ఉపాసనా ఖండము రెండవ భాగము
దూర్వామహాత్మ్యం
ఆ ఇంటియందు చివరికి కూర్చునేందుకు కనీసం పీటయైనా లేనందున విరోచన త్రిరోచనులు యిరువురూ నేలపైనే కూర్చున్నారు.
ధరించేందుకు సరైన వస్త్రాభరణములు కూడా లేనివారవటంచేత దిగంబరులై ఉండిరి. అయాచితంగా లభించినదానిని మాత్రమే భుజించే నియమం కలవారవటంచేత తమకు భుజించేందుకు ఆహారం లభించని రోజులలో కేవలం నీటితోనే తమ అవసరాలు తీర్చుకునేవారు. ఇల్లంతా ఈగలచేత, దోమలతో నిండి ఎంతో అశుభ్రంగా ఉండినది.
నానా రకాల పత్రి చేత అర్చించిన వినాయకునిమూర్తి, నీరు తప్ప మరింకేమీలేని వారియింటిలో ప్రవేశించిన ఆ కపటబ్రాహ్మణుడు వారలతో ఇలా అన్నాడు.
“ఓ పుణ్యదంపతులారా! ఈ దేశపు రాజైన జనకుని కీర్తిని విని ఆకలిగా వున్నదికదా! కడుపారా భోజనంచేద్దామని వచ్చిన నా ఆశ అడియాసే అయింది! అతడు చేసేదంతా దంభముతోటి తనగొప్ప చాటుకునేందుకే చేస్తున్నాడు కనుక నాకు తృప్తికలిగేలా మీ యింట ఏమివున్నా పెట్టండి!”
ఆ మాటలకు నిర్ఘాంతపోయిన ఆదంపతులిలా అన్నారు.’ఓ బ్రాహ్మణోత్తమా! చక్రవర్తియైన రాజు సైతం నీకు తృప్తికలిగించ లేకపోయినాడే? దరిద్రులమైన మేము నీకెలా తృప్తినొందించగలము? నదీనదములచేత నిండని సముద్రము కేవలము బిందువుతో నిండుతుందా?
ఆ మాటలకు కపటియైన ఆ బ్రాహ్మణుడిలా అన్నాడు: “ఓ దంపతులారా! భక్తితో సమర్పించినది కొంచెమైనా అది నాకు అనంతతృప్తిని కలిగిస్తుంది!అలాకాక దంభముతో నాకు ఎంతయిచ్చినా అది వృథాయే అవుతుంది!” అప్పుడు ఆదంపతులిలా అన్నారు.
‘ఓ బ్రాహ్మణోత్తమా! నీకు ఇవ్వటానికి మా ఇంట ఏమీలేవు! నిజమే చెబుతున్నాము. ఉదయాన్నే గణనాధుని పూజించటానికి సేకరించిన దూర్వాంకురాలలో ఒక్కటి మిగిలివున్నది.’ ఆ మాటలకు ఆ బ్రాహ్మణుడిలా అన్నాడు.
‘ఓ దంపతులారా! మీరు భక్తిభావముతో ఆ ఒక్క దూర్వాంకురాన్నే సమర్పించినా నేను సంతుష్టుడనౌతాను. కనుక నాకు మీరు దానిని నిస్సందేహంగా యివ్వండి!’
‘ఓ ఆశ్రయా! ఆ విధంగా బ్రాహ్మణుడినుండి ఆదేశించబడ్డ విరోచన అనే ఆ ఇంటి యిల్లాలు ఆ ఒక్క దూర్వాంకురమును తెచ్చి సమర్పించింది. దానితో ఆ బ్రాహ్మణుడు సంతుష్టుడైనాడు. ఆమె షడ్రసోపేతమైన భక్షభోజ్యాదులతోకూడిన విందుభోజనం సమర్పిస్తున్నట్లు భావించి ఆ ఒక్క దూర్వాంకురమునే భక్తిశ్రద్ధలతో ఆ బ్రాహ్మణుడికి సమర్పించటంచే ఆ దూర్వాంకురంచేత ఆ మాయాబ్రాహ్మణుడి జఠరాగ్ని ఉపశమించింది. ఆతడు పరమ తృప్తిని చెందాడు. అప్పుడా బ్రాహ్మణుడు ప్రేమతో త్రిశిరసుని ఆలింగనంచేసుకొని తన మాయా రూపాన్ని త్యజించి, తన నిజరూపంతో ప్రత్యక్షమైనాడు.
ఆ దివ్యమంగళరూపం ఎలావున్నదంటే నాలుగు చేతులలో కమలము, పరశువు, పద్మమాల, దంతములను ధరించి కమలాల వంటి నేత్రాలతో అనేకమైన దివ్యాభరణాలను ధరించి దివ్యసుగంధలేపనాల పరిమళం గుబాళించగా ప్రత్యక్షమై అనుగ్రహమూర్తిగా యిలా అన్నాడు.
‘ఓ పుణ్యదంపతులారా! మీ నిరతిశయమైన భక్తికి నేను ముగ్ధుడినైనాను. మీ మనోభీష్టములన్నీ తప్పక నెరవేరుస్తాను. కోరుకోండి!’ అంటూ అభయమిస్తూ చిరుదరహాసచంద్రికలు వెదచల్లుతూ ప్రసన్నవదనంతో గజాననుడు అనుగ్రహపూర్వకంగా అన్నాడు.
‘ఓ ప్రభూ! మేమెక్కడ జన్మించినప్పటికీ నీ చరణకమలాల పైన యెడ బాటులేని భక్తిని ప్రసాదించు. లేదా ఈ ఘోర సంసారసాగరం నుండి మమ్ములను విముక్తుల్నిచేయి! ఇంతకంటే వేరేమీ కోరము!’ అన్న ఆ దంపతులతో ‘తధాభవతు’ (“అలాగే జరుగుగాక!” అంటూ ఆ త్రిశిరుని మరోసారి ప్రేమమీర ఆలింగనం చేసుకొని అంతర్ధానం చెందాడు.
ఓ ఆశ్రయా! అసంఖ్యాకములైన భక్ష్యభోజ్యాదులను ఎన్ని సమర్పించినా తృప్తిచెందని ఆ భగవంతుడైన గజాననుడు కేవలం ఒక్క దూర్వాంకురం వల్లనే అఖండతృప్తిని చెందాడు. కనుక ఓ ఆశ్రయా! దూర్వాంకుర మహిమను దాని సమర్పణ ఫలమును నీకు వర్ణించి చెప్పాను!
ఈ దూర్వామహిమను పఠించుటవలన, వినుటవలన సకల శుభాలూ ఒనగూరుతాయి! ఈ పవిత్రమైన మహిమను చదివినవారు ధనధాన్య పుత్రపౌత్రాది సంపదలను కలిగి ఇహలోకములో అనంత భోగాలను అనుభవించి గజాననునియందు భక్తికలిగి, కోరికలన్నీ నశించి ముక్తిపొందుతారు’ అంటూ తన ధర్మపత్నియైన ఆశ్రయకు కౌండిన్యుడు వివరించాడు.
ఇదంతా విన్న ఆశ్రయకు ఇంకా సందేహం తొలగనందున ఆమెను పిలిచి కౌండిన్యుడు ”ఓ ఆశ్రయా! నీ సందేహనివారణకై ఒక వ్యాక్యం చెబుతా విను! నీవు ఒక దూర్వాంకురము తీసుకుని ఇంద్రునివద్దకు వెళ్ళి మొదట ఆశీర్వదించి తరువాత ఈ దూర్వాంకురం ఎత్తు బంగారము యిమ్మని యాచించు! అది తీసుకుని శీఘ్రముగా రమ్ము! అంతకు ఎక్కువగాని, తక్కువగాని గ్రహించవలదు!” అన్నాడు.
ఈరకంగా భర్తృ ఆదేశాన్ని విన్న ఆశ్రయ అతనివద్దనుండి దూర్వాంకురమును గ్రహించి భర్త ఆజ్ఞానుసారము ఇంద్రునివద్దకు వెళ్ళింది.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”దూర్వామహాత్మ్యం”అనే 66-వ అధ్యాయం.సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹