Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – డెబ్భై ఎనిమిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

కార్తవీర్యోపాఖ్యానం రెండవ భాగము

జమదగ్ని – కార్తవీర్య సంవాదం

నదీతీరంలో విడిదిచేసిన పరివారాన్నంతటినీ ఆహ్వానించి, ఆ శిష్యులు జమదగ్ని చెప్పిన మాటలను ఆ రాజుతో యిలా విన్నవించారు.

“ఓ రాజా! ససైన్యంతో మీరు భోజనానికి విచ్చేసి, తమకు అన్ని విధాల తగినట్టి విందును ఆరగించగలరు!” అప్పుడు ఆ రాజు స్నాన పానాదులు పూర్తిచేసుకుని భోజనానికి సైనికులతోసహా బయలుదేరాడు.

అంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో నిర్మితమైన భవన సముదాయాన్ని చూసి చకితుడై, తన పరివార మంతటితోనూ ఆ భవంతి లోకి ప్రవేశించాడు. ఆ భవంతి మధ్యలోకి చేరుకొని ఆ వైభవాన్నిచూసి నిర్ఘాంతపోయి తనలో తానిలా అనుకున్నాడు.

‘ఆహా! ఈ మునియొక్క అపూర్వవైభవం యింతకుముందెన్నడూ కనీవినీ ఎరుగను! హరిహరాదులకుగాని, సృష్టికర్తయైన బ్రహ్మదేవునికి గాని, లోకపాలకులకు కూడా ఇట్టి ఐశ్వర్యము, యిటువంటి సంపదా ఉన్నట్లు వినలేదే! ఒక తాపసికింతటి భోగమా?’

అనుకుంటూవుండగా ముని వారిని ఎదుర్కొని వారందరిని వారి వారి అర్హతలననుసరించి కూర్చుండచేసి, అంతటా మంగళతూర్యాలు మ్రోగుతుండగా వారందరినీ తృప్తులయ్యేలా భుజింపచేశాడు. ఆ పదార్ధ ముల రుచి, సువాసనలు చూచేవారికి నోరూరేలా ఉండి, సైనికులు తనివితీరా భుజిస్తూ ”ఒక్క యామమాత్రంలో ఈ ఏర్పాట్లన్నీ ముని ఒక్కడే ఎలా చేయగలిగాడా?” అని ఆశ్చర్యం చెందసాగారు.

భుక్తాయాసంతో భుజించినవారు తమ చేతులను కూడా ఆ ప్రక్కనే కడుగుకునే ఏర్పాట్లను ప్రక్షాళనకై పాత్రలను సమకూర్చడం ద్వారా చేశారు ఆముని శిష్యులు.

ఇక పరివారంతో పాటూ విచ్చేసిన ఏనుగులు, అశ్వములు, వృష భములకు శేషాన్నము, గుగ్గిళ్ళుపెట్టి, వాటినీ తృప్తిపరచారు. అలా భోజనాదికములు ముగించి వారందరూ వేరొక భవంతిలోకి తీసుకు వెళ్ళబడ్డారు. అక్కడ చెఱకు, ద్రాక్ష, పనస, దాడిమ మొదలైన ఫలాలను భక్షించి, ఆ తరువాత మునిచే సమర్పించబడిన ఏలకులు, లవంగపువ్వు పచ్చకర్పూరంతోనూ మిశ్రితమైన తాంబూలాదులను సేవించారు. ఆ తరువాత జమదగ్నిముని అందరికీ నానావిధములైన అలంకారములనూ, నూతన వస్త్రాలనూ యిచ్చి గౌరవించాడు.

ఆ రాజుకు కూడా ఎంతో విలువైన వలువలను కానుకగా యిచ్చి ఘనంగా సత్కరించాడు. అప్పుడా ముని రాజుతో యిలా అన్నాడు. ”ఓ రాజా! ”నా విష్ణుః పృధివీపతి’ అన్న సూక్తిప్రకారం విష్ణువు యొక్క అంశనే రాజు పరిపాలనచేయగల్గుతున్నాడు. సకలమూ నీ పాదాల చెంతకు తమంతతామే వచ్చి చేరే నీకు, అడవిలో ఒకమూల తపస్సు చేసుకునే నేను ఏంభోజనం పెట్టగలను?

ఐనా నామాటను తీసివేయకుండా వచ్చి నా ఆతిధ్యాన్ని అంగీకరించి నాకు తృప్తినీ, అజరామరమైన కీర్తినీ ఒన గూడేలా చేశావు! నీ ఈ మహోదారకార్యంచేత మూడులోకాలలోనూ నా కీర్తి వ్యాపించింది. నాకు నీవు కల్గించిన తృప్తికి ప్రతిగా నేటితో నీ సకల అరిష్టములు తొలగిపోతాయి!” అన్న జమదగ్ని మాటలకు కార్తవీర్యుడిలా అన్నాడు..

“ఓ మునివర్యా! నేనింతకు పూర్వం వచ్చినప్పుడు ఈ భవనాలు కాని, భోజనపదార్ధాలుకాని ఏవీ కనబడలేదే? ఇవన్నీ నీ మాయవల్ల కల్పించావా ఏమి? లేక ఇదంతా నీ అమోఘమైన తపఃశ్శక్తి ప్రభావమా? నిజంచెప్పు! అంటూ వేడగా

“ఓ రాజా! నేనెన్నడూ – చివరికి పరిహాసానికైనా సరే అసత్య మాడను! అందుకని నీవడిగావు గనుక సత్యమునే వచిస్తాను! ఇదంతా కామధేనువు యొక్క అనుగ్రహంవల్ల కల్పించబడింది!” అనిచెప్పాడు.

రాజు ససైన్యంగా భుజించి, తీరిన ఆకలిచేత తృప్తుడైనప్పటికీ దురాశచెంది, ఆ కామధేనువును తనవెంట తీసుకొనిపోదలిచాడు. ఎవనిపట్ల దైవానికి దయాదాక్షిణ్యాలు కొరవడతాయో అట్టివానికే బుద్ధి పెడత్రోవ పట్టడం జరుగుతుంది! దుష్కర్మవైపు మనస్సు ప్రకోపింపబడి, అది భవిష్యత్తులో వాడికి అరిష్టాన్ని కొనితెస్తుంది.

ఆ కార్తవీర్యునికికూడా ఆ సమయంలో అటువంటి దుర్బుద్ధే పొడమింది! అప్పుడతడు శాంత చిత్తుడైన జమదగ్నితో యిలా అన్నాడు.

“ఓ తాపసోత్తమా! సకల మనోవృత్తులూ ఉడిగి, కోరికలన్నీ నశించినవారు, కేవలం కందమూలాదులను భక్షించి కాలంగడిపేవారూ, నివృత్తిమార్గంలో మనోవాసనలన్నీ లయమై, కేవలం సంకల్పమాత్రం చేతనే సృష్టిని సంహరించగలిగినట్టి ప్రతిభాశాలురూ, ఇంద్రియాలన్నీ నిగ్రహించి విజ్ఞానులైన మీవంటివారికి కామధేనువుతో పనిఏమి?

ఈ ఐశ్వర్యాలూ ఆడంబరాలు మీకు నిష్ప్రయోజనములూ, అవి రాజోచి తములూ! ఇట్టిది నావద్ద ఉంటే అనేక మహత్తర కార్యములకు ఉపకరిస్తుంది. ఇది శ్రేష్టమైన వస్తువు కాబట్టి శ్రేష్టుడనైన నావద్ద ఉండటమే ఉచితం! అరణ్యములో నివసించే నీవద్ద ఇటువంటి విలువైన మహ ద్రత్నము ఉండతగదు!

కనుక ఓ మునిశ్రేష్టా! నీవు సంతోషపూర్వకంగా ఈ ధేనువును నాకు సమర్పించుకో! నా దగ్గర ఉంటే నీవద్ద ఉన్నట్లే అని భావించి సరిపెట్టుకో. నా మాటను మన్నించి, నీ గౌరవాన్ని కాపాడుకో! లేదా అతులిత బలపరాక్రమ సంపన్నుడనైన నాకు అసాధ్య మేమున్నది?”

“నాయనా, సత్యవతీనందనా? ఈవిధంగా భయపెడుతున్నట్లుగా పలికిన ఆ మాటలకు జమదగ్నిముని ఆగ్రహోదగ్రుడై మండిపడుతూ కన్నుల్లో నిప్పులు కురవగా యిలా అన్నాడు.

“ఓయీ! రాజా! నీవు సత్పురుషుడవని, పరిశుద్ధమనస్సు కలవాడవన్న ఉద్దేశ్యంతో నిన్ను భోజనానికి అతిధిగా ఆహ్వానించాను. కొంగలా నీవు కపటివైనావు. నీమనస్సులోని కపటాన్ని గ్రహించలేకపోయాను!

ఈ లోకంలో కోకిల, కాకి రెండూ నల్లగానే కనబడతాయి! కోకిల తనపిల్లగా కాకిపిల్లను భావించి అమాయకంగా తన ఆహారాన్ని పెట్టి పోషిస్తుంది. ఐనా ఆ కాకికి జన్మనైజంవల్ల ఇది భక్ష్యము (తినదగినది) ఇది అభక్ష్యము (తినకూడనిది) అన్న విచక్షణ లేకుండా అన్నిటియందు ఆసక్తి కలిగినట్లుగా, నేనే నీవు సత్పురుషుడవన్న భ్రాంతితో నీవంటి రాజుతో స్నేహము గరపాను. ఇటువంటి దుర్బుద్ధిగల మిత్రుడిని ఎవ్వరూ కనీవినీ ఉండలేదు!” అంటూ పరుషంగా నిందించాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ‘కార్తవీర్యోపాఖ్యానం’ అనే డెబ్భై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment