ఉపాసనా ఖండము రెండవ భాగము
భ్రుశుండోపాఖ్యానం
అప్పుడు దేవేంద్రుడిలా అన్నాడు. ‘ఓయీ! నీ కుతూహలానికి సమాధానం తప్పక ఇస్తాను. ఏ పరమపుణ్యప్రదమైన భక్తిభావంచేత భ్రుశుండి మహాముని సాక్షాత్తూ వరప్రదుడైన గణపతిగా సారూప్యాన్ని పొందాడో, అటువంటి పురాతనేతిహాస గాధను తప్పక చెబుతాను. అందు వల్ల శ్రోత, వక్తా యిరువురూకూడా ధన్యులౌతారు. శ్రద్ధగా విను!
దండకారణ్యానికి సమీపంలో ”నందుర” అనే ఊరు ఉండేది. ఆ అరణ్యంలో అత్యంత దుష్టుడైన కైవర్తకుడొకడుండేవాడు. అతడు సమస్తమైన దుర్లక్షణాలకు ఆలవాలమై వుండేవాడు. బాల్యంలో చేతివాటం చూపి సమస్తమైన వస్తువులను, విలువైన ఆభరణాలనూ తస్కరిస్తూ, యితరులను మోసంచేస్తూండేవాడు.
అబద్ధపు ప్రమాణాలను చేయటం, బొంకడమూ అతడికి వెన్నతోపెట్టిన విద్య! వయస్సు పెరిగేకొద్దీ స్త్రీలోలుడై, దానికితోడు మధువు మత్తులో యుక్తాయుక్తాలను మరచి ద్యూతక్రీడ (జూదం) లో మగ్నుడై ఉండేవాడు.
అటువంటి దుష్టుడిని ఊరిలోనివారందరూ తరిమివేయగా పర్వతములు, గుహలు ఉన్నట్టి అరణ్యానికి వలసపోయి భార్యాసమేతుడై అక్కడే నివసిస్తూ, దారిన పోయే బాటసారుల నందరినీ దోచుకుని తన యింట్లోవారిని సకల భోగభాగ్యాలతో తులతూగేలా ఉంచేవాడు. వయసులో ఉన్న తన భార్యను ఒంటినిండా ఆభరణాలను తొడిగి తృప్తిపరిచాడు.
తాను శస్త్రాస్త్రాలను ధరించి అరణ్యంలోని వృక్షాల కొమ్మలపైన దాక్కుని బాటసారులను సంహరించి, వారి వస్తువుల నన్నింటినీ సంగ్రహించి, యింట్లో దాచి గ్రామాంతరాలలో వాటిని విక్రయిస్తూ, సకల భోగాలనూ అనుభవించేవాడు.
ఇటువంటి ఘోరకృత్యాలు చాలవా అన్నట్లు అరణ్యంలోని జంతువులను కూడా విడవకుండా నిత్యం వేటాడి వధించేవాడు. ఇలావుండగా ఒకనాడు ఒక లేడిని వేటాడుతూ అరణ్యంలో దాదాపు యోజనం (ఎనిమిది మైళ్ళు) దూరానికి తరుముకుంటూ వెళ్ళి అక్కడ జారిపడ్డాడు.ఆ పడటం లో కాలికి దెబ్బతగిలి మెల్లగా కుంటుకుంటూ తిరుగు ప్రయాణ మయ్యాడు.
ఆతరువాత మార్గమధ్యంలో గణేశతీర్ధంలో బడలిక తీరేందుకని స్నానంచేశాడు. ఆ సమీపంలోవున్న ముద్గలుడనే మహర్షిని చూశాడు. ఆ మహర్షి మహానిష్టతో నామంతో కూడిన గణేశమహామంత్రాన్ని జపించ సాగాడు. ఆ కిరాతుడు అతడిని మామూలు బాటసారిగా భావించి సర్రున తన ఒరలోంచి కత్తిని బైటికితీసి చేతిలో ధరించి ఆ ముద్గలుని వద్దకు వెళ్ళి యిలా అన్నాడు
“ఓయీ! నేను వర్తుడనే పేరుగల కిరాతుణ్ణి! నిన్ను హత్యచేసే ఉద్దేశ్యంతో వచ్చాను!” అని చెబుతూండగా ఆ కైవర్తుడి చేతిలోని శస్త్రములు ధృఢమైన అతడి పిడికిలిలోంచి జారి క్రిందపడిపోయాయి. మహనీయుడైన ఆ మహర్షి సన్నిధిలో ఆ దుర్మార్గుడి బుద్ధి, ప్రవృత్తి ఒక్కసారిగా మారిపోయింది. అలా క్రిందపడినట్టి శస్త్రాస్త్రములు గల్గిన ఆ కైవర్తుడిని చూసి చిరునవ్వుతో ఆ ముని యిలా అన్నాడు. “ఓయీ కైవర్తకా! నీచేతిలోనున్న ఆయుధాలు జారిపడటానికి కారణం ఏమిటి? అవన్నీ అల్లెత్రాటితో కట్టబడినవైనా ఎందుకని ఒక్కసారిగా క్రింద పడినట్లు?” అంటూ అడిగాడు.
తాత్కాలిక జ్ఞానోదయమైన ఆ కైవర్తుడు “ఓ మునిసత్తమా! గణేశ తీర్ధంలో స్నానం చేయటంచేతా, మీ సందర్శనభాగ్యంచేతా నాకు జ్ఞాన వైరాగ్యములు కలిగాయి. ఐనా ఈ కుండంలో స్నానంచేయటంతోటే నాబుద్ధి ఇంతగా మారటం నాకే అంతుబట్టకుండా ఉన్నది. ఆ వెంటనే తమ దర్శనం యొక్క ప్రభావంచేత నాబుద్ధి మరింత పరిశుద్ధమైంది.
చిన్నతనాన్నుంచీ కూడా నాబుద్ధి పాపప్రవర్తనయందే మగ్నమై వున్నది. ఈనాడు కేవలం మీ అనుగ్రహ ప్రభావంచేతనే నాకీ దుష్ట కార్యాలపట్ల విరక్తి కలిగింది. అందువల్ల ఈ జారిపోయినట్టి ఆయుధాలను నేను ఇంకెన్నటికీ చేతబూనను! ఓ ఋషిపుంగవా! నాపై దయ వహించి నన్ను అనుగ్రహించి ఈ సంసారమనే బురదలోంచి పైకిలాగండి!
సత్పురుషులయొక్క విశిష్టత ఎట్టిదంటే ఎంతటి దుష్కర్ములనైనా వారి దీనత్వంపట్ల జాలికలిగి అనుగ్రహిస్తారు. ఓమునివర్యా!నిధులు ధాతు సంపర్కంతో ఎలా మరింతగా విలువైనవవుతాయో ఆ రీతిలోనే సాధుపురుషులతో సంగమం ఎటువంటి వారినైనా సంస్కరించి తీరుతుంది కదా!”
అంటూ కన్నులు నీటితో నిండిపోగా ఆ ఋషి పాదాలపై వాలి పోయాడు. ఈ కధనంతటినీ శూరసేనుడికి వినిపిస్తున్న ఇంద్రుడు యిలా కొనసాగించాడు.
“ఓరాజా! ఈరీతిగా దీనుడై తన పాదాలపై పడిన కైవర్తకునిపట్ల ముద్గలమహర్షి మనస్సు కరుణతో నిండిపోయింది. శరణాగతుడైన అతడిని తిరస్కరించటానికి అఋషికి మనస్సు అంగీకరించలేదు. అందుకని ఆ కైవర్తకుడితో యిలా అన్నాడు.
“నీకు శాస్త్రాలలో చెప్పబడిన దోషహరణములైన దానాదులు చేసేటందుకు అధికారంలేదు. ఎందుకంటావా నీవు సంపాదించినదే ఇతరులను కొల్లగొట్టి! కనుక నీకు దుష్కర్మ తొలగటానికి ఒకటే మార్గాంతరం ఉంది. అదేమిటంటే విధివత్తుగా నీకు సర్వసిద్ధికరము, సకల దోషహరము ఐన గజాననుని నామము జపమునకై ఉపదే శిస్తాను!” అనగానే ఆ కైవర్తుడు ఆర్తితో ముద్గలుని చరణాలను గట్టిగా పట్టుకున్నాడు.
అప్పుడా మహర్షి తన హస్తమును అతడి శిరస్సుపైన ఉంచి అతడికి ‘గణేశాయనమః’ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు తన చేతిలో ఉన్న దండాన్ని దానిఎదుట పాతి అతనితో యిలా అన్నాడు.
“ఓయీ! నేను తిరిగి వచ్చేటంతవరకూ ఒకే ఆసనంపై నిశ్చలంగా కూర్చొని కేవలం వాయువునే ఆహారంగా భక్షిస్తూ నీవు చేసిన జపజలాన్ని ఈ దండం మొదట్లో ఉదయం, సాయంసంధ్యలలో ధారపోస్తూండు.
ఈ కఱ్ఱ చిగురు తొడిగేవరకూ అలా చేస్తూండు’ అని నియమించి, అంతర్హితు డైనాడు.అప్పుడా కైవర్తుడు అన్యమైనవన్నీ విడిచి, జీవితంపైని ఆశనుకూడా వదలి వృక్షచ్ఛాయలో, ఆ ముని పాతిన దండమునకు ఎదురుగా కూర్చుని జపంచేయ నారంభించాడు..
ఏకాగ్రచిత్తంతో! ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించి, ఆహారాన్ని కూడా త్యజించి అన్యమైనవేవీ మనస్సులోనికి రానీయకుండా వేయిసంవత్సరాలు తపస్సు ఆచరించగా అప్పుడా ముద్గలుడు నాటిన దండం చిగిర్చింది. అప్పుడా కైవర్తకుడు మునిరాకకై ప్రతీక్షించసాగాడు! చిరకాలం ఒకే ఆసనంపైన కదలక మెదలక స్థిరంగా కూర్చొనడంతో అతడి శరీరంపై పుట్టలుపోసి పొదలు బయలుదేరి అతడిని కప్పివేసాయి.
అప్పుడు దైవవశాన ముద్గలుడు అక్కడికి రావటమూ, ఆ మునికి కైవర్తకుడు గుర్తొచ్చి అతడికై వెతుక్కుంటూ వచ్చి చిగిర్చిన తన దండమునూ, దానికెదురుగా పుట్టలు, చెదలుకట్టి తపోమగ్నుడైయున్న కైవర్తకుడినీ చూశాడు! ఎంతో దుస్సాధ్య మైన తపోదీక్షను అకుంఠితంగా నిర్వహించి కేవలం ఎముకలగూడుగా మిగిలిన అతడిపైనున్న పుట్టల నన్నిటినీ ముద్గలుడు తొలగించి, ఉదకమును అభిమంత్రించి ఆ కైవర్తకునిపైన చల్లగానే ఆతడు దివ్యదేహాన్ని ధరించాడు.
కేవలం తనవద్ద హస్తదీక్షనూ, ఉపదేశాన్నిగైకొని ఘోరమైన దీర్ఘతపస్సుతో వైనాయక సారూప్యాన్ని పొంది నామజపం చేస్తూన్న ఆతడిని నెమ్మదిగా తట్టిలేపాడు ముద్గలమహర్షి! ఆతడు కన్నులు తెరచీ తెరువగానే అతడి కన్నుల్లోంచి మెరపువంటి ప్రకాశంగల తపోగ్ని వెలువడింది.
ఆ ముని దానియొక్క తీవ్రతను తనయందు లయంచేసుకుని, చిరునవ్వుతో ఆతడిపై అనుగ్రహదృష్టిని బరపాడు. తన గురువైన ఆ మునికి సాష్టాంగ నమస్కారం చేసిన ఆ కైవర్తకుడిని పుత్రవాత్సల్యంతో లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు ముద్గలుడు!
అలా తన ఉపదేశాన్ని పొంది ఘోరతపస్సు ఆచరించి, తన పాతకములనన్నిటినీ తపోగ్నిలో భస్మంచేసుకొని వల్మీకంనుండి తిరిగి పుట్టడంచేత చాలా సంతుష్టిని పొందిన ఆ ముద్గలముని అతడిని తన కుమారునిగా భావించి తండ్రిగా సకల సంస్కారాలను కావించాడు. భ్రూమధ్యం లోంచి శుండము మొలవటంచేత అతడికి భ్రుశుండుడన్న నామకరణం చేశాడు.
ఈరీతిగా కైవర్తకుడు దివ్యశరీరాన్ని ధరించి భ్రుశుండు మహర్షియై ఆవిర్భవించాడు. అప్పుడు ముద్గలుడు ఆతడికి గణేశుని ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి, అనేక వరములు ప్రదానంచేసి అతడిని మునిసత్తముడవు కమ్మంటూ దీవించాడు.
“నీవు ఇంద్రాది దేవగణములకు కూడా ఆరాధ్యుడవగుదువుగాక! గజానునివలే నీవుకూడా భక్తజనుల పాపములను నశింపచేసి, కేవలం నిన్ను దర్శించినంత మాత్రాన్నే సకల జనుల మనోభీష్టము లీడేరునుగాక!
‘భ్రుశుండ’ నామంతో చిరకీర్తివై వర్ధిల్లుదువుగాక! నాఆశీర్వచన ప్రభావంచేత నీవు నూరుకల్పముల ఆయుర్దాయం కలిగివుందువుగాక!” అంటూ అనేకవరాలను ప్రసాదించాడు. అప్పుడు ఇంద్రాదిదేవతలు, నారదాదిమునులు వచ్చి ఆభ్రు శుండమహర్షిని దర్శించుకుని అతడికి నమస్కరించి యిలా కీర్తించారు.
“ఓ భ్రుశుండ మహర్షీ! నీ దర్శన విశేషంచేత మా జన్మ, విద్య, తపస్సు సర్వమూ సార్ధకమైనాయి! మా అందరికీ నీవు గణనాధునివలే పూజ్యుడవైనావు!”
ఆ మాటలకు భ్రుశుండి వారందరికీ నమస్కరించి తిరిగి ఏకాక్షరీ గణేశ మంత్రానుష్టానానికి పూనుకున్నాడు! అతిసుందరుడైన గణేశమూర్తిని ఎదురుగా స్థాపించి, అతడిని షోడశోపచారములతోనూ అత్యంత శ్రద్ధా భక్తులతో అర్చించసాగాడు. ఆముని తపోవాటిక అంతా ఎంతో ప్రశాంత తనూ పవిత్రతను సంతరించుకోసాగింది!
సహజంగా విరోధులైన జంతువులుకూడా ఆ ఆశ్రమ ప్రాంగణంలో తమ సహజవైరాన్ని విడనాడి అన్యో న్యంగా మెలగసాగాయి. ఈ రీతిగా నూరుసంవత్సరాలు సుదీర్ఘ తపస్సు ఒనరించిన భ్రుశుండి మహర్షిని వినాయకుడు అనుగ్రహించి తన దివ్యదర్శనాన్ని ప్రసాదించాడు.
“నాయనా! భ్రుశుండీ! నీవిప్పటికే నా స్వరూపాన్ని పొందావు! నీ తపస్సు సిద్ధించింది! నీవు కృతకృత్యుడవైనావు. అంత్యమున నీవు నా సాయుజ్యాన్ని పొందగలవు. నీవు తపస్సు చేసిన ఈ క్షేత్రము ”నామల” అన్న పేరుతో ప్రసిద్ధమౌతుంది. ఇక్కడ తపస్సు అనుష్టానం చేసినవారు సకల సిద్ధులనూ పొందగలరు! ఈ క్షేత్రంలో వెలసిన నా మూర్తిని దర్శించి, అర్చించినవారు పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతారు. పిల్లలులేని వారికి పుత్రసంతానమూ, విద్యార్థులు జ్ఞానమునూ పొందు తారు” అంటూ అనుగ్రహించాడు గణేశుడు.
ఓ శూరసేన మహారాజా! నీవడిగిన వివరమంతా తెలిపాను ఇంకా నీవేమైనా వినగోరితే అడుగు! అదికూడా తెలియ జేస్తాను” అన్నాడు శచీపతి!
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ‘భ్రుశుండ్యోపాఖ్యానము’ అనే యాబై ఏడవ అధ్యాయం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹