ఉపాసనా ఖండము రెండవ భాగము
కార్తవీర్యోపాఖ్యానం మొదటి భాగము
“ఓ వ్యాసమునీంద్రా! నీవు కోరినట్లుగా దుర్వామహాత్మ్యము, నామప్రభావము వివరించాను. నీవింకా ఏమి వినగోరుతున్నావో చెప్పవలసింది” అన్న చతురాననుడి ప్రశ్నకు పరాశరనందనుడిలా అన్నాడు.
“ఓ పరమేష్టి! సకల శుభకరమైన ఈ సంకష్ట చతుర్థీవ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఏయే ఫలాలను పొందారు? దయతో ఆ విశేషాలన్నీ వర్ణించవలసింది!”
“గతంలో జమదగ్ని మహర్షి ప్రియసుతుడైన రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి శత్రునిర్మూలనా సామర్ధ్యాన్ని, విజయాన్ని ”జ్ఞానమును” దీర్ఘా యువునూ కూడా పొందాడు!” అనగానే
“ఓ చతురాననా! ఈ రాముడెవరు? ఎలా ఉద్భవించాడు? అతడి తలిదండ్రులెవరు? అతని వృత్తాంతాన్నంతటినీ విస్తారంగా తెలుప వలసింది!” అంటూ కోరిన వ్యాసమునీంద్రునితో చతురాననుడిలా అన్నాడు.
“శ్వేతద్వీపంలో మహాతపశ్శాలియైన జమదగ్ని అనే ప్రఖ్యాతుడైన మహర్షి ఉండేవాడు. ఆయన కేవలం సంకల్పమాత్రంచేతనే సృష్టి స్థితి లయములు కావించగలిగినంతటి సమర్ధుడు. నిగ్రహానుగ్రహ సమర్ధుడూ త్రికాలవేదీను! అత్యద్భుత సౌందర్యరాశియైన రేణుకాదేవి ఆతడి ధర్మపత్ని. ఈ పుణ్యదంపతుల గర్భాన విష్ణ్వంశ సంభూతుడైనట్టి రాముడు జన్మించాడు.
రాముడుకూడా మన్మధుడిని తలదన్నేటంతటి సౌందర్యంతో, అమితమైన తపశ్శక్తితో ”మరోసూర్యుడా” అనేటంత ప్రకాశమానుడై దేవత లను, ద్విజులను గురువులను గో అశ్వద్ధములను అమిత భక్తిశ్రద్ధలతో పూజించి ప్రతులర్పించేవాడు. ఆతడు భాషిస్తూంటే దేవగురువైన బృహస్పతి స్ఫురించేవాడు. పితృవాక్యపాలనా తత్పరుడు. మిక్కిలి ఓర్పు కలిగి గాంభీర్యంతో ఉండేవాడు. ఇటువంటి సద్గుణసంపన్నుడైన రాముడు ఒకనాడు తండ్రియొక్క ఆజ్ఞానుసారం యజ్ఞకర్మకు సమిధలను సేకరించేందుకని అరణ్యానికి వెళ్ళాడు!
ఆ సమయంలో అమిత బలపరాక్రమోపేతుడు ఒక్కసారిగా అయిదువందల బాణములు విడువగలవాడు, అత్యంత బలపౌరుషాలతో ఇంద్రాది దిక్పాలకులచే సేవించబడుతున్నవాడూ, అపారమైన చతురంగబలోపేతుడూ, కేవలం తన శంఖధ్వనిచేతనే శత్రు సేనావారముల గుండెలవియచేసేవాడూ ఐన కార్తవీర్యుడు వేటకని అడవికి విచ్చేసి తనతో చతురంగబలాలు వెంటరాగా, నీలమైన వస్త్రాన్ని ధరించి నీలఛత్ర పతాకంతో శోభితుడై, సైనికులు వెంటరాగా వేటాడుతూ సహ్యాద్రిపైనున్న ఒకానొక ముని ఆశ్రమ సమీపానికి చేరుకున్నాడు.
‘ఇది ఎవరి ఆశ్రమము?’ అంటూ సేవకులను ప్రశ్నించగా “ప్రభూ! మహాతపస్వి, ఆగ్రహానుగ్రహసమర్ధుడూ ఐనట్టి జమదగ్ని మునియొక్క దివ్యతపోభూమి ఇది! కేవలం ఆ పుణ్య పురుషుని సందర్శించటం చేతనే సకలపాపములు పటాపంచలైపోగలవు! నీవు తప్పక ఆతడి దర్శనం చేసుకోవలసింది! మహాత్ముల దర్శనంచేత నీవు, నీవల్ల మేమూ ఉపకారం పొందగలము”. అన్న దూతవాక్కులు విన్న కార్త వీర్యుడు తన అపార సేనావాహినిని అక్కడే విడిదిచేయించి కొద్దిమంది ముఖ్యులు వెంటరాగా ఆ జమదగ్నిముని ఆశ్రమంలోకి వెళ్ళాడు.అక్కడ దర్భాసనం పైన కూర్చుని ప్రజ్వరిల్లే అగ్నిలా ప్రకాశిస్తూన్న మునిపుంగవుని చూచి తన సహచరులతో సాష్టాంగ దండప్రణామాలు ఆచరించాడు.
ఆ జమదగ్ని మహర్షి రాజుతో కూడావచ్చిన వారికి ఆదరంతో యధోచితరీతిన ఆతిధ్యమిచ్చి గౌరవించాడు. రాజుతోకూడా వచ్చిన పరివారమంతా, అక్కడి సరోవరంలోని నిర్మలజలాలలో స్నానంచేసి, సేదతీరి ఆ ఆశ్రమంలోనే మునియొక్క శిష్యులు చేసే వేదఘోషలను వింటూ, శాస్త్ర చర్చలను సైతం శ్రద్ధగా ఆలకించారు. అప్పుడు ఆ రాజు మునియొక్క ఆతిధ్యానికీ సత్కారాలకూ సంతసించి యిలా అన్నాడు.
“ఓ మునిసత్తమా! తమ సందర్శనభాగ్యంచేత నేటికి నా తపోవృక్షము ఫలించింది! నా జన్మ, పూర్వీకులైన పితరులూ ధన్యమైనారు. శ్రుతులలో ఏదైతే పరబ్రహ్మమని చెప్పబడుతున్నదో ఆ మంగళకర స్వరూపమే తమది! నీయొక్క అతిధిసత్కారంచేత అత్యంత సంతుష్టుడ నైనాను!” అన్న రాజు మాటలకు ఆ మహర్షి చిరుదరహాసంచేస్తూ సర్వజ్ఞుడై వుండికూడా ప్రసన్నచిత్తంతో యిలా ప్రశ్నించాడు.
“ఓ రాజా! నీవెవరవు? ఎవరి కుమారుడవు? ఏంపని మీద యిటుగా వచ్చావు?” దానికి ఆరాజు యిలా బదులిచ్చాడు.
“ఓ మహాత్మా! నా పూర్వజన్మ పుణ్యపరిపాకంవల్ల మీ సందర్శన భాగ్యం నేడు మాకు కలిగింది! నేను కృతవీర్యుని పుత్రుడను. కార్తవీర్యుడన్న నామధేయం నాది! ఇక మాకు సెలవైతే నగరుకు తిరిగివెళ్ళ గలము!” అప్పుడా గౌతమముని
“ఓ రాజా! నీ ఖ్యాతిని నేను ఇదివరలో వినేవున్నాను! నిన్ను చూడాలన్న నా ఆకాంక్ష నాకూ ఎంతోకాలంగా వున్నా అది నేటికి ఫలిం చింది! నీవు యిలా నా ఆశ్రమానికి విచ్చేయటంవల్ల నా దేహము, అంతరాత్మజ్ఞానము, ఆశ్రమము, సంపదలూ సర్వమూ సార్ధకములైనాయి! అతిధివై వచ్చిన నీవు ఏమీ భుజింపకుండా ఎలా వెళ్ళగలవు? నీకిచట కొదవేమీలేదు! నీవంటి అతిలోక పరాక్రమవంతునికి ఆతిధ్యమిచ్చిన ఖ్యాతి నాకూ లోకంలో కలుగనియ్యి! కనుక కొంచెం తడవారి భోజనం చేసివెళ్ళు!” అన్నాడు.
అప్పుడా కార్తవీర్యుడు “ఓమునివర్యా! ఇప్పుడు భోజనసమయం కనుక తమ ఆజ్ఞమేరకు తప్పక భుజించగలను! శ్రోత్రీయులైన వారి యింట అన్నము లేకపోయినా జలాన్ని యాచించైనాసరే త్రాగమనికదా శాస్త్ర వచనం? అలా ఐనప్పటికీ నాతోకూడా వచ్చిన పరివారాన్నంతటినీ వదలి నేనొక్కణ్ణి కేవలం నీళ్ళైనాసరే త్రాగ నిచ్చగించను. మా సిబ్బంది కందరికీ భోజనం పెట్టగల శక్తి తమకు లేదని నాకూ తెలుసు! కనుక నాకు సెలవిప్పిస్తే పోయివస్తాను!” అన్నాడు
“ఓ కార్తవీర్యమహారాజా! నేనెట్లా యింతమంది పరివారానికీ ఆతిధ్యమివ్వగలనా అన్న సందేహం నీకు వద్దు! ససైన్యంగా నాల్గు విధాల భక్షభోజ్యచోష్యలేహ్యాదులతో అందరికీ భోజనపు ఏర్పాటుచేస్తాను. తపస్సు వల్ల సాధించలేనిదేదీ లేదుకదా! కనుక నీవు నీ సందేహాన్ని వీడి, పదలివచ్చిన సిబ్బందినందరినీ కూడా రప్పించు! ఈ సుందర నదీ తీరంలో క్షణకాలం విశ్రమించు. భోజన పదార్ధములన్నీ సిద్ధమయ్యాక సంతోషంతో వాటిని వీక్షిద్దువు గాని!” అన్న జమదగ్నిముని వాక్యాలకు మనస్సులోనే ఆశ్చర్యపోతూ ఆ రాజు నదీతీరానికి వెళ్ళాడు.
అప్పుడా ముని తన పత్నిని పిలిచి ఈ వృత్తాంతాన్నంతా చెప్పాడు. ఆ యిరువురూ దేవలోకంలోని కామధేనువును స్మరించి, పూజించారు. ‘ఓ ధేనుశ్రేష్టమా! మా ఆతిధ్యంలో ఎటువంటి కొరతా కలుగనీయక మా మానం కాపాడు. అసంఖ్యాకమైన పరివారమంతటిలోనూ రాజును ఆతిధ్యానికి ఆహ్వానించాము.
సైన్యసహితంగా ఉన్న ఆ రాజుకు తృప్తి కలిగేలా, రుచ్యమైన సకల ఆహారపదార్థాలను శీఘ్రముగా సమకూర్చ వలసింది. లోకంలో సత్యం నిలిచేలా, నాకు అపకీర్తి కలుగకుండేలా,అతిధులను ఆదరించకపోయిన అసంతృప్తి నాకు కలుగనీయక నా ప్రార్ధన నాలకించి నీకు తోచినట్లు చేయి!”
మునిదంపతుల ప్రార్ధనను ఆలకించిన కామధేనువు తన మహా ప్రభావంచేత క్షణకాలంలో రాజోచితమైన నగరును నిర్మించింది. రమ్య మైన, సుందర ఉద్యానవనాలతోనూ, రత్న ఖచిత దివ్యమందిరాలతో సర్వాంగసుందరంగా అలంకరించబడి రాజోచిత భోగాలన్నీ కలిగి, విశాలమైన భవంతులను, కొలువుతీరేందుకు అనువైన సభామంటపాలనూ కలిగిన ఆ భవంతి అనేకములైన ధ్వజములు, పతాకములతో శోభిల్లుతూ ఉంది.
మంగళవాయిద్యాలు కర్ణపేయంగా వీనులవిందు చేస్తుండగా అతిధుల విందుకు తగిన భోజనపదార్ధాలన్నీ భోజనశాలలతోసహా అమర్చింది.
ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయని సంతృప్తిచెందిన జమదగ్నిముని కార్తవీర్య మహారాజును భోజనానికి పరివారసమేతంగా రావలసిందని కబురుపంపి సకల పదార్ధములను వడ్డింపచేశాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”కార్తవీర్యోపాఖ్యానం” అనే డెబ్భై ఏడవ అధ్యాయం.సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹