ఉపాసనా ఖండము మొదటి భాగము
శివపార్వతీ సంయోగం
ఆ తరువాత జరిగిన కధను పర్వతరాజైన హిమవంతుడు తన ప్రియపుత్రిక పార్వతితో ఇలాచెప్పాడు..
“ఓ పార్వతీ! ఈ విధంగా వ్రతపరిసమాప్తి అయిన తరువాత గణేశుడి అనుగ్రహంచేత పాతాళలోకంలోని నాగకన్యకల బుద్ధిమారింది. వెంటనే వారు చంద్రాంగద మహారాజుని బంధననుంచి విడిపించి యధా విధిగా పూజించి నూతనవస్త్రాలనూ, అలంకారాలను, వివిధ భూషణా లను ఇచ్చి సంతోషపరచి, మనస్సంత వేగంగా పరిగెత్తగల గుఱ్ఱాన్నిచ్చి అతనిని విడిచివేశారు.
అప్పుడు ఆరాజు సరోవరం నుంచి బయటికి వచ్చి తన అశ్వాన్ని చెంతనేవున్న ఒక వృక్షానికి బంధించి స్నానం చేస్తూండగా అక్కడి ప్రజలు కొందరు చూచి ఆరాజుకు నమస్కరించి అతనిని కుశలప్రశ్నలు వేశారు. వారివల్ల ఇందుమతీ మరియు తన కుమారులు క్షేమాన్ని తెలుసుకొని మానసికచింత తొలగగా ఆరాజు స్వాంతనచెందాడు. కొందరు ప్రజలు అతనిని గుర్తించి, ‘ఓ ప్రభూ! కొద్దిసేపటిక్రితమే మహారాణి ఇందుమతీదేవి ఈ సరోవరంలో స్నానం చేసి వెళ్ళింది. ఆమె ధర్మనిరతురాలై ఉపవాస వ్రతంతో కృశించివున్నది.
కుమారునియందే తన ప్రాణాలనుంచుకొని జీవమాత్ర శేషితురాలై ఉంది!’ అని చెప్పారు. కొందరు పరుగెత్తుకువెళ్ళి రాజనగరిలో మహారాజు తిరిగివచ్చారన్న శుభవార్త పట్టణమంతా చాటారు. ఈ విషయాన్ని తెలుసు కున్న రాణి మనస్సు ఆనందంలో ఓలలాడింది.
ఆమె తనవెంట మంత్రులనూ, సైనిక ప్రముఖులనూ తీసుకొని నగరమంతా శోభాయమానంగా అలంకరింపచేసి తాను సర్వాంగసుందరంగా అలంకరించుకొని,భూసురులైన బ్రాహ్మణులను గో, హిరణ్యాదులచే సంతోషపరచి, సువాసినులైన ముత్తైదువులకు మంగళహారతి ద్రవ్యాలను ఇచ్చి, సన్నాయివంటి మంగళవాయిద్యాలతో కూడి సరోవరతీరానికి బయలుదేరి వెళ్ళింది.
అప్పుడు ఆ చంద్రాంగద మహారాజు అందరియొక్క కుశలప్రశ్నలు అడిగి, ప్రముఖులందరినీ తాంబూలాదులతో గౌరవించి తాను స్వయంగా మహారాణి ఇందుమతి విడిదిచేసిన శిబిరానికి వెళ్ళాడు. అలా పన్నెండు సంవత్సరాలకాలం భార్యాభర్తలిరువురూ ఒకరినొకరు చూసుకోని కారణంచేత, శాస్త్ర విధిప్రకారంగా ప్రాయశ్చితాది కర్మలను బ్రాహ్మణుల చేత జరిపించి, పుణ్యాహవచన మంత్రపఠనంతో, రుద్రాభిషేకాలను చేయించి బ్రాహ్మణులకు దక్షిణాదికములను ఇచ్చి, నరదృష్టి తొలిగేందుకు గుమ్మడికాయ పగులగొట్టి, ఆ తరువాత ముందుకి నడిచి కృష్ణపక్ష చతుర్దశినాటి చంద్రకళలావున్న భార్య ఇందుమతిని చూశాడు.
అప్పుడు ఇందుమతీదేవి సువాసినీ స్త్రీసమూహంతో రాజుకు ఎదురేగి, మంగళహారతినిచ్చి, మహారాజుపై పుష్పవర్షాన్ని కురిపించింది! ఆ దంపతులు ఆనందభాష్పాలను తుడుచుకొని హర్షంతోనూ, శోకంతోనూ ఇంత కాలం తాము పడ్డ కష్టసుఖాలను పరస్పరం చెప్పుకొని కాసేపు విచారించారు. ఆ తరువాత మంత్రులతో పరివృతుడైన రాజు తాను పట్టపుటేనుగుపై కూర్చుండి పదాతిదళాలు ముందు నడుస్తూండగా, ఇరు ప్రక్కలా ఖడ్గములు ధరించి, అశ్వారూఢులైన సైన్యంతో నగరిలోకి ప్రవేశించాడు.
ఇరుప్రక్కలా ఏనుగులు ముందు నడుస్తూండగా, వంది మాగధులు కైవారం చేస్తూండగా, నర్తకీమణులు నృత్యంచేస్తూ వాయిద్య ఘోషలతో ముందు నడుస్తూండగా, ఆ సమూహం అంతా రాజుతోసహా నగరిలో ప్రవేశించారు. అలా ఊరేగింపుగా వెళ్ళినవారు రాజభవనం వరకూ వెళ్ళి, రాజువద్ద అనుమతిని గైకొని, తమతమ గృహాలకు మరలి వెళ్ళారు.
ఆ తరువాత ఆరాజు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచేత షడ్రసోపేతమైన విందుచేయించి, తానుకూడా సోదరులతోకూడి భుజించాడు! ఆ రాత్రి దంపతులిరువురు హంసతూలికా తల్పంపై పరుండి, తమతమ కష్టాలను పరస్పరం చెప్పుకొని, పురోహితుడి చేత ఊరడించ సుఖంగా నిద్రించారు.
రాణివద్దనుంచి వినాయకవ్రత మహిమను గురించి విని చంద్రాంగదుడు ఆ వ్రతాన్ని తానూ చేయాలని సంకల్పించాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు శ్రావణశుద్ధ చతుర్ధిరాగా, మహోత్సాహంతో ఆ వ్రతాన్ని ఆచరించాడు!” అంటూ ఈ వృత్తాంతాన్ని తన తనయయైన పార్వతికి వివరించాడు హిమవంతుడు.
అంత పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగాన్ని ఒసగి ఆమెతోకూడి కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు దేవతలంతా తమతమ స్థానాలకు వెళ్ళారు!’ అంటూ బ్రహ్మ ఇలా అన్నాడు.
ఓ వ్యాసమునీంద్రా! నీకోరికమేరకు గణనాధుని వ్రత మహత్యాన్నంతా వివరించాను. ఇప్పుడు నీకింకో కధ చెబుతాను! ఆ కధను వినడంవల్ల మానవుడు సర్వ పాపములనుండి విముక్తుడై సర్వాభీష్టములనూ పొందగలడు!” అన్నాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ‘శివపార్వతీ సమాగమం’ అనే యాబై ఐదవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹