కాలయవనోపాఖ్యానము
గోష్ఠమందు గార్గ్యుని బావమరది.అతనిని (పురోహితుని) యదువులదరి సన్నిధియందు షండుడని (నపుంసకుడని) తూలనాడెను. యాదవులందఱు నవ్విరి. అంతనతడు కినుకగొని దక్షిణాపథమునకు వచ్చి యదువంశ భయంకరుడగు పుత్రునింగోరి తపస్సుచేసెను. ఆతడు శివునారాధించుచు లోహచూర్ణ మాత్రము తిని యుండెను. హరుడాతనికి సంతుష్టుడై పండ్రెండవ సంవత్సరమున వరమిచ్చెను. పుత్రసంతతిలేని ఆతనిని యవనాధీశ్వరుడు గౌరవించెను. వానియంగనతో నతడు సంగమించినంతట భ్రమర (తుమ్మెద) సమాన ప్రభగల కొడుకు పుట్టెను. కాలయవనుడను పేరుగలవానిని వజ్రకఠినమైన రొమ్ముగల వానిని తనరాజ్యమున పట్టాభిషేకించి అడవికి బోయెను.
ఆ కాలయవనుడు బలమున మదమెక్కి అవనింగల బలవంతులు రాజులెవ్వడని అడుగ నారదుడు యాదవులని తెల్పెను. వాడు కోటివేలమంది మ్లెచ్ఛులతో చతురంగ బలముతో పెద్ద ఉద్యమము చేసెను. దినదినమెండలను బడివాడు పయనించి కసిగొని యాదవులను గూర్చి మధురాపురి కేగెను. అంతట కృష్ణుడిట్లాలోచించెను యవనులచె యాదవులము నశించుటచూచి మాగధుడు (జరాసంధుడు) యుద్ధమున కేతెంచును. మాగధునిబలము క్షీణించినపుడు యవనుడు వచ్చును.ఈవిధముగ రెండువైపులనుండియు యాదవులకు కష్టము వచ్చివడినది. అందుచే యాదవులకొరకు ఒకభేద్యమైన దుర్గమొకటి నిర్మించెదను. తద్రక్షణచే అబలలు (స్త్రీలు) కూడా యుద్ధము చేయగలరు. అట్టియెడ పృష్టి యదువంశములవారి మాటచెప్పనేల? నేను మత్తుకొనికాని ప్రమత్తుడనై కానియున్నను నిద్రపోయినను నెటకేని ప్రవాసము వెళ్ళినగాని యాదవుల లోకువచూచి శత్రువులు వారిపై నెక్కువ విజృంభింపరు. అని గోవిందుడు ఆలోచించి మహాసముద్రుని పండ్రెండు యోజనముల మేరనిమ్మని (సముద్రమును దూరముగా తొలగుమనికోరి అచట ద్వారకాపుర నిర్మాణము చేసెను. అది మహోద్యానములు పెద్దకోట పెక్కుతటాకములు ప్రాకారములతో ఇంద్ర రాజధాని అమరావతివలెనుండెను. మధురాపురవాసులను అక్కడికి గొనివచ్చి అందుంచి కాలయవనునికి దగ్గరగా నుండునని తాను మధురకేగెను. అందుండి సైన్యము తరలింపబడగా దాన నిరాయధుడై అటకేగినంత అతనిని కాలయవనుడు చూచెను. వాడాయన వాసుదేవుడని గ్రహించి చేత ఆయుధములూని మహాయోగులేని మనసుల చేబట్టరాని ఆ స్వామిని వెన్నంటి తరిమె. అట్లు తరుమబడి కృష్ణుడచ్చట ముచుకుందుడను రాజు మహా పరాక్రముడు నిద్రించుచున్న గుహలో ప్రవేశించెను. ఆ యవనుడు అటదూరి అటపరుండియున్న నరునిగని కృష్ణుడనుకొని పాదముచే దన్నెను. అతడు కన్దెఱచి చూచిన క్షణములో యవనుడగ్నిచే గాలిపోయెను. ఆ ముచుకుందుడు మున్ను దేవాసురయుద్దమునకేగి మహారాక్షసులందఱిం జయించి దేవతలను నిద్రకావలెనని కోరెను. వారును నిదురించిన నిన్నెవ్వడువచ్చి లేపునో వాడు నీ దేహమునంబుట్టిన అగ్నిచే అప్పుడే భస్మము గాగలడు అని వరమిచ్చిరి.
ఇట్లాపాపాత్ముని యవనునింగాల్చి మధుసూదనుంగని ఎవడవీవు అన నేను చంద్రవంశమున వసుదేవునికి బుట్టినాడను యాదవుడనని హరిపల్కెను. ముచుకుందుడు విని వృద్ధగార్గ్యుని మాటస్మరించి సర్వేశ్వరుండని యెఱింగి హరికి ప్రణతుడై యిట్లనియె. అవును నిన్నెఱుగుదును నీవు విష్ణుని అంశమున ఉదయించినవాడవు. మున్ను గార్గ్యుడు ఇరువదియెనిమిదవ ద్వాపరము చివర యదువంశమున హరియవతారము జరుగుననిచెప్పెను. అతడే నీవు. మర్త్యులకుపకారము చేయదయచేసిన వాడవు. సంశయములేదు. నీ అప్రాకృత దివ్యతేజము నేను సహింపలేను. అని మహామేఘగర్జాగంభీరమైన ధ్వనితో ముచుకుందుడు కృష్ణస్వామినిట్లు స్తుతించెను.
ముచుకుందుడు కృష్ణుని స్తుతించుట
స్వామి!దేవాసుర యుద్దములం దుద్బుతులైన దైత్యులెందఱో నీతేజమునకు తట్టుకొనలేకపోయిరి. అట్టి నీ తేజస్సు నేనోర్వజాలను. సంసానపతితమైన జంతువునకు నీవొక్కడివే దిక్కు. ప్రసన్నుల ఆర్తిని హరించునీవు నా యెడ ప్రసన్నుడవుగమ్ము.నా అశుభమును హరింపుము. సముద్రములు పర్వతములు నదులు మేదిని గగనము వాయువు నీరు అగ్నియునీవే. పురుషునికంటె మిగులపరమై వికల్పాత్మకమైన ఎల్లజన్మములందు వ్యాపించి శబ్దాది విషయస్పర్శలేక వృద్ధిక్షయ జరాదులు లేకయున్న కేవలమైన వస్తువునీవే. నీవలనన చరాచరాత్మకము స్థూలము సూక్ష్మమునైన జగత్తు పొడమినది. పొడముచున్నది. పొడమనున్నది. మూర్తము అమూర్తము నైవదెల్ల నీవలననైనదే. నీకంటె మఱియేదియులేదు. సంసారచక్ర పరిభ్రమణము సేయుచు తాపత్రయ తప్తుడనైన నాకాత్యంతిక సుఖమందలేదు. దుఃఖములను సుఖములని యెండమావులను జలాశయములని అనుకొంటిని. అది ఎక్కడలేని ఉడుకుం దెచ్చిపెట్టినది. రాజ్యసుఖము పుత్రమిత్ర కళత్రాదికము శబ్దాది విషయభోగము సుఖమని మఱిగిన నాకు తుదకది తాపాత్మకముగా పరిణమించినది. దేవలోక గతినందితినిగాని ఆ దేవగణము నా సహాయము గోరినది. తండ్రీ! శాశ్వతమైన నిర్వృతి (పరమ తృప్తి) ఎక్కడ? సర్వజగత్ప్రభవస్థానమును నిన్నారాధింపక అశాశ్వతానంద మెవడు పొందును? నీమాయచే మూఢులై జన్మమృత్యుజరాది పాపానుభవములనంది ప్రేతపతిం జూతురు. అవ్వల కాలపాశములం గట్టువడి అతిదారుణముగ నరకములందనేక విధములగు దుఃఖములందురు. ఇది నీ విశ్వ స్వరూపము. నేను విషయ లోలుడనై నీమాయచే మోహితుడనై మమకారమను మురికి గుంటలో తిరుగాడుచున్నాను. పరమేశ్వర! నిన్ను స్తుతిపాత్రుని శరణందుచున్నాను. సంసారశ్రమచే నుడికిల్లిన మనసుతో నిర్విణ్ణుడనై (దుఃఖినై) పరమపదమైన పరంధామమైన నీయందుముచ్చటగొన్నాడను.
ఇది శ్రీ బ్రహ్మపురాణమున కాలయవనోపాఖ్యానమున ముచుకుంద చరిత్రయను తొంబయ్యవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹