ఉపాసనా ఖండము మొదటి భాగము
శూరసేనోపాఖ్యానం
ఆతరువాత భృగుమహర్షి ఇలా అన్నాడు. “ఓ సోమకాంత మహా రాజా! గణేశ మహాత్మ్యన్నంతా వివరించి చెప్పాను. అంతేకాదు! బ్రహ్మ ముఖంనుంచి వ్యాసుడువిన్న చరిత్రనంతా చెప్పాను.” అనగానే ఆ సోమకాంతుడిలా అన్నాడు.
‘ఓ ఋషివర్యా! ఆ తరువాత బ్రహ్మనుంచి వ్యాసమహర్షి ఇంకా ఏమేమి విన్నాడు? ఆ వివరంగూడా దయచేసి చెప్పండి. అమృతోపమమైన ఈ విషయాన్ని ఎంతవిన్నా తనివితీరటం లేదు. అనగా భృగువిలా చెప్పసాగాడు.
“నాయనా! నీలాగే వ్యాసమహర్షి కూడా బ్రహ్మని ప్రశ్నించగా బ్రహ్మచెప్పిన సమాధానమే నీకూ చెబుతాను. నీవూ విను!” అంటూ చెప్పసాగాడు.
మధ్యదేశంలో శూరశేనుడు అనే మహారాజు సహస్రాఖ్యపురాన్ని పరిపాలించేవాడు. అతడు సకల సద్గుణవంతుడు, అమిత పరాక్రమోపేతుడు. ఇంద్రుని రాజధానియైన అమరావతి వంటి తన నగరాన్ని సద్గుణవంతుడై, ధర్మబద్దమైన పరిపాలనను చేయసాగాడు. అతనికి మహాపతివ్రతయైన, అతిలోక సౌందర్యంగల, సుగుణవతియైన భార్యవుండేది!
ఇలావుండగా ఒకనాడు ఆ రాజు కొలువుతీరి ఉండగా, ఆకాశంలో వెళ్ళే ఒక దివ్యవిమానాన్ని చూశాడు. జ్వలించే జ్వాలలా కన్నులు మిరమిట్లుగొలిపే కాంతికలిగిన ఆ దివ్య విమానంలో నుంచి మృదుమధురంగా దివ్యగానం వినపడసాగింది. ఆ విశేషాన్ని కనుక్కొనిరమ్మని రాజు తన దూతలను పంపించాడు.
ఇంతలో ఒకానొక కుష్ఠువ్యాధిగ్రస్తుడైన వైశ్యపుత్రుడైనట్టి రాజదూతయొక్క దృష్టివల్ల సూర్యునితో సమానమైన ఆ విమానం నేలకూలింది! ఆ విషయాన్ని రాజువద్దకు వెళ్ళి ఆతడి దూతలు తెలియచేసారు. అప్పుడారాజు తన ఇరువురు మంత్రులనూ వెంటబెట్టుకొని, అశ్వాన్ని అధిరోహించి ఆ విమానం చూడ్డానికి వెళ్ళాడు.
ఆ విమానంలో దేవతలరాజైన ఇంద్రుడు తనపరివారంతోసహా ఉండడంచూసి రాజు తన వాహనంనుంచి దిగి వినయంగా చేతులుమోడ్చి, దేవరాజైనటువంటి ఆ ఇంద్రునితో ఇలా ప్రశ్నించాడు.
“ఓ దేవేంద్రా! మనుష్య లోకంలో ఎవరివల్లాకూడా మీ దివ్యదర్శనం పొందటం సులభమేమీకాదు. నీయొక్క దర్శనంచేత నా సంపదలు, పితరులు సర్వమూ ధన్యమైనాయి. ఎంతో పుణ్యంచేసిన వారికిదప్ప దివ్యమైన నీ తేజోరూపం చూడడం సాధ్యంకాదు. ఇటువంటి మహద్భాగ్యం పొందటానికి మేము ఏం పుణ్యం చేసుకున్నామో? ఓ ప్రభూ!
మీ విమానం క్రిందపడడానికి కారణమేమిటి? మీరు ఎటు వెళ్తూ వున్నారు? ఆ వివరాలన్నీ దయచేసి నాకు చెప్పండి.”
ఆ మాటలకు ఇంద్రుడు ఇలా అన్నాడు. “ఓ శూరసేనమహారాజా! నారదునిచేత ప్రేరేపించబడిన నేను, మానవలోకంలోగల భృశుండి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. ఆ మహర్షి గజాననుడిని నిరంతరభక్తితో అర్చిస్తూ ఆ దేవతా స్వారూప్యాన్ని పొందినవాడు! అందుకని ఆ మహనీయుని దర్శించుకొని, పూజించి, ఆయనవద్ద ఆదర సత్కారాలను, పొంది తిరిగి నా నగరికిపోతూ నా విమానం నీరాజ్య పరిసరాలను చేరుకోగానే నీ పరివారంలోని కుష్ఠువ్యాధిగ్రస్థుడు, పాపియైనటువంటి ఒక భటుని దృష్టిచేత నా విమానం కూలింది!” అని చెప్పాడు.
అప్పుడు శూరసేన మహారాజు ఇలా ప్రశ్నించాడు. ‘ఓ ఇంద్రా! ఏ తపోమహిమవల్ల ఆ భృశుండిమహర్షికి దివ్యమైన గజానన సారూప్యం సంభవించింది? ఆ వివరాన్ని దయతో కుతూహలుడనైన నాకు వినిపించు!’ అంటూ ప్రార్ధించాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘శూరసేనోపాఖ్యానం’ అనే యాబై ఆరవ అధ్యాయం.సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹