ఉపాసనా ఖండము మెదటి భాగము
వరదగణేశ వ్రతవిధానం
ఓ వ్యాసమునీంద్రా! హిమవంతుని ఉపదేశాన్ని విన్న గిరినందన తిరిగి తన తండ్రినిలా ప్రశ్నించింది
“ఓ తండ్రీ! నీ ఉపదేశము నా చెవులకు అమృతపు జల్లై కురి సింది! ఐతే ఈ వరదగణేశ వ్రతాన్ని ఇంతకు పూర్వం ఎవరాచరించారు? ఎలాంటి సిద్ధుల్ని పొందారు? ఆ వివరాలను నాపై కృప వహించి తెలియజేయవలసింది.”
కుమార్తె యొక్క శ్రద్ధాసక్తులకు ఆనందం పొందిన హిమవంతుడిలా అన్నాడు
“అమ్మా! నీవు, నీకై గణేశుని గాధలను వివరించే నేనూ కూడా ఇందువల్ల ధన్యులమౌతాము! ఎందుకంటే గణనాధుని దివ్యలీలల, కధనమూ, శ్రవణమూ కూడా అత్యంత కమనీయమైనవి! పరమపావనమైన ఆ కథావృత్తాంతాన్ని నీకు తెలుపుతాను! విను!”
“ఓ పార్వతీ! పూర్వం కైలాసంలో ప్రమధగణాలతో సేవించబడుతూ సుఖాసీనుడైవున్న శంకరునికి అభివాదముచేసి, స్తుతించి, షణ్ముఖుడైన స్కందుడిలా ప్రార్ధించాడు
“భక్తులపాలిట కొంగు బంగారమై, అభయ వరప్రదుడవైన ఓ శంకరా! నీయొక్క కృపావిశేషములచేత అనేక ఉపాఖ్యానాలను నీనుంచి తెలుసుకున్నాను! ఐనా, ఆ దివ్యగాధల మకరందాన్ని ఎంతగా గ్రోలినా, తనివి తీరటంలేదు! అందుకని ఇప్పుడు సర్వార్థసిద్ధికరమైన ఒక వ్రతము గురించి చెప్పు! ఎవరి సంబంధమైన వ్రతాన్ననుష్టించటంవల్ల జనులకు సర్వసిద్ధులూ కాగలవో, అట్టి వరప్రదుని వ్రతాన్ని నాకు ఉపదేశించవలసింది!” అంటూ వేడిన స్కందునితో శంకరుడిలా అన్నాడు.
వరదవ్రత ఫలం
కుమారా! లోకోపకారార్ధమై నీవడిగిన ఈప్రశ్న ఎంతో ఉచిత మైనది! నీయందు నాకుగల ప్రేమ, వాత్సల్యాలవల్ల భూలోకంలో సమస్త మహాసిద్ధులను ఇవ్వగల వ్రతాన్ని గురించి చెబుతాను! అదే వినాయకుని వ్రతము! ఇది సర్వవ్రతాలలోకీ శ్రేష్టమైనదేకాక అత్యుత్తమమైన ఫలాన్ని ఇవ్వగలది!
ఓ కుమారా! యజ్ఞ, దాన, జప, హోమాదులనే ఉత్కృష్టములైన సాధనాంగాల గురించిన ప్రసక్తి ఏమాత్రం లేకుండా, సకల సిద్ధులను ప్రదానం చేసేదీ, పుత్రపౌత్రాభివృద్ధిని కల్గించేదీ, ఈ గణేశ వ్రతమేసుమా!
ఈ వ్రతప్రభావంవల్ల, రాజాధిరాజులూ, సమస్తమైన అధికారిక పురుషులూ కూడా సులభంగా వశ్యులౌతారు! ఈ వ్రతానుష్టాన మహిమ అనేక జన్మార్జిత పాపకోటినంతటినీ భస్మంచేస్తుంది! అంతేకాదు ఈ ప్రతప్రభావంవల్ల మానవుడు దుర్లభమైన ముక్తినిసైతం బడయగలడు! ఈ వ్రతము సకలార్ధప్రదుడైన గణేశునికి అత్యంత ప్రీతిపాత్రమైనది! దీనితో సాటైన మరోవ్రతమేదీలేదు! ఈ వ్రతాన్ని ఆచరించినవాడు సకల సిద్ధులచేతా ఆశ్రయించబడతాడు!”
ఈ మాటలకు స్కందుడు తిరిగి ఇలా ప్రశ్నించాడు. “తండ్రీ! ఇంతటి మహామహిమోపేతమైన వ్రతాన్ని ఎప్పుడు అనుష్టించాలి? దీని విధానమేమిటి? ఇదివరలో దీన్ని ఎవరు ఆచరించి శ్రేయస్సును పొందారు? ఈ వృత్తాంతాన్నటినీ దయతో సెలవివ్వండి!” అని అడుగగా శంకరుడిలా బదులుచెప్పాడు
వ్రతానుష్టాన కాలం
“ఓ కుమారా! ఈ వ్రతాన్ని శ్రావణశుద్ధ చవితినాడు ఆరంభించాలి! ఆ రోజున స్నానసంధ్యాదులను గావించుకొని, గురుగృహానికి వెళ్ళి సాక్షాత్ గణేశ స్వరూపునిగా ఆయనకు సాష్టాంగనమస్కారము, పాద్యము, ఆచమనం, వస్త్రములను సమర్పించి, వారిని సంతుష్టపరచి వారినుంచి ఉపదేశంగా పొందాక, వారి అనుజ్ఞతో, ఈ వ్రతాన్ని ఆరంభించాలి!
అక్కడినుండి వచ్చి తన గృహంలో సుఖాసీనుడై, గురూపదిష్ట మార్గంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి! దీనికై మృత్తికతో గజాననుని మూర్తిని తయారుచేసి ప్రతిదినమూ పూజించాలి! ఇలా భాద్రపద శుక్ల చవితి వచ్చేవరకూ పూజిస్తూండాలి!
వ్రతనియమాలు
బ్రహ్మచర్యము, అధఃశయనము, ఏకభూక్తము (నక్తం)తో గడపాలి. ఉప్పు, కారములను వర్ణించి, మధురపదార్ధాలనే భుజిస్తూ, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి!
ప్రతిరోజూ వ్రతం ముగిశాక, గణేశ ఏకాక్షరీ, షడక్షరీ, చతురక్షరీ, దశాక్షర, ద్వాదశాక్షరులలో ఒక మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో జపించాలి.
జప సంఖ్య
ఓ కుమారా! ప్రతీరోజూ ఇంత అని నియమంగాగాని లేదా పదివేలుగాని జపించాలి! ఇలా జపంచేస్తూ, గణేశుని హృదయపద్మంలో ధ్యానిస్తూ, సావధానమనస్కుడై ఉండాలి! భాద్రపద శుక్ల చతుర్ధినాడు గజాననుని స్వర్ణమూర్తినీ, ఎలుక లేదా నెమలి వాహనాన్నీ చేయించాలి!
వ్రతవిధానం
ముందుగా పూజాస్థలంలో ఒక మంటపాన్ని ఏర్పరచి, దానిపై ధాన్యంపోసి, బంగారు, వెండి లేదా రాగి కలశాన్ని స్థాపించి, దానిమీద ఇంకో లోహపు పాత్రనుంచి, దాన్ని వస్త్రద్వయంతో చుట్టబెట్టాలి!
ఆ కలశంలో పంచపల్లవాలనూ, పంచరత్నాలను ఉంచి ముందుగా వీరపూజను చేయాలి! ఆ తరువాత కలశంపైన గణేశుని మూర్తిని స్ధాపించి,మూలమంత్రాలతోనూ, వేదమంత్రాలతోనూ గజాననుణ్ణి ధ్యానించి పరమప్రీతితో ఆహ్వానించాలి!
ఇలా ఆవాహన చేశాక, గణేశమూర్తికి పాద్యం, అర్ఘ్యం, ఆచమనం మధుపర్కం సమర్పించి,పంచామృతాలతోనూ, ఆ తరువాత శుద్ధోదకం తోనూ స్నానంచేయించాలి!
ఆ తరువాత ఎఱ్ఱటి వస్త్రద్వయాన్ని సమర్పించి, యజ్ఞోపవీతాన్ని, దివ్యాలంకారాలను సమర్పించాలి! గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది షోడశోపచారాలతో గణేశుని అర్చించాలి!
నైవేద్యం
ఇక నైవేద్య ద్రవ్యాలేమిటంటే గారెలు, అప్పాలు, లడ్లు, అన్నపాయసము, మొదలైన మధుర పదార్థాలను నివేదనగా సమర్పిం చాలి! హస్తప్రక్షాళనం తరువాత, తాంబూలాన్ని సువర్ణ దక్షిణాదికాలతో సమర్పించి, గౌరవించి, ఛత్రం చామరం మొదలైన సకలమైన రాజోపచారాలను చేయాలి!
నీరాజన మంత్రపుష్పాలను సమర్పించి అనంతరం గణేశుని సహస్రనామాలను పఠించాలి! ఆ తరువాత బ్రాహ్మణులను దానములతో సంతోషపరచి, ఆరాత్రి నృత్యగీతాలతో జాగరణ చేయాలి!
“నాయనా! ఆ మర్నాడు ప్రాతఃకాలంలోనే స్నానసంధ్యాదికాలు చేసి ఇదివరకులాగే ఆ దేవదేవుని ఆరాధించి, హోమంచేయాలి! ఇలా హోమం ముగించాక, ఆ ఆధ్వర్యుని దక్షిణాది కాలచేత సత్కరించి, తన శక్తికొలదీ ఇరవై ఒక్కమందికి తగ్గకుండా బ్రాహ్మణ భోజనం పెట్టాలి!
బీదసాదలకు అన్నదానంచేసి, పిదప తాను బంధుమిత్రులతో కూడి భుజించాలి! ఓ స్కందా! ఇది ఈ వ్రతవిధానం! ఈ వరదవ్రతము మానవులకు భుక్తి,భుక్తి ప్రదము!సకల కామనలనూ నెరవేర్చగలదు!ఇందుకు దృష్టాంతంగా నీకో పూరాతన ఇతిహాసాన్ని వివరిస్తాను!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹