Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఎనభై ఎనిమిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

అనంగోపాఖ్యానం మొదటి భాగము

అనంతరం వ్యాసమునీంద్రుడిలా అన్నాడు. “ఓ చతురాననా! సకలార్ధప్రదములైన గజాననుని వ్రతమునూ దాని సంబంధిత యితర గాధలను వినిపించి నాకు పరమ సంతోషాన్ని కల్గించావు. ఐనా నాకో సందేహం మిగిలివున్నది. అదేమిటంటే మన్మధుడు శంకరునియొక్క క్రోధాగ్నిచే దగ్ధుడైనాడుకదా మరలా లోకములో ఎలాగున గోచరుడౌతున్నాడు? అతనివల్లనే ఈ సృష్టివిలాసం కొనసాగుతున్నదికదా? దయతో నా ఈ సందేహాన్ని నివారించు!”

అప్పుడు చతురాననుడిలా బదులు పలికాడు :-

“శంకరుడు రోషంతో ఆగ్రహపరవశుడై తన మూడవకన్ను తెరవగానే అతడి క్రోధాగ్నికి భస్మీపటలమైన మదనుడి విషయాన్ని తెలుసుకుని ఆతడి పత్నియైన రతి తన భర్త అపరాధాన్ని తెలుసుకొని ఆ మదనారి శివుని పాదాలనంటి సాష్టాంగ దండప్రణామాలు ఆచరించి ఈవిధంగా స్తుతించింది.

“ఓ మహాదేవా! నీవే త్రిగుణాలకు ఆధారభూతుడవూ, అతీతుడవూ! సత్వగుణంచేత లోకపాలననూ, రజోగుణంచేత సృష్టికార్య నిర్వహణనూ, చివరకు తమోగుణం ఆధారంగా సకల లోకాలనూ హరిస్తున్న నీకిదే నా శరణాగతి! ముక్కంటివీ, వృషభవాహనుడవూ గిరిజా సహాయుడవైన నీకివే నా నమస్కృతులు!

చేతిలో కపాలధారిపై నిత్యభిక్షువువైనా భక్తుల మనోరధాలనన్నిటినీ నెరవేర్చుతూ, దీనులయెడ అపారమైన దయను వర్షించే దీనజనార్తి హరణా! నా పతివియోగాన్ని నేను సైపలేకున్నాను! నీవుతప్ప మరినాకు వేరేదిక్కు లేదు! నీ క్రోధాగ్నిచే దగ్ధుడైన నా భర్తకు ప్రాణాలను దానంచేసి నాకు సౌభాగ్య భిక్షను ప్రసాదించు! అలా కాకపోతే నేను ప్రాణత్యాగం చేసి ఆతడిని చేరుకుంటాను. అది నీకు అపకీర్తి కాదా ప్రభూ! నీ కరుణయే నాకిక ఆధారం!” అంటూ దీనంగా ప్రార్ధించిన రతీదేవి స్తుతికి శంకరుడు ప్రసన్నుడై ఆమెతో యిలా అన్నాడు.

“ఓ రతీ! నీ స్తుతికి నేను సంతసించాను! నీకేం వరం కావాలో కోరుకో!” అప్పుడు ఆ మదనుని పత్ని సంతోషభరితురాలై యిలా కోరుకున్నది.

“ఓ పరమేశ్వరా! ముల్లోకాలలోనూ కాంతలకు పతితోడిదే జీవితం కదా! భర్తృరహితమైన మగువ జీవితం వ్యర్ధం! శక్రాదులను సైతం మోహింపచేయగల సౌందర్యం, నా శరీర లావణ్యం యివన్నీ నిరర్ధకము లైనవి! కనుక ఓ దయానిధీ! నాకు భర్తృదానంచేసి నన్ను బ్రతికించు! రతి విధవ అనే అపకీర్తిని తొలగించు!” అంటూ దీనయై రతి చేసిన ప్రార్ధనకు శంకరుడు ఆమెను ఊరడిస్తూ, తన మృదుమధుర వాక్యాలతో అనునయంగా యిలా అన్నాడు.

“ఓ మంగళప్రదురాలా! దుఃఖించకు! లజ్జనొందకు! నీవు స్మరించినంతనే నీభర్త నీకు కనబడగలడు! నీ కోరికలను తీర్చగలడు. నీవు మాననీయురాలవవుతావు! మనసారా స్మరించటంతో సంప్రాప్త మౌతాడు గనుక నీభర్త మనోభవుడన్న పేరుతో విఖ్యాతుడౌతాడు.

మళ్ళా ఈతడు శ్రీకృష్ణునకు పుత్రుడై రుక్మిణీదేవి గర్భాన ప్రద్యుమ్నుడన్న పేరుతో జన్మించినప్పుడు తిరిగి నీకు భర్తవుతాడు. నీవు దిగులు చెందకు!” అన్న శివుని ఆజ్ఞానుసారియై ఆమె తన యింటికి వెళ్ళి తన భర్తను స్మరించగానే అనంగుడామె ఎదుట సాక్షాత్కరించాడు. ఆమె ఆశ్చర్యానందాలకు అవధేలేకపోయింది. ఆ తరువాత అనంగుడు శంకరుని సన్నిధికి వెళ్ళి నమస్కరించి ఇలా పలికాడు.

“ఓ దేవా! అపరాధము లేకుండానే నాకు శరీరం లేకుండా చేశావే! తారకాసురుని బాధలకు తట్టుకోలేక ఇంద్రాదిదేవతలు వేడుకొనగా విశాఖుడైన కుమారస్వామి జననం నీవలన జరగవలసినందున నీ నిష్టను భంగపరచటానికి కేవలం లోకోపకారం నిమిత్తమే పూనుకున్నాను. ఎవరైనా తమకు ఆయాచితంగా ఉపకారంచేస్తే ఎంతో ఆనందిస్తారు. కానీ అది నా విషయంలో విపరీత ఫలితాన్నిచ్చింది.

గతంలో ముప్ఫైమూడుకోట్ల దేవతలందరిలోనూ అత్యంత సుందరుడనై ఒప్పాను. ఇంద్రుడు, జయంతుడు, వసంతుడు, నలకూబరుడు వీరంతా నన్ను చూసి సిగ్గుతో తమ తలదించుకునేవారు! ఇప్పుడు అంగహీనుడనై ప్రేతలా ఎలా వుండగలను? కనుక ఓ మహాదేవా! దయచేసి నన్ననుగ్రహించు!” అంటూ వేడుకొనగా ‘ఓ వ్యాసమునీంద్రా! శంకరుడు ఏకాక్షర గణపతీ మహామంత్రాన్ని అనంగుడికి ఉపదేశించాడు. అప్పుడా మన్మధుడు కడు సుందరమైనట్టి జనస్థానానికి వెళ్ళి సుప్రసిద్ధమైన ఆ ఏకాంత ప్రదేశంలో శివుని అనుజ్ఞమేరకు అనుష్టానం చేయసాగాడు.

గజానన సాక్షాత్కారం

కేవలం వాయువునే ఆహారంగా భక్షిస్తూ రతీసమేతుడై అనంగుడు నూరుసంవత్సరాలు మహత్తరమైన తపస్సును గణేశ ఏకాక్షరి మంత్రాన్ని జపిస్తూ నిష్ఠగా చేశాడు.

ఆ కఠోర తపస్సుకు ప్రసన్నుడైన గజాననుడు పదిబాహువులతో దివ్యకిరీటాన్ని దాల్చి, ప్రకాశిస్తూన్న రత్నకుండలాలను దాల్చి, కోటిసూర్యు లను ధిక్కరించే తేజస్సుతో, మెడలో ముత్యాలహారములు ధరించి, దివ్యమైన పుష్పమాలలను అలంకరించుకుని, సింధూరముతో అలదబడి నట్టి ఎఱ్ఱటి దేహఛాయతో, పదిబాహువులలోనూ దివ్యమైన దశాయుధా లనూ ధరించి శేషునిచేత కట్టపడిన నాభిస్థానం కలవాడై తన ఘీంకార ధ్వనితో లోకములనెల్ల భయకంపితులను చేస్తూ అనంగుడికి గణేశుడు సాక్షాత్కరించాడు.

ఈ విధంగా ఆవిర్భవించిన గజాననుని ఆరాధించేందుకుగాను ఇంద్రాది సమస్త దేవతలూ, అప్సర, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష గణాలూ అక్కడికి విచ్చేశారు. షోడశోపచారములతో భక్తియుతులై ఆతడికి దివ్యంగా పూజలను సలిపారు.అప్పుడా రతీపతి దేవతలకూ, మునులకు నమస్కరించి, దయా మయుడైన గణపతిని యిలా స్తుతించాడు.

“ఓ దేవా! దేవతలందరిలోకీ ధన్యుడవైనప్పటికీ నీవు కేవల పరబ్రహ్మ స్వరూపుడవే! నిరాకారుడవైనప్పటికి భక్తజనులయందలి వాత్సల్యంచేత సాకారమూర్తివిగా సాక్షాత్కరించావు. నీ దివ్యసందర్శనం చేత నాజన్మ తపస్సూ ధన్యమైనాయి! నీ దివ్యచరణారవింద దర్శనం సమస్త సిద్ధులకు ఆలవాలం! చతుర్విధ పురుషార్ధప్రదమైనట్టి, సర్వదుఃఖ విమోచకమైనట్టి నీ పాదయుగళం దర్శించిన నా నేత్రములు పావనమై, పునీతము లైనాయి!

ఓ కరుణాంతరంగా! వేదాలచేత, శాస్త్రప్రమాణాదులచేత ఇట్టిదని నిర్వచించరానట్టి అనిర్వచనీయ స్వరూపంగల్గిన మహామహిమాన్వితుడవు! నిన్ను వర్ణింపశక్యంకాక వేదాలే మౌనం వహించినాయి! నీలోని ప్రతీ అణువు అనేకకోట్ల బ్రహ్మాండాలకు నెలవైన నీవు అఖిలేశ్వరుడవు! భక్తుల మనోహరుడవూ, కల్పవృక్షమువంటివాడవు! నీ దర్శనాన్ని నాకు ప్రసా దించిన ఆ మంత్రము సహితం అత్యంత ప్రభావవంతమైనది! నాపై నీ దయను ప్రసరించు!”

గజాననుడిలా అన్నాడు:-

“ఓ మన్మధా! నీవు పలికినదంతా అక్షరసత్యం! బ్రహ్మరుద్రాదులు సైతం నా నిజతత్వాన్ని తెలుసుకునేందుకు సమర్థులుకారు! వారైనా నా సాకార రూపాన్ని మాత్రమే ఎరుగగలరు! కేవలం నీయందలి అనుగ్రహ విశేషంచేత నీకు నా నిజస్వరూపదర్శనాన్ని ప్రసాదించాను! నీ తపమునకు నేను కడుసంతుష్టుడనైనాను! ఓ రతీపతీ! నీ మనో భీష్టములన్నీ తప్పక అనుగ్రహిస్తాను! కోరుకో!”

అప్పుడా మదనుడు ఆ గజాననుని అనుగ్రహ వచనాలను విని శివుని ఆగ్రహానికి తను దగ్ధుడవటమూ, తన భార్యయైన రతీవిలాపమూ, ఏకాక్షర మంత్రోపదేశము మొదలైన వివరాలను ఆ గజాననునికి విన్నవించి “ఓ దేవా! నీకు నాయందు అనుగ్రహం కలిగినట్లయితే నాకు సదేహత్వాన్ని ఒసంగుము! సర్వదేవతా మాన్యత్వమునూ, పూర్వంలో వలే శరీర లావణ్యాన్నీ, నీ చరణారవిందాలపై చెదరని ధృఢభక్తినీ మూడు లోకాలపైనా విజయాన్నీ కలుగచేయి!” అంటూ ప్రార్ధించాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”అనంగోపాఖ్యానం” అనే ఎనభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment