ఉపాసనా ఖండము రెండవ భాగము
చంద్రశాపానుగ్రహ వర్ణనం
ఆ తరువాత బ్రహ్మ యిలా చెప్పసాగాడు.
“ఓ రాజా! ఒకానొకప్పుడు నేను పరమేశ్వరుడు నివసించే కైలాసమునకు వెళ్ళాను! అక్కడ ఉచితాసనాన్ని అలంకరించిన నేను నారదమహర్షి రాకను గమనించాను. ఆతడు ఒక అపూర్వఫలాన్ని తెచ్చి శంకరునకు యిచ్చాడు.
ఆ ఫలమును తనకివ్వమని గణపతీ, తనకే యివ్వమని కుమారస్వామీ శివుడిని కోరారు. అప్పుడు శిశుడు నన్ను ”ఆఫలాన్ని యిరువురిలో ఎవరికివ్వమంటా”వని అడిగాడు. నేను చిన్న వాడైన కుమారునికిమ్మన్నాను”. శివుడు అలాగే చేయగా, గజాననుడు క్రోధపరవశుడైనాడు.
తాను మహోగ్రరూపం ధరించి నన్ను భయపెట్ట సాగాడు. ఒక అద్భుతమైన విఘ్నాన్నికూడా నాకు కల్గించాడా విఘ్నకరుడు. ఇలా నేను భ్రాంతి చెందియుండగా చంద్రుడు తన పరివారముతోకూడి వికృతరూపుడైన గజాననుని చూసి గొప్ప పరిహాసం చేశాడు. అప్పుడు క్రోధోద్దీప్తుడైన గజాననుడు చంద్రుణ్ణి యిలా శపించాడు.
“ఈ మూడులోకాలలోనూ ఎవరిచేతా చూడబడతగని వాడవగుదువు గాక! ఒకవేళ అలా ఎవరైనా నిన్నుచూస్తే అట్టివాడు మహాపాపి అవుతాడు!
ఇలా శాపాన్ని యిచ్చి గణేశుడు స్వగణాలతో కూడి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక చంద్రుడు శాపగ్రస్తుడవటంచేత మలినుడూ, దీనుడూ అయి, దుఃఖసముద్రంలో మునిగిపోయి ఇలా విచారించసాగాడు.
“మూర్ఖుడిలా అనాలోచితంగా దేవపరిహాసంచేసి ఎంతటి చేటును కొనితెచ్చుకున్నాను? బాలునిలా అజ్ఞానంతో యిలా చేయడంవల్లనే నాకీ దురవస్థ సంప్రాప్తమైంది! అందరిచేతా ఆహ్లాదకారిగా కొనియాడబడే నేను ఈరకంగా వివర్ణుడనైనాను!
ఎప్పటికి తిరిగి మళ్ళీ సురూపుడను కాగలనో కదా? అందరిచేత వందనీయుడనయ్యేది ఇక ఎన్నటికో? పదహారు కళలతోనూ సకల లోకులకు, దేవతలకూ మునుపటిలా సంతోషకరుడి ఎలా కాగలను?” అనుకుంటూ పరిపరి విధాల పరితపించాడు.
బ్రహ్మ యిలా కొనసాగించాడు. ”ఓరాజా! ఇంతలో దేవతలకు చంద్రుని శాపవృత్తాంతం తెలిసి వెంటనే ఇంద్రాది దేవతలు గజాననుడిని చేరుకుని విఘ్నకారకుడూ, సకల విఘ్నహర్తాయైన ఆ గజవదనునితో యిలా మనవిచేసుకున్నారు.
“ఓ దేవదేవా! సమస్త జగత్తులచేతా పూజింపతగినవాడవు! సృష్టిస్థితి లయములకు కారకుడవు! నీవు స్వతః నిర్గుణస్వరూపుడవైనప్పటికీ గుణములను సృష్టించి, సృష్టి అనే లీలను నడిపిస్తూంటావు! త్రిమూర్తులకూ ఆధారమైనటువంటి పరబ్రహ్మతత్త్వానికి రూపుకట్టినవాడవు, మహా మహిమోపేతుడవు! ఓ ప్రభూ! మమ్ములను రక్షించు!
అపరాధియైన చంద్రుడికింతటి మహాకష్ట మెందుకు కలిగింది? ఓ దేవా! సకలజగత్తూ, దేవతలమైన మేము, చంద్రుడూ ఏంచేస్తే సుఖము పొందగలమో అది ఒనరించు! ఓ ప్రభూ! చంద్రుడు కానరాక ఈ జగత్తంతా కష్టజలధి లో మునిగిఉన్నది! అందువల్ల చంద్రునియందు, త్రైలోకములందూ నీవు ప్రసరించు. మమ్మల్ని కృతార్ధులను చేయి!’
ఓ దేవా! వేదాలు సైతం నీరూపాన్నిగాని, మహిమనుగాని తెలుసుకో లేక మౌనం వహించాయి! అట్టి నిన్ను స్తుతించబూనుకోవటం ఎంతటి సాహసం? మహా మహిమాన్వితుడవూ కరుణాంతరంగుడవూ ఐన నిన్ను శరణుపొందుతున్నాము. నీ దర్శనంచేతా, నీతో సంభాషించటంచేతా మా హృదయాలకు స్వస్థతచిక్కింది! ప్రపన్నులైనవారి బాధలను తొలగించే ఓ దయాసముద్రా! నిన్ను శరణు పొందుతున్నాము!”
దేవతల ఈ స్తుతికి ప్రసన్నుడైన ఆ కరివదనుడు సకలమనోభీష్టాలను ప్రసాదించగల కామితార్ధప్రదుడై, చిరునవ్వు దరహాసచంద్రికయై వదనంపై విరియగా మనోహరంగా యిలా అన్నాడు.
“ఓ దేవతలారా! మీ ఈ స్తుతిచేత నేను ప్రసన్నుడనైనాను. మీ వాంఛితాన్ని ఎంతటి దుర్లభమైనదైనా అనుగ్రహించదలిచాను! కోరు కోండి!” అనగా అప్పుడు సకలదేవతలూ యిలా వేడుకున్నారు.
‘ఓ దేవా! చంద్రుని దయతో అనుగ్రహించవలసిందిగా మేమందరమూ వేడుకుంటున్నాం! చంద్రుణ్ణి తాను అనుగ్రహిస్తే, మేమందరమూ అనుగ్రహించబడ్డట్లే!” అనగానే ఆ వినాయకుడిలా అన్నాడు.
ఓ దేవతలారా! నాశాపం అప్రతిహతమైనది. ఐనా మీకోరికమేరకు ఒక సంవత్సర కాలంగాని, ఆరు నెలలుగాని, అందులో సగమైన మూడునెలలపాటు కానీ, చంద్రుడు దర్శింపతగిన వాడుకాదు! కనుక ఇదికాక మరోవరం కోరుకోండి అప్పుడు సకలదేవతలూ ఆ ద్విరదాననుని పాదాల పైబడి అనన్య భావంతో శరణాగతులై సాష్టాంగ దండప్రణామాలు ఆచరించారు.వారి భక్తిప్రపత్తులకు కరిగిన దీనజన బాంధవుడైన ఆ కరుణాసముద్రుడు ఇలా అన్నాడు.
‘ఓ దేవతలారా! నావాక్యమును అప్రమాణము చేయటానికి ఎందుకు ప్రయత్నిస్తారు? శరణాగతులైన వారిని విడుచుట నాకు ఏమాత్రం యిష్టం లేనిపని! మేరుపర్వతం చలించవచ్చు, సూర్యుడు గగనాన్ని వీడి నేలపై పడవచ్చు. అగ్ని చల్లదనాన్ని వహించవచ్చు, సముద్రుడు సైతం తన మర్యాద నతిక్రమించి చెలియలికట్టను దాటవచ్చు! నా మాట మాత్రం ఎన్నటికీ వ్యర్ధంకాదు!
ఐనా ఒకమాటను మీయందలి అనుగ్రహ విశేషంచేత చెబుతాను వినండి! ఎవరైనప్పటికీ తెలిసిగాని, తెలియకగాని భాద్రపద శుక్ల చతుర్ధినాడు చంద్రదర్శనం చేసినట్లయితే వారు తప్పక దుఃఖాన్ని పొందుతారు! ఇది నిశ్చయం!’
ఈ మాటలకు దేవతలు ఎంతో సంతోషించారు. ”శ్రీగణేశాయ నమః” అంటూ ఆ దేవదేవునిపై పుష్పవృష్టి కురిపించి, నమస్కరించి, అనుజ్ఞనుగైకొని చంద్రునివద్దకు వెళ్ళి యిలా అన్నారు.
‘ఓయీ! నీవెంతటి మూఢుడివి? సకల జగద్వందనీయుడూ పరమ పావనుడైన ఆ గజాననుని చూసి పరిహసిస్తావా? నీయొక్క అవివేకత వలన, నీవొనరించిన అకృత్యంవలన మూడులోకాలూ ఎంతో సంకటం లో పడివున్నాయి. ఆ కరుణాసముద్రుడు ముల్లోకాలకూ అధినాయకుడు. జగత్రయములకే విధాత! నాశరహితుడు నిర్గుణుడు పరబ్రహ్మస్వరూపుడూ, సకలజగాలకు గురుస్వరూపుడైన ఆ మహనీయునికి ఎందుకు అపరాధం చేశావు?
ఆ మహానుభావుడు అతికష్టంమీద మా ప్రార్ధనలకు ప్రసన్నుడై, సకలలోకహితం కోరి మాకు యిలా నియమించాడు. ”భాద్రపద శుక్లచవితినాడు మాత్రం నీవు ఎవరిచేతా చూడబడ తగనివాడవు! ఓ చంద్రా! నీవుకూడా వివేకం కలిగి వెంటనే ఆ దేవదేవుని శరణువేడు! ఆతడనుగ్రహిస్తే నీవు మరల శుద్ధశరీరాన్నీ, లోకఖ్యాతినీ పొందగలుగుతావు!”
ఈ రకంగా ఆత్మహితోక్తులను దేవతలవద్ద విన్న చంద్రుడు శరణాగతవత్సలుడైన ఆ వరదగణపతిని శరణువేడాడు! తన నిజరూప ప్రాప్తికై సకలపాపహర మైనట్టి ఏకాక్షరీగణపతి మంత్రాన్ని అకుంఠితదీక్షతో నూట ఇరవై సంవత్సరాలపాటు జపిస్తూ దారుణమైన తపస్సుచేశాడు. గంగానదీ తీరానికి దక్షిణఒడ్డున ఘోరతపస్సు ఆచరించగా గజాననుడు ప్రసన్నుడై అతనికి ఇలా దివ్యరూపంతో సాక్షాత్కరించాడు.
ఎఱ్ఱటి వస్త్రమును ధరించి, రక్తచందనంతో అలదబడిన మేనును కలిగి నాలుగు బాహువులతోనూ, పెద్ద శరీరంతోనూ సింధూరవర్ణంలో కోటిసూర్యప్రకాశమానుడై సకలజగాలనూ ప్రకాశింపచేస్తూ ప్రత్యక్షమవగా ఆ తేజస్సును తట్టుకోలేక అంజలియొగ్గి ఎదుటనిలిచి మనస్సులోనే యిలా స్తుతించసాగాడు.
“సర్వవిఘ్నహరుడవైన ఓ మంగళస్వరూపా నీకు నమస్కారము! భక్తులకు చతుర్విధ పురుషార్ధాలనూ అలవోకగా ప్రసాదించే నీకు ఓస్వామీ! శరణాగతి! విశ్వాత్మకుడవు, విశ్వవిధాతవూ కృపానిధివీ, బ్రహ్మ మయుడవైన ఓ ప్రభూ! నీకు సాష్టాంగనమస్కారం! విశ్వానికే బీజస్వరూపుడవై, జగత్తంతా వ్యాపించిన మోహనకరమైన మాయాస్వరూపుడవై మాయాతీతుడవైన నీ లీలావిభూతికిదే నా ప్రణామం!
త్రైలోక్యసంహారకర్తవుగా జీవులలోని బుద్ధిప్రదీపకుడవుగా వెలుగొందే నీకు పదేపదే ఆర్తితో నమస్కరిస్తున్నాను. సురలకు అధిపుడవై, నిత్యసత్య స్వరూపుడవై, నిరీహుడవైన నీకు మరిమరి నమస్కారం!అజ్ఞానంచేత నావల్ల ఒనరింప బడిన అపరాధాన్ని క్షమించు. శరణునొందిన శరణార్ధిని! కనుక రక్షించి నన్ను అనుగ్రహించు!” అంటూ పరిపరివిధాల వేడిన ఆ చంద్రుని ఊరడించి చంద్రునికిలా ఆ వరదగణపతి వరాల ననుగ్రహించాడు.
చంద్ర వరప్రదానం
ఓ చంద్రా! నీకు యధాపూర్వరూపం సంప్రాప్తమౌగాక! భాద్రపద శుక్ల చతుర్ధినాడు మాత్రమే నీవు అదర్శనీయుడవవుతావు! ఇక కృష్ణ పక్ష చతుర్ధినాడు నీవు ఉదయించినప్పుడు ఎవరైతే సంకష్ట చతుర్థీ వ్రతాన్ని ఆచరిస్తారో వారిచేత ఆసమయంలో నీవుకూడా నాతోపాటూ పూజ్యుడవు కాగలవు!
ప్రయత్నపూర్వకంగానైనా ఆరోజు నిన్ను సర్వులూ తప్పక దర్శించి తీరాలి! అలా చేయకపోతే ఆ వ్రతం వృధా అవుతుంది! ఓ చంద్రా! నీవు ఒకకళతో నా లలాటంలో ఉండు! అదినాకు ఎంతో సంతోష కరము! అంతేకాదు ప్రతినెలలోనూ శుక్లపక్ష ద్వితీయనాడు నీవు ప్రయత్న పూర్వకంగా దర్శింపతగిన వాడవు , నమస్కరింప తగినవాడవు అవుతావు!”
అంటూ భక్తజన పరిపాలకుడైన గజాననుడు కురిపించిన అనుగ్రహ ఫలితంగా చంద్రుడు యధాపూర్వకంగా తిరిగి ప్రకాశవంతుడైనాడు. ఆ తరువాత దేవతాబృందాలు అనుసరించగా గజాననుని మూర్తిని అక్కడ ప్రతిష్టించి, సువర్ణమయమైన, రత్నఖచితమైన మందిరాన్ని నిర్మించి షోడశోపచారములతోనూ ఆ మూర్తిని పూజించాడు.
దేవతలు, మునులు కూడా అక్కడ వరదమూర్తిని పూజించి ఆ క్షేత్రానికి శక్తివంతమయ్యేలా వరాలిచ్చారు. సిద్ధక్షేత్రమనే పేరుతో ఆ క్షేత్రము లోకవిఖ్యాతమైంది!
“ఆ దివ్యక్షేత్రంలో అనుష్టానం చేసినవారికి సర్వసిద్ధులూ కలుగు తాయి.” అంటూ దీవించి దేవతలు మునులు వరదునికి నమస్కరించి నిర్మలమనస్కులై తమతమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఫాలంలో చంద్రుడు అంతర్హితుడైన తరువాత చంద్రుడు సెలవుగైకొని సంతుష్టాంతరంగుడై తన నిజస్థానాన్ని చేరుకున్నాడు.
ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘చంద్రశాపానుగ్రహ వర్ణనం’ అనే అరవై ఒకటవ అధ్యాయం.సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹