ఉపాసనా ఖండము రెండవ భాగము
కృతవీర్యుని పూర్వచరిత్ర
ఆ తరువాత దేవేంద్రునితో ఆ శూరసేనమహారాజు తన సందేహాన్ని గూర్చి యిలా ప్రశ్నించాడు.
“ఓ ఇంద్రా! ఆ ప్రకారంగా కృతవీర్యునియొక్క పితరులు కుంభీపాక నరకంనుండి విముక్తులై స్వర్గాన్ని చేరుకున్నాక, కృతవీర్యుని తండ్రి ఏం చేశాడు? ఆ వివరాన్ని దయతో నాకు తెలియచేయవలసింది!” అన్న అతడి మాటలకు శచీపతియైన ఇంద్రుడు చిరునవ్వుతో యిలా బదులిచ్చాడు.
“ఓ రాజా! నారదమహర్షివల్ల తన వంశవిచ్ఛేదం గురించి తెలుసు కొని కడు దుఃఖితుడైన ఆ కృతవీర్యుని తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కమలాసనుడైన చతుర్ముఖుడికి సాష్టాంగ నమస్కారమాచరించి, తన వంశవిచ్ఛేదమునకు కారణం తెలుపమంటూ ప్రార్ధించాడు.
‘ఓకమలాసనా! అన్ని సుగుణాలకూ ఆలవాలమై, సకల శుభలక్షణ సమన్వితుడై అనేక యజ్ఞ, దాన, తపః కర్మలను త్రికరణశుద్ధిగా ఆచరించి, దేవతలను అతిధులనూ పూజించి, అందరికీ తలలో నాల్కలా ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసే నా కుమారునికి పుత్రసంతానం కలుగకపోవడానికి కారణమేమి? అతడు ఆ బాధచేత వివశుడై, చివరికి తన యావత్ రాజ్యభారాన్నీ మంత్రుల భుజస్కంధాలపై ఉంచి తాను ఘోరారణ్యములో కేవలం వాయుభక్షణ మొనరిస్తూ ఎముకలగూడుగా మారి నేడోరేపో మరణించటానికి సంసిద్ధుడై వున్నాడు! ఏ పాపంవల్ల వానికి సంతానప్రాప్తి కలుగలేదు?
ఆ పాప ప్రక్షాళన ఏ ఉపాయంవల్ల జరుగుతుంది? ఆ వివరం నాకు తాము దయతో తెలిపితే నేను నా కుమారునికి తెలియజేస్తాను!” అన్న ఆతడి మాటలకు బ్రహ్మ అతనితో వాని కుమారుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని యిలా తెలియచేశాడు.
పూర్వం నగరంలోనే సాముడు అనే పేరుగల పంచముడు ఉండేవాడు. అత్యంత దుర్మార్గుడవటంచేత కేవలం వాడిని చూస్తేనే ఎవరికైనా తమ సకల సత్కర్మలూ నశిస్తాయి! ఇలాఉండగా ఒకనాడు ఆ ఛండాలుడు ధనంమీదగల కాంక్షచేత సత్పురులైన పన్నెండుగురు విప్రులను సంహరించి వారిని దోచుకున్నాడు. అలా వారివద్దనున్న సకల సంపదలూ దోచుకుని ఆరాత్రి తన ఇల్లు చేరుకున్నాడు. ఆనాడు మాఘబహుళ చవితి! సాయంసంధ్య గడిచి చంద్రుడు ఉదయించే సమయంలో ఆ తస్కరుడు తన కుమారుడిని “గణేశా! గణేశా! వెంటనే రా!” అంటూ పిలిచాడు.
ప్రొద్దుటినుంచి అన్నపాదులు లేనివాడవటంచేత తన కుమారుని చేరపిలిచి అతనితోకలిసి కడుపారా భుజించాడు. తరువాత కొంతకాలానికి అతని కుమారుడు మరణించాడు. అలా ఆ మాఘబహుళ చవితినాడు చంద్రోదయ సమయంలో అన్యాపదేశంగా తనకే తెలియకుండా ఉపవాసం ఉండి గణేశ స్మరణను కావించి ప్రసాదాన్ని భుజించినందు వల్ల, సంకష్ట చతుర్థీవ్రత సంభవమైన అనంతమైన పుణ్యం యొక్క ప్రభావంచేత, ఆ బాలకుడు పరమ ఆనందమయమైన వైనాయకలోకానికి దివ్యవిమానారూఢుడై పుణ్యశాలులందరూ అర్చిస్తూండగా వెళ్ళాడు.
ఆ పుణ్యంయొక్క విశేషంవల్లనే కృతవీర్యుడనే పేరిట రాజై మరుజన్మలో నీకు కుమారునిగా జన్మించాడు!పూర్వజన్మకృతమైన ఆ పాపం నశించిన వెంటనే అతడికి పుత్రసంతతి కలుగుతుంది!
ఈ మాటలు వింటూన్న కృతవీర్యుని తండ్రి భయంతో గడగడా వణికి, “అతి హ్యేయమైన బ్రహ్మహత్యా పాతకం నుంచి తన కుమారునికి ఎలా విమోచన కలుగు గలదో దయాసముద్రులైన బ్రహ్మదేవుడు ఎంత కష్టతరమైనదైనా ఆ ఉపాయాన్ని దయతో సెలవీయవలె”నంటూ ప్రార్ధించాడు.
అప్పుడు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు.
“ఓ! నీకు కుమారుడు సంకష్ట చతుర్థీవ్రత”మనే పేరుగల వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో, నియమనిష్టలతో ఆచరించినట్లైతే ఆ మహాపాతకాన్నుంచి విముక్తుడు కాగలడు!” రాజు యిలా తిరిగి ప్రశ్నించాడు.
“ఓ కమలాసనా! ఐతే ఆవ్రతవిధానమెలాగ? అది ఎప్పుడు ఏ మాసములో ఆచరించాలి? అటువంటి మంగళప్రదము అమోఘఫల ప్రదమైన వ్రతవిధానాన్ని దయతో నాకెరిగించు!” అంటూ ప్రార్ధించగా, “ఓయీ! మాఘమాసపు బహుళపక్షములో మంగళవారంతో కలిసి వచ్చే చతుర్ధి (చవితి) నాడు శుభముహూర్తంలో చంద్రుడు ఉదయించే వేళ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి!
దంతధావనతోపాటు ఇరవైఒక్కమార్లు స్నానంచేసి, నిత్యకర్మలను నిర్వర్తించుకొని, గణేశమహామంత్రజపం చేయాలి! ఆ రోజు ఆహారాన్ని వదిలి, తాంబూలము మొదలైన వాటిని వర్జించి, మౌనంవహించి, యితరులను నిందించటం పిశునత్వం (పీనాసి తనం), యితరులపట్ల ద్రోహచింతన వంటివి విడనాడి నియమంగా గడపాలి..
ఆనాటి సాయంత్రం తిలామలకచూర్ణం (తెల్లనువ్వులు, ఉసిరి కాయలు కలిపి నూరినది) తో నలుగుపెట్టుకొని స్నానంచేయాలి! తన శక్తికొలది ఏకాక్షరి, షడక్షరీ లేదా వైదికమంత్రము (గణానాంత్వా) ను జపించి ఆ గజాననుని మూర్తిని స్థిరమనస్కుడై ధ్యానించాలి.
ఒక ముహూర్తకాలం గడిచాక భక్తవరప్రదుడైన ఆ గణేశుని షోడశోపచారము లతో పూజించాలి! ఇక నివేదనకై మోదుకములు (ఉండ్రాళ్ళు), లడ్లు, అరిసెలు, జంతికలు, పాయసము మొదలైన పిండివంటలతో షడ్రసో పేతములైన ఆధరువులతో అన్నము, పులిహారలను సమర్పించాలి! రకరకాల ఫలములను, తాంబూలమును (సదక్షిణకంగా), ఇరవైఒక్క దూర్వాంకురము (గరికె)లను కూడా గణేశునికి భక్తితో సమర్పించాలి.
వివిధములైన సుగంధపుష్పాలతోనూ, దీపములతోనూ ఆ దేవదేవుని అలంకరించాలి! చంద్రోదయ సమయానికి చతుర్థీతిధికి, గజాననునికీ ఆ తరువాత చంద్రునికీ అర్ఘ్యం యివ్వాలి!
ఆ తరువాత మహానివేదననిచ్చి, అపరాధ క్షమాపణకై గణేశుని వేడుకుని నమస్కరించి, తన శక్తికొలదీ ఇరవైఒక్క మందికి తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి! ఆ తరువాత వ్రతకధను విని మౌనంగా తాను భుజించాలి! మిగతారాత్రి భాగాన్ని యావత్తూ సంకీర్తనతో గడపాలి!
ఈవిధంగా ఒక సంవత్సరకాలం నియమపూర్వకంగా ఈవ్రతాన్ని ఆచరించినట్టైతే సర్వపాపక్షయమై, ఆతడు పుత్రసంతానమును పొందటంతోపాటూ ఇంకా ఏ యితర కోరికలున్నప్పటికీ అవన్నీ కూడా అవశ్యం నెరవేరతాయి! ఈ వ్రతంయొక్క ప్రభావంవల్ల సర్వ సంకటములూ నశించి, శత్రుపీడకూడా తొలగుతుంది.
ఈ వ్రతాన్ని శమి (జమ్మి) వృక్షముయొక్క మూలములో (మొదట్లో) కూర్చుని ఉపవాస దీక్షలో మరునాటి ఉదయం చంద్రోదయమయ్యేవరకూ నిష్టతో గణేశ మంత్రాన్ని జపిస్తూ ఈవ్రతాన్ని ఆచరించాలి! అలా చేయడంచేత పుట్టుగుడ్డి, మూగ, చెవిటి వారైనప్పటికీ తప్పక తమ సకలాభీష్టములను పొందుతారు! రాజులు రాజ్యవైభోగాలను బహుళీకృతంగా పొందుతారు.
ఐతే ఆహార నియమాలుకూడా పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులూ వశమౌతాయి! ప్రతీ మాసంలోనూ చతుర్థినాడు విధిగా కొన్ని ఆహారనియమాలు పాటించాలి అవేమిటంటే
1) శ్రావణమాసంలో నేయి, లడ్లు విడివిడిగా భుజించాలి!
2) భాద్రపదమాసంలో పెరుగును భుజించాలి
3) ఆశ్వయుజమాసంలో ఉపవాసం చేయాలి!
4) కార్తికంలో పాలు, పానకములను ఆహారంగా స్వీకరించాలి!
5) మార్గశిరమాసంలో నిరాహారిగా ఉండాలి!
6) పుష్యమాసంలో గోమూత్రము, పానకమును సేవించాలి!
7) మాఘమాసములో నువ్వులను
8) ఫాల్గుణమాసంలో చక్కెర నేయిలను
9) చైత్రమాసంలో పంచగవ్యములను
10) వైశాఖమాసంలో పుష్కరబీజములను
11) జ్యేష్ఠమాసంలో నేయితో తడిపిన భోజనాన్ని
12) ఆషాఢమాసంలో తేనెనూ భుజించాలి.
ఈ విధంగా ప్రతిమాసంలోనూ ఆహారనియమాన్ని పాటిస్తూ ఈ చతుర్థీవ్రతాన్ని విధివత్తుగా ఆచరించినట్లయితే సకలసిద్ధులూ సిద్ధి స్తాయి” అన్న బ్రహ్మదేవుడితో కృతవీర్యుని తండ్రి తిరిగి యిలా ప్రశ్నించాడు..
“ఓ చతురాననా! అన్ని మాసములు చతుర్థీలలోనూ అంగారక చతుర్ధి (మంగళవారంతో కూడివచ్చిన బహుళ చతుర్ధి) కి విశేషాధిక్యత ఎందుచేత చెప్పబడింది? ఆ విషయాన్ని కూడా దయతో నాకు తెలుపవలసింది. మంగళకరములు, శుభప్రదములైన గజాననుని కధలను ఎంతవిన్నా నాకు తనివితీరటం లేదు!”
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”చతుర్థీవ్రతకధనం” అనే యాబై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹