ఉపాసనా ఖండము రెండవ భాగము
శేషోపాఖ్యానము రెండవ భాగము
వ్యాసమహర్షి యిలా ప్రశ్నించాడు:-
“దేవా! గణేశభగవానుని కధామృతం ఎంతవిన్నా అమృతంవలే తృప్తి కలుగుటలేదు! ఇంకనూ వినవలెనన్న ఆసక్తి కలుగుతున్నది. ప్రభూ! ఇంకనూ గణేశకధామృతమును ప్రసాదించు!” అనగా
బ్రహ్మదేవుడు చెబుతున్నాడు:-
“ఒకానొకప్పుడు పూర్వకాలము ప్రళయం సంభవించింది! అప్పుడు గజాననుడు నాకు కర్తవ్యం జ్ఞాపకంచేస్తూ “ఓబ్రహ్మదేవుడా! నానావిధమైన సమస్త సృష్టినీ నా ఆజ్ఞతో నీవు వెంటనే ప్రారంభించి యధాప్రకారం సమస్తమూ సృష్టించు!” అనగా ఆ ప్రకారమే నేను సంకల్పంచేసి ఏడుగురు మహర్షులను మానవపుత్రులుగా సృష్టించితిని. వారి పేర్లు చెబుతున్నాను
1) కశ్యపుడు
2) గౌతముడు
3) జమదగ్ని
4) వశిష్టమహర్షి
5) భరద్వాజుడు
6) అత్రిమహర్షి
7) విశ్వామిత్రుడు.
ఈ ఏడుగురినీ సర్వవిద్యా విశారదులైన సప్తఋషులుగా మనసా కల్పించాను. వారందరూ నాకు ప్రణమిల్లి”బ్రహ్మన్ ఆజ్ఞాపించు! మేమేం చేయాలో! ఆ విధంగా చేస్తాము!” అన్నారు. వారందరిలోకి విశేష బుద్ధిమంతుడైన కశ్యపుని ఆజ్ఞాపించగా “నా సమస్త సృష్టికార్యములూ నేను చెప్పిన విధంగా ప్రారంభించుము!” అనగా “అలాగే చేసెదను” అని నాతోచెప్పి వనముల కేగి ఘోరతపస్సు చేశాడు. అలా దివ్యసహస్రవర్షముల కాలం ఏకాక్షర గణపతి మహామంత్రమును తీవ్రనిష్టతో జపించగా పరమేశ్వరుడగు గజాననుడు సాక్షాత్కరించాడు.
చతుర్భుజుడు, పద్మసుందరనేత్రుడు మహోజ్వల కిరీటధారి, పాశాంకుశములను ధరించి, ఏకదంతమును, చేతిలో అక్షమాలను ధరించి, కంకణకేయూరాది సువర్ణ మణిరత్నములతో విరాజిల్లే ఆభరణములతో, సర్పము చుట్టిన ఉదరముతో, కోటిసూర్యుల తేజస్సు తో బ్రహ్మాండమును ప్రజ్వలింపచేస్తూ, అందమైన తొండముతో సుందర ముఖుడై సాక్షాత్కరించాడు.
ఆ విధంగా కశ్యపమహాముని ఎదుట ప్రత్యక్షమైన గజాననుడు చిరుగంటలు సుందరశబ్దంతో, అందెల సుందర రవళితో నాట్యంచేస్తూ తన ముద్దుపాదముల ధ్వనితో ఆనందతాండవం చేయగా చూసి, కశ్యప మహర్షి ఆనందం భరించరాక నిర్భరహృదయంతో పులకించాడు. భక్తివినమ్రుడై నానామంగళవస్తువులను తెచ్చి పూజించాడు.
తనముందు సాక్షాత్కరించిన ప్రసన్నుడైన గజాననుని అంజలి ఘటించి యిలా ప్రార్ధించాడు “ధన్యుడు నాతండ్రి! ధన్యురాలు నాతండ్రి! నీదయతో యింతటి సుందరరూపాన్ని దర్శనమిచ్చావు! నా అదృష్టమేమని వర్ణించను? ఆహా! ఈ భూమి చరితార్థురాలు! ధన్యురాలు! భూమిపై తరు, వృక్ష, ఫలములు సార్ధకవంతములు! ఆహా! నేడుకదా ఏకాక్షరగణపతి మంత్రముతో సిద్ధించిన ప్రత్యక్షంతో సర్వేశ్వరుడైన గణపతి దర్శనంతో ధన్యుడనైతిని!
పరమాత్మావతారుడైన శ్రీ గణేశభగవానుడు ఎదుట సాక్షాత్కరించగా సాక్షాత్తూ ఆ చతుర్వేదములే వాక్కు పెగలక మూగపోగా ఇక నేనా? ఆహా! మనస్సుకు అగోచరుడు, తర్కంచేత అందనివాడు సాక్షాత్పరమేశ్వరుడైన గణేశుడు నాముందు స్వయంగా సాక్షాత్కరించి ఈశ్వర, విష్ణు ప్రభృతులైన దేవతలను, సృష్టికర్తను అనుగ్రహించినాడు. పాతాళం ఆదిగా, ఏడు అధోలోకములు పైని ఏడు ఊర్ధ్వలోకములు కలిసి చతుర్దశ భువనాలూ ప్రళయంచెందినా సనాతనుడూ, శాశ్వతుడైన పర మాత్ముడైన గణేశుడు ఈనాడు నాకు దర్శనమిచ్చినాడు!
ఎవరు నిర్గుణుడో, గురువువలే శరణుపొందతగిన పరమగురువో ఎవరు పరబ్రహ్మ స్వరూపియో అట్టి లోకగురువు భగవంతుడైన గణేశుడు ఈనాడు కదా! నాకు దర్శనమిచ్చినాడు!
ఈవిధంగా అమృతమును కురిసే వాక్కులతో ప్రసన్నుడైన గజాననుడికి ప్రణమిల్లిన కశ్యపమహర్షియొక్క స్తోత్రముతో ఆనందించి గజాననుడు ఈ విధంగా అనుగ్రహించాడు.
గణేశ ఉవాచ :-
“నీయొక్క పరమప్రేమకూ గాఢమైన భక్తికీ మిక్కిలి సంతోషించితిని! ఓ మునీశ్వరా! నీవేమి వరం కోరుకున్నా అది నేను మనోభీష్ట ప్రకారమే అనుగ్రహిస్తాను! నీ సంకల్పము తప్పక నెరవేర్చెదను! వరము కోరుకున్నాము.
కశ్యప ఉవాచ:-
“ఓ ప్రభూ! దేవా! సమస్త సృష్టినీ నానావిధ రూపములతో యధాప్రకారం సృష్టించే శక్తినినాకనుగ్రహించు! అంతేకాదు నీపాద పద్మములయందు చంచల భక్తివిశ్వాసములను, ఎన్నడూ నీ పాదములను మరువకుండు జ్ఞప్తినీ ప్రసాదించు. నేను ఎప్పుడెప్పుడు భక్తితో నీ దర్శనంకోరి ప్రార్ధిస్తానో అప్పుడు నీవు తప్పక నాకు అనుగ్రహించవలెను. అంతేకాదు! సాక్షాత్తూ నీవంటి సత్పుత్రునే కశ్యపనందనునిగా నాకనుగ్రహించు!” అంటూ కోరగా
గణేశ ఉవాచ :-
“ఓ మహామునీ! నీవు కోరిన వరాన్ని సంతోషంతో అనుగ్రహిస్తున్నాను! నాయందు అచంచలమైన మరపులేని భక్తినీ, నీకెపుడెపుడు అవసరములు సంకటములు కలిగితే అప్పుడే నీకు సన్నిధిలో ప్రత్యక్షం అవగలను. నా అనుగ్రహంతో ప్రసాదించిన సిద్ధివల్ల చిత్రవిచిత్రములైన సృష్టి చేయగలవు. ఇదే నా ఆశీస్సులు!
కశ్యప ఉవాచ:-
ఈ విధంగా గణపతి దేవుడు కశ్యపమహామునికి వరమిచ్చి మెరుపు మెఱసినట్లు అక్కడే మాయమైనాడు. కశ్యపమహాముని పరమానంద హృదయుడై తన స్వస్థానమునకు వెళ్ళెను.
ఇలావుండగా ఇంకొకసారి అకస్మాత్తుగా కశ్యపునకు శరీరంలో పీడ సంభవించింది. కొంచెంకూడా శరీరాన్ని కదపలేని అశక్తుడై గృహంలోనే కూలబడిపోయాడు. తాను చేయవలసిన నిత్య నైమిత్తికములైన వేదకర్మలు, కామ్యకర్మలు, సమస్త కర్మలూ చేయలేక అశక్తుడై భయ కంపితుడై తన పధ్నాలుగురు భార్యలైన (1) దితి (2) అదితి (3) వినత (4) కద్రువ మొదలైన పడ్నాలుగు మంది భార్యలూ భర్తయొక్క దురవస్థను చూసి దుఃఖములో కశ్యపునివద్దకు వచ్చి నిలిచారు.
అప్పుడు కశ్యపుడు వారలతో ఇష్టసుఖములను అనుభవించి వారి సంకల్పములను తీర్చగా వారు గర్భములను ధరించి సకాలములో సంతానములు కనిరి! అట్లు వారు కన్న సంతానమే
అదితికి – దేవతలు, గంధర్వులూ,
దితికి – దైత్యులూ, దానవులూ
అలానే క్రమంగా గంధర్వ, యక్ష, రాక్షస, కిన్నర, సిద్ధ, చారణ, కింపురుషగణాలు సృష్టించబడ్డారు. పృధివి, పర్వతములు, వృక్షములు, సముద్రములు, నదులు, లతలు, ఓషధులు, గామ్య, అరణ్య, పశువులు, సమస్త ధాతువులు, రత్నములు, ముత్యములు, సర్పములు, పక్షిగణములు, క్రిమికీటకాది, పిపీలికాది జీవగణము సమస్తమూ ఈ సమస్త చరాచర సృష్టి అంతా జన్మించింది.
ఇంకా ఉంది
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹