ఉపాసనా ఖండము రెండవ భాగము
వ్యాధిగస్త వైశ్య పూర్వజన్మ వృత్తాంతం
ఓ రాజా! పూర్వజన్మలో ఈ వైశ్యుడు గౌడదేశములోని గౌడనగర నివాసియైన ఒక సద్రాహ్మణుడి యింట జన్మించాడు. ఈతడి తల్లిపేరు శాకిని. ఈతడికి యుక్తవయస్సు రాగానే సావిత్రి అనే సర్వాంగ సుందరురాలైన కన్యనిచ్చి వివాహం కావించారు. ఒక్కగానొక్క పుత్రుడవటంచేత మిక్కిలి గారాబంతో పెంచి ఎంతో అపురూపంగా చూచుకునేవారు. క్షణ కాలమైనా ఈతడి వియోగం ఆ తలిదండ్రులకు అత్యంత దుస్సహంగా ఉండేది.
అమిత గారాబం ఫలితంగా పెడత్రోవపట్టిన బుద్ధితో యౌవనవతి యైన భార్యను ఇంట విడిచి, జారత్వము, చోరత్వములను అలవర్చుకున్నాడు. దుస్సావాస ఫలితంగా దారితప్పిన ఈతడు వేశ్యారతుడై రేయింబవళ్ళు ఆమెతోటిదే లోకంగా గడుపుతూ ఉండేవాడు.
తన సమస్త ఆభరణాలనూ, విలువైన అనేక రత్నాలను రహస్యంగా ఆ వేశ్యకు సమర్పించి ఆమెతో రతిక్రీడలో మగ్నుడై సురాపానము చేస్తూ భ్రష్టుడై మైమరచి తిరుగుతూండేవాడు! అప్పుడీ పాతకుడి తల్లిదండ్రులు వీనిజాడ తెలియక మమతాపాశబద్ధులై నిద్రాహారాలను మాని వీడికై అన్వేషించసాగారు. కుమారుడు లేని ఆ యింటిలో ఉండలేక ఆ బ్రాహ్మణ దంపతులైన దూర్వుడు, శాకిని చేతిలో కఱ్ఱను తీసుకుని కొడుకుకై గాలిస్తూ బైలుదేరారు.
అలా దారినపోయే ప్రతివారినీ తమ కుమారుడి జాడ ఏమైనా ఎరుగుదురా? అని ప్రశ్నిస్తూ తమ ఆకలిదప్పులకు ఓర్చుకోలేక మధ్య మధ్య స్పృహను కోల్పోతూ, తిరిగి అంతలోనే తెప్పరిల్లి తమ కుమారుడికై అన్వేషణను కొనసాగించేవారు. ఇలా ఉండగా వారికి దారిలో భీముడు అనే అంత్యజుడు ఎదురై, వారికి తమ కుమారుని జాడ యిలా తెలిపాడు.
“మీ కుమారుడైన బుధుడు దురాచారియై, వేశ్యారతుడై, వేశ్యాగృహంలో ఉన్నాడు. సర్వమూ మరచి ఆనందాన్ని పొందగోరుతూన్న అతడినిగూర్చి మీరెందుకు దుఃఖించటం?”
ఈ మాటలు చెవిన పడటంతోనే ఆ దూర్వుడనే బ్రాహ్మణునికి నెత్తిన పిడుగుబడినట్టైంది. ఉండబట్టుకోలేక తీవ్రమైన ఆవేదనతో ఆ వేశ్యయొక్క ఇంటికివెళ్ళి అక్కడ మదవిహ్వలుడై, సురాపానమత్తుడైన తన కుమారుణ్ణి కనుగొన్నాడు. ఆవేశం ముప్పిరి కొనగా,
‘ఓరీ! దుర్మార్గుడా! చంద్రునిలో మచ్చలా యిటువంటి దుష్టత్వంతో నీవు నా వంశంలో ఎలా జన్మించావురా? నీవల్ల కలిగిన ఈ కళంకం ఎలాపోతుంది నాకు? ఇటువంటి పాపపు పనులు చేస్తూకూడా యింకా ఆ పాపఫలం పొందకుండా ఎలా తప్పించుకోగల్గుతున్నావు? నీకు చావైనా రాదే!” అంటూ ఆక్రోశించాడు.
“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా తండ్రి మందలించగా రోషావేశ పరవశుడై, ఆ బుధుడు తన రతిక్రీడకు కలిగిన విఘ్నానికి క్రుద్ధుడై, రౌద్రావతారం దాల్చి, చేత దుడ్డుకఱ్ఱును పూని తండ్రి తలపై మోదాడు! అలా మరణించిన తండ్రి శవాన్ని దూరంగా కాలుపట్టి ఈడ్చి పొదలలో పారేసి తిరిగి మద్యం సేవించి మత్తెక్కి ఆ వేశ్యతోనే విహరించసాగాడు.
ఆ మర్నాడు తాను ఉండే యింటికి వెళ్ళి ప్రేమగా తన క్షేమ సమాచారాలడిగిన కన్నతల్లిని కూడా దుడ్డుకఱ్ఱతోమోది, ఆమె నిశ్చేష్టురాలయ్యాక ఆమెను కూడా కాలికి తాడుకట్టి దూరంగా పొదలలోకి ఈడ్చి వేశాడు. అప్పుడా ఊరివారు పూనుకొని ఆ బ్రాహ్మణ దంపతులకు అంతిమ సంస్కారాలను చేశారు! ఈ బుధుడు బ్రాహ్మణుడైన కారణంచేత రాజు వానిని శిక్షించకుండా తీవ్రంగా మందలించి వదిలివేశాడు.
ఆ దుష్టుడు అప్పటికీ తన ప్రవర్తనను మార్చుకొనక ఆ మరునాడు ఇంటికి చేరాడు. అతడి భార్య ఎంతో అణకువతోను ఆదరణతోనూ దరిచేరి ఇలా హితవుచెప్పింది.
“నాధా! చక్కటి సద్వంశంలో పుట్టి సకలశాస్త్రాలను అధ్యయనం చేసినవాడవు! బహుదుర్లభమైన ఈ విప్రజన్మము ఎంతో పుణ్యఫలంగా గాని లభించదు! వివేకహీనుడైన మానవుడు పశువుకన్నా హీనం! యిక నైనా ఈ దుష్ప్రవర్తనను విడనాడి సన్మార్గవర్గనుడివిగా మెలుగు! సదాచారి యైన మనుజుడికి ఇహపరాలు రెండూ కరతలామలకము లౌతాయి. యౌవనంలో కార్యశూరుడైనవాడు వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపగలడు. రాత్రి సుఖంగా గడవాలంటే పగలు శ్రమించినట్లు, వర్షాకాలం ఆనందం గా గడపాలంటే సంవత్సరంలో మిగతా ఎనిమిదినెలలూ కష్టపడాల్సి వచ్చినట్లే, వార్ధక్యం సుఖవంతంగా గడపగోరేవాడు. యౌవనాన్ని దుర్విని యోగం చేయకూడదు!
ధర్మబద్ధంగా వివాహమాడిన భార్యను, సర్వాంగసుందరినైన నేను ఇంటనుండగా, నన్ను విడచి వేశ్యారతుడవైనావని లోకులంతా నిన్ను నిందిస్తున్నారు! నీ భర్త ఇటువంటి దుష్టుడైనాడే! అంటూ లోకులు నిందిస్తూంటే సిగ్గుతో చితికిపోతున్నాను. నాతో నీవు అహర్నిశలూ రమించినా ఎవ్వరూ తప్పుపట్టరు! కనుక నీకు కీర్తికలిగేలాగా నాకు ప్రీతిపాత్రుడ వయ్యేలా ఆ వేశ్యను పరిత్యజించు! ఇందుకు భిన్నంగా చరిస్తే ఇహపరాలకు నీవు దూరమవటమేకాక అసౌఖ్యానికీ లోకనిందకూ గురౌతావు.
“ఓసి పాపాత్మురాలా! సిగ్గులేకుండా నాకే నీతులు చెప్పేటంతటి దానవైనావా! ఎంతకు తెగించావు? నా తలిదండ్రులకు పట్టించిన గతే నీకూ పట్టిస్తాను” అన్న ఆ బుధుడి మాటలకు ఆ సాధ్వి యిలా అన్నది : “నిన్ను సరిదిద్దపూనిన సర్వవిధాలా అర్హులైన తలిదండ్రులనే అవమానించిన నీవు నన్నుమాత్రం ఎలా రక్షిస్తావనుకుంటాను? నీచేతిలో చావే రాసి పెట్టివుంటే అలాగేకానీ! – స్త్రీకి
పునిస్త్రీగా భర్తచేతిలో మరణించటమే అనంతమైన పుణ్యాన్ని ఇహపరాల్ని ప్రసాదిస్తుంది!”
ఇలా అంటూన్న ఆ సావిత్రిమీదకు ఉగ్రుడై దూసుకువెళ్ళి, ఆమెను కొప్పుపట్టి బరబరా లాక్కొనివచ్చి, ఆమెను పిడిగుద్దులతోనూ కఱ్ఱతోనూ మోదగా ఆమెమాత్రం తన భర్తనే సాక్షాత్తూ శ్రీరామచంద్రుని రూపంగా భావిస్తూ ప్రాణంవిడిచింది! ఆ వెంటనే పార్థివశరీరాన్ని వీడి దివ్యమైన దేహాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళిపోయింది!
ఆమె శవాన్నికూడా కాలుపట్టి పొదలలోకి ఈడ్చివేసి తిరిగి ఆ వేశ్యాగృహానికే వెళ్ళి అక్కడ ఆమెతో విషయలోలుడై గడపసాగాడు! అంతేకాక ఇంకా చాలాకాలం గడిచినతరువాత ఈ బుధుడియొక్క దుష్టత్వం శ్రుతిమించిరాగాన పడ్డదన్నట్లు కాలభుడనే ఋష్యాశ్రమంలోకి చొరబడి ఆయన నిత్యానుష్టానానికై నదీతీరానికి వెళ్ళిన సమయంలో ఆ మహర్షి భార్యను బలాత్కారంగా ఎత్తుకొచ్చి రమించాడు. ఆమె వివశురాలై తన నిస్సహాయతనూ క్రోధాన్నీ ఆక్రోశాన్నీ వెలిబుచ్చుతూ యిలా శపించింది.
“ఓరీ దుర్మార్గుడా! నాభర్త యింటలేని సమయంలో అసహాయురాలై ఒంటరిగా ఉన్న నన్ను నికృష్టుడివై బలాత్కరించావు. గనుక జన్మాంతరంలో కుష్ఠురోగివై జన్మింతువుగాక” అంటూ మూర్ఛిల్లింది.
భీతుడైన బుధుడు తిరిగి వేశ్యాగృహంజొచ్చి ఆమెతోడిదే లోక మన్నట్లుగా మద్యంత్రావుతూ రమింపసాగాడు. ఓ రాజా! ఈరకంగా వాడు చేసిన అకృత్యాలెన్నో నేను నానోటితో చెప్పలేను. ఎందుకంటే ఇతరుల దోషములను ఎంచినట్లయితే స్వపుణ్యక్షయమౌతుంది!
ఆ తరువాత కొంతకాలానికి బుధుడు అనే ఆ బ్రాహ్మణ యువకుడు మరణించాడు. అప్పుడతడిని యమదూతలు యమధర్మ రాజువద్దకు తీసుకువెళ్ళగా యముడు అతడికి నరకయాతనలను శిక్షగా విధించాడు. అప్పుడు యమదూతలు ఆయన ఆజ్ఞానుసారం ప్రళయపర్యంతం నరకాలలో పడవేశారు. అలా నరకబాధల ననుభవించి ఇప్పుడీ వైశ్యజన్మ మెత్తాడు. ఋషిపత్నియొక్క శాపంవల్ల కుష్టురోగియైనాడు.
వీడు మహాపాపి! చేసిన అకృత్యాలు లెక్కలేనన్ని. ఇట్టి మనుజుడిని స్పృశిస్తే సచేలస్నానం చేయాలి. ఇట్టివాడి పేరును స్మరించటంకూడా మహా పాపమే! గనుక వీడిని వెంటనే ఈ విమానంనుండి దించివేయి! అలా చేసిన తక్షణమే విమానం యధారీతిగా పైకి ఎగయగలదు. దీనికి ఎట్టి సంశయమూ లేదు!”
ఈ మాటలు విన్న శూరసేనుడు భయంతో విస్తుపోయి ఆ దూతలనిలా అభ్యర్ధించాడు. “ఓ దూతలారా! నాపై దయ ఉంచి ఈ దుష్టునియొక్క సర్వదోష పరిహారానికీ ఉపాయాన్ని సెలవివ్వండి!” అప్పుడు ఆ గణేశదూతలు”ఓ రాజా! లెమ్ము! నీమాట తీసివేయ లేకున్నాము. వాడి పాపవిమోచనానికి ఒక్కటే మార్గాంతరం ఉంది. అదేమిటంటే గణేశునికిగల సుప్రసిద్ధమైన నాలుగక్షరాల నామాన్ని వాడి కర్ణరంధ్రములో జపిస్తే సూర్యోదయమవగానే అంధకారం నశించినట్లుగా సకల పాపములూ నశిస్తాయి! ఇంక వేరే ఏ ఉపాయం వలనా ప్రయోజనం శూన్యం సుమా!”
ఓ వ్యాసమహర్షీ! ఆ గణేశదూతల వాక్యాన్ని అనుసరించి ”గజానన” అనే నామమంత్రాన్ని జయశబ్దంతో కలిపి ఆ వైశ్యుని చెవిలో ముమ్మారు జపించాడు. ఆ మంత్రం యొక్క మహాప్రభావ విశేషంచేత ఆ కుష్టురోగియైన వైశ్యుడియొక్క దుష్కృతమంతా పటాపంచలై దివ్య దేహాన్ని ధరించాడు. దివ్యమైన శరీరకాంతితో అనూరుడు సూర్య రధసారధిగా భువనములనంతనూ ప్రకాశింపచేసినట్లుగా దిక్కులను ప్రకాశింపచేస్తూ గణేశుని దివ్యవిమానాన్ని తిరిగి అధిష్టించాడు. అప్పుడు ఆ గణేశదూతలచే ప్రేరేపించబడిన దివ్యవిమానం విఘ్నరాజుయొక్క ఆదేశానుసారం గణేశలోకానికి వెళ్ళింది! అంటూ బ్రహ్మ యిలా అన్నాడు. “నీ సందేహాన్ని అంతటినీ నివృత్తిచేశాను. అంతే కాకుండా సంకష్టచతుర్థీ వ్రతమును గురించికూడా తెలిపాను.
ఇది మహత్తర పుణ్యాన్ని ప్రసాదిస్తుంది! ఈ చరిత్రను వినటంవల్ల, చదవటం వల్ల ధర్మవృద్ధి, యశోవృద్ధి, ఆయుర్వృద్ధి కలుగుతాయి. సకలసిద్ధులూ సంప్రాప్తమవటంతో పాటూ సర్వవిఘ్నములు తొలగిపోయి సకలపీడలూ నశిస్తాయి!”
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని “వైశ్యపూర్వజన్మ వృత్తాంతం” అనే డెబ్భై ఆరవ అధ్యాయం. సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹