ఉపాసనా ఖండము మొదటి భాగము
అంబావిర్భావం
అనంతరం వ్యాసమునీంద్రుడు బ్రహ్మదేవుని ఇలా ప్రశ్నించాడు. “ఓ చతురాననా! త్రిపురాసుర సంహార చరిత్రను నాకు వర్ణించి చెప్పావు! సరే! అలా కైలాసంలో ఆ త్రిపురుని బారినుండి తప్పించుకున్న జగదంబిక పార్వతి ఎక్కడ ఉన్నదో, తిరిగి ఎప్పుడు ఉద్భవించిందో ఆ వివరాలన్నీ, దానవశ్రేష్టుడైన త్రిపురుడు ఏరోజున వధించబడినదీ మొదలైన వివరాలన్నీ నాకు దయతో చెప్పు!”
“ఓ వ్యాసమునీంద్రా! పూర్ణిమతిధి తిధులు అన్నిటిలోకి ప్రభావ వంతమైనది! ఆరోజు దినభాగమంతా శంకరుడు దానవునితో ఘోరంగా యుద్ధంచేశాడు. ఆరోజు సాయంకాలము ప్రదోషపువేళ త్రిపురములతో సహా దైత్యేంద్రుడైన త్రిపురుడుకూడా శివుని బాణాగ్నియొక్క అమోఘప్రభావం చేత దగ్ధం కావించబడ్డాడు.
ఆరోజునే సకల దేవతలూ శర్వుని అర్చించిన శుభతరుణం! కనుకనే ఓమునివర్యా! ఆరోజు ఉదయాన్నే ఎవరైతే త్రిపురారిని అర్చిస్తారో వారికి సర్వత్రా విజయం సంప్రాప్త మౌతుంది! వారి పుణ్యమూ ఇతోధికంగా వృద్ధి అవుతుంది! అందుచేతనే విజ్ఞులైనవారు తప్పక ఆరోజున అర్చించి శివానుగ్రహానికి పాత్రులౌతారు!
అయితే ఆ రోజున త్రికాలాలలోనూ శివార్చన యొక్క ఫలితం యిలా ఉంటుంది. ప్రాతఃకాలార్చనకు ఫలం రాత్రియందు చేసిన సకల పాపములూ నశిస్తాయి!మాధ్యాహ్నికార్చనవల్ల జన్మించినదాదిగా చేసిన పాపములు నశించిపోతాయి!ఇక ప్రదోషవేళ శంభుని పూజించటం వల్ల ఏడు జన్మాలలోనూ ఆచరించిన దుష్కర్మలు దగ్ధమౌతాయి! ఇంత మహత్తరమైనదవటంవల్లనే ”పూర్ణిమ “తిధిని పర్వదినంగా భావిస్తారు!
ఓ పరాశరనందనా! త్రిపురుడు శివుని బాణాగ్నికి దగ్ధుడైన సంగతి తెలుసున్న గిరినందన హిమవంతుని పర్వతగుహ బైట ఆవిర్భవించింది! అలా వెలుపలికివచ్చి వెలుపల సింహ. వ్యాఘ్రములచేత నానావిధములైన అడవి మృగాలతో నిండివున్న ఘోరమైన ఆ పర్వతాన్ని చూసి ఎక్కడా తన భర్తయైన శంకరుని జాడ కానరాక..
‘ఓ ప్రాణనాధా! నిన్ను విడిచి నేనెలా జీవించి ఉండగలను? ఇక నీ దివ్యవదనాన్ని సందర్శించుకునే భాగ్యం నాకు ఎన్నటికి కలిగేది? నిన్ను వీడి క్షణకాలం కూడా మనలేను! ఓతండ్రీ! హిమవంతుడా! నా ఈ దుఃఖాన్ని నీవుకూడా గమనించుటలేదా? ఇక నేను ఎవ్వరి శరణువేడను? నా వ్యధని తీర్చగలవారెవ్వరు? ఓ తండ్రీ! నీవెలాగైనా ఆ మంగళకరుడైన నా నాధునితో సంయోగము కలిగేలా చూడు! నీవు పూనుకొని నా భర్తతో పునఃసమాగమం కల్పించకపోయావా నాకిక ప్రాణత్యాగమే గతి!” అంటూ గోడుగోడున విలపిస్తున్న సంగతిని ఒక కిరాతుడు ఇలా పర్వతరాజైన హిమవంతుని చెవిన వేశాడు.
“ఓ పర్వతరాజా! ఒక మంగళప్రదురాలైన స్త్రీ, సర్వాలంకారములతో అలంకృతయై, చెవులకు గుండ్రని తాటంకాలనూ, నుదుట ముత్యాలతో అలంకరించబడ్డ ఆభరణాన్నీ ధరించి, ముక్కుకు బంగారు ముక్కెఱనూ, చేతులకు దండకడియాలతో మురుగులతోపాటు వెలలేని నవరత్నఖచిత తాపితమైన ఉంగరాన్ని ధరించి, మెడలో ముత్యాలహారాలతో, మొలకు మెరిసే బంగారు వడ్డాణంతో ఘల్లున మ్రోగే కాలి యందెల అలంకారాలతోనూ శోభిల్లుతుండగా, ఎందుకో ఆమె అతి దుఃఖంతో వివశురాలై నీ పేరును మాత్రం బిగ్గరగా చెబుతూ శోకిస్తోంది! ఏవివరమూ, అడిగినా చెప్పదు! ఆమెనోట వినవచ్చిన నీపేరు విని, నీతో ఆవిషయం చెప్పిపోదామని వచ్చాను!”
ఈ మాటలు విన్న పర్వతుడు వేగంగా ఆ పర్వతగుహను సమీపించి, తన కుమార్తెయైన జగదంబికను అక్కున చేర్చుకొని ఊరడించాడు. ఆమెయొక్క నిజస్వరూపాన్ని గుర్తుచేస్తూ “ఓతల్లీ! నీవు సర్వశక్తిమంతురాలవూ, సకల సృష్టిస్థితిలయములకై కారకురాలవూ, సమస్త కోరికలు పరిపూర్తియైనట్టి మంగళప్రదురాలవు! నీకీ దైన్యమేమిటమ్మా? సర్వాంతర్యామిణిగా ఉన్న నీకు శివునితో వియోగ మెక్కడుంది? శివుడిని అనుసరించేకదా ‘శక్తి’ ఉండేది? ఐనా లోకదృష్టితో నీకూ, నీ భర్తతో సమాగమం ఏర్పాటుచేస్తాను!అందాకా నీవు నావద్దనే ఉందువుగాని తల్లీ!” అంటూ ఆమెను తనవెంట తీసుకువెళ్ళాడు.
అక్కడ తన తల్లిని చూసిన పర్వతరాజనందిని ఎంతో ఆనందించింది! అయినా భర్తయొక్క వియోగం తనని వేధిస్తూండటంతో విరహాగ్ని లో తప్తురాలై వేడివేడి నిట్టూర్పులు విడువసాగింది! తన తండ్రికి నమస్క రించి ‘ఓ తండ్రీ! నా భర్తయైన సాంబశివుడిని తిరిగి పొందేందుకు ఏదైనా చక్కని ఉపాయం తపంగాని, వ్రతంగాని ఉపదేశించు! అలాచేసి, పూర్వంలా ఘోరతపస్సు ఆచరించి నాభర్త అనుగ్రహాన్ని పొందుతాను!”
అని కోరగా క్షణకాలం ధ్యానమగ్నుడై, హిమవంతుడు తన కుమార్తెకు సకల కార్య సిద్ధినీ ప్రసాదించగల మహాప్రభావవంతమైన ఉపాయాన్ని యిలా తెలిపాడు.
‘అమ్మాయీ! పార్వతీ! పరమశివుని సన్నిధిని తిరిగి నీవు ప్రాప్తించు కునేందుకు ఒక ఉపాయాన్ని తెలియజేస్తాను! జాగ్రత్తగా విని, దాన్ని శ్రద్ధగా ఆచరించి, నీ మనోభీష్టాన్ని అనంత సౌభాగ్యాన్నీ పొందు!
సర్వులకూ చతుర్విధ పురుషార్థాలనూ ఇవ్వగలది, ఇంద్రాది సకల దేవతలచేతనూ సలుపబడుతున్నదీ, మహాప్రభావ సంపన్నమైనదీ విఘ్నరాజు ఐన గజాననుని ఉపాసన! సృష్టికర్తయైన బ్రహ్మకు ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించిందీ, స్థితికర్తగా లోకపాలనం చేసే శక్తిని విష్ణువుకూ, సర్వాన్నీ లయం చేయగల శక్తి హరునికి ఆ గణేశుడే యిచ్చి అనుగ్రహించి ఉన్నాడు!
ఇక భూభారాన్ని వహించగల సామర్ధ్యాన్ని శేషునికి ప్రసాదించిందీ ఆతడే! ఆతడు అవాజ్ఞానస గోచరుడు. బ్రహ్మేంద్రాదులుగాని, నారదాది మహర్షులుగాని ఆ సర్వేశ్వరుని స్వరూపం తెలుసుకోలేరు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నప్పటికీ, తన నిజభక్తజనుల అనుగ్రహార్ధమై ఈ అనుగ్రహకరమైన గజానన రూపంలో ఆవిర్భవించాడు!
సర్వులచేతా, సకల కార్యారంభాలలోనూ పూజించబడే ఆ వరద గణేశమూర్తి సకల శుభఫలప్రదుడు! కనుక నీవు ఆ గజానన స్వరూపుని, సర్వేశుడైన ఆ దేవదేవుని నే చెప్పే నియమాలతో శ్రద్ధగా పూజించి అతడి పరమానుగ్రహాన్ని పొందాడు..
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”అంబావిర్భావం” అనే 48-వ అధ్యాయం.సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹