ఉపాసనా ఖండము రెండవ భాగము
వ్రత నిరూపణం
ఆ తరువాత శూరసేన మహారాజు ఇంద్రుడిని తిరిగి యిలా ప్రశ్నించాడు. ”ఓ ఇంద్రా! గణనాధుని చరిత్ర ఎంతవిన్నా యింకా వినాలనిపిస్తూనే ఉంది. తనివితీరటంలేదు! దయ ఉంచి ఆ తరువాత కృతవీర్యుడి తండ్రి ఏంచేశాడో ఆ వివరం తెలుపు!”
శూరసేనుడి శ్రద్ధాభక్తులకు ఎంతో సంతోషించి ఇలా చెప్ప సాగాడు. “ఓరాజా! చతురాస్యునివద్ద నుండి కృతవీర్యుని తండ్రి సంకష్ట చతుర్థీ వ్రతవిధానాన్ని, దూర్వామహాత్మ్యాన్ని విని, నిదురించి ఉన్న తన కుమారునికి కలలో కనిపించాడు.
చింతా వ్యాకులములతో ఉన్న ఆ కృత వీర్యుడు అలా తలవని తలంపుగా తనతండ్రి స్వప్నములో కనపడగా అత్యంత ఆనందంతో మాటలుకూడా అందని ఉద్విగ్నతతో పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అప్పుడా కృతవీర్యుడు తన కుమారుని తన పర్యంకంమీద కూర్చోబెట్టుకొని ”నాయనా! సంతానం నిమిత్తం నీవుపడ్డ శ్రమంతా నాకుతెలుసు! అందుకని నీకొక ఉపాయము నేను బ్రహ్మవద్ద తెలుసుకున్న దానిని నీయందుగల అభిమానంచేత తెలియజేస్తాను!
నీ వ్యధయావత్తూ దాని నివారణకూడా మానవలోకంనుండి వచ్చిన నారదమహర్షి ద్వారా నాకు తెలిసింది.నీ అభిష్టసిద్ధికై చతురాననుడు నాకు దయతో చెప్పిన సంకష్ట చతుర్థీ వ్రతం నీకు తెల్పుతాను అంటూ ఆ వ్రతనియమాలు తాను వ్రాసుకున్న పుస్తకాన్ని చేతికిచ్చి“ఇందులో చెప్పినట్లుగా సంవత్సరకాలం ఈ చతుర్థీవ్రతాన్ని ఆచరించు.
అలా ఆచరిస్తే సర్వ సంకష్టహరుడైన గజాననుని అనుగ్రహ విశేషంచేత నీ సకలదోషాలూ నశించి నీకు పుత్రసంతతి ప్రసాదింపబడు తుంది!” అంటూ స్వప్నంలో తెలిపి కృతవీర్యుని తండ్రి అదృశ్యుడైనాడు.
అప్పుడు కృతవీర్యుడు నిద్రనుంచి వెంటనే మేల్కొని స్వప్నంలోని విషయమంతా స్మరించుకుంటూ సంతోషం, దుఃఖము పెనవేసుకొనగా కన్నులనుండి అశ్రుధారలు విడుస్తూ, తన చేతులలోని పుస్తకాన్ని హృదయానికి హత్తుకుని ఉండగా మంత్రులు అతడిని సమీపించి ఊరడిస్తూ ”ఓ రాజా! నీవీ దుఃఖాన్ని వీడి సావధానమనస్కుడవుకమ్ము!నీవెందులకు దుఃఖపడుతున్నావో ఆ కారణం మాకు చెప్పు. నీవిలా దుఃఖించటం చూస్తే మాకూ దుఃఖం కలుగుతోంది!” అనగానే కృతవీర్యుడు తన మంత్రులకిలా సమాధానం చెప్పాడు.
“మంత్రి పుంగవులారా! నాకీనాడు స్వప్నంలో స్వర్గస్తులైన నా పితృ దేవుల దర్శనమైంది. ఆయన సమస్త దుఃఖనివారకము, సత్సంతాన ప్రదాయకమూ ఐన సంకష్టచతుర్థీవ్రతాన్ని అనుష్టించమని నాకు ఉపదేశించి, ఆ వ్రతవిధానం వ్రాయబడ్డ ఈ పుస్తకాన్ని నాచేతులో ఉంచి అదృశ్యులైనారు.
ఆ భావోద్వేంగం చేత నేను చేష్టలుడిగి ఉద్విగ్నుడిని అయినాను!ఆయన వియోగదుఃఖాన్ని తట్టుకోలేక దుఃఖిస్తున్నాను. ఆ మాటలకు మంత్రులిలా అన్నారు.
“ప్రభూ! స్వప్నంలో మీకు మీపితృదేవుల రూపంలో దర్శనమిచ్చి చతుర్థీవ్రతాన్ని ఆచరించమని మీకు బాధా నివారణోపాయాన్ని తెలిపింది మరెవరోకాదు! సకలలోకాలకూ తండ్రియైన భక్తవత్సలుడు ఆ శ్రీగణేశుడే! ఆతడే మీ వంశవృద్ధికై తగిన ఉపాయాన్ని తెలిపాడు. అంతేకాదు! ఆ మహదనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ పుస్తకాన్ని నీకు అనుగ్ర హించాడు! అలాకానిదే ఇట్టి దివ్యస్వప్నం కలగటం అసాధ్యం! కనుక మీరు తక్షణ కర్తవ్యాన్ని ఆలోచించవలసింది.”
ఇంద్రుడిలా కొనసాగించాడు
‘ఓ శూరసేన మహారాజా! ఈ విధంగా మంత్రుల సలహాను అనుసరించి వేదవేత్తలైన పండితులను తన సభాస్థలికి పిలిపించి తనకు లభించిన పుస్తకములోని విశేషాన్ని వివరించి చెప్పమని అర్ధించాడు.
అప్పుడు ఆ వేదవిదులైన విప్రులు ఆ గ్రంధాన్ని పరిశీలించి ”ఓ కృతవీర్యమహారాజా! ఇందులో మీ తండ్రిగారికీ చతుర్ముఖునికి జరిగిన సంవాదము, బ్రహ్మ ఆతడికి ఉపదేశించిన ”సంకష్ట చతుర్థీవ్రత విధానము”, చంద్రోదయ సమయంలో చేయవలసిన గణేశపూజ, అంగా రక చతుర్థీమహిమ వర్ణించబడి ఉన్నది!
అంతేకాదు మహారాజా! ఇంకా చతుర్థీ తిథికి, దేవతకు, చంద్రునికి అర్ఘ్యప్రధానంచేసే విధానంకూడా వివరించబడివున్నది. దానితో పాటూ ఇరవైఒక్కమంది సద్విప్రులకు చేయవలసిన అన్నసంతర్పణ, పూజ, వాళ్ళ కీయవలసిన వివిధములైన దానముల గురించి తెలుపబడింది.
విఘ్నేశ్వరునికి దూర్వాసమర్పణవల్ల కలిగే అనంతఫలమూ, అందునా శ్వేతదూర్వముయొక్క సమర్పణఫలం గురించి విడిగా తెలపటం జరిగింది. ఓ మహారాజా! ఈ వ్రతవిధానం నీకు సంప్రాప్తమవటం నీ అనంత పుణ్యఫలంగానే కాని వేరుకాదు! ఇలా సర్వులకూ బహుళార్ధప్రదమైన వ్రతం ఇదివరకు ఎవ్వరూ కనీవినీ ఉండలేదు! దీన్ని వినటంవలన, స్మరించుటవలనా కూడా సకల సంకటనాశనం జరుగగలదు!”
అన్న విజ్ఞులు శుభవచనాలను విన్న కృతవీర్యుడు అమిత సంతోషాన్ని పొందినవాడై వారిని ఉచితరీతిని సత్కరించి సంతుష్టులను కావించాడు. ఆ తరువాత తమ కులపురోహితుడైన అత్రిమహర్షిని పిలిపించి ఆతడిని యధావిధిగా పూజించి వారివద్దనుండి ఏకాక్షరీగణపతి మహా మంత్రాన్ని ఒక శుభముహూర్తంలో స్వీకరించి, ఆమంత్రానుష్టానాన్ని అనన్యభక్తితో చేస్తూ, ఇంద్రియములను జయించినవాడై తన సంకట నాశనంకొరకూ, ఆ సంకష్టహర చతుర్థీవ్రతాన్ని సంతానార్ధియై అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”వ్రతనిరూపణం” అనే అరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹