Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – యాబై ఎనిమిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

సంకష్టచతుర్థీ వ్రతకధనం

“ఓ వ్యాసమునీంద్రా! ఆ శూరసేనుడు ఇంద్రుని వచనాలను విని తిరిగి ఆ గణేశ కధామృతాన్ని వినగోరి ఆ శచీపతిని యిలా ప్రశ్నించాడు.” అంటూ కధాగమనాన్ని కొనసాగించాడు చతుర్ముఖుడు.

ఓ ఇంద్రా, కిందకు దిగిపోయినట్టి నీ ఈ దివ్యవిమానము తిరిగి ఏ ఉపాయంచే నింగికెగరగలదు? ఆ ఉపాయంచేయి! లేదా అట్టి ఉపాయాన్ని నాకు చెప్పు!” అంటూ పదేపదే తనని అర్ధిస్తున్న ఆ శూరసేనుడితో శచీపతియైన దేవేంద్రుడిలా అన్నాడు.

చతుర్ధి వ్రతము’ “ఓ శూరసేనమహారాజా! నీ పట్టణంలో ‘సంకష్ట ను ఆచరించిన బ్రాహ్మణులుగాని క్షత్రీయులుగాని ఎవరైనా ఉన్నట్లైతే – అట్టివారు తాము ఒక సంవత్సరంపాటు ఆచరించిన ప్రతఫలాన్ని ధారపోసినట్లైతే ఈ దివ్యవిమానం అప్పుడు యధావిధిగా నింగికెగుర గల్గుతుంది! అలాకాక పదివేలమంది బలాఢ్యులు పైకెత్తబూనినా ఏమీ ప్రయోజనముండబోదు!” అన్న ఇంద్రుని మాటలకు శూరసేనుడిలా ప్రశ్నించాడు.

“ఓ ఇంద్రా! ఇంతటి ప్రభావయుతమైన ఆ సంకష్ట చతుర్థీవ్రత విధానమెలాగ ఆచరించాలి? అదిచేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుంది? అందులో పూజించబడే దేవుడెవరు? ఇంతకు పూర్వం ఎవరా వ్రతమాచరించారు? వారు ఎలాంటి ఫలితాన్ని పొందారు? ఓ ఇంద్రా! ఆ వివరాలన్నీ దయతో నాకు విస్తరించి వివరించు!” అంటూ ప్రార్ధించిన శూరసేనుడితో ఇంద్రుడిలా బదులు పలికాడు!

“ఓ రాజా! ఈ విషయమై ఒక ప్రాచీనమైన ఇతిహాసాన్నొకదానిని నీకు చెబుతాను! ఇది కృతవీర్యుడనే రాజుకూ, దేవర్షియైన నారదుని మధ్య జరిగిన సంవాదం!”

పూర్వం కృతవీర్యుడనే మహాబలపరాక్రమ సంపన్నుడైన రాజు ఒకడుండేవాడు. అతడు సకల సద్గుణోపేతుడు! అనేక యజ్ఞాలుచేసి భూరిగా దానధర్మాలు చేసినవాడు సత్యవాది! ఇంద్రియములనన్నింటినీ తన వశం చేసుకున్నట్టి జితేంద్రియుడుకూడా!

దేవతలన్నా అతిధులన్నా అతనికిగల ప్రీతిమెండు! అసంఖ్యాకమైన చతురంగబలాలు ఆరాజు సేనావాహినిలో ఉండేవి! ప్రతినిత్యం పన్నెండు వేలమంది బ్రాహ్మణులను సహపంక్తిలో నుంచుకునిగాని భుజించేవాడు కాడాతడు! అట్టి కృతవీర్యునికి సుగంధియనే పేరుగల మహాపతివ్రతా, అతిలోక సౌందర్యవతీయైన భార్య ఉండేది! ఆమె ద్విజ, దేవ, అతిధి పూజాపరురాలు. ఆమె సుగుణవతి సౌశీల్యవతీ! ఇంత అపూర్వ గుణ సంపత్తి కలిగివున్న ఆ దంపతులకు పుత్రసంతతి మాత్రం కరువైంది.

సంతానంకోసం వారు చేయని వ్రతంలేదు! ఇవ్వని దానములేదు. అనేక క్రతువులనూ యజ్ఞయాగాదికాలను కూడా నిర్వహించినా ఫలితం మాత్రం శూన్యం! అనేక పుణ్యతీర్థాలను కూడా సందర్శించారు. ఎన్ని చేసినప్పటికి జన్మాంతర పాపకర్మ ఫలితంగా సంతతిమాత్రం కలుగలేదు!

ఈరకంగా నిరాశకు గురైన ఆరాజు ఒకనాడు తన మంత్రులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళాడు. నారబట్ట లను ధరించి తపోదీక్షను ప్రారంభించాడు ఇంద్రియాలను వశపరచు కొని, ఆహారాన్ని పూర్తిగా వర్ణించి, పైనుంచి రాలిపడ్డ ఆకులనే భుజిస్తూ, కేవలం వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ, కాలం గడుపుతూన్న ఆ దంపతులకు రాజు శల్యావశిష్టుడైవుండగా దేవర్షియైన నారదమహర్షి యొక్క సందర్శనభాగ్యం కలిగింది!

ఆతరువాత ఆ నారదుడు పితృలోకానికి వెళ్ళి అక్కడ కృతవీర్యుని తండ్రిని కలిసి, ఆతని కుమారుడు సంతతికోసం పడే ఆరాటాన్నీ బాధనూ వివరించి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఇలా వెళ్ళిన దేవర్షి నారదుడు ఊర్థ్వలోకాలగుండా పోతూ భ్రుశుండిమహర్షి తలిదండ్రులూ, కన్యకా సహితయైన ఆతనిభార్య అందరూ కుంభీపాక నరకంలో విపరీతయాతనలు అనుభవించడాన్ని గమనించి వారి దుస్థితికి జాలిపడి వేగంగా భ్రుశుండి మహర్షియొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు.

“ఓయీ భ్రుశుండా! నీవు సమస్త దేవతలచే వంద్యనీయుడవైనప్పటికీ అక్కడ నీ తలిదండ్రులూ, భార్యాకుమార్తె సకలురూ కుంభీపాక నరకంలో లెక్కలేని నరకయాతనలు అనుభవిస్తున్నారు. గనుక నీవు నీ పూర్వులను ఉద్ధరించే ప్రయత్నం తప్పక సలుపవలసింది! అది సర్వులకూ శ్రేయస్కరము.”

అన్న నారదముని పలుకులకు భ్రుశుండమహర్షి ఎంతో ఖిన్నుడై వారి దుఃఖనివారణకు తప్పక ప్రయత్నించాలని పూనుకుని సమాధినిష్ఠలో ఏకాగ్రచిత్తంతో గణేశుని ధ్యానిస్తూ అందుకు పరిష్కారమార్గం తెలుసుకుని తన చేతిలోకి పరిశుద్ధమైన మంత్రోదకాన్ని తీసుకుని తనచే ఆచరించ బడిన సంకష్ట చతుర్థీవ్రతంచే సముపార్జించబడిన పుణ్యం యావత్తూ తన పితరుల ఉద్ధరణకై ధారపోయ సంకల్పించి

“ఓ గజాననా! నీ వ్రతాన్ని నేను భక్తిభావముతో చేజేసినట్లైతే దానియొక్క మహత్తర ప్రభావంచేత నా పితరులు తక్షణమే ఉద్ధరించ బడుదురు గాక!” అంటూ గజాననుని స్మరిస్తూ చేతిలోని మంత్రజలాన్ని పెట్టగానే ఆ గజాననుని దివ్యానుగ్రహంచేత భ్రుశుండుని విడిచి పూర్వీకులందరూ దేవరూపులై, శ్రేష్టములైన దివ్యవిమానాలను అధిరో హించి అప్సరలచే సేవించబడుతూ, చారణులచేత కీర్తించబడుతూ, గంధర్వులచేత గానం చేయబడుతూ గణేశ లోకాన్ని పొందారు.”.

‘ఓ శూరసేన మహారాజా! ఇట్టి అనంత ఫలప్రదమైన సంకష్ట చతుర్థీ వ్రతాచరణవల్ల ఒకరోజుకే కల్గిన మహాప్రభావ మిలాంటిది! ఇక జన్మప్రభ్రుతి ఈ వ్రతాచరణ చేసినవారి పుణ్యం లెక్కించటం ఆదిశేషునికి కూడా వీలుకాదు. కనుక అట్టి మహత్తర పుణ్యంచేతనే నావిమానంకూడా పైకెగెయగలదు” అన్నాడు ఇంద్రుడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ‘సంకష్ట చతుర్థీవ్రత కధనం’ అనే యాబై ఎనిమిదవ అధ్యాయం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment