Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – యాబై రెండవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

నలవ్రత నిరూపణం

తండ్రియైన హిమవంతుడు తనకు ప్రేమతో ఉపదేశించిన ”వరద గణేశ వ్రతవిధానం” అంతా విన్నాక పార్వతి ఇలా ప్రశ్నించింది.

“ఓ తండ్రీ! ఈ వ్రతాన్ని ఇంతకు పూర్వం నలుడు చేశాడని చెప్పావు! ఇంతకీ ఆ నలుడెవ్వరు? ఎందుకని ఈ వ్రతాన్ని ఆచరించాడు? ఈ వృత్తాంతాన్ని చెప్పి నాకు ప్రశాంతిని చేకూర్చవలసింది!” అని కోరగా హిమవంతుడీవిధంగా చెప్పసాగాడు.

“అమ్మా! పార్వతీ! ఈ నలుడనే మహారాజు పూర్వం నిషధదేశాన్ని పరిపాలించేవాడు. అతడొక మహాదాత! అమిత తపస్సంపన్నుడై, శుభ లక్షణాలతోనూ, సకల సంపదలతోనూ తులతూగేవాడు. ఈ నలమహారాజు సమస్త యుద్ధవిద్యలలో ఆరితేరినవాడై, అంతు లేని పరాక్రమంతో శత్రువుల పాలిట సింహస్వప్నమై ఉండేవాడు.

ఆ నలమహారాజుకు మహాసౌందర్యవతి, మహాపతివ్రతా, సుగణవతీయైన దమయంతి భార్య! నలమహారాజు కొలువులో పద్మహస్తుడనే కుశాగ్రబుద్ధి గల మంత్రి ఉండేవాడు. ఈ మంత్రి నీతివిషయంలో అంగీరసుని, ఔన్నత్యం విషయంలో మేరుపర్వతాన్ని మించి, సముద్రునివంటివాడై, గాంభీర్యంలో, బుద్ధికి బృహస్పతిలా ప్రతిభావంతుడై శోభించేవాడు.

ఈ నలమహారాజు ఒకనాడు మంత్రి సామంత దండనాధులతో కొలువుతీరి, రాజనర్తకీమణులు చేసే అద్భుతమైన నృత్యప్రదర్శనను తిలకించసాగాడు. అట్టి సమయంలో గౌతమమహర్షి ఆయన వద్దకు వచ్చాడు. రాజు ఎంతో గౌరవాదరాలతో తన సింహాసనంపైనుండి లేచి, ఆ మహర్షిని తన ఆసనంపై కూర్చుండచేసి యిలా ప్రశ్నించాడు.

“ఓ మహర్షీ! మీరాకచేత నేను అనుగ్రహించబడినాను! నాజన్మ కులము, మాతాపితరులూ, రాజ్యమూ సమస్తమూ ధన్యములైనాయి! తమరాకకు గల కారణం వెంటనే సెలవియ్యండి!”

ఆ మాటలకు గౌతముడిలా అన్నాడు.

‘ఓ మహారాజా!త్రిమూర్తుల చేతా, త్రిలోకాధిపతియైన ఇంద్రునిచేతా కూడా ప్రశంసించబడుతున్న నీ ఐశ్వర్యాన్నీ, వైభవాన్నీ చూడాలని వచ్చాను. మనుష్యలోకంలోఉన్నా, దేవతలచేతా, మానవులచేతా కూడా కొనియాడ బడుతున్నావు! నేను నిత్యతృప్తుడనైనప్పటికీ, నీయొక్క వినయమూ, సౌశీల్యమూ కూడా నాకు ఎనలేని తృప్తినిచ్చాయి! ఇక నీవు అనుజ్ఞనిస్తే నా ఆశ్రమానికి తిరిగి వెడతాను!” ఆ మాటలకు మహారాజైన నలుడిలా అన్నాడు.

“ఓ మునివర్యా! తాము సర్వజ్ఞులు! వేదవేదాంగాలను క్షుణ్ణంగా ఎరిగినవారు! సకలశాస్త్ర ప్రవర్తకులూ! ఓ దయానిధీ! క్షణకాలం తాము దయతో కూర్చుండి, నాకుగల ఒక సందేహాన్ని తీర్చ ప్రార్ధన!” అప్పుడు గౌతముడు ఆదరంగా

“ఓ నలమహారాజా! నీ శ్రద్ధాభక్తులకు అమితంగా ప్రసన్నుడనైనాను. సకల దేవతలూ, రాజులూ సైతం నీమాటను జవదాటక ఆజ్ఞగా శిరసావహిస్తారు! కనుక నేనూ నీమాటను తప్పక పాటిస్తాను! కనుక నీ సందేహాన్ని తెలుపు!” అన్నాడు.

“ఓ ఋషివర్యా! ఈ నా అపూర్వ వైభవంచూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతోంది! పూర్వజన్మలోని ఏ పుణ్యవిశేషం చేత ఇట్టి వైభవం నాకు కలిగింది? ఇంతకూ పూర్వజన్మంలో నేనెవర్ని?” ఆ వివరాన్ని దయతో నాకు తెలియజేయండి!” అంటూ ప్రశ్నించగా గౌతమముని నలునితో ఇలా అన్నాడు.

“ఓరాజా! పూర్వజన్మములో నీవు గౌడదేశానికి ఆవల గల పిప్పల నగరంలో ఒక దరిద్రుడైన క్షత్రీయుడవై జన్మించావు! ధనహీనుడనైన నీవు భార్యాబిడ్డల నిరసన వాక్యాలకు ఎంతో బాధపడి, విరక్తుడవై, ఎవరికీ తెలియకుండా ఒక మహారణ్యంలోకి వెళ్ళావు! కూరమృగాలతో నిండి, దట్టమైన మహావృక్షాలతోనూ మధ్యమధ్య సరస్సులతోనూ ఉన్న ఆ అరణ్యంలో తిరుగుతూ వెళ్ళి ఒకానొక ఋష్యాశ్రమాన్ని చేరుకున్నావు! ఆ ఆశ్రమం వేదఘోషతో ప్రతిధ్వనిస్తూన్నది. అది మహాతపస్వియైన కౌశికుని ఆశ్రమము!

లోనికివెళ్ళి భక్తితత్పరుడవై ఆ ఋషికి ప్రణమిల్లావు! దీనుల బాధలకు కరిగిపోయే స్వభావంగల కరుణాపూరితుడైన ఆ మహర్షి, నిన్ను ప్రేమారగా లేవనెత్తి, నీ దుఃఖకారణం ఎరిగి, నిన్ను ఇలా ఆశీర్వదించాడు.

“ఆ దేవేశుడైన గజాననుడు నీకు సకల శుభాలనూ చేకూర్చుగాక ఇలా ఆ ఋషిసత్తమునివద్ద అమోఘమైన ఆశీర్వచనాన్ని పొంది, సంతోషభరితుడవై ఆ మునిని నీ దారిద్ర్యనాశనానికై తగు ఉపాయం చెప్పమంటూ వేడుకున్నావు! అప్పుడా మహర్షి భుక్తిముక్తిప్రదమైన, సకలాభీష్టాలనూ నెరవేర్చగల, ఉత్కృష్టమైన గణేశారాధనను నీకు ఉపదేశించాడు.

ఆ తరువాత ఆ కౌశికుడిలా అన్నాడు “ఓరాజా! నీవు ఒక మాసమాత్రం క్రమంతప్పక ఈ గణేశవ్రతాన్ని ఆచరించు!” అంటూ ఆ వ్రతవిధానాన్ని నీకు కౌశికుడిలా చెప్పాడు

పూజావిధానం

“ఓరాజా! ముందుగా వరదుడైన గణేశుని దివ్యసుందర విగ్రహాన్ని మట్టితోచేసుకొని, ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠచేసి, షోడశోపచారములతో భక్తిగా పూజించాలి. ఇలా ప్రతిదినమూ శ్రద్ధగా ఒక మాసంరోజులపాటు చేయాలి! అలా నియమబద్ధుడవై ఆచరిస్తే, నీకు సకలసిద్ధులూ సంప్రాప్తిస్తాయి!” ఆ మాటలకు

“ఓ కౌశిక మునిపుంగవా! గజాననుని మూర్తిని మృతికతో చేయాలంటున్నారు. ఇంతకీ ఆతడి స్వరూపమెలాంటిది? అది నాకు దయతో తెలపండి. ఆతడి స్వరూపాన్ని తెలుసుకున్నాక, గణేశవ్రతాన్ని మీరుచెప్పిన రీతిలో నియమంగా ఆచరిస్తాను!” అన్న అతడి మాటలకు కౌశికుడిలా అన్నాడు

“ఓ రాజా!గణేశుడంటే ‘ఇతడు’ అని నిర్వచించరానివాడు!సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపుడే ఆతడు!ఈ జగత్తంతా ఆ గజాననుని నుండే ఉత్పన్నమైంది!ఆయన సంకల్పంవల్లనే ఈ సమస్త జగత్తూ కూడా నిర్మించబడ్డది! అందువల్ల ఈ జగత్తంతటికీ అతడే తల్లీ, తండ్రీ కూడా!బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, విష్ణువు మొదలైన వారందరూ ఆయననే నిత్యం తమ హృదయకమలంలో ధ్యానిస్తూంటారు!”

“ఓ రాజా! నీవా కౌశికముని మాటలను ఆలకించి, అతడికి నమస్కరించి, అతనివద్ద అనుజ్ఞను గైకొని తిరిగి నీ యిల్లు చేరుకున్నావు! ఆ ఋషి ఆదేశించినట్లుగా, శ్రావణ శుక్ల చతుర్థినాడు నీవా గణేశవ్రతాన్ని ఆరంభించి, మృత్తికతో ఒక గణపతిమూర్తిని తయారుచేసి, ఆ గణేశునే నీ హృదయపద్మములో సర్వకాల సర్వావస్థలయందూ ధ్యానిస్తూ, అతడి అనుగ్రహంచేత సర్వోత్తమమైనట్టి సకలసిద్ధులనూ పొందావు! ఆ జన్మములో నీవు సకల దాసదాసీ జనములతో కూడిన మహదైశ్వర్యాన్ని పొందావు! దానితో దేవతాతృప్తికై అనేక దానాదికాలు చేశావు!

ఎంతో పుణ్యప్రదమైనట్టి ఒక గొప్ప విలువైన గణేశుని ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అక్కడే నిర్మించావు! ఇహలోకంలో సకల భోగాలన్నీ అనుభవించాక కాలధర్మం చెంది, తిరిగి ఆ పుణ్యవశాన రాజకుటుంబంలో జన్మించి నిషధదేశానికే రాజుగా నలుడన్న పేరుతో రాజ్యం చేస్తున్నావు! ఓనలమహారాజా! ఇదే నీవడిగిన సందేహానికి జవాబు!” అంటూ వెళ్ళి పోయాడా గౌతమమహర్షి!

“కనుక అమ్మాయీ! ఇలా గౌతమమహర్షి వెళ్ళిపోయాక నలుడు తిరిగి ఆ జన్మలోకూడా వరదగణేశ వ్రతాన్ని అనుష్టించాడు! ప్రతీరోజూ వ్రతం పూర్తయ్యాక వ్రతకధనుకూడా భక్తితో వినేవాడు. ఈ వ్రత ప్రభావం చేతనే అతడు తన సకలాభీష్టాలనూ పొందగలిగాడు! కనుక ఓ పార్వతీ! ఈ విధంగా గౌతమునిచే ఉపదేశించబడిన నలమహారాజు, పూర్వజన్మలో తాను చేసిన వ్రతాన్ని తిరిగి ఆచరించి, కృతార్ధుడయ్యాడు! ఆ విధానం అంతా నీ కోరికమేరకు ఇప్పుడు చెప్పాను! ఈ వ్రతప్రభావాన్ని పూర్నిగా వర్ణించడం ఎవరితరమూ కాదుతల్లీ!” అంటూ ముగించాడు హిమ వంతుడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”నలవ్రత నిరూపణం” అనే యాబై రెండవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment