Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఎనభై ఒకటవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

రామోపాఖ్యానం రెండవ భాగము

రాముడు “జమదగ్ని రేణుకాదేవి”ల కర్మసంస్కారము చేయుట :-

అప్పుడా చతురాస్యుడు వ్యాసమునీంద్రునితో యిలా అన్నాడు. “ఓ వ్యాసమునీంద్రా! ఆ తరువాత రాముడు తలనీలాలను తీసివైచి, శుద్ధిస్నానంచేసి స్మార్తవిధానం ప్రకారం సంచయన కర్మనంత టినీ యధావిధిగా నెరవేర్చి, మంత్రాగ్నిని ప్రజ్వరిల్లజేసి తలిదండ్రులిద్దరికీ విశ్రాంతి శ్రాద్ధమునూ ఆ తరువాతి సంస్కారాలనూ చేసి, ఆతరువాత దత్తాత్రేయుని సన్నిధికి వెళ్ళాడు.

మాయాస్వరూపియైన ఆ దత్తాత్రేయుడు కుత్పితునిలా వేషంధరించి, శిష్యులు తనను కుక్కలై అనుసరించగా కుక్కలమెడలో త్రాటిని వైచి ఆ త్రాళ్ళు చేతిలో పట్టుకొని కృశించిన మలినరూపిగా దర్శనమిచ్చాడు. ఆ మునీంద్రుని నిజస్వరూపాన్ని తన ధ్యానంద్వారా గ్రహించిన రాముడు నమస్కరించి దోసిలియొగ్గి ఎదుట నిలిచాడు. సర్వజ్ఞుడైనప్పటికీ యోగీశ్వరేశ్వరుడైన ఆ దత్తమూర్తి అతడి మనోభీష్టాన్ని గ్రహించదలిచి. అందుకనే జమదగ్ని సుతునితో యిలా అన్నాడు.

“ఓ రామా! నీ మనోభీష్టము అర్థమైనది. అయినా నీవేకార్యార్ధివై ఇటు వచ్చావో చెప్పు!” అనగా అప్పుడు ఆ రాముడిలా అన్నాడు. “ఓ యోగిరాజా! కృతవీర్యుని కుమారుడైన కార్తవీర్యుడు నేను ఆశ్రమంలో లేని సమయంలో వేటకని వచ్చి మాతండ్రి జమదగ్ని మహర్షి ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి, దురాశాపరుడై, ఆ ఏర్పాట్లు ఒనరించిన కామధేనువును బలాత్కారంగా తోలుకొని పోజూశాడు. దైవబలంగల ఆ ధేనువు ధాటికి ఆతడి సైన్యమంతా కకావికలై చెల్లాచెదరైపోయింది.

ఆ ధేనువు దేవలోకానికి వెళ్ళిపోగా, క్రుద్ధుడై అవమానభారంతో మా తండ్రిపై అకారణవైరం పూని తన తీవ్ర శరాఘాతంతో దాడిచేసి వధించాడు. అది చాలదన్నట్లు మందలించపోయిన అసహాయురాలైన నా మాతృదేవిపై కూడా ఇరవైఒక్క శరాలు గుప్పించాడు! ఆమె నేను తిరిగివచ్చేదాకా కొనఊపిరితో ఉండి ఈ అకృత్యాన్ని నాకు వివరించి తమకు అపరకర్మలు నిర్వర్తించేందుకు మిమ్మల్ని పురోహితునిగాఅభ్యర్ధించమని ఆదేశించి, తన తనువు చాలించింది!

ఆ అపరకర్మల నిర్వహణలో మీ సహాయాన్ని అర్ధించడానికై మీ చెంతకు వచ్చాను. ఈ కర్మ తంత్రంలో మీకు సాటైనవారెవరూ లేరని, ఆ కర్మ ముగించి ఇరవైఒక్కమార్లు క్షత్రియులనెల్లా పరిమార్చి ధరను క్షత్రియుల బారినుండి కాపాడమని మాతల్లి ఆదేశం! అందువల్ల ఓ మహాత్మా! నాపై దయ యుంచి నాతోకూడా దయచేయవలసింది!” అంటూ ప్రార్ధించగా కరుణాళువైన ఆ దత్తమూర్తి అడిని అనునయిస్తూ శోకార్తియైన రామునితో యిలా అన్నాడు.

“ఓ రామా! కార్తవీర్యుడు క్షత్రీయుడెన్నడూ చేయకూడని అకృత్యాన్నే చేసి తీరనిపాపం మూటకట్టుకున్నాడు! ఎవరి యింటిలో తృప్తిగా భుజించామో వారితో ఎన్నడూ విరోధం కూడదు! ఒకవేళ ఎవరైనా దుష్టత్వం వహించి అలా చేసినా, తగిన ఫలితం తప్పక అనుభవించి తీరతాడు! నీవు ఇప్పుడు నీమాతా పితరులిరువురికీ ఊర్ధ్వదైహికకర్మను యధావిధిగా ఆచరించవలసింది!”

“ఓ వ్యాసమునీంద్రా! ఆ విధంగా కర్తవ్యోన్ముఖుడైన రాముడు దత్తాత్రేయునితో కూడి తన ఆశ్రమానికివచ్చి దత్తాత్రేయుడు చెప్పిన ప్రకారమే సమంత్రకంగా రెండవరోజునుండి మొదలు పెట్టి భక్తిపూర్వకంగా ఉత్తర క్రియలు జరుపసాగాడు.

అలా రెండోరోజున కర్మకాండ పూర్తవగానే తాను కొల్హాపురం వెడతానని చెప్పగానే ఆ రాముడు ‘ఓ మునీంద్రా! తిరిగి మీరెప్పుడు వస్తారు?’ అని అడిగాడు.

అప్పుడు దత్తాత్రేయుడిలా బదులు చెప్పాడు. ”ఓ రామా! నీవెప్పుడు ”ఏహి దత్తాత్రేయా” అని స్మరిస్తావో ఆ క్షణంలోనే నన్ను చూడగలవు!” ఇలాగ దత్తాత్రేయుడు ప్రతిదినమూ కర్మకలాపాన్ని నిర్వహింపజేస్తూ అశౌచాన్నము అభోజ్యం కనుక, భిక్షాటన నిమిత్తమై వెళ్ళేవాడు! ఇలా ఒకనాడా దత్తాత్రేయ మునీంద్రుడు కొల్హాపురం వెళ్ళినప్పుడు రాముడు కర్మ చేస్తుండగా అకస్మాత్తుగా ఒకపులి అక్కడికి వచ్చింది! అప్పుడు రాముడు ‘అమ్మో! అమ్మో! ఎక్కడికిపోను’ అంటూ భయంతో అరిచాడు.

ఆ పిలుపులకు రాముడి తల్లియైన రేణుక అక్కడ ఆవిర్భవించింది. కర్మకాండ యింకా అసంపూర్తిగా కావడంతో ఆ దేహానికి శిరస్సుమాత్రం ఏర్పడలేదు! అలా పన్నెండవరోజున పిలచిఉంటే ఆమె సంపూర్ణ ఆకృతి తో వచ్చివుండేది! అప్పుడా రేణుకాదేవి యిలా అన్నది.

“నాయనా! రామా నన్నెందుకాహ్వానించావు?” అంటూ తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నది. ఆరవరోజున దత్తాత్రేయుడు మరలి వచ్చి ”రామా! మధ్యలో ఆమెనెందుకు పిలిచావు? అసంపూర్ణదేహంతో వచ్చిందికదా! పిండీకరణ అయినాక పిలిస్తే సంపూర్ణ అవయవాలతో నీయందలి ప్రేమతో వచ్చివుండేది”.ఆ మాటలకు జమదగ్నినందనుడు “ఓ మునీంద్రా! బాలభావంచేత పులికి భయపడి “మాతర్మాతః” అని అరచినాను! ఆ వెంటనే ఇట్టి స్వరూపాన్ని చూశాను!” అని బదులిచ్చాడు.

ఆ తరువాత రాముడు పదకొండోరోజున వృషోత్సర్జనంచేసి పన్నెండవ రోజున మాతాపితరుల కిరువురికీ సపిండీకరణ శ్రాద్ధమును ఆచరించాడు. ఆ మర్నాడు పాధేయశ్రాద్ధమును పుణ్యాహవచనమునూ చేసి బ్రాహ్మణులకు యధార్హముగా అనేక దానధర్మముల నాచరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి దివ్యదేహందాల్చి బ్రహ్మలోకానికి వెళ్ళాడు.

రేణుకాదేవి మాత్రము భూలోకంలోనే అసంపూర్ణదేహంతో తిరుగుతూ భక్తజనుల కోర్కెలనన్నీ తీరుస్తున్నది! “ఓ వ్యాసమునీంద్రా! ఈమె మహాత్మ్యం స్కాందపురాణంలో విస్తారంగా వర్ణించబడివున్నది. అందుచేత ఇక్కడ సంక్షేపంగా వివరించాను.” అంటూ దరహాసం చిందించాడు చతురాననుడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”రామోపాఖ్యానము” అనే ఎనభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment