ఉపాసనా ఖండము రెండవ భాగము
రామవరదానం
ఆ తరువాత వ్యాసమునీంద్రుడు ఇలా ప్రశ్నించాడు. “ఓ చతురాననా! రాముడా బాల్యం వీడనివాడు. అతడు ఒక్కడైవుండి అనంత పరాక్రమోపేతుడు, సహస్రబాహుయుతుడు, చతురంగ బలోపేతుడైన కార్తవీర్యుడిని ఎలా జయించాడు? ఆ గాధను విస్తారంగా తెలుపవల సింది!” బ్రహ్మయిలా బదులిచ్చాడు.!
“ఓ మునీంద్రా! బాలుడైన రాముడు ఒకనాడు తన తల్లియైన రేణుకామాతనిలా ప్రశ్నించాడు. ”అమ్మా! ఎవరి పరాక్రమంచూసి ఇంద్రాది దేవతలంతా భయంతో గడగడ వణుకుతారో, చతురంగబలాలు ఎవని వెన్నుకొస్తున్నాయో అటువంటి కార్తవీర్యుడిని జయించే ఉపాయం నాకు తెలుపు! నీకోరికమేరకు ధరాతలాన్ని ఇరవైఒక్క పర్యాయాలు ఆ క్షత్రీయాధములపై దండెత్తి ”నిక్షత్రీయ” (క్షత్రీయులే లేకుండా) చేయగల సమర్ధత నాకెలా లభ్యమౌతుంది? దీనికిగాను నాకు కర్తవ్యాన్ని ఉద్బోధించు!”
అప్పుడా మాతృమూర్తి వాత్సల్యం ముప్పిరికొనగా ప్రేమతో తన తనయుడి తల నిమురుతూ యిలా అన్నది: ”నాయనా నీ సంకల్పం నెరవేరటానికి అఘోరరుద్రుని అనుగ్రహం నీకెంతైనా అవసరం! అందుకని నీ పరాక్రమం యినుమడించడానికి నీవు ఆ శివుని ఆరాధించి ప్రసన్నుడిని చేసుకో! ఆ మహాదేవుడు తృప్తిచెందితే నీయొక్క సకల మనోభీష్టాలూ సునాయాసంగా నెరవేరతాయి! నీకు శుభమవుగాక!” అంటూ ఆశీర్వదించి పంపింది.
అప్పుడు తనతల్లికి నమస్కరించి ఆమె వద్ద సెలవుతీసుకొని వెంటనే కైలాసానికి ప్రయాణమై వెళ్ళాడు. శంకరుడిని రాముడు స్తుతించటం.కైలాసగిరిని చేరుకున్న రాముడు రత్నసింహాసనాసీనుడైన శంకరుని చూచి సాష్టాంగ దండప్రణామాలు ఆచరించి, అంజలి యొగ్గి యిలా ప్రార్ధించాడు.
“ఓ దేవాధిదేవా! గౌరీమనోహరా! శివశంకరా! నీకిదే నాప్రణతి! విశ్వభర్తవూ విశ్వకర్తనూ ఐన నీకు నమస్కారము. విశ్వలయకర్తవైన నీకు నమస్కారము. విశ్వమే నీవుగా మూర్తీభవించిన ఓ విశ్వమూర్తీ నీకు నమస్కారము. విశ్వానికి ఆధారభూతుడవైన నీకు నమస్సులు! చంద్రకళను లలాటమున ధరించిన భక్తమనోహ్లాదకారి ఓ బ్రహ్మజ్ఞాన హేతూ నీకు నమస్కారము! నిర్గుణనిరాకార స్వరూపుడవైన నీకు నా శరణాగతి! నీయొక్క మాయచేత సాకారము దాల్చేవాడవు. వేదము లెవ్వరినుండి వెలువడినవో, ఎవ్వరిని వర్ణింప అశక్యములో అట్టి పరమ పురుషుడవగు నీకు నమస్కారము.
సత్యమే స్వరూపమైనట్టివాడా! సత్త్వ రజస్తమోగుణాలకు అతీతుడవై వాటిని ప్రేరేపించు నీకు నమస్కారము. నిష్ప్రపంచ స్వరూపుడవూ సర్వవేత్తవూఐన నీకు మరీమరీ నమస్కా రము” అంటూ ఓ వ్యాసమునీంద్రా! రాముడు చేసిన స్తుతికి శంకరుడు అమిత ప్రసన్నుడై ‘ఓ రామా! నీవు రేణుకా తనయుడవని తెలుసు కున్నాను. అమృతఝరిలా సాగిన నీవాగ్ధాటికీ, స్తోత్రానికీ కడుంగడు సంతుష్టుడనైనాను. నీవేమి కోరివచ్చావో చెప్పు!’ అన్న భోళాశంకరునికి భక్తితో అంజలిఘటించి రాముడిలా అన్నాడు.
“ఓ దేవా! దుష్టుడైన కార్తవీర్యుడు కామధేనువును చెరపట్టబోగా అతడికి తగ్గశాస్త్రి జరిగింది! ఆ అవమానానికి కినిసి నాతండ్రియైన జమదగ్నిని నిరపరాధిని, ఒంటరి, బ్రాహ్మణుడూ, బ్రహ్మవేత్తా అనైనా చూడకుండా చంపివేశాడు. వారి ఆతిధ్యాన్ని స్వీకరించి, నిరపరాధియైన నా మాతృమూర్తిపైన నిర్దయతో ఇరవైఒక్క వాడిశరాలను నాటి ఆమెను విగతజీవురాలిని చేశాడు. అట్టి దోషిని దండించమని నా మాతృదేవి ఆన తిచ్చింది! అందుకనే నిన్ను శరణువేడాను. నా కార్యసిద్ధికి అనువైనట్టి ఉపాయం సెలవివ్వు! ఈ ధరామండలాన్ని యావత్తూ ఇరవైఒక్కమార్లు నిఃక్షాత్రముగా చేస్తాను!”
రామునకు మంత్రోపదేశం
“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా, జరిగిన విషయమంతా రామునివల్ల తెలుసుకున్న శంకరుడు ఆతడి విజయప్రాప్తికి అనువైన ఉపాయాన్ని యోచించి గజాననునికి అత్యంత ప్రీతిపాత్రమైనట్టి షడక్షర మహా మంత్రాన్ని ఆ జమదగ్ని సుతునికి ఉపదేశించి”ఓ రామా! నీవు దీనిని ఉపాసించి నిరాటంకంగా కార్యసిద్ధి ప్రసాదించగల గణేశానుగ్రహాన్ని బడయవలసింది! ఒక లక్షసార్లు జపించి అందులో పదవవంతు హోమాన్ని, అందులో పదవవంతు తర్పణలను, అందులో పదోవంతు బ్రాహ్మణ భోజనాన్ని ఏర్పాటుచేయి! ఈ రకంగా భక్తితో చేసినట్లైతే వరప్రదుడైన గజాననుడు నీకు ప్రసన్నుడౌతాడు. నీ సకల కార్యములు నెరవేర్చగలడు!”
ఈ రకంగా జమదగ్ని నందనుడైన రాముడు శివుని వాక్యములు విని ఆ భవునికి మ్రొక్కి, అతడివద్ద అనుజ్ఞగైకొని, కృష్ణానదికి ఉత్తర దేశంలో తన తపస్సుకు అనువైన ప్రదేశానికై అన్వేషించి, సిద్ధిప్రదమైన నానాలతాకీర్ణమైనట్టి ప్రదేశంలో కూర్చుండి, శివుని ఆజ్ఞానుసారం అనుష్టానం చేశాడు. మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సును ఏకాగ్రపరచి గజాననుని దివ్యమంగళమూర్తిపై లగ్నంచేసి, పాదాంగుష్టం పై నిలిచి మంత్రావృత్తినిచేస్తూ జపించి, హోమ, తర్పణాదికములనూ, బ్రాహ్మణ భోజనాదికములు యధావిధిగా ఆచరించాడు!
అప్పుడు అమితమైన కాంతితో, అతిసుందరమైన ముగ్ధమోహనమైన ముఖముతో పెద్ద ఉదరము, నాలుగు బాహువులూ ధరించి, కిరీటము, హారకేయూరములను ధరించి, నాల్గు హస్తములలోనూ పరశువు, పద్మము, దంతము, మోదుకములను దాల్చి, సుందరమైనట్టి తన తొండమునూ అటూయిటూ త్రిప్పుతూ, నాల్గు దిక్కులనూ తన అద్భుతమైన కాంతితో ప్రకాశింపజేస్తూ, విఘ్నేశ్వరుడైన గజాననుడు రామునికి సాక్షాత్కరించాడు!
కన్నులు మిరుమిట్లుకొలిపే దివ్యకాంతితో కోటి సూర్యసమమైన ప్రకాశం కనబడటంతో కన్నులు మూసుకొని “ఓ మహనీయమూర్తి నీకిదే నమస్కారం! అంటూ ఇలా స్తోత్రంచేశాడు.
“సకలవిద్యాధీశుడవూ, సకలాభీష్ట ప్రదుడవై సకల యత్నకార్యములనూ సిద్ధింపచేయగల విఘ్నహరా! నీకు యిదే నా శరణాగతి! భక్తాభీష్ట ప్రదుడవూ భక్తులకిష్టుడవూ, జ్ఞానమే మూర్తికట్టినట్టి విఘ్నాధిపా! నీకు నా నమస్కారము! విఘ్నములకు ప్రభువువైన ఓ పరాత్పరా! తపోనాశ కరములైన సకల విఘ్నములబారినుండీ నన్ను రక్షించు!”
ఈ విధమైన స్తోత్రానికి సంతుష్టుడైన గణేశుడు తన తీక్షణ తేజస్సుచేత భ్రాంతచిత్తుడైన జమదగ్నినందనునితో మేఘగంభీరధ్వనితో యిలా అన్నాడు. “ఓ రామా! అహోరాత్రములు తదేకదీక్షతో నిష్ఠగా షడక్షరీమంత్రముతో నీవు ఎవరినైతే హృదంబుజములో ధ్యానిస్తున్నావో, ఆ మంత్రాధిష్టాన దేవతనైన నేను నిన్ననుగ్రహించతలచి వచ్చాను. నీకు కావలసిన వరముల నన్నిటినీ యధేచ్చగా కోరుకో! అఖిల బ్రహ్మాండములకు సృష్టిస్థితిలయ కారకుడనైన నా ఈ దివ్యరూపాన్ని బ్రహ్మాదిదేవతలుగాని, మునీశ్వరులుగాని రాజర్షులుగాని తెలియలేరు. నీయందలి అనుగ్రహవిశేషం చేత నీకు నా సగుణ స్వరూప దివ్యదర్శనాన్ని ప్రసాదించాను!”
“ఓ దేవాధిదేవా! సకల జగాలకూ ఆధారభూతుడవూ, ఈ యావత్ సృష్టికీ సృష్టి, స్థితి, లయకారకుడవూ, వేదములచేతి యజ్ఞయాగాది కర్మలచేతా, యోగముచేతా కనుగొనబడజాలనివాడవూ ఐన నీవు నాయందలి యనుగ్రహవిశేషంచేత ఇప్పుడిలా సాక్షాత్కరించావు! నాకు నీ చరణారవిందాలయెడ ధృఢమైన భక్తిని ప్రసాదించు!” అంటూ వేడుకొనగా వరప్రదుడైన గణపతి యిలా అన్నాడు.
“ఓ రామా! నీకు నాయందు ధృఢమైన భక్తి కలుగగలదు! వరములనిస్తానని ప్రలోభపెట్టినా నీబుద్ధి అచంచలంగా నిలవటం కేవలానుగ్రహ విశేషమే! సర్వశత్రువులను నశింపచేసేటటువంటి నా ”పరశువు”ను నీకు ప్రసాదిస్తున్నాను. దీనివల్ల ఈనాటినుంచి నీపేరు “పరశురాముడని” జగద్విఖ్యాతమౌతుంది!” అంటూ మంగళప్రదమైన చిరునవ్వు ప్రసన్నంగా తన మోమున వెదజల్లుతూండగా ఆ గణేశుడు అంతర్ధానం చెందాడు.
అప్పుడు ఆ పరశువును గ్రహించి పరశురాముడై, ఆ జమదగ్ని నందనుడు వేదవేదాంగవిదులతో అక్కడనే గజాననుని మూర్తిని ప్రతిష్ఠించి రత్నస్థంభయుతమైన మంటపాన్ని, ఆలయప్రాసాదాన్ని నిర్మించి, ప్రదక్షిణ నమస్కారాదులను సమర్పించి, బ్రాహ్మణులకు భోజనాదులను పెట్టి శ్రద్ధగా అనేక దానధర్మాలు చేశాడు. నిర్మలాంతఃకరణతో పరశురాముడు తన నిజమందిరానికి తిరిగి వెళ్ళాడు..
అనంతరం ఉచ్ఛైఃస్వరముతో కార్తవీర్యుడిని యుద్ధానికి కవ్విస్తూ ఆహ్వానించి, యుద్ధరంగంలో అతడి వేయి బాహువులను ఖండించి, ఇరవైఒక్కమారులు భూమిని నిఃక్షాత్రము చేశాడు. ఆ తరువాత యజ్ఞము నాచరించి భూమి నంతటినీ బ్రాహ్మణులకూ దక్షిణగా ఇచ్చివైచాడు. సర్వదేవతలు దిగ్భ్రాంతులయ్యేటంతటి అతడి పరాక్రమంచూసి ప్రజలందరూ అతడిని విష్ణ్వంశ గలవానిగా పూజించారు.
ఓ వ్యాసమునీంద్రా! ఈవిధంగా గజాననుని నానావిధ అనుగ్రహవంతములైన మహిమలను సంక్షేపంగా వర్ణించిచెప్పాను. ఆ మహిమలను అంతా పూర్తిగా వర్ణించడం వేయినాల్కలు గల శేషునికికూడా తరం కాదు!
ఈ ఉపాసనాఖండమును ఏ మానవులైతే శ్రద్ధాభక్తులతో వింటారో, అట్టివారు ఇహలోకములో తమ సకల మనోభీష్టములనూ పొంది, అంత్యకాలములో గణేశలోకాన్ని పొందుతారు. ప్రళయకాల పర్యంతం ఆ లోకంలో యధేచ్ఛగా రమించగలరు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”రామవరదానం” అనే ఎనభై రెండవ అధ్యాయం సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹