ఉపాసనా ఖండము రెండవ భాగము
అంగారకచతుర్థీ మహిమ
కార్తవీర్యునితండ్రి అంగారక చతుర్ధియొక్క ప్రాశస్త్యాన్ని చెప్పమని ప్రార్ధించగా అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. “ఓ రాజా! అంగారక చతుర్ధియొక్క మహిమను వివరిస్తాను. సావధానంగా విను! పూర్వం అవంతీ నగరంలో భారద్వాజుడనే ముని వుండేవాడు. అతడు యమ, నియమ సంపన్నుడై, వేదవేదాంగాలలోని తత్త్వమంతా అపోశన పట్టి, శిష్యులకు మహోత్కృష్టమైన శిక్షణగరపుతూ నిరతాగ్నిహోత్రపరుడై ”మరో అగ్నిదేవుడా” అన్నంత తేజస్సుతో ప్రకాశించేవాడు.
అతడొకనాడు ఒక నదీతీరములో అనుష్టానంలో మగ్నుడై ఉన్నసమయంలో మహాసౌందర్యవతియైన ఒక అప్సరసను చూశాడు. ఆమె పట్ల కోరిక కలుగగా కామ మోహితుడై మూర్ఛిల్లాడు. అప్పుడు వివశుడైన ఆతనికి రేతస్థలనం కలిగింది. ఆ వీర్యం నేలపైనిగల ఒక బొరియలోకి జారింది.
ఆ రేతస్సునుండి జపాకుసుమం వంటి ఒక సుందరుడైన బాలకుడు ఉద్భవించాడు. ఆ బాలుని సంరక్షణాభారాన్ని భూదేవత స్వీకరించి పెంచసాగింది. ఇలా ఏడుసంవత్సరాలు గడిచాక ఆ బాలుడు ”నాతండ్రి ఎవరు?” ఏ కారణంచేత నాకు ఈ ఎఱ్ఱటిశరీరం కలిగింది? ఆ వివరం నాకు యిప్పుడు వెంటనే చెప్పు” అంటూ ప్రశ్నించాడు.
అప్పుడు ”ఓ కుమారా! భారద్వాజుని రేతస్సు నాయందు స్థలితమవ్వగా నీవు జన్మించావు. నావలన సంరక్షించబడుతూ ఇంతవాడ వైనావు!” అనగానే ఆ బాలకుడు ”ఐతే వెంటనే నాతండ్రియైన ఆ తపోనిధిని నాకు చూపించు!
అన్న ఆ బాలకుడిని తీసుకునివెళ్ళి భారద్వాజుని ఆశ్రమం వద్దకు కొనిపోయి, ఆతడితో ఇలా అన్నది. ”ఓయీ! నీ వీర్యంచేత ఉద్భవించిన ఈ బాలకుడు నాచేత సంరక్షింపబడ్డాడు. కనుక నీవిక వీనిని స్వీకరించు!” అంటూ అప్పచెప్పి ఆ ముని వద్ద సెలవుగైకొని వెళ్ళిపోయింది! అప్పుడా ముని తన కుమారుని ఆలింగనం చేసుకొని, తలపై ముద్దాడి, తన వడిలో కూర్చుండ బెట్టుకున్నాడు.
ఒకానొక సుముహూర్తంలో ఆ బాలకునికి ఉపనయనాది సంస్కారములు జరిపించి, వేదశాస్త్రాలను అభ్యసింపచేశాడు. చివరకు సకలార్ధప్రదమైన గణేశమంత్రాన్ని ఉపదేశించి, ”నాయనా! దీనిని శ్రద్ధాభక్తులతో భక్తజనవల్లభుడైన గణేశునికి ప్రీతికలిగేలా అనుష్టించు!
ఆ దీనపోషకుడి అనుగ్రహాన్ని పొందితివా ఆతడు నీ ఎడల అమితప్రసన్నుడై నీకు సకలాభీష్టములను ప్రసాదించ గలడు!” ఇలా తండ్రియైన భరద్వాజుని చేత ప్రేరితుడై ఆ బాలకుడు ఆతడి ఆదేశాన్ననుసరించి నర్మదానదీ తీరాన్ని చేరుకొని అక్కడ ఒకచోట పద్మాసనంలో కూర్చుని సకల ఇంద్రియాలనూ నిగ్రహించి, అంతర్ముఖుడై దీక్షగా తన హృదయకమలంలో గణేశునే ధ్యానిస్తూ, అతడి మంత్రజపం చేస్తూ నిరాహారుడై వేయిసంవత్సరాలు సుదీర్ఘమైన తపస్సును ఆచరించాడు!
ఇలా చేస్తూన్న సమయంలో మాఘమాసపు బహుళపక్షంలో చవితినాడు చంద్రోదయకాలంలో నాలుగు చేతులతో, తలపై బాల చంద్రుని చంద్రకళగా ధరించి, సకల ఆయుధాలను ధరించి, దివ్యమైన దేవతా వస్త్రాలతో సకలాభరణాలతో శోభిల్లుతూ సుందరమైనట్టి వంకర తిరిగిన తుండముతో, ప్రకాశిస్తూన్న దంతమును కలిగి కుండలాలతో అలంకరించబడిన చేటల వంటి చెవులతో, వేయిసూర్యుల కాంతితో వెలుగుతూ గణేశుడు భక్తవరదుడై శుభంగా దర్శనాన్ననుగ్రహించాడు.
ఆ మంగళప్రదునికి భక్తితో ప్రణమిల్లి ఆ బాలకుడిలా స్తోత్రం చేయసాగాడు!
“ఓ భక్తులపాలిట మందారమై, అభక్తులకు సకల విఘ్నకర్తనైన దీనజనావనా! నీకు నమో నమః! దేవతలకు, అసురులకు సకలగణములకు ఆధినాయకుడవైన ఓప్రభూ! నీకు నమస్కారం! సకల శక్తులను వికసింపచేసి విజృంభింపచేసే ఓ మూలశక్తి స్వరూపా! నీకు నా నమస్కారము!
పరబ్రహ్మతత్త్వమువై, నిర్వికారుడవై, నిర్గుణుడవై, గుణభేదకుడవైన నీకు నమస్కారము! బ్రహ్మవిదులలో శ్రేష్టుడవునూ, సృష్టిస్థితి లయాలకు కారణభూతుడవైన నీకిదే నా ప్రణతి! మూడు లోకాలను ఏలే త్రైలోక్య పాలకా! నీకిదే నాసన్నుతి! ఓ దేవా! లక్ష్యాలక్ష్యస్వరూపుడవూ, సమస్త దుర్లక్షణములను నశింపచేసే నీకిదే ప్రణతి!
పరేశుడవైన ఓ విఘ్న నివారక! నీకు మరల మరల నమస్కారం!” అంటూ భక్త్యుత్సాహాలతో తనను స్తుతించి తన పాదాలమ్రోల వాలిన అతడిని లేవనెత్తి, చిరునవ్వు వెన్నెలలా వర్షిస్తూండగా అతడిని ఉత్సాహపరుస్తూ మృదుమధురంగా గజాననుడిలా అన్నాడు.
‘ఓ బాలకా! నీ భక్తికీ, నీయీ స్తుతికీ నాకు ఎంతో సంతోషం కలిగింది! నీ ఉగ్రతపస్సు నన్ను తృప్తిపరచింది! అందుచేత నీవు బాలుడవైనప్పటికీ నీ సకల మనోభీష్టాలనూ అనుగ్రహించదలచాను! అవేమిటో కోరుకో.
ఆమాటకు స్వాంతనచెందిన ఆ భూమి పుత్రుడిలా ప్రార్ధించాడు. “ఓ దేవాధిదేవా! మీయొక్క దివ్యమంగళరూపాన్ని చూడటంవల్ల నా దృష్టి ధన్యమైంది! మీ దర్శనభాగ్యం చేత నాజన్మ, నాకులము, పావనమైనాయి! మిమ్ములను ధరించుటచేత సకల పర్వతాలతోనూ, వనాలతో విలసిల్లే ఈ భూమి యావత్తూ ధన్యమైంది.
అందరికీ ప్రభువువైన తమ దర్శన భాగ్యంచేత నా తపస్సూ, మూఢభావంతో కూడినదైనా నిన్ను స్తుతించటం చేత నాక్కూ ధన్యములైనాయి! ఓదేవా! సకలమంగళకారకా! నీవు సంతుష్టుడవైతే నన్ను స్వర్గలోకం చేర్చి, అక్కడగల దేవతలతోపాటూ నాకూ అమృతపానంచేసే భాగ్యం ప్రసాదించు.
నేను మంగళుడన్న పేరిట లోకప్రసిద్ధుడనౌదును గాక! నీ దివ్యదర్శనము నాకు సంప్రాప్తమైన ఈ చతుర్ధితిధి పుణ్యప్రదమై సర్వసంకష్టములనూ హరించునుగాక! నీ అనుగ్రహ విశేషంచేత ఈ చతుర్ధితిధినాడు వ్రతమాచరించినవారికి సకలాభీష్టములూ నెరవేరునుగాక!”అంటూ ప్రార్ధించిన అతడితో గణేశుడిలా వరమిచ్చాడు.
“నాయనా! భూమిసుతుడవైన నీవు రక్తవర్ణము కలవాడవటంచేత నీకు అంగారకుడవన్న పేరుతో వర్ధిల్లు! అంగారకచతుర్థినాడు వ్రతం ఎవరు ఆచరిస్తారో వాళ్ళకు ఒక సంవత్సరంపాటు సంకష్టవ్రతంవల్ల కలిగేంత పుణ్యం కలుగుతుంది.
ఈ అంగారక చతుర్థీవ్రత ఆచరణవల్ల సర్వ కార్యములయందూ అవిఘ్నత నిస్సందేహంగా కలుగుతుంది. నీవు ఎంతో ఉత్తమమైనదీ, అమితఫలవంతమైన ఈ వ్రతాన్ని అనుష్టించటంచేత ఈ పుణ్యప్రభావంవల్ల నీవు అవంతీదేశానికి రాజువవుతావు!” అంటూ అంతర్హితుడైనాడు.
ఓ వ్యాసమునీంద్రా! ఈవిధంగా కృష్ణ అంగారక చతుర్ధినాడు సకలాభీష్టప్రదమైన అంగారక చతుర్థీ వ్రతాన్ని అనుగ్రహించి, ఆతడి సకలా భీష్టములనూ ప్రసాదించి సకల జగన్మోహనకరమైన తన దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిచ్చి గణేశుడు అంతర్థానం చెందాడు!
ఆ తరువాత ఆమంగళుడు పదిబాహువులు గల సుందరమైన గణేశమూర్తిని ప్రతిష్ఠించి. గజాననుని సంతుష్టికొరకు గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాక ఆమూర్తికి “మంగళమూర్తి” అన్న నామకరణం చేశాడు. అప్పటినుండీ ఆ ప్రదేశము ”కామదాతృ క్షేత్రము” అన్నపేరుతో ప్రసిద్ధిచెందింది.
ఈ క్షేత్రములో జరిపే అనుష్టానము, పూజ, దర్శనములు మోక్ష దాయకములు! ఆ తరువాత గజాననుడు తన వైనాయకగణాలను తోడిచ్చి, భౌముని తనవద్దకు తీసుకురావటానికి ఉత్తమమైన విమానమును పంపించాడు. అప్పుడా దూతలు ఆ భౌముని సశరీరునిగా గజాననుని సన్నిధికి తీసుకువెళ్ళురు. మంగళవారం చవితి కలిసివచ్చిన నాడు సంకష్టహర చతుర్థీవ్రతాన్ని ఆచరించటంవల్ల అతడు ముల్లోకాలలోనూ ”భౌముడు” అన్న పేరుతో ప్రసిద్ధిచెందాడు.
ఆ తరువాత అతడికి దేవలోకంలో దేవతలతోపాటు అమృతపానముచేసే భాగ్యం సంప్రాప్తించి నది”. అంటూ వ్యాసభగవానునికి చెప్పిన గాధనే కార్తవీర్యుని తండ్రియైన కృతవీరునికీ తెలిపి బ్రహ్మ యింకా యిలా అన్నాడు.
“ఓరాజా! పారినేర నగరానికి పశ్చిమభాగంలో ”చింతామణి” అన్న పేరిట సర్వవిఘ్న నివారకుడైన మంగళమూర్తి ఆవిధంగా వెలిశాడు. అప్పటినుంచీ అంగారకచతుర్థీ లోకంలో ప్రఖ్యాతమైంది. ఇప్పటికి ఆ మంగళమూర్తి సన్నిధికి నిత్యం చంద్రోదయ సమయంలో సిద్ధులు, గంధర్వులూ చేరి పూజిస్తూ ఉంటారు. ఆ దేవదేవుడు భక్తులయొక్క సకల మనో రధాలనూ పూర్తిచేసి పుత్రపౌత్రాది సంపదలను ప్రసాదిస్తూన్నాడు.”
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”చతుర్థీ మహాత్మ్యం” అనే అరవయ్యవ అధ్యాయం.సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹