Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఎనభై తొమ్మిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

అనంగోపాఖ్యానం రెండవ భాగము

అనంగునికి గజానన వరప్రదానం

అప్పుడా వరదుడైన గణేశుడు మన్మధునితో యిలా అన్నాడు:-

“ఓ మన్మధా! నీవు కోరిన కోరికలన్నీ ఈడేరగలవు! నీవు రమాదేవి గర్భవాసాన జన్మించి సశరీరుడవవుతావు! సౌందర్యంతో అందరిచేత కొనియాడబడ తగినవాడవు, త్రైలోక్యవిజేతవూ కాగలవు! ఇక నీకు నీ కార్యసాధనలో సహకరించేందుకుగాను పుష్పములు, ఫలములు, లేచిగుళ్ళూ, కామినుల అవయవాలు, మలయమారుతములూ, వెన్నెలా, చందనమూ, పద్మములు, హంసధ్వనులు సహకరిస్తాయి! ఈ సామగ్రితో నీవు ఈశ్వరాదులనైనాసరే జయించగలవు! వీటి దర్శనస్పర్శనాదికముల చేత మనస్సులో జనిస్తావు!

నీకు లోకంలో మనోభవుడని, స్మృతిభవుడని ప్రసిద్ధనామములు కల్గుతాయి! నా చరణారవిందస్మృతీ, దృఢభక్తి నీకు కలుగగలవు! మహత్కార్యము సంభవించినప్పుడు నన్ను స్మరించినంతనే నీకు దర్శన మిస్తాను!” అంటూ వరాలను గుప్పించి ఆ అనుగ్రహమూర్తి అంతర్ధానం చెందాడు..

“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా అభీష్టసిద్ధిని పొందిన కాముడు అక్కడనే మహాగణపతియొక్క మూర్తిని స్థాపించి ఎనలేని భక్తితో పూజించాడు. అప్పుడతని పత్నియైన రతీదేవి లడ్లు, మోదకములు మొదలైన నానావిధ పక్వాన్నములను ఆ గణేశునకు మహానైవేద్యంగా భక్తితో సమర్పించింది. తేజోసంపన్నుడైనట్టి ఆ గజాననునికి మహోత్కటుడు అన్న నామకరణంచేసి రత్నస్థంభ విరాజితమైన ఆలయ ప్రాసాదాన్ని నిర్మించాడు.

ఆ తరువాత అనతికాలానికే అనంగుడు శ్రీకృష్ణపత్నియైన రుక్మిణీ దేవియొక్క గర్భవాసాన జన్మించి సముద్రంలో శంబరాసురునిచే పారవేయబడ్డాడు. అప్పుడతడు చేపతో మ్రింగబడినాడు. ఆ చేపనే జాలరులు శంబరాసురునికి సమర్పించగా అతని భార్యయైన మాయాదేవి దగ్గర పెరిగి పెద్దవాడైనాడు. నారదునిచేత ప్రేరేపితురాలైన ఆ మాయాదేవి మన్మధునికి మాయలన్నీ చక్కగా ఉపదేశించింది.

ఆ మాయాబలంతోనే ఆ ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించాడు! గణేశుని అనుగ్రహవిశేషం చేత ఒక్కడైనప్పటికీ ఆ బాలుడు అనేకమంది శత్రువులను నిర్జించి, ప్రద్యుమ్నుడన్న నామధేయం ధరించి సారస్వతపురానికి వెళ్ళాడు. అప్పటినుండీ సర్వదేవతామాన్యుడై, త్రైలోక్య విజేతయై, గజానన అనుగ్రహంచేత మహదానందాన్ని పొందాడు!

రుక్మిణి మొదలైన వారందరూ అతణ్ణిచూసి కృష్ణుడేమోనని పొరబడినా నారదునిద్వారా అతడు తమ కుమారుడేనని ఎరిగి పరమానంద భరితులైనారు. అప్పుడు రతీదేవికూడా అతని చెంతచేరి భక్తితో ప్రణమిల్లింది!

“ఓ వ్యాసమునీంద్రా! ఈ రీతిగా అనంగుడిచేత ప్రతిష్ఠితమైన జనస్థానగతుడైనట్టి గణేశమహాత్యం యావత్తూ నీకు తెలిపాను! ఇక్కడనే పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు శూర్పణఖను తిరస్కరించగా లక్ష్మణుడామె నాసికను, చెవులను కోయడంచేత ”నాసిక” అను పేరుతో ప్రసిద్ధి చెందింది.

ఈ ప్రదేశంలో ఈనాటికీ రాళ్ళుసైతం మోదకములలా కనబడతాయి! ఈ రకంగా కామునిచేత ఆరాధింపబడిన గణేశుడు అతడిని కృతకృత్యుడిని గావించాడు. ఇక్కడనే రతీమన్మధులు తిరిగి సాంగముగా కలిసి ఆనందించారు. షడక్షరమంత్రంతో శేషుడు ఆరాధించినట్లుగానే మదనుడైన మన్మధుడుకూడా మంత్రానుష్టానంచేసి గణేశానుగ్రహాన్ని పొందాడు!” అంటూ చెప్పాడు చతురాస్యుడు!

అప్పుడు వ్యాసమునీంద్రుడు తిరిగి బ్రహ్మనిలా ప్రశ్నించాడు:-

“ఓ చతురాననా! శేషుడెలాగ గజాననుని ఆరాధించాడు? ఎందుకని ఆరాధించాడు? ఏయే వరాలను పొందాడు? ఈ యావద్ వృత్తాంతాన్నీ విస్తారంగా వినిపించి నన్ను ధన్యుడిని గావించు!”

శేషుడు గజాననుని ఆరాధించి వరాలను పొందుట

“ఓ వ్యాసమునీంద్రా! నీవడిగిన ప్రశ్న చాలా సమంజసమైంది సావధానమనస్కుడవై విను!” ఒకానొకప్పుడు శంకరుడు పార్వతీసమేతుడై, కైలాసశిఖరంపై కొలువుతీరి వుండగా సమస్త దేవతాగణాలు వారి సందర్శనార్ధమై విచ్చేశారు. సాష్టాంగ దండప్రణామాలను ఆచరించి, అద్భుతమైన తమ గానకళా కౌశలంతో శంకరునికి ప్రీతిగావించారు గంధర్వులు! అప్సరసలు లయబద్ధంగా నాట్యంచేశారు. కొందరు మునులు నేత్రములు మూసుకుని ధ్యానించసాగారు. కొందరా గౌరీవల్లభుడిని మానసికోపచారములతో పూజించారు. వశిష్ట, వామదేవ, జమదగ్ని, అత్రి, కణ్వ, భరద్వాజ, గౌతమాది మునీశ్వరులంతా వివిధ స్తోత్రాలతో స్తుతించసాగారు!

శేషునకు మూడులోకాలలోనూ నేనే శ్రేష్టుడిని! అందువల్లనే శంభుని శిరస్సు పైన ఉన్నాను. భూధారణ సామర్ధ్యం నాకుకాక యితరులెవ్వరికీ లేదు కదా! నా కులానికే చెందిన వాసుకిని కవ్వపుత్రాటిగా చేసుకొనే దేవతలు అమృతాన్ని సిద్ధింపచేసుకొని అమరులైనారు! గనుక నాకంటే ఉత్కృష్ట మైన వారెవరూలేరు” అన్న తలంపు కలిగింది.

శివుడాతని మనోగర్వమును తెలుసుకుని అందుకు ఆగ్రహావేశుడై తలపైనున్న శేషుని నేలపైకి విసిరికొట్టాడు! శేషుని యొక్క ఒక్కొక్క శిరస్సు పదేసి భాగాలై మూర్ఛిల్లి మరణించినవానివలే పడియున్నాడు.

ఇలా ప్రాణమాత్రావశిష్టుడైన శేషుడు దుఃఖిస్తూ తనలో తానిలా అనుకున్నాడు.ఆహా! త్రైలోక్యేశ్వరుడైనట్టి శివునికే శిరోలంకారాన్నైనప్పటికీ ఇటు వంటి దురవస్థను ఏ దుష్కర్మ కారణంచేత పొందానోకదా! ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా ఎటూ కదలలేకుండా వున్నాను.

ఇప్పుడు నేనేమి చేయను? ఎటుపోను? నన్ను రక్షించి సేదతీర్చే వారెవ్వరు? తిరిగి నా స్వస్థానమును పొందగల ఉపాయం చెప్పే వారెవ్వరు? అనుకుంటూ విచారిస్తూండగా ఆతడికి మార్గమధ్యంలో వస్తూన్న నారదుడు దైవవశాన కనిపించాడు.

నిర్ధనుడికి స్వప్నంలో నిధి లభించినంత ఆనందాన్ని పొందాడు శేషుడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”అనంగోపాఖ్యానం” అనే ఎనభై తొమ్మిదవ అధ్యాయం.సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment