Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఎనభై ఆరవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

స్కందోపాఖ్యానం

” ఓ మునీంద్రా! అలా ఆ పర్వతరాజనందనయైన పార్వతి గంగా తీరానికి వెంటనే చేరుకున్నది. అక్కడ ముద్దులు మూటగట్టే ఆ చిన్నారి బాలుడిని చూడగానే ఆమెకు స్తన్యం ధారగా స్రవించసాగింది. అతడిని ప్రేమతో ఆలింగనం చేసుకొని ముద్దాడింది! అప్పుడు గంగా దేవి వీడు నా కుమారుడని పల్కింది! అగ్నిహోత్రుడు నా కుమారుడనీ, కృత్తికలు వచ్చి ‘ఓ పార్వతీ! ఈ బాలుడు మా గర్భవాసాన జనించాడు. గనుక మా కుమారుడేనన్నారు!

ఇలా అందరూ పరస్పరం వాదులాడుకొంటూ కైలాసంలోవున్న పరమేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు. అప్పుడు పార్వతీమాత ముద్దులు మూటకట్టే ఆ షణ్ముఖుడిని ముందుగా తన చంకనెత్తుకొని కైలాసంలోకి ప్రవేశించింది. అప్పుడా పరమశివుడు ఆ బాలుడిని తన తొడపై కూర్చుండచేసుకుని మంత్రపూర్వకంగా ఆతడి తలను ఆఘ్రాణించి పరమసంతోషాన్ని పొందాడు. అప్పుడు అగ్ని, కృత్తికలు, గంగ, శంకరునికి భక్తితో ప్రణమిల్లి తమతమ లోకాలకు వెళ్ళిపోయారు.

అప్పుడు శివుడు పరమేష్టిని, దేవగురువైన బృహస్పతినీ రావించి ఆ బాలకునికి నామకరణం చేయవలసిందని వారిరువురూ యిలా అన్నారు. ఆజ్ఞాపించాడు.

“ఓ శంకరా! ఈ బాలకుడు కార్తీకమాసంలో జన్మించాడు గనుక కార్తికేయుడన్న నామం ఇతడికి సార్ధకమైనది! పార్వతీనందనుడనీ, శరద్వీపమున (రెల్లు దుబ్బుల మొదట్లో జన్మించాడు గనుక శరజన్ముడనీ, కృత్తికలవలన జన్మించాడు గనుక కార్తికేయుడనీ ఆర్గురు తల్లుల బిడ్డడవటంచేత షాణ్మాతురుడనీ పిలుబడతాడు. అంతేకాదు ఈతనివల్లనే తారకాసురుడు వధించబడతాడు. ఓశంకరా! అందుచేత ‘తారకజిత్’ అనీ ఆరుముఖాలుండటంచేత షడాననుడనీ, దేవసేనలకు అధ్యక్షుడు కాగలడు గనుక సేనానియనీ, నీ రేతస్సు మూడుసార్లు స్కన్నమవటం (మార్పు చెందటం స్థానాంతరంచెందటం) చేత స్కందుడనీ పిలువ బడతాడు!”

ఇలా వారు మువ్వురూ సంభాషించుకుంటూండగా ఇంద్రాది దేవతలు అక్కడికివచ్చి ఆ దివ్యబాలకుడిని చూసి పరమానంద భరితులై అతడిని పూజించి స్తుతించారు! దివ్యపరిమళాలు సర్వత్రా వ్యాపించాయి.దేవదుందుభులు మారుమ్రోగాయి. ఆ దేవతాసైన్యాలు ఆ శివసుతునికి నమస్కరించి “ఓ దేవా! నీవల్లనే ఆ త్రైలోక్యకంటకుడైన తారకుని వధ జరగాల్సివున్నది! కాబట్టి నీవు దేవసేనాధిపత్యము నంగీకరించి లోక కళ్యాణం చేకూర్చవలసింది!” అంటూ అతడిని వైదిక మంత్రాలతో అభిషేకించి అనేక విధములైన సంభారములతో ఆతడికి దేవతల సేనానిగా పట్టాభిషేకం జరిపించారు.

ఆ తరువాత దేవతలు అనుజ్ఞను గైకొని తమతమ నెలవులకు వెళ్ళిపోయారు. అప్పుడు ఋషులు యధాపూర్వకముగా తమ తపశ్చర్యను కొనసాగించారు. “సేనాధ్యక్షుడు సమర్థుడైవుండగా మనకేమి కొదవ?” అనుకుని నిర్భయంగా తమ కార్యములు నెరవేర్చుకోసాగారు.

ఆ షణ్ముఖుడు కూడా శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడవసాగాడు. ఒకనాడు తన బాల్యచాపల్యంతో చంద్రుణ్ణి పట్టుకుందామని అంతరిక్షంలోకి ఎగిరాడు. అప్పుడు బ్రహ్మ “నాయనా! ఇటువంటి సాహసకృత్యాలు ఎన్నడూ చేయకు” అంటూ వారించాడు. ఇలా ఆ గాంగేయుడు బుద్ధివిషయంలో బృహస్పతినీ, శక్తి విషయంలో ఇంద్రుణ్ణి మించిపోయాడు.

ఇలాఉండగా ఒకనాడు ఆ స్కందుడు పార్వతీసమేతుడైవున్న పరమేశ్వరుని సన్నిధికి వెళ్ళి సర్వకార్యసిద్ధికోరి వారికి వినయంగా నమస్కరించాడు. ఆతరువాత శంకరునితో యిలా తన అభీష్టాన్ని తెలిపాడు.

“ఓ తండ్రీ! ఇంతవరకూ మీనుండి అనేక కధలను విన్నాను. త్రైలోక్య గురువైన మీవలన ఎన్నివిన్నా తృప్తి కలుగటంలేదు. కనుక నాకు సర్వ కార్యసిద్ధినిచ్చేటటువంటి పుత్ర, ధన, సంపదలను వృద్ధిగలుగ చేసేటటువంటి, సర్వపాపహరమైన, త్రివర్గప్రదమైన, మోక్షార్థులకు మోక్షప్రదమైన, శత్రువులపై జయాన్ని ప్రసాదించేటటువంటి ఉత్తమమైన వ్రతాన్నొకదానిని ఉపదేశించవలసింది!”

ఈ మాటలకు శంకరుడు ఎంతో సంతోషించి కుమారా! నీవడిగిన ప్రశ్న ఎంతో సమంజసమైనదీ లోకోపకర మైనట్టిదీ! నీవు అడిగిన ఈ వ్రతము మానవులకు సర్వసిద్ధులనూ అనుగ్రహించగలట్టిది! అంతేకాదు సమస్త సంకటములను హరింపగలది, అలక్ష్మీ నాశకరము, పాపక్షయకరమూ, పుత్రపౌత్రాద్యభివృద్ధికరము!

ఇది గణనాధునికి పరమ సంతోషకరమైనట్టిది! ఎవరైతే ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తు లతో అనుష్టిస్తారో అట్టివారు త్రైలోక్యపూజ్యులవుతారు! వారికి త్రిమూర్తులకు ఉన్నట్టి సృష్టి స్థితి లయములు చేయగల కార్య సామర్థ్యం లభిస్తుంది. అట్టివారు అమితమైన పరాక్రమోపేతులై శత్రువుల గుండెల్లో నిద్రిస్తారు! అంతేకాదు! అట్టివారిని దర్శించినంత మాత్రాన్నే సమస్త పాపాలూ నశిస్తాయి! ఓ స్కందా! దీనికి “వరదగణపతీవ్రత”మని పేరు! దీనికి సాటియైన వ్రతం మరొకటిలేదు!” అన్నాడు.

అప్పుడు ఆ కుమారస్వామి తిరిగి “ఓ దేవా! ఇంతటి అమోఘ మైన ఈ వ్రతమహాత్మ్యమును గురించి విస్తరించి తెలుపవలసింది! అంతేకాదు.

ఈ వ్రతాన్ని ఏరోజున ప్రారంభించాలి? దీని విధివిధాన మేమిటి? దీనివలన కలిగే ఫలమెలాంటిది? ఇంతకుముందెవరు దీనిని ఆచరించారు? వారెలాంటి ఫలం పొందారు? ఈ వివరమంతటినీ నాపై నీకు అనుగ్రహమున్నచో విస్తారంగా చెప్పవలసింది! సర్వలోకములకూ ఉపకారం జరిగేలా, ఈ వ్రతప్రసిద్ధికోసం విధానమంతా చక్కగా వివరించ గోరుతాను!” అంటూ శంకరుణ్ణి ప్రార్ధించాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని”స్కందోపాఖ్యానం” అనే ఎనభై ఆరవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment