Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – అరవై తొమ్మిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

రెండవ భాగము సంకష్ట చతుర్థీవ్రతము

పిండివంటలు, కుడుములు, లడ్లు, అప్పములు, పాయసము, చక్కెర, చక్కగా వండిన సిద్ధాన్నం నేతితో అభికారం చేసి నైవేద్యం సమర్పిస్తున్నాను దేవా! దయతో స్వీకరించు! అని దయతో స్వీకరించు! అని ప్రార్ధిస్తూ

“చంద్రమా మనసోజాతః” అన్న మంత్రంతో నైవేద్యం సమర్పించాలి!

టెంకాయఫలము, ద్రాక్షలు, దానిమ్మ, మామిడి వంటి రుచి కరములైన శుభఫలములను సమర్పిస్తున్నాను. ఓ దేవదేవా! నా సంకటములను నివారించుము! అని “నాభ్యా ఆసీదంతరిక్షం” అన్న మంత్రంతో సమర్పణ ”ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము, జాపత్రి, జాజి కాయ వంటి సుగంధద్రవ్యములతో చేరిన తాంబూలమును స్వీకరించి నా సంకటములను నివారించుమోదేవా!” అని తాంబూలము సమర్పణ చేయాలి!

ఈ విధంగా షోడశోపచారములు సమర్పించి దక్షిణ రూపము లో ”హిరణ్యము” అనగా రూపాయి నాణెము లేక సువర్ణమును యధాశక్తిగా సమర్పించి “సప్తాశ్వాసన్” మంత్రంతో దక్షిణను విఘ్నేశ్వరునికి నివేదించాలి!

ఈ విధంగా షోడశోపచారముల పూజను పూర్తిచేసి, గరిక చిగుళ్ళతో కలిసిన ఏకవింశతి పత్రములను గణపతియొక్క ఇరవైఒక్క నామములతో పూజిస్తూ సమర్పించాలి! ఏకాగ్రమనస్సు కలిగి గణేశుని ఈక్రింద చూపబడిన నామములతో జపిస్తూ పత్రములను సమర్పించాలి!

1. ఓం సుముఖాయ నమః

మాలతీపత్రం పూజయామి

2. ఓం గణాధిపాయ నమః

బృహతీపత్రం పూజయామి

3. ఓం ఉమాపుత్రాయ నమః

బిల్వపత్రం పూజయామి

4. ఓం గజాననాయ నమః

దూర్వాయుగ్మం పూజయామి

5. ఓం హరసూనవే నమః

దత్తూరపత్రం పూజయామి

6. ఓం లంబోదరాయ నమః

బదరీపత్రం పూజయామి

7. ఓం గుహాగ్రజాయ నమః

అపామార్గపత్రం పూజయామి

8. ఓం గజకర్ణాయ నమః

జంబూపత్రం పూజయామి

9. ఓం ఏకదంతాయ నమః

చూతపత్రం పూజయామి

10. ఓం వికటాయ నమః

కరవీరపత్రం పూజయామి

11. ఓం భిన్నదంతాయ నమః

విష్ణుక్రాంతపత్రం పూజయామి

12. ఓం వటవేనమః

దాడిమీపత్రం పూజయామి

13. ఓం సర్వేశ్వరాయ నమః

దేవదారుపత్రం పూజయామి

14. ఓం ఫాలచంద్రాయ నమః

మరువకపత్రం పూజయామి

15. ఓం హేరంబాయ నమః

సింధువారపత్రం పూజయామి

16. ఓం శూర్పకర్ణాయ నమః

జాజీపత్రం పూజయామి

17. ఓం సురాగ్రజాయ నమః

గణకీపత్రం పూజయామి

18. ఓం ఇభవక్రాయ నమః

శమీపత్రం పూజయామి

19. ఓం వినాయకాయ నమః

అశ్వద్ధపత్రం పూజయామి

20. ఓం సురసేవితాయ నమః

అర్జునపత్రం పూజయామి

21. ఓం కపిలాయనమః

అర్కపత్రం పూజయామి

శ్రీ గణాధిపతయేనమః

ఏకవింశతిపత్రాణి పూజయామి

అంటూ ఈ విధంగా ఇరవైఒక్క నామాలతోనూ “ఏకవింశతి పత్రి పూజ”ను చేసి కర్పూర నీరాజనమును గణేశ భగవానునకు సమర్పించాలి! “దేవా నా సంకటములను నివారించుము” అన్న ప్రార్ధనతో!

సుగంధముగల్గిన పారిజాత, మందార, తామరపుష్పాలతో “పుష్పాంజలి”ని భక్తితో సమర్పించాలి!

“యజ్ఞేన…” అన్న మంత్రంతో పుష్పాంజలినిచ్చి “ఓ గణేశదేవా! ఈ పుష్పాంజలి స్వీకరించి,ఈ సంకటముల నుండి నన్ను విముక్తునిచేయి!” అంటూ పుష్పాంజలిని సమర్పించాలి!

ఆ తరువాత గణేశుని ఈవిధంగా ప్రార్ధించాలి.

“దేవా! నీవే ఈ విశ్వాన్ని సృష్టించేవాడివి! పరిరక్షించేవాడివి! గజాననా! నీవీ విశ్వసృష్టికి స్థితిసంహారకుడవు! ఈ విశ్వవిశ్వాత్మకుడవు నీవే! అట్టి నీకు, దేవదేవుడైన గజాననునకు, గణనాధునకు, విఘ్నాలను హరించే విశ్వరక్షకునకు, నాకు ఏకైక దిక్కైన భక్తుల బాధలు నివారించే వేదవేద్యా! నమస్కారం! ప్రణవస్వరూపా! నమోవాకములు! భక్తార్తిహరుడా శరణు శరణు! వేదపురుషుడా నమస్కారం నమోనమః!”

అంటూ విధివత్తుగా గణేశుని ప్రార్ధించి పునఃపునః మళ్ళీ మళ్ళీ నమస్కరించి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారములు 21 సార్లు సమర్పించాలి! ఈ విధంగా విశ్వవంద్యుడైన గజాననునికి నమస్కరించి, నాగయజ్ఞోపవీతిధారి, ఫాలచంద్రునితో పరశువును ధరించిన సర్వ విద్యాప్రదాయకుడైన విఘ్నపతిని పూజించి గరికచిగుళ్ళతో సంకటములు పోవలెనని సంకల్పించి అర్చన చేయాలి!

ఈ విధంగా పూజిస్తే తక్షణమే గణపతి అనుగ్రహించి దుష్కరములైన కోరికలను కూడా సిద్ధింపచేసి, విఘ్నములను నశింపచేసి దుష్ట పీడను నివారించగలడు. గణపతి అనుగ్రహంచేత సర్వకార్యసిద్ధి కలుగ వలెనని, శత్రువులకు శత్రుబుద్ధి నశించాలని, మిత్రభావం కలగాలని సాష్టాంగ నమస్కారం చేస్తూ పునఃపునః స్తుతించాలి.

ఆ తరువాత హోమముచేసి అష్టోత్తర శతనామార్చనకాగానే పిండి వంటలు, లడ్లు, కుడుములు, పాయసము, ఇరవైఒక్క రకముల ఫలములు గణపతిస్వామికి నైవేద్యమివ్వాలి! ఆ తరువాత విధివత్తుగా వాయనమును ఎఱ్ఱని రక్తవస్త్రముతో (ఎఱ్ఱని పట్టువస్త్రముతో) తన గురుదేవునకు గణపతి స్వరూపునిగా నిమంత్రణచేసి సర్వసంకల్పసిద్ధికై వాయనమివ్వాలి!

“సంకటాం మాం నివారయ” (సంకటముల నుండి నన్ను విముక్తుని చేయుము) అన్న వాయనమునిచ్చి గణేశునికధను, పుణ్యప్రదమైన పురాణశ్రవణమును శ్రద్ధగా విని స్వామికి పునః అర్ఘ్యపాద్యములు సమర్పించాలి!

ఓరాజా! ఈ విధంగా చతుర్థీ మంగళవారంనాడు బహుళ పక్షంలో వచ్చే ”సంకష్టహర చతుర్థి” పర్వదినంనాడు “ఓ గణేశప్రియవల్లభా! నాచే సమర్పించబడు అర్ఘ్యములను స్వీకరించి నా సంకటములను నివారణచేయి!” అని నివేదించాలి!సంకటహరగణపతిని నిమంత్రించి మోదకప్రియుడైన సంకటహర గణపతికి అర్ఘ్యమివ్వాలి! ఈ క్రిందివిధంగా చంద్రునకు ఏడుసార్లు అర్ఘ్యమివ్వాలి!

రోహిణీనక్షత్రం కలిసిన శుభదినంనాడు “క్షీరోదార్ణవ సంభూత! అత్రి గోత్ర సముద్భవ! గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణ్యా సహితశ్శశి”అన్న చంద్రార్ఘ్య సమర్పణ మంత్రంతో అర్ఘ్యమివ్వాలి!

ఆ తరువాత అపరాధ క్షమాపణ మంత్రంచెప్పి వేదపండితులైన బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి! వారి భుక్తశేషాన్ని ప్రసాదంగా తాను భుజించి మౌనంగా నియమవంతుడై విశ్రమించాలి! బంధుజనులతో ప్రసాదమును భుజించి యిట్లుచేసిన వ్రతము శీఘ్రంగానే ఫలసిద్ధిని కలిగించి సమస్త కోరికలను సిద్ధింపచేయును. వేయేల? ఇంతకన్నా సంకటముల నివారణకు, సంకల్పసిద్ధికీ వేరుమంత్రం లేనేలేదు!”

అని ఈ విధంగా బ్రహ్మదేవుడు రాజునకు ఉపదేశించగా, ఆ రాజు శ్రద్ధగా సంకష్ట గణపతీవ్రత మహిమను విని తరువాతి అధ్యాయంలో చెప్పిన విధానంలో ఆచరించి సర్వసుఖాలను పొందాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ‘సంకష్ట చతుర్థీ వ్రతం” అనే అరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment