ఉపాసనా ఖండము రెండవ భాగము
రామోపాఖ్యానం మొదటి భాగము
ఆ తరువాత జరిగిన కథనాన్ని బ్రహ్మ యిలా వివరించాడు. “ఓ వ్యాసమునీంద్రా! అలా ఆ కార్తవీర్యుడు భీభత్సము భయానకమైన వాతావరణాన్ని సృష్టించి వెళ్ళిపోయాక, జమదగ్ని పత్నియైన రేణుక దుఃఖంతో వివశురాలై ”ఆహా! నేడు ఎంతటి దుస్థితి దాపరించింది?
ఇటువంటి ఆపత్సమయాలలో నా కుమారులెక్కడికి వెళ్ళారోకదా? మహా రోషవంతుడూ పరాక్రమీయైన నా రాముడు ఎక్కడికి వెళ్ళాడో? అత్యంత ప్రేమాస్పదుడైన వానికేమైనా జరిగితే ఉత్తరక్షణంలో నా ప్రాణాలు కూడా విశ్వవాయువుల్లో కలిసిపోగలవు!” అని అనుకుంటూండగా ఆమె స్మరించి నంతనే రాముడామెవద్దకు వచ్చాడు.
బాణాలతో నాటబడిన తనతల్లిని, మృతుడైన తండ్రి జమదగ్నినీ చూడగానే మొదలునరికిన చెట్టులా నేలకూలి, ఆ బాధతో మూర్ఛిల్లాడు! కాస్సేపటికి స్పృహరాగానే తలిదండ్రుల గురించి ఎంతగానో పరితపిస్తూ అహో! ఇప్పుడంతాఅంధకారం అలుముకున్నట్లుగా ఉన్నదే? ప్రపంచమంతా శూన్యమై వెలవెలపోతోందే?
ఇంద్రుడులేని అమరావతి, మేరుపర్వతంలేని భూమి ఎలా కాంతివిహీనమై నిస్తేజములౌతాయో, అలాగే నా తండ్రిలేని ఆశ్రమంకూడా ఎంతో చిన్నబోయింది! పరమపావనియైన గంగానది లేకపోతే మూడులోకాలూ ఎలావుంటాయో అట్లాగే నా జనని రేణుకాదేవి నడయాడని ఆశ్రమం అలా శూన్యంగా గోచరిస్తోంది!
అమిత తపోనిష్టకు అలవాలమైన ఈ తపోనిధిపై అతడెలా ఆయుధప్రహారం చేయగలిగాడు?’ అనుకుని పరిపరివిధాల తన మాతాపితరులను తలచుకొని విలపించసాగాడు.
ఆ దుఃఖభారానికి మూర్ఛిల్లి తిరిగి కొంచెంసేపైన తరువాత లేచి ఏడుస్తూ తల్లివద్దకు వెళ్ళి ఆమె తలను తన వడిలో ఉంచుకొని ఆమెను నాటిన బాణాలను లాగివైచాడు. అప్పుడు తల్లిలేని వియోగం గుండెల్ని కలచివేయగా మళ్ళా దుఃఖితుడై ఇలా అనుకున్నాడు..
మూడులోకాలను సైతం తన పాతివ్రత్య పరాకాష్టచేత భస్మం చేయగలిగినట్టి సామర్థ్యంవున్న నా మాతృమూర్తి ఈ దుష్టబాణాల బారిన పడి ఇలా పడివున్నదెందుకని?” ఓ తల్లీ! నేను ఆటలకు వెళ్ళినా క్షణ కాలం గూడా నన్ను విడిచివుండేదానవుకాదు! ఇప్పుడు నన్నిలా అనాధను చేసి ఎక్కడికిపోదల్చావు? నాకు ఆకలితీర్చే సమృద్దైన భోజనాన్నీ, పాలను మంచి వస్త్రాలనూ ప్రేమతో నాకు యిచ్చేదానివే? ఎంతో కష్టపడి మీకై నేతెచ్చిన కందమూలాలన్నీ విడిచి ఎక్కడికి పోయావమ్మా? ఇక తలి దండ్రులు లేని నా జన్మ వ్యర్ధమైంది!” అంటూ రోదించాడు.
ఆ రాముడి గుండెలవిసేలా చేసే రోదనను విని మాతృమూర్తియైన రేణుకాదేవి ఆ హృదయవిదారక దృశ్యాన్ని చూడలేక అతడి కళ్ళు తుడిచి, నాయనా! శోకించకు! నేను నీవద్దనే ఎప్పటికీ ఉంటాను. నిన్ను వీడివెళ్ళను. జరిగిన వృత్తాంతాన్ని యావత్తూ తెలుపుతాను విను!
నీవు ఈ మధ్యాహ్నం అరణ్యాలకు కందమూలాలను సేకరించడానికి వెళ్ళినప్పుడు ఈ నగరానికి రాజైన కృతవీర్యుని కుమారుడైన కార్తవీర్యుడు సేనాసమేతుడై మన ఆశ్రమానికి వచ్చాడు. యధోచితరీతిన గౌరవించి, భోజనానికి బలవంతంగానే ఒప్పించాడు నీతండ్రి! సమస్త రాజలాంఛనాలతోనూ రాజోచిత వైభవాలతో ఆ రాజును భుజింపచేశాము.
కామధేనువును ప్రార్ధించి ఆమెయొక్క విశేషానుగ్రహం చేత సర్వమూ సమకూర్చుకుని యధావిధిగా అతిధి సత్కారాలను జరిపాము. ఆ రకంగా భోజనంచేశాక దురాశాపూరితుడై ఆ ధేనువును తనకు సమర్పించమని నీ తండ్రిని యాచించాడు.
ఉదాసీనత వహించినట్టి నీ తండ్రిపై పట్టరాని ఆగ్రహం క్రమ్ముకొనిరాగా ఆ ధేనువును బలాత్కారంగా తరలించదలచి ఆమెకు కట్లు విప్పాడు. అలా శత్రుస్పర్శ కల్గినమాత్రంచేతనే ఆ ధేనువు అపారమైన చతురంగ బలాలను నిర్మించింది! ఆ రాజసైనికులకూ, ధేనువుచే సృష్టించబడిన సైనికులకూ మధ్య జరిగిన ఘోరమైన పోరులో రాజు యొక్క సైన్యం చెల్లాచెదురై పారిపోయారు!
అప్పుడా కార్తవీర్యుడు స్వయంగా తానే పూనుకొని యుద్ధంచేశాడు! ప్రతీసారీ ఐదువందల బాణాలను గుప్పిస్తూ యుద్ధంచేసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది! ఖిన్నుడై విగతశస్త్రుడైన అతడితో పోరును విరమించి ఆ కామధేనువు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది!
తిరిగి వచ్చి నీతండ్రి సముఖంలో అతడిని నిందిస్తూ ఆ దుష్టుడు నీతండ్రి వక్షస్థలంపై వాడియైన ఒక బాణాన్ని నాటాడు! ఏరకంగానూ అతడికి అపకారంచేయని నన్నుకూడా ఇరవైఒక్క వాడి బాణాలతో గుచ్చి బాధించాడు. ఆ దుర్మార్గుడు అలా లేవలేని స్థితిలోఉన్న మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు! ఓ రామా! నీవు వెంటనే ఆ దుష్టుని సంహరించు! అంతేకాదు దుర్మదాంధుడై నా పై ఇరవైఒక్క బాణాలు గ్రుచ్చాడు గనుక నీవు ఇరవైఒక్కసార్లు క్షత్రియ వంశాలనన్నింటినీ నాశనంచేసి మా ఆత్మకు శాంతిని కూర్చు! అంతేకాదు! నీవింకొక పనికూడా చేయి!
ఎవరినీ ఎన్నడూ దహింపచేయని ప్రదేశంలో మాకు అగ్నిసంస్కారాలు నెరవేర్చు! నీకు పురోహితునిగా అనసూయాసుతుడైన దత్తాత్రేయుని ఆహ్వానించి పదమూడోరోజువరకూ మాకు అపరకర్మలు నిర్వహించు! ఆ విధంగా చేసినట్లయితే మేము ఉత్తమగతులను పొందగలము!
అలా దత్తునివల్ల నిర్వహింపచేయబడ్డ ఉత్తరక్రియలు సార్ధకములౌతాయి. అతనికంటే సమర్ధుడు వేరెవరూ లేరు!” అంటూ ఆ రేణుకాదేవి తన తనయుడైన రాముని ఒడిలో తలఉంచి ప్రాణములు విడిచింది. ఆ తరువాత జమదగ్ని సుతుడైన రాముడు తనతల్లి చెప్పిన విధానంలో కర్మకాండనంతా యధావిధిగా పూర్తిచేశాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనా ఖండములోని ”రామోపాఖ్యానము” అనే ఎనబయ్యవ అధ్యాయం.సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹