ఉపాసనా ఖండము రెండవ భాగము
చతుర్థీవ్రత మహాత్మ్యం రెండవ భాగము
ఆ విధంగా ఇంద్రుడు శూరసేన మహారాజుకు చతుర్థీవ్రత కధనాన్ని ఇతిహాసంతోపాటు వివరించాక ఎంతో శ్రద్ధతో ఆలకించిన ఆ శూర సేనుడు తన దూతలను పిలిచి యిలా ఆజ్ఞాపించాడు.
“ఓ దూతలారా! మీరు వెంటనే నగరంలోకి వెళ్ళి సంకష్ట చతుర్థీ వ్రతాన్ని ఎవరైనా పుణ్యపురుషుడు ఆచరించివున్నట్లైతే అతడిని ఉన్న ఫళంగా మీవెంట తీసుకొనిరండి!”
ఈ మాటలు విన్న రాజదూతలు వెంటనే నగరిలోకి వెళ్ళి ప్రతి యింటికీ వెళ్ళి ”ఆ ఇంట్లోచతుర్థీవ్రతాన్ని ఆచరించినవారెవరైనా ఉన్నారా?” అంటూ ప్రశ్నించసాగారు. ఇలా తిరుగుతూన్న వారు ఒకచోట ఆగివున్న ఒక దివ్యవిమానాన్ని చూశారు.
ఆయింట్లో ఒక దుష్టఛండాల స్త్రీ కుష్టువ్యాధితో బాధపడుతూ, శరీరపు గాయాలనుండి రసి స్రవిస్తూండగా ఈగలు దోమలు ముసురుతూన్న కృశించిన దేహంతో ఉన్నది. ఆమెను తీసుకువెళ్ళడానికై ఒక దివ్యవిమానం వచ్చి ఆగింది. అందులోంచి గణేశదూతలు దిగుతూండగా,ఆ రాజభటులు వారినిలా ప్రశ్నించారు.
“ఓ దూతలారా! ఈమెను చూడటానికే ఏవగింపు కలిగేంత జుగుప్సాకరంగా ఉన్నది. పైగా ఛండాల కులములో పుట్టినట్టిది కూడాను! ఇంతటి పాపి స్వర్గములోకి ఎలావెళ్ళగలదు? ఈమె ఇంతకు పూర్వ మెవరు? ఈ దుస్ధితి ఈమెకెందువల్ల కల్గింది? ఈమె స్వర్గవాసానికి వెళ్ళడానికి ఏపుణ్యం కారణమైనది? ఈ వృత్తాంతాన్ని మాకు వివరించండి!” అంటూ ప్రశ్నించిన వారితో గణేశభటులు యిలా బదులిచ్చారు.
“ఓ రాజభటులారా! బంగాళాదేశంలో సారంగధరుడనే పేరుగల క్షత్రియ ప్రముఖుడుండేవాడు! ఈమె అతని కుమార్తె సుందరి అన్న నామధేయముగలది! మహాసౌందర్యంతో మహాతపస్వుల చిత్రాలను సైతం మోహింపచేయగల సామర్ధ్యం గలది. జాణతనంలో దిట్ట! జారత్వంతో అందరినీ వివశులను చేస్తూ, యువకులను బ్రహ్మచర్యంనుంచి పతితు లను చేస్తూ సంచరిస్తూండేది! విలువైన దుస్తులను ధరించి, సకలాలంకరణములను ధరించి విషయ భోగములననుభవిస్తూ, సిగ్గూ లజ్జలను విడిచి వేశ్యవలె బంగాళానగరంలో సంచరించేది ”చిత్రుడు” అన్న యువ కుడిని వివాహమాడినా విశృంఖలత్వంతో అతడిని కూడా మోసగిస్తూ, ఆతడి ద్రవ్యాన్ని అంతటినీ కర్పూరంలా హారతిగా వెలిగించింది.
ఇలా ఉండగా ఒకనాడు తనయింట భర్త శయనించి ఉండగా, మంచంనుండి దిగి సకల అలంకారములు చేసుకొని తన విటునివద్దకు పోతూండగా భర్తకు మెలకువవచ్చి ఆమె చేయిపట్టి, కొట్టితిడుతూ “ఓసి దౌర్భాగ్యురాలా! ఉచ్ఛనీచాలను వీడి కట్టుకున్నవాణ్ణి ఏమార్చి విటుడికై అంగలారుస్తున్నావే? నీపాపం పండకపోతుందా?” అంటూ మందలించాడు.
ఇలా అన్న భర్త వాక్యాలకు ఆమె పుండుపై కారం చల్లినట్లైంది. తాత్కాలికంలో కోపాన్ని దిగమ్రింగుకుని ఒక అర్థరాత్రి సమయంలో పదునైన ఖడ్గం చేతబూని తన భర్తను దారుణంగా పొడిచివైచింది. ఆ తరువాత తన జారునితో రమింపటానికి పారిపోయింది. ఆమె అలా రమిస్తూండగా ఇరుగు పొరుగులవారి వృత్తాంతాన్నంతటినీ తెలుసుకొని ఆ దేశపు రాజువద్ద ఫిర్యాదుచేశారు! అప్పుడు ఆ రాజాజ్ఞ మేరకు రాజదూతలు పొంచి వుండి ఆమెను ఇంటికివెళ్ళే మార్గంలో పట్టుకొని బంధించి ఆమెను రాజసన్నిధికి ఈడ్చుకొనిపోయారు!
అప్పుడు రాజు ఆమెకు మరణశిక్ష విధించగా ఆ భటులామెను ఊరివెలుపలికి తీసుకువెళ్ళి మరణదండనను అమలుజరిపారు. శరీరం విడిచీ విడవగానే యమదూతలు ఆమెను ఈడ్చుకొని వెళ్ళి ఘోరనరక ములను పొందింపచేశారు.
ఆ నరకాలలో క్రిములచేత పీకబడుతూ తన దుష్కృత్యాలను గుర్తుచేసుకొని అధోముఖియై ఎంతగానో లజ్జ నొందుతూ మహావేదనల ననుభవించి, ఈ రకంగా కల్పాంతంవరకూ గడిపి చండాల స్త్రీయై దుష్టమైన వ్యాధితో జన్మించింది.
ఒకనాడామె మద్యం పూర్తిగా సేవించి మతిభ్రమించగా రాత్రి ప్రధమయామంలో లేచి ఆకలి తీర్చుకోడానికై భిక్షాటన నిమిత్తం దైవవశాన ఒకానొక సంకష్ట చతుర్థీ వ్రతకారకుని ఇల్లు చేరుకున్నది! వారు పెట్టిన అన్నాన్ని చంద్రోదయ సమయంలో భుజించింది! గజాననుని నామాన్నికూడా మనసారా స్మరించింది. ఆ పుణ్యవిశేషంచేత తక్షణమే గజాననుని దూతలు విమానం కొనివచ్చారు. సంకష్టచతుర్థీవ్రత దివసాన్న చంద్రోదయ కాలంలో గజాననుని స్మరిస్తూ ప్రసాదాన్ని భుజించిన కారణంగా ఈమెకు ఇంతటి భాగ్యమబ్బింది!”
ఈ మాటలను వింటూన్న రాజభటులిలా అన్నారు ”ఓ గణేశ దూతలారా! కార్యార్థులమై వెళ్తున్న మాకు యిది ఒక మహాద్భుతంగా తటస్థమైనది! మా రాజు చెప్పిన వాక్యాన్ని మీకు తెలియజేస్తాము ఆలకించండి.
‘దేవతల రాజైన ఇంద్రుడు గృతృమదుని దర్శించుకోగోరి, ఆ మార్గ మధ్యంలో భ్రుశుండిమహర్షి ఆశ్రమంలో అతడినికూడా దర్శించి ఆయన పూజ గ్రహించి అనుజ్ఞను బడసి, తిరుగుప్రయాణంలో అమరావతికి వెళుతూండగా ఈ శూరసేనపురంలోని ఒక వైశ్యుని దృష్టి సోకడంచేత ఆతడి విమానం నేలబడింది! ఆ విషయం విన్న శూరసేనుడు అక్కడికి వెళ్ళి ఇంద్రుని పూజించి, అతడి విమానం పతనమవడానికిగల కారణ మడిగాడు.
అప్పుడు ఇంద్రుడా కారణాన్ని సంగ్రహంగా అతడికి వివరించి, తిరిగి తన విమానం యధాప్రకారం నింగికెగరాలంటే అది కేవలం సంకష్ట చతుర్థీవ్రత సంభవమైన పుణ్యప్రభావం వల్లనే జరుగుతుందనీ, అటువంటి వారిని అన్వేషించమనీ పురికొల్పగా, మా రాజాజ్ఞను అనుసరించి అటువంటి వ్రతానుష్టానం చేసిన వ్యక్తికై వెదుకుతూ యిలా వచ్చాము.
గనుక ఓ గణేశ దూతలారా! ఈమె గనుక ఆ సంకష్టచతుర్థీ వ్రతాన్ని అనుష్టించినట్లైతే ఈమెను మాతో మాప్రభువు శూరసేనులవారి సన్నిధికి తీసుకొనిరండి! ఈమె తన పుణ్యం ధారపోసి ఇంద్రుని విమానాన్ని తిరిగి మింటినంటేలా చేయగలదు! దేవతాధిపతియైన ఇంద్రుడు సకల వందనీయుడవటంచేత ఇంద్రుని కార్యము నెరవేర టానికై మనముభయులమూ రాజాజ్ఞ పాటించవలసిందే! మీకు ఈమాట నచ్చితే ఆ ప్రకారం చేయండి!”
ఈ మాటలకు గణేశదూతలు యిలా బదులిచ్చారు. ”ఓ రాజ భటులారా! మాకు ఈమెనివ్వటానికి గణేశుని ఆజ్ఞ ఎంతమాత్రమూలేదు! అంటూ ఆ చండాల స్త్రీని విమానంపైకి ఎక్కించారు. అలా ఆదివ్య విమానాన్ని అధిరోహించటంతోనే ఆమెకు దివ్యదేహం సంప్రాప్తమైనది. దివ్యమైన శరీరపు కాంతితో శుభంగా దివ్యాలంకారాలను మేన ధరించి సుందర వస్త్రాలతో అలంకరించుకుని సమస్త వాద్యఘోషలతో దేవ దూతలు వెంటరాగా, గజాననుని సముఖానికి తీసుకుపోబడింది.
ఈ విషయాన్నంతటినీ రాజుకు భటులు విన్నవించగా, అతడు నాల్గుదిక్కులా కాంతిని ప్రసరింపచేస్తూన్న ఆ దివ్యవిమానాన్ని పరివార సమేతంగా దర్శించాడు. అలా దివ్యవిమానంలో వెడుతూన్న ఆ చాండాలి దృష్టి సోకడంచేత ఇంద్రుని విమానంకూడా నింగికెగసింది. ఈ దృశ్యాన్ని చూస్తూన్న సర్వులూ ఆశ్చర్యచకితులైయారు.
ఇంద్రుడు తన నిజలోకానికి వెళ్ళిపోగానే అందరూ తమతమ నెలవులకు మరలివెళ్ళారు. ఆ చాండాలి కూడా దివ్యదేహాన్ని ధరించినదై వైనాయక ధామాన్ని చేరుకున్నది. సంకష్ట చతుర్థీవ్రత పుణ్యవిశేషంచేత ఆమెయొక్క సకల పాపాలూ పరిహరింప బడి గణేశ సామీప్యాన్ని పొందింది. ఈ ఉపాఖ్యానాన్ని ఎవరైతే భక్తిశ్రద్ధ లతో పఠిస్తారో, వింటారో వారు సకల కష్టములనుండీ విడివడి తమ సకలాభీష్టములను పొందగలరు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ‘చతుర్థీవ్రతమహాత్మ్యం’ అనే డెబ్భై నాల్గవ వ అధ్యాయం సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹