Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – డెబ్భై తొమ్మిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

కార్తవీర్యుడు జమదగ్నిమహర్షిని సంహరించుట

జమదగ్నిముని యింకా యిలా అన్నాడు :-

“ఓ రాజా! నీవో మేకవన్నె పులిలాగా, గోముఖ వ్యాఘ్రంలాగా మొదట్లో సాధువువలే, సాధుజనులకు ఉపకారివిలా కనబడి ఇప్పుడు నీ నైజాన్ని వెలిబుచ్చావు! దురాశతో అనవసరమైన భ్రాంతిలో చిక్కు కున్నట్లున్నావు! ఈ పవిత్రమైన కామధేనువు ఎవరికీ పొందశక్యం కానిది! దీనిని అపేక్షించావా మూడులోకాలనూ నాశనమొనర్చినంతటి పాపం నీపై బడుతుందిసుమా!” అంటూ చేసిన హితోక్తులను చెవినిబెట్టక కోపంతో త్రాచుపాములా బుసలుకొడుతూ కార్తవీర్యుడు ఆ మునిని ఉద్దేశించి యిలా అన్నాడు.

“ఓయీ దుర్మార్గా! ఇంతవరకూ నేనెవ్వరివీ పరుషవాక్యాలు విని వుండలేదు! ఐనా బ్రాహ్మణువన్న గౌరవంతో ఇంతవరకూ నీ దుర్భాషలను సహించాను!” అంటూ తన కన్నుల్లో నిప్పుకణాలను కురిపించాడు.

“ఓ వ్యాసమునీంద్రా! అప్పుడు ఆ కార్తవీర్యుడు వెంటనే తాను కూర్చున్న ఆసనంపైనుండి దిగ్గున లేచి దూతలతో ”మీరు శ్రీఘ్రముగా పోయి ఆ ధేనువును బంధమువిప్పి నావద్దకు తీసుకునిరండి!” అంటూ ఆజ్ఞాపించాడు. ఆ దూతలు రాజుయొక్క అప్రతిహతమైన ఆజ్ఞను పాటించేందుకు ఆ గోవును చుట్టుముట్టారు. ఆ ధేనువు చేసిన పూత్కారము మాత్రంచేతనే అందరూ తమ అసువులను కోల్పోయారు.

ఆ తరువాత చుట్టుముట్టిన సకల సైన్యాన్నీ ఆ కామధేనువు తన క్రోధాగ్ని జ్వాలలచే భస్మం కావించింది! అది ముక్కుపుటాలగుండా విసరిన శ్వాస వాయువు యొక్క వేగానికే కొందరు ఆకాశంలోకి విసరివేయబడ్డారు! అది గిట్టలతో రేపినధూళి ఆకాశాన్నంతటినీ అలముకొని చీకట్లు నలుదెసలా క్రమ్ముకున్నాయి. అప్పుడు భూమికూడా కంపించింది. వృక్షాలన్నీ సుడిగాలికి పెకలించబడ్డాయి!

ఆ రాజ సైనికులు దాంతో భయభ్రాంతులై నాలుగు దిక్కులకూ పారిపోయారు! ఒకని బల్లెపుపోటుకు ఆగ్రహించిన ఆ ధేనువు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి ఏనుగుపైకి లంఘించే మృగరాజులా, నాగుల పైకి దూకే గరుత్మంతుడిలా సైన్యాలపై పడింది! అప్పుడు సైన్యమంతా హాహాకారాలు చేస్తూ చెల్లాచెదరైపోయింది!

అప్పుడు వారందరినీ ఉత్సాహపరుస్తూ “భయపడకండి! నేనుండగా మీకెట్టి ఆపదా కలుగదు! నా శంఖపు ధ్వని చెవులబడటంతోటే సమస్త శత్రువుల గుండెలూ అవిసిపోతాయి! ఇక నా పౌరుషంముందర ఈ ధేనువెంత?” అంటూ మూడులోకాలుపిక్కటిల్లేలా శంఖాన్ని పూరించాడు కార్తవీర్యుడు.

ఐనా ఆ ధేనువిదేమీ లెక్కచేయలేదు అప్పుడు ఆ రాజుయొక్క సైనికులు విజృంభించి ఆ ధేనువును కఱ్ఱలతోనూ, లోహపు ఆయుధాలతోనూ కొట్టసాగారు! ఒక్కొకదెబ్బ ఆ ధేనువు శరీరంపై పడినప్పుడల్లా అక్కడక్కడనుంచి సర్వశస్త్రాలనూ ధరించిన భటులు బయల్వెడలి ఈ కార్తవీర్యుని సేనావాహినిని వధించసాగారు! ఆ కామధేనువుయొక్క రోమకూపాలలోంచి శకులు, బర్బరులు బయలుదేరారు! పాదాలలోంచి పటచ్చరులనేవారు ఇంకా నానావిధములైన యవనజాతులు ఉత్పన్నమైనారు! వీరంతాకూడా కార్తవీర్యుని సేనలపైబడి వారిని చావమోదారు! లెక్కలేనంతమంది సైనికులు ఆ దాడిలో మరణించారు! కొందరు యదుభూమిలో చనిపోయిన వారివలే భయంతో బిగుసుకుని పడుకుంటే, మరికొందరు శస్త్రాలను శస్త్రాలతో నరికి బాహాబాహీగా మల్లయుద్ధానికి తలపడ్డారు! ఇలా సంకుల సమరం కొనసాగింది.

శస్త్రాస్త్రాలన్నీ గుట్టలుగా నేలపై పేరుకోసాగాయి. ఆ ధూళి ఆకాశానికంటి ఎవరు తమవారో ఎవరు శత్రువులో తెలుసుకోవడం గగనమైంది. ఒకరి నొకరు కనబడ్డవాడినల్లా తెగనరుక్కుంటూ భీతావహంగా పోరాడసాగారు! మృతసైనికుల కళేబరాలకై కాచుకు కూర్చున్న గద్దలకు, రాబందులకు ఈపారు ఎంతో సంతోషాన్ని కల్గించింది. వీరపత్నులకు మాత్రం భయావహమైంది! లెక్కలేనన్ని రధాలు, సైనికులు నేలకూలారు. ఈ విధంగా చచ్చినవారు యుద్ధంలో సమసిపోగా కొందరు మాత్రం తమకాళ్ళకు బుద్ధిచెప్పి శక్తికొద్దీ పారిపోసాగారు.

మన రాజుకేదో పోగాలము దాపురించే అకారణంగా తాపసియైన ఆ మునితో వైరం కొనితెచ్చుకున్నాడు. ముని మనకెలాంటి హానీ చేయ లేదు సరిగదా చక్కటి ఆతిధ్యంకూడా యిచ్చాడు. మనరాజుయొక్క దురాశ ఫలితమే ఈ ఉపద్రవం!’ అనుకుంటూ బ్రతికుంటే బలుసాకు తినవచ్చు అనుకొని సైన్యం చెల్లాచెదురుగా పారిపోయారు.

“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా తనసైన్యం యావత్తూ కకావికలవటం చూసిన కార్తవీర్యుడు దిగ్గున లేచి తన ఐదువందల బాణాలనూ ఎక్కుపెట్టి శరజాలములను ఆ ధేనువు సృజించిన సైనికులపై ప్రయోగించాడు. అలా ఎన్నిసార్లు శక్తికొద్దీ బాణవర్షం కురిపించినా ఒక్క గో సైనికుడుకూడా మరణించలేదు! ఈ రకంగా తన బాణాలన్నీ వృధాగా పోగా ఆతడు చింతాక్రాంతుడై ”ఆహా నేడు నాసామర్థ్యమంతా మొక్క వోయిందే! ఇంక నాకేది దారి?” అంటూ వ్యాకుల పడసాగాడు. ఇట్టి వీనితో యుద్ధమెందుకని ధేనువు తన సైన్యంతోసహా దేవలోకానికి తరలిపోయింది.

అలా కామధేనువు స్వర్గలోకానికి వెళ్ళిపోయాక కార్తవీర్యుడు తిరిగి జమదగ్నిముని సన్నిధికివెళ్ళి ఉక్రోషంతో “ఓయీ! కపటబ్రాహ్మణా! నీ హృదయంలో ఇంతటి కాపట్యముంచుకొని నన్ను మభ్యపెట్టబోయావా? ఎవని హృదయంలో కాపట్యముంటుందో ఆతడు బ్రాహ్మణుడు కానేకాడు!” అంటూ ఆ ముని హృదయంలో నాటుకునేలా ఒక వాడిబాణాన్ని ప్రయోగించాడు. దాంతో ఆ ముని వెంటనే మరణించాడు. అప్పుడా జమదగ్ని మునిపత్నియైన రేణుకాదేవి క్రోధంతో ఉడికిపోతూ “ఓరి దౌర్భాగ్యుడా! అకారణంగా నీవు బ్రహ్మహత్యకు పూను కున్నావే! నీకీ మహర్షి ఏమి అపకారంచేశాడు?” అంటూ ఆక్రోశించింది. అందుకు కార్తవీర్యుడు అగ్గిమీద గుగ్గిలమే అయ్యాడు.

”నీవు తక్షణం నోరుమూసుకో! లేదా నిన్నూ సంహరిస్తాను!” అంటూ రోషంతో తన ఎక్కుపెట్టిన విల్లుతో ఇరవైఒక్క బాణాలను ఆమెపై ప్రయోగించాడు.అలా ఆ కార్తవీర్యుని బాణములచే గ్రుచ్చబడి నేలకూలిన ఆ సాధ్వీమణియైన రేణుకామాత తన భర్తను మనసారా స్మరించింది. ఆ తరువాత ఆ రాజును యిలా శపించింది.

”ఓరీ దుర్మార్గుడా! నీకే బలమున్నదని గర్వంతో విర్రవీగుతూ అకారణంగా మమ్మల్ని వధిస్తున్నావు. నీకూ అనతికాలంలోనే చేటు మూడుతుంది. నీవు నీ సహస్రబాహువులతోనూ నశించే వినాశం వస్తుంది! దీనికెంత మాత్రమూ సందేహంలేదు! ఇది యదార్ధంగా జరిగి తీరుతుంది!”

ఈ మాటలు తననెంతో బాధించగా ఆ కార్తవీర్యుడు శేషమైన పరివారంతో, నిరుత్సాహంతో ఏపని చేయటానికి ఉత్సాహంలేక తన అకృత్యానికి తనను నిందించుకుంటూ తన మందిరానికి చేరుకున్నాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”జమదగ్ని సంహారం” అనే డెబ్భై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment