బలరామ క్రీడా వర్ణనము
వ్యాసుడిట్లనియె.
మాయామానుష రూపమున ఒకానొక పనికై అవని నవతరించి గోపకులతో బృందాపనమున సంచరించుచున్న తన ఫణామండలమున ధరణి నెల్ల ధరించిన శేషుని అవతారమై మహత్తర కార్యములను నిర్వహించుచున్న బలరాముని అపభోగముకొఱకు వరుణుడు వారుణియను తన శక్తిని గూర్చి ఓ మదిరా! నీవు అనంతునికి ఎంతయో ఇష్టమైనదానవు. అతడు నిన్నాలకించుటకు ఆనువుగ అచటికరుగుము అన ఆ వారుణి సంకర్షణుని సన్నిధానమునకు అరిగెను. బృందావనమందున్న కదంబ (కడిమి) వృక్షముయొక్క తోఱ్ఱలోవసించుచు బలదేవుడద్భుతమైన మద్యపరిమళము ఆఘ్రాణించి తొలుతటి చవి గుర్తించి హర్షమొందెను. అవ్వల ఆ చెట్టునుండి పడుచున్న మధ్యధారను జూచిమిగుల సంతోషించెను. గోపికలతో గోపకులతోగూడి గీతవాద్య నిపుణులు తనయశోగానము చేయ ఆ వారుణుని త్రావెను. శ్రమచే క్రమ్మిన చెమట బిందువులు ముత్యములవలె భాసిల్లనతడు యమునకు వచ్చి స్నానము చేయుదునని పలికెను.
ఆనది యాతని మాటవిని తప్పత్రాగి మత్తుచే నన్నమాటయని అనుమానించి ఆమె రాదయ్యెను. దాన గోపించి ఆతడు నాగలి గైకొని మదవివశుడై ఆన ది యొడ్డున పెల్లగించి లాగెను. పాపాత్మురాలా ! రానైతివి. మరి యెచటికేని నీ ఇచ్చ ననుసరించి పొమ్మనెను. ఆ నదీదేవత అట్లు తటాలున ఆకర్షింపబడి మార్గము విడిచి బలదేవుడున్న ఆ వనమునంతటను ముంచెత్తెను. మరియు శరీరము దాల్చి బెదరిన చూపులతో ఓ హలాయుధా ! అనుగ్రహము జూపుము. నన్నువదలిపెట్టుమని పల్కెను. అతడు నాశౌర్యమును బలమును నీవు కించ పరతువేని నా నాగలిచే నిన్నుడచి వేయిపాయల వెంట నిన్ను నడిపించెదను. అననామె మిక్కిలి జడిసిపోయి బ్రతిమాలినంతట ఆమె ముంచెత్తిన భూభాగమందామెను వదలెను.
అవ్వల నతడందు స్నానము చేయగా అద్భుతకాంతి వచ్చెను. తరువాత లక్ష్మి ఒకనల్లగలువను శిరోభూషణముగను వరుణుడు కానుక పంపిన కుండలము వెట్టుకొని వాడిపోని తామర పూమాలను సముద్రునికి కుచితములైన రెండు దివ్యాంబరములను బలభద్రునకు కానుకపెట్టెను. నీలాబ్జము నవతంసముగ ధరించి మణికుండలము చెవికి బెట్టుకొని ఆ నీలాంబరములు గట్టుకొని పూలమాలదాల్చి కాంతినొంది బలరాముడు మిక్కిలి శోభించెను. అచట రెండు మాసములు క్రీడించి మధురకు జని రైవతరాజు కూతురు రేవతిని పరిణయమాడెను. ఆమెయందతడు నిశఠుడు ఉన్ముఖుడు అను ఇరువురు పుత్రులను కనియెను.
ఇది బ్రహ్మపురాణమున బలరామ క్రీడా వర్ణనమను తొంబై రెండవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹