభాగం చేసివేశాడు. జయజయ ధ్వానాల తోనూ, దుందుభి ధ్వనులచేత మారుమ్రోగుతూ. సర్వాలంకృతమైన కైలాసము చేరాడు!
అప్పటినుంచి శంకరునికి ”త్రిపురాంతకుడు” అన్న ప్రఖ్యాతి లోకం లో కలిగింది! ఈవిధంగా మహాగణపతి మంత్రసామర్ధ్యము, సహస్రనామ ప్రాశస్త్యమూ వివరించబడింది! ఓ వ్యాసమునీంద్రా! ఈ విషయం నేను తప్ప ఇంకెవరూ ఎరుగరు! నేనూ ఈ మహాత్మ్యాన్ని ఎవ్వరికీ ఇంత వరకూ చెప్పియుండలేదు! దీన్ని చదవటంవల్లా, వినటంవల్ల సర్వ కామనలూ సిద్ధిస్తాయి!
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”శంకర విజయం” అనే నలబై ఏడవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹