ఉపాసనా ఖండము రెండవ భాగము
అనలాసుర వృత్తాంతం
ఈ కధావృత్తాంతము అంతటినీ కౌండిన్యమహర్షినుండి వింటున్న అతడి ధర్మపత్ని ఇలా ప్రశ్నించింది. “ఓ మునివర్యా! దేవతలు, మునులు అలా రాక్షసుడి భీతితో కాలికి బుద్ధిచెప్పి పారిపోగా ఓ పర్వతంలా ఆ బాలకుడా నిలిచివున్నది? ఆ తరువాత ఏం జరిగింది? ఆ వృత్తాంతమంతా వినాలని కుతూహలమౌతున్నది. కనుక దయతో వివరించండి!” అలా ప్రశ్నించిన ఆ శ్రమకు కౌండిన్యుడు ఏమి బదులిచ్చాడో ఓ దేవేంద్రా నీవూవిను! అంటూ నారదుడు తరువాత జరిగిన కధను వివరించాడు.
బాలుడైన గజాననుడు అలా అచలుడై నిలచియుండటం చూసి అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ మీదకి దాడిచేయవచ్చాడు. అతడి భయంకర పదఘట్టనలకు భూమి గడగడా వణికింది! ఆకాశంలో ఉరుములతో మేఘగర్జన వినవచ్చింది. ఆ వికృతమైన ధ్వనులకు చెట్ల కొమ్మల పైనుండే పక్షులన్నీ నేలపై రాలినాయి. సముద్రములు ఉప్పొంగాయి! ఒక ప్రచండవాయువు పెనుతుఫానులా వీచి పెద్దపెద్ద వృక్షాలన్నీ కూకటివేళ్ళతోసహా పెకలించబడ్డాయి.
అప్పుడు బాలస్వరూపుడైన ఆ గజాననుడు అనలరూపుడైన ఆ రాక్షసుణ్ణి తన మాయాబలంతో పట్టేసి అందరూ చూస్తుండగా అగస్త్యుడు సముద్రాలను అపోశన పట్టినట్లు ఆ దానవుడిని మ్రింగేశాడు. అలా మ్రింగివేసి ”వీడుగాని కడుపులోకి వెళ్ళాడా కుక్షిలోని భువనాలన్నీ దగ్ధమౌతాయి” అనుకున్నాడు.
అప్పుడా బాలగజాననుడి తాపోపశమనమునకై ఇంద్రుడు చంద్రుని కళని యిచ్చాడు. ఆనాటినుండి ఆతడికి ”ఫాలచంద్రుడ”న్న నామం కలిగింది. బ్రహ్మదేవుడు తన మనఃసంకల్పమాత్రంచేతనే సిద్ధిబుద్ధియనే ఇరువురు కన్యలనూ సృజించి సర్వాంగసుందరులూ, కోమలశరీరులైన ఆ భామలను సమర్పించి ‘ఓదేవా! వీరిని ఆలింగనం చేసుకుంటే నీ తాపం శాంతిస్తుంది’ అంటూ మొక్కాడు.
అప్పుడు విష్ణుమూర్తి కమలములను యివ్వగా ”పద్మహస్తుడు” అన్న నామం సుప్రసిద్ధమైంది! అప్పటికీ అగ్ని శాంతించనందున వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడు. శంకరుడు శేషుడిని బహూకరించగా దానితో బంధింపబడిన ఉదరము కలవాడైనందున ”వ్యాళబద్ధు”డని దేవతలు కీర్తించారు. ఐనా వేటివల్లా కూడా గణేశునికి తాపోపశమనం కాలేదు. అప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది మునీశ్వరులు వచ్చి ఒక్కొక్కరూ ఇరవైఒక్క దూర్వాంకురముల చొప్పున భక్తితో సమర్పించారు. అప్పుడు వాటివల్ల ఆ అగ్ని శాంతించింది.
ఈ రీతిగా దూర్వాంకురములచేత అర్చించబడిన గజాననుడు చాలా సంతసించాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ కూడా ఆ భక్త సులభుడిని దూర్వాంకురములతో పూజించి సంతుష్టపరిచారు. అలా అనంతమైన దూర్వాంకురములచేత అర్చించబడ్డ గజాననుడు దేవతలతోనూ, మునులతోనూ ఇలా అన్నాడు.
“నా పూజకై భక్తి శ్రద్ధలతోపాటూ సేకరించాల్సిన మహాముఖ్యమైన పూజాద్రవ్యం ఈ దూర్వాంకురాలే! అందువల్ల నాపూజలో వీటిని తప్పక వినియోగించాలి! దూర్వాంకురములు లేని పూజవల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు! అందువల్ల నా భక్తులు ఉషఃకాలంలో ఒక్కటైనా, ఇరవైఒక్కటైనా దూర్వాంకురములు సమర్పిస్తే అది అనంతఫలప్రదమౌతుంది! ఆ ఫలితం నూరుయజ్ఞాల వల్లగానీ, దానాదికముల వల్లగాని ఉగ్ర తపోనిష్ట వల్లగాని సంపాదించే పుణ్యంకన్న ఎన్నోరెట్లు అధికమైనది.”
‘ఓ ఆశ్రయా! ఈ విధంగా దేవతలు, మునులు గజాననుని వాక్యాలను విని తిరిగి ఆయనను దూర్వాంకురములతో పూజించారు. అప్పుడా భక్తవత్సలుడు అమిత సంతోషంతో భూనభోంతరాళాలు ప్రతిధ్వ నించేలా గర్జించాడు. అనేక వరాలను ఆనందపరవశులైన దేవతలకు, మునులకు, మానవులకు ఒసంగి అంతర్ధానం చెందాడు. అది మొదలు ఆయనకు ”కాలానల ప్రశమనుడు”అన్న నామం కల్గింది. తరువాత అందరూ ఆ ప్రదేశంలో ఒక గణేశ దేవాలయాన్ని నిర్మించి గణేశమూర్తిని స్థాపించి ఆ మూర్తికి ”విఘ్నహరుడ”న్న నామం ఉంచారు.
ఎవరైతే ఈ ప్రదేశంలో స్నానం, దానము, అనుష్టానము నిష్టగా ఆచరిస్తారో వారికి విఘ్నహరుని కృపవలన అనంతమైన పుణ్యం సంప్రాప్త మౌతుంది. ఇక్కడ గజాననుడు కాలానల అసురునిపై జయంపొందాడు. గనుక ఈ ప్రదేశము విజయపురమన్న పేరిట ఖ్యాతివహించింది. సకల భక్తజనుల విఘ్నహర్త కనుకనే ఆ దేవదేవునికి విఘ్నహరుడన్న పేరుకూడా విఖ్యాతమైంది. “ఓ ఆశ్రయా! నీవు అడిగావు గనుక అమిత ఫలప్రదమైన ఈ దూర్వాంకుర మహాత్మ్యాన్ని నీకు వివరించాను. దీనిని పఠించుటవలన వినటం వలన సర్వపాపములు క్షయమౌతాయి! ఇది అతిపురాతనమైన ఇతి హాసం” అంటూ కౌండిన్యమహర్షి తన అనుష్టానానికి నదీతీరానికి వెళ్ళిపోయాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”అసుర వృత్తాంతం” అనే అరవై నాల్గవ అధ్యాయం సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹