Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – అరవై మూడవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

‘దూర్వామహాత్మ్యం’ రెండవ భాగము

ఈవిధంగా యోగులు ప్రశ్నించగా దేవతాగణములు ఈవిధంగా చెప్పారు

“ఓ యోగీశ్వరులారా! ఏకాగ్రమనస్సుతో వినుడు. గజాననుడి మహిమలు వర్ణించుటకు బ్రహ్మదేవునికిగాని, సహస్ర ఫణములుగల ఆదిశేషునికి గాని శక్యము కానిపని. ఐనప్పటికీ మా శక్తిమేర మీకు వర్ణించి తెలిపెదము.

ఏ మహానుభావుని నిత్యమూ బ్రహ్మమహేంద్రాదులు వేదమంత్రములతో స్తోత్రములు చేయుచుందురో అట్టి గణేశుని మహిమనెవరు వర్ణించగలరు? ఇంకనూ దుర్వాంకుర మహిమలను గురించి తెలుపుటకు దేవతలకూ మునులకూ కూడా వశముగానిపని!

ఎందుకనగా కేవలం దూర్వాంకురము సమర్పించడం వల్ల కలిగేటటువంటి అసమాన ఫలము – యజ్ఞము, దానము, వ్రతము తపస్సులతో కూడా పొంద వీలుకానంతటి అనంత పుణ్యఫలము! దీనిగురించిన ఒక ప్రాచీన ఇతిహాసము కలదు! దానిని వర్ణించి తెలిపెదము. గతంలో ఇంద్రునకూ నారదునకూ జరిగిన సంవాదాన్ని మీకిప్పుడు తెలిపెదను.

ఒకానొకప్పుడు దేవర్షియైన నారదుడు ఇంద్రదర్శనమునకై స్వర్గానికి వెళ్ళగా ఇంద్రుడాయనకు ఆర్ఘ్యపాద్యములను ఒసగి సమస్త గౌరవాలతో పూజించి, సుఖాసీనుడైన నారదుని ఇంద్రుడు దూర్వాంకురములు (గరిక చిగుళ్ళు) గణేశునకు సమర్పించుటవలన కలిగే ఫలాన్నిగురించీ వాని మహాత్మ్యం గురించి తెలుపమని ప్రశ్నించెను.

అంతట ఇంద్రుడు “ఓ మునీంద్రా! దేవతలకు అధిదేవుడైన గణపతిదేవునకు ఈ దూర్వాంకురమంటే అంత ప్రీతి ఎందుకు? దాని ప్రత్యేకమైన మహిమనుగూర్చి వివరముగా తెలుప”మని ప్రార్ధించెను. దానికి నారదమునీంద్రుడు.

“ఓ దేవేంద్రా! పూర్వకాలములో స్థావరమనే నగరంలో కౌండిన్యుడనే పేరుగల మహాముని నివసించేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు. గణేశమంత్ర జపసిద్ధి పరాయణుడు. గొప్ప తాపసి! ఆ గ్రామమునకు దక్షిణ దిక్కుగా పరమపవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించినాడు! దానిలో పచ్చని నవనవలాడే వృక్షములు, దివ్యౌషధులు, ఫలపుష్పములు కలిగి నిర్మలమైన కొలనులో వికసించిన తామరపద్మములు లక్ష్మీకళతో విలసిల్లేవి!

ఆ సరస్సులో తెల్లని హంసలు, పున్నమచంద్రునివంటి చక్రవాకపక్షులు, కొంగలు, కలకలలాడే జల పక్షులు ఆనందంగా విహరించేవి! అట్టి నిర్మలమైన ఆశ్రమంలో ఆ మునీశ్వరుడు యోగనిష్టా పరాయణుడై ధ్యానసమాధి స్థితిలో తన హృదయములో గణేశుని మూర్తిని ప్రతిష్ఠింపజేసుకుని “గణేశషడక్షరీ మంత్రము”ను అఖండముగా జపించేవాడు. అంతేకాక పరమపవిత్రములైన దూర్వాంకురములతో ప్రతినిత్యం గణపతి విగ్రహాన్ని పూజించేవాడు.

ఇట్లుండగా ఆ మునీశ్వరుని భార్య మునిపత్నియగు ఆశ్రయాదేవి ఒకనాడు తన భర్తను యిలా ప్రశ్నించింది.”ఓ ప్రాణనాధా! ప్రతిరోజూ మీరు గజాననునిపై పూజానంతరము పచ్చని గరిక చిగుళ్ళు (దూర్వాంకురములు) ఎందుకని ఉంచుతున్నారు! కేవలము గడ్డిపరకల వలననే గణేశుడు సంతసించునా? ఇలా దూర్వాంకురములు సమర్పించడంవల్ల కలుగు ఫలితమేమి? దీనికి ఏదైనా రహస్యము ఉంటే దానిని తెలియజెప్పండి దయతో!” అని ప్రశ్నించెను.

దానికా మునీశ్వరుడు “ఓ ప్రియభార్యామణీ! దూర్వాంకురము యొక్క మహాత్మ్యము ఇంతింతని చెప్పరాదు. దీని గురించిన మహాత్మ్యకధను నీకు చెప్పెదను శ్రద్ధతో విను..

పూర్వకాలంలో “సంయమని పురము”లో ఒక గొప్ప మహోత్స వము జరుగుతున్నది! ఆ ఉత్సవానికని సమస్త దేవతాగణములు అప్పరసలు, గంధర్వ, విద్యాధరులూ, కిన్నర కింపురుషాదులు ఆహ్వానించబడి తరలివచ్చారు. ఆ దేవతాసభలో అతిలోకసుందరియైన ”తిలోత్తమ” అనే అప్సరస నాట్యం చేస్తున్నది. నృత్యం మధ్యలో ప్రమాదవశాత్తూ ఆమె చీరచెంగు జారిపోయింది.

దేవసభలో కూర్చున్న యమధర్మరాజు ఆమె సౌందర్యమును తటాలున చూసి మోహపరవశుడై ఆమె సౌందర్యమునకు వశపడి కామంతో తపించి ఒక్కసారిగాలేచి ఆమెను కౌగలించుకోవాలని లేచాడు. మరుక్షణమే ఒడలు తెలిసి సభలోంచి తలవంచుకుని వెళ్ళిపోతూండగా ప్రమాదవశాత్తూ అతని వీర్యము స్థలించి భూమిపై పడింది!

ఆ యమధర్మరాజు వీర్యంచేత అగ్నిజ్వాలవలే మండుతున్న ఒక భయంకరాకారుడైన అసురుడు పుట్టాడు. భయంకరమైన కోరలు, పెద్ద నోరు, జ్వాలలవంటి జడలు, నిప్పుకణికెలవంటి మిడిగ్రుడ్లు ప్రపంచాన్ని దద్దరిల్లచేసే పెద్ద అరుపులతో భయంకరమైన వాడికోరలుగల నోటిని తెరచి లోకాలను భక్షించాలని ఉరికాడు. ఆ రాక్షసుని భయంకర వికటాట్టహాసంతో ముల్లోకములలోనివారూ గడగడలాడిపోయారు.

అకస్మాత్తుగా జరిగిన ఈ విపరీత ప్రమాదమునకు భయపడిన దేవతలందరూ దేవసభలో లేచి శ్రీమహావిష్ణు దేవుని శరణుపొంది అనేక విధముల స్తోత్రం చేశారు. శ్రీవిష్ణుదేవుడు వారందరినీ శ్రీగణేశ ప్రభువును ఆశ్రయించవలసిందిగా సలహాయిచ్చాడు.

ఆ దేవతా గణములను వెంట పెట్టుకుని ఆ రాక్షసుని సంహారం నిమిత్తం మహాగణపతిని శక్తివంతమైన దివ్యమంత్రాలతో స్తుతింపచేశాడు.

దేవతల గణపతిస్తోత్రం

దేవతాగణాలు ఈ విధంగా ప్రార్ధనచేసిరి!

‘విఘ్నస్వరూపుడైన గణపతిదేవునకు నమోనమస్తే

సర్వ విఘ్నములనూ హరించు విఘ్నహరునకు నమోనమః,

సర్వసాక్షీభూతుడైన పరమాత్మ రూపియగు గణేశునకు నమో నమస్తే!

సర్వసృష్టి స్వరూపుడైన గణేశ పరబ్రహ్మకు యివే మా నమోవాకములు!

ఓ సర్వసాక్షివగు ప్రభూ! నీకిదే నమోనమః|| ఓ దేవదేవా నమస్తే! నమస్తే!

ఓ మహానుభావా! మహాగణపతీ!! సమస్త జగదాధార భూతుడా! మహాగణపతీ నమోవాకములు!

ఓ కృపానిధీ! జగద్రక్షకుడా, గణేశా! నీకిదే మా శరణాగతి! ఓ జగత్పరిపాలకుడా! పూర్ణబ్రహ్మ స్వరూపుడా! పరిపూర్ణ తపస్స్వరూపుడా నీకిదే మా నమోనమః!

సర్వదుష్ట అసురసంహార కర్తకు, సమస్త కష్టనివారకునకు, వరములిచ్చి అనుగ్రహించే దయామూర్తికివే మా నమస్సులు!

ఓ పరమేశ్వరా! నీకంటే మాకు అనన్యశరణ్యం వేరులేదు! మా సమస్త కోరికలనూ తీర్చగల నీకిదే మా నమస్కారము.

ఓ సమస్త వేదమంత్రాత్మకుడా! సమస్త వేదచ్చందస్వరూపుడా! సమస్త వేదఛందోగణాధిపా! వేదమూర్తీ! నమస్కారము!

నీవుతప్ప దిక్కులేని మేము వేరెవరిని శరణుపొందగలము? నీవు తప్ప మమ్ములను సంకటములనుండి భయములనుండీ రక్షించగల దయామూర్తి ఎవరుంటారు?

ఈ అకాల ప్రళయమేమిటిప్రభూ? ఈ దుష్టరాక్షసబాధ ఏలమాకు? హాగజాననా। అయ్యో! హాహా! సర్వవిఘ్నహరుడా! దేవదేవేశా॥ సర్వరక్షకా!!! మాకందరకూ మరణప్రాప్తి కాగల గొప్ప మృత్యు భయంనుంచి రక్షించు! మమ్ములను ఉపేక్షించకు! ఓ కరుణాసముద్రా! మహాగణేశా!! శరణు! శరణు||”

అంటూ దేవతలు ప్రేమతో, ఆర్తితో, భక్తితో స్తుతించగా వారి ముందర శిశువు రూపములో గణపతిదేవుడు “బాలగణపతి”గా సాక్షాత్కరించి ‘భయములేదు! అభయం!! అభయం!!!’ అంటూ తామర పద్మములవంటి నేత్రములతో దయను వర్షించుతూ పున్నమిజాబిల్లివంటి ముఖం కోటిచందమామల అందం కులికించగా, కోటి సూర్యకాంతి ప్రభలతో, వేయిమన్మధుల అందంతో తెల్లని మల్లెపూవుల వంటి ధవళవర్ణం తో చవితి చంద్రునివలే తెల్లగా ప్రకాశించే దంతంతో, తామర మొగ్గవంటి ఎఱ్ఱని క్రింది పెదవితో గంభీర కంబుకంఠస్వరంతో ఉన్నతమైన కుంభ స్థలంతో, ముద్దులు మూటగట్టే చిట్టిపాదములతో లక్ష్మీకళతో వెలుగొందే గుండ్రని మోకాళ్ళు, బొద్దుగా ముద్దుగావుండే పాదపద్మములతో నవరత్న ఖచితమైన అందెలతో మేఘస్వరం వంటి మంగళవాద్య స్వరంతో నృత్య తాండవ స్వరూపంలో వారిఎదురుగా భూమిపై సాక్షాత్కరించాడు గణేశ ప్రభువు!!

ఒక్కసారిగా దేవతలు ఖంగారుగా లేచినిలబడ్డారు! జయజయ శబ్దములతో దండములవలె సాష్టాంగముగా క్రిందపడి నమస్కరించారు. తామరపుష్పములవంటి సుకుమారమూర్తియైన గణేశునితో ఇంద్రాది దేవతలు ప్రార్ధన యిలాచెప్పారు.

దేవతల ఉవాచ

“ఓ దేవదేవా! ఈ బాలస్వరూపమేమిటి? పరమాశ్చర్యమైనది!బ్రహ్మరూపివైన బాలకుడా ఏకార్యం నిమిత్తం యిట్టి సుందర శిశురూపం లో సాక్షాత్కరించావు? ఘోరమైన అనలాసురుడు మమ్ములను భక్షించే ప్రమాదంలో యిలా మాకు బాలకుడిగా ప్రత్యక్షమైతేఎలా? మమ్ములను నీవు రక్షించగలవని నమ్మి ఉన్నామే? అయ్యో! శిశురూపీ! పసిబాలకుడా! గజాననా! ఏమి ఈరూపం?” అంటూ ఆశ్చర్యంతో ప్రార్ధించిన మునిగణాలతో కలిసి ప్రణామంచేసిన దేవతలతో శ్రీ గణేశుడు యిలా చెప్పాడు.

గణేశ ఉవాచ:

“నేను నా సంకల్పం చేతనే ఇలా బాలరూపంతో ప్రత్యక్షమైనాను! అతివేగంగా, జన్మించగానే బాలునివలే మీ ముందర ఆ రాక్షసుని సంహారం నిమిత్తం అవతరించాను. ఓ అనఘులారా! ఈ రాక్షసవధకు ఉపాయం చెబుతాను! నేను ఆరాక్షసుని యొక్క పరాక్రమాన్ని చూడాలన్న కుతూహలం తోనే ఈ బాలరూపంతో అవతరించాను. మీరుపోయి ఆ రాక్షసుణ్ణి ప్రేరేపించండి!”

గణపతి వాక్యములు విని దేవతలు ఆనంద పరవశులైనారు. దేవతలు ఒకరితో ఒకరు ”ఆహా! ఈశ్వరుడైన ఈ గణపతి ఇంటా బాలరూపం లో సాక్షాత్కరించి ఆరాక్షసునితో తలపడటం ఎలాసాధ్యం? మనల్ని రక్షించేందుకూ, ముల్లోకాలను పీడిస్తున్న ఈ రాక్షసుని వధార్ధము ప్రార్ధించాముకదా!’ ఇంతలోనే ఈ కాలానలుడు అగ్నిస్వరూపుడైన జ్వాలలు దశదిక్కులకూ ప్రజ్వలించగా మానవలోకం హాహాకారాలు చేసేలా ప్రత్యక్షమయ్యాడు!

గొప్ప కోలాహలంతో సర్వత్రా గగ్గోలుగా సమస్తలోకాల జీవులూ రోదనం చేస్తున్నారుకదా! ఈ మహత్కష్టం చూసి మునులు, దేవతలు భయంతో పరుగెత్తసాగారు. మనంకూడా శీఘ్రంగా తప్పించుకు పోకుంటే ఈ రాక్షసుడు మనలను ఒక్కసారిగా ఓ పెద్ద తిమింగలం చిన్నచిన్న చేపలను మింగినట్లు గుటుక్కున భక్షించగలడు! గరుత్మంతుడు సర్పాలను చీల్చినట్లు మనలను చీల్చి చెండాడనూగలడు!

పారిపోదాం పదండి!”అంటూ పరుగెత్తిపోయే కోలాహలశబ్దం విని పరమాత్ముడైన గజాననుడు బాలరూపం ధరించి, ఆ రాక్షసుని దారి కడ్డంగా బండరాయివలే కదలక స్థిరంగా నిలబడ్డాడు. ఆ బాలకుని ఒంటరిగా విడిచి దేవతలు దూరంగా పరుగెత్తారు ప్రాణభయంతో.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”దూర్వామహాత్మ్యం”అనే అరవై మూడవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment