Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – డెబ్భై ఐదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

చతుర్థీవ్రత మహాత్మ్యం మూడవ భాగము

“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా సంకష్టచతుర్థీ వ్రతమహాత్మ్యాన్ని కన్నులారా గాంచిన శూరసేనమహారాజు ఆ తరువాత ఏంచేశాడో ఆ వృత్తాంతాన్ని యావత్తూ తెలియజేస్తాను విను!” అంటూ చెప్పసాగాడు చతుర్ముఖుడు.

కన్నులరమోడ్పులవగా భక్తివినమ్రభావాలు మదిని ముప్పిరిగొనగా శ్రద్ధగా ఆలకిస్తున్న కృష్ణద్వైపాయనుడితో చతుర్ముఖుడిలా కధనాన్ని కొనసాగించాడు. “ఈ వ్రతవైభవాన్నీ, మహిమనూ కళ్ళారా చూసిన ఆ శూరసేన మహారాజు వశిష్టమహామునిని ఇలా ప్రార్ధించాడు.

“ఓ మహానుభావా! ఈ మంగళప్రదమైన సకలాభీష్టప్రదము, సకలారిష్ట నివారకమూయైన సంకష్టచతుర్థీవ్రతాన్ని అనుష్టించడానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించండి! సద్యః ఫలితాన్నివ్వగల ఈ మహోత్కృష్ట వ్రతాన్ని ఆచరించాలని నిశ్చయించుకున్నాను! తమ అనుజ్ఞను ఆశీస్సు లనూ అర్థిస్తున్నాను!

అంటూ చేతులుమోడ్చి ప్రార్ధించిన శూరసేనుడితో చిరుదరహాసం మోమున విరియగా వశిష్టమహర్షి తన ప్రశాంత గంభీర స్వరంతో “ఓ శూరసేనా మాఘమాసం లోని బహుళపక్షంలో మంగళవారం నాడువచ్చే చతుర్థీ తిథి ఈ వ్రతానుష్ఠానానికి అత్యంత అనువైన సమయం! ఆ రోజున ఆచరించిన వ్రతం సర్వసిద్ధికరమూ సర్వకామ ప్రదమూను! అందుచేత ఆనాడు నీవీ వ్రతాన్ని అనుష్ఠించు!” అంటూ శుభముహూర్తం నిర్ణయించగా ఆ శూరసేనుడు వ్రతాన్ని ఆచరించటానికి సంబారాలన్నీ సమకూర్చుకుని భార్యసమేతుడై, అత్యంత భక్తిశ్రద్ధలతో వశిష్టుని అనుజ్ఞను గైకొని సంకష్టచతుర్థీవ్రతాన్ని ఆచరించాడు.

ఆ తరువాత భక్తాభీష్టప్రదుడైన గణేశునియందు తన మనస్సును లగ్నంచేసి, తన ఎడమకాలి బొటనవ్రేలుపైన నిలచి గణేశుని దివ్య మంత్రాన్ని సూర్యాస్తమయము అయ్యేంతవరకూ జపించాడు. ఆ సాయంత్రం తిరిగి స్నానసంధ్యానుష్టానములను నిర్వర్తించుకొని, పురోహితులు కూడిరాగా వ్రతాన్ని చేయనారంభించాడు.

ఒక దివ్యమైన మంటపాన్ని అరటిస్థంభాలతో అలంకరింపచేసి ” శుభ్రమైన వస్త్రాలంకారములతోనూ ఛత్రచామరాలతోనూ పుష్పమాలలతోనూ దీపమాలలతోనూ దానిని అలంకరింపచేసి, మణికాంతులతో విలసిల్లుతూన్న ఆ మంటపంలో సర్వకలశద్వయాన్ని ఉంచి, వాటిపై సర్వావయవ సంపూర్ణమైన బంగారు గణేశ ప్రతిమను ఉంచి,ఆ ప్రతిమను కూడా అలంకరించి బ్రాహ్మణుల స్వస్తివచనాలతోనూ, గాయకుల గాత్రంతోనూ మారుమ్రోగుతూండగా మంగళతూర్యారవములు మ్రోగుతూండగా, భోగంవారు నృత్యంచేస్తూండగా, వైదిక పౌరాణిక మంత్రాలతో ఆ మూర్తిని చక్కగా పూజించినాడు.

షోడశోపచారములు సమర్పించి, పంచామృతములనూ, గణేశునికి అత్యంత ప్రీతిపాత్రములైన మోదకములు (ఉండ్రాళ్ళు), అప్పాలు, లడ్లు, శర్కరతో కూడిన పాయసము, అనేకరకాల పచ్చళ్ళనూ నైవేద్యంగా ఆ దేవదేవునికి సమర్పించి, ఆచమనానికి చల్లటి పరిమళ భరిత పానీయాలను, గజాననుని సంతుష్టికై ఫలతాంబూలాలను సమర్పించాడు.

ఆ తరువాత సువర్ణ మంత్రపుష్పాన్నీ, దూర్వాంకురములను సమర్పించి, నీరాజనమిచ్చి, తిధికి, గజాననునికీ, చంద్రునికీ అర్ఘ్యప్రదానం చేశాడు.

బ్రాహ్మణభోజనాదికములు ముగిశాక వారిని శాస్త్రోక్తరీతిన సత్కరించి, అప్పుడు తానుకూడా భుజించాడు. బ్రాహ్మణులకు పదివేల గోవులను దానమిచ్చి వస్త్రాలంకరణాదులతో తృప్తిపరచాడు. ఆ రాత్రి శేషకాలమంతా – నృత్యగీత వాద్యాదికములతో జాగరణసలిపాడు. ప్రాతఃకాలాన్నే స్నానసంధ్యాదుల అనంతరం గణేశుని మరలా పూజించి, ఆ మూర్తిని పరికరములన్నిటితో సహా వశిష్ఠమునికి వాయనముగా సమర్పించాడు.

అప్పుడు గజాననుడు సంతుష్టుడై తక్షణమే అతడికై దివ్య విమానాన్ని పంపించాడు. ఆ విమానాన్ని అధిరోహించిన శూరసేనుడు వినాయకునితో సారూప్యాన్ని పొంది ప్రజలందరూ ఆనందంతో వీక్షి స్తూండగా తన పుణ్యప్రభావంచేత గణేశధామాన్ని చేరుకున్నాడు.

అక్కడికి చేరుకున్న శూరసేనుడితో ఆ గణేశదూతలిలా అన్నారు. ఓ రాజా! నీ భక్తిశ్రద్ధలకు సంతుష్టుడైన వినాయకుడు నిన్ను చూడగోరి వెంట తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు.” ఈ మాటలకు రాజు విచలితుడై ఆనందబాష్పములు కన్నులువెంటరాగా గద్గద స్వరముతో యిలా అన్నాడు.

“ఓ దూతలారా! నిర్గుణ పరబ్రహ్మయూ,అవ్యక్తరూపుడుఅపరిచ్ఛి న్నుడు నిత్యుడు అవాజ్మాసన గోచరుండును ఐన ఆపరమాత్మునికి నా దర్శనంవల్ల కలిగే ప్రయోజనమేమిటి? వేదాలు సహితం ఎవరిని వర్ణించలేక మౌనం వహించాయో, సకల దేవతాగణములచే ఆరాధ్యుడైన ఆ దేవదేవుడైన ఆ గజాననునిచేత అనుగ్రహపూర్వకంగా నేను స్మరించ బడినట్లయితే నా జన్మ ధన్యమైనది!” అంటూ పరవశించిపోయాడు.

“ఓ రాజా! భక్తియొక్క ప్రభావమెంతైనదీ, ఆ భక్తులయొక్క మహిమలనూ వర్ణించడం మాతరంకాదు! ఆ భక్తియొక్క విశిష్టతవల్లనే నిర్గుణ నిరాకారుడైన పరమాత్మ సగుణత్వమును పొందాడు. అదంతా భక్తుల మహిమయే!” అన్న గణేశదూతలతో శూరసేనుడిలా అన్నాడు.

“ఓ దూతలారా! ఆ గజాననుడూ, మీరు ఉభయులూ సంతుష్టులైతే నాకో కోరికయున్నది. దాన్ని నెరవేర్చగోర్తాను. నా కన్నబిడ్డల పై కన్నా ప్రజలయందు నాకెంతో వాత్సల్యం! నేను లేకుండా నా ప్రజలు కనీసం భోజనంకూడా చేయరు! ప్రేమతో నేను హాలహలం భుజించమన్నా నామాట జవదాటక యిట్టే స్వీకరిస్తారు. అటువంటివారిని విడిచి నేను ఒక్కడినే స్వార్ధపూరితుడినై ఆనందాన్నెలా పొందగలను?”

“ఓ శూరసేన మహారాజా! సరే, అయితే నీ అభీష్టప్రకారమే నీ వాంఛా పరిపూర్తిచేస్తాము! లేకపోతే మా ప్రభువు మాపై ఆగ్రహించ గలడు!” అంటూ “ఓ వ్యాసమునీంద్రా! ఆ గణేశదూతలు రాజుయొక్క అభీష్టం మేరకు ప్రజలందరినీకూడా విమానంపైకి ఎక్కించారు!

ఆ దివ్యవిమానం అధిరోహించగానే దాని దివ్య ప్రభావంచేత ప్రజలందరూ దివ్యమైన వస్త్రాలనూ, అలంకారాలనూ పొందారు! ‘ఆహా! ఏమి మన భాగ్యం! ఇంతటి దివ్యానుగ్రహాన్ని పొందటానికి మనమేమి పుణ్యం చేసుకున్నామో! కాదుకాదు! ఇదంతా మన రాజుయొక్క పుణ్య విశేషమే! సాధువుల సాంగత్యం అతిదురాత్ములనైనా పునీతులను చేసినట్లు, పరశువేదిసోకిన ఇనుముకూడా బంగారంగా మారినట్లు, ఆతని రాజ్యంలో ఉన్న కారణంచేత, ఆ మహనీయుడి పుణ్యవిశేషంచేత మన అదృష్టం పండింది!’

ఇలా అనుకుంటూ ఉండగా గణేశదూతలచేత ఆ విమానం పైకెగిర్చేందుకై ప్రయత్నించారు. విమానం మాత్రం ఏమాత్రం భూమిపైనుంచి ఒక్క అంగుళం ఎత్తుకుకూడా లేవలేదు! అప్పుడు ఆ విమానం ఎక్కికూర్చున్న ప్రజలు అందుకు కారణమేమిటా? అని అన్వేషించగా అందులో ఒక కుష్టురోగి కనిపించాడు. ఆ ప్రజలు ఆ కుష్టురోగిని విమానంలోనుండి దింపివేయమనీ అలా చేస్తే నిరాటంకంగా ఆ దివ్యవిమానం పైకెగరగలదనీ రాజును అభ్యర్ధించారు. దూతలు కూడా అలాగే అతడిని దింపివేయబోగా రాజు వారితో యిలా అన్నాడు

ఈ దీనుణ్ణి వదిలి మీతో స్వర్గలోకానికి రావడం నాకెంత మాత్రమూ అంగీకారయోగ్యం కాదు! అందుకని నన్ను వదిలి మిగతా ప్రజలందరినీ మీతో కొనిపొండి! అలా వీలుపడదంటే ఈ కుష్టురోగి యొక్క పూర్వజన్మ కర్మవృత్తాంతాన్ని నాకు తెలిపి, అట్టి దుష్కర్మకు నివారణోపాయాన్నికూడా చెప్పండి!”

అప్పుడా గణేశదూతలు ఇలా బదులు చెప్పారు. ”ఓ శూరసేన మహారాజా! నీవువిచారించకు! నీకు ఈ కుష్టురోగియొక్క పూర్వజన్మ కృతకర్మనూ ఆ పాపపరిహారానికి సరైన ఉపాయాన్నీ చెబుతాము!”

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”చతుర్థీవ్రతమహాత్మ్యం” అనే డెబ్భై ఐదవ అధ్యాయం.సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment