Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – తొంబై రెండవ అధ్యాయము

గజానన మహిమా నిరూపణం

ఉపాసనా ఖండము రెండవ భాగము

అనంతరం బ్రహ్మ యిలా అన్నాడు: “ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా సృష్టించబడిన చరాచర జగత్తులోని వారందరూ దేవదేవుడైనట్టి గజాననునికి స్తోత్రంచేసి తిరిగి ఆ గణాధ్యక్షునితో యిలా అన్నారు ఓ దేవా! మేమిప్పుడు ధన్యులమైనాము. మీ సందర్శనభాగ్యంచేత మా నేత్రములు పావనమైనాయి!”

ఇట్టి వినయాన్వితములైన వారి వాక్కులను విని సంతసించిన గజాననుడిలా అన్నారు.

‘ఓ జీవులారా! నా ఈ రూపాన్ని బ్రహ్మరుద్రాదులు సహితం దర్శించజాలరు. నిర్గుణ స్వరూపుడనైన నేను మీయందుగల వాత్సల్యం చేతనే నా ఈ సగుణమూర్తిని దర్శింపజేసాను. మీ ఈ స్తుతికి సంతసించి వరములీయ వచ్చాను! మీరు మీ ఇచ్ఛాను సారం వరాలను కోరుకోండి!’

అప్పుడు “ఓ వ్యాసమునీంద్రా! వారంతా తమకు కావలసిన వరాలను కోరుకున్నారు. అసంఖ్యాకములైన ఆ వరాలను వర్ణించటం నా తరముకాదు! ఆ వరాలన్నీ అనుగ్రహించి, గజాననుడిలా అన్నాడు.

నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ స్తోత్రాన్ని త్రిసంధ్యలలోనూ పఠించినవాడు పుత్రవంతుడు, ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడూ కాగలడు! కీర్తి జయము రెండూ సంప్రాప్తమవుతాయి! వాంఛితార్థములన్నీ పొంది అంత్యమున మోక్షాన్నికూడా పొందగలడు!

త్రిసంధ్యలలోనూ ఈ స్తోత్రాన్ని ముమ్మారు భక్తితో పఠిస్తే సర్వ కార్యాలూ సిద్ధిస్తాయి! ఎనిమిదిరోజులపాటు రోజూ ఎనిమిదిసార్లు పఠించి, చతుర్థీతిధియందు కూడా ఎనిమిదిసార్లు పఠిస్తే అష్టసిద్ధులూ కలుగుతాయి!

రోజూ పదిసార్లు చొప్పున ఈ స్తోత్రాన్ని మాసముదినాలు పఠిస్తే రాజుయొక్క బంధనములనుండి విముక్తుడౌతాడు!

ఇరవైఒక్కసార్లు జపించితే విద్యాకాముడికి విద్య, ధనం కోరినట్టి వానికి ధనమూ, పుత్రులను కోరినవానికి పుత్రులూ ఇలా ఎవరేమి కోరితే వారికి అది లభిస్తుంది!” అంటూ గజాననుడు అంతర్ధానం చెందాడు! అప్పుడా సమస్త పరివారమూ ఎవరికివారు తమకు వేరువేరుగా ప్రత్యేకమైన గణేశుని వివిధ మూర్తులను స్థాపించి పూజించారు.

దేవతలు తమ మూర్తిని “సుముఖుడ”నీ, మునులు తాము స్థాపించిన మూర్తికి “ఏకదంతుడ”నీ కీర్తించారు. గంధర్వులూ, కిన్నరులూ “కపిలుడన్న” నామంతో అర్చించారు. గుహ్యకులూ, చారణులూ, సిద్ధులూ మహాప్రాసాదాన్ని నిర్మించి అందులోని మూర్తికి “గజకర్ణుడని” నామముంచి పూజించారు.

ఆ పూజాప్రభావంచేత వారంతా దివ్యవిమానాలను అధిరోహించి స్వర్గారోహణం చేశారు. ఆ తరువాత మానవులంతా”లంబోదరు”డన్న నామధేయంతో మూర్తిని స్థాపించి పూజించారు! పక్షులన్నీ తమ గణేశ మూర్తిని వికటుడన్న పేరుతో పూజించి వనాలలోకి ఎగిరిపోయాయి.

పర్వతాలు, వృక్షాలు తాము స్థాపించిన మూర్తికి విఘ్ననాశనుడన్న పేరుతో పూజించాయి. ఆ ప్రభావంచేత పర్వతాలు, వనాలూ వృద్ధి చెందాయి.

పక్షిగణాలు ఒకమూర్తిని స్థాపించి గణాధిపుడన్న నామముంచాయి. విషధరజీవులన్నీ “ధూమకేతు” వన్న పేరుతోనూ జలాశయాలన్నీ “గణాధ్యక్షుడన్న పేరుతోనూ పూజించాయి.

క్రిమికీటకాదులన్నీ ఓషధీగణాలతోకూడినవై తాము స్థాపించిన గణేశమూర్తికి”ఫాలచంద్రు”డన్న నామంతో పూజించాయి. ఇంకా ఇతర చేతనములన్నీ అనేక గణేశమూర్తులను స్థాపించి భక్తిభావంతో పూజించాయి.

“గజానను”డనే పేరుగల మూర్తి అందరకూ సకల కోరికలనూ ప్రసాదించునటువంటిది! ఇలా సమస్త లోకాలలోనివారూ గజాననుని అనుగ్రహవిశేషం చేతనే తమతమ కార్యాలను నెరవేర్చుకోవటంలో దక్షులై విలసిల్లారు. ఆ దేవదేవునికి గల అనంతనామముల యొక్క ఫలమింతని చెప్పటానికి శక్యముకాదు. వాటిలోని సారమునే గ్రహించి సహస్ర నామములను చెప్పాను.

అట్టివాటిలోకెల్లా సారభూతమైనట్టివి పన్నెండు నామములు! సముద్రమధనంచేత పధ్నాలుగు రత్నాలు లభించినట్లుగా, సహస్రనామములనూ మధించుటచేత గణేశ ద్వాదశనామాలు లభించాయి!

ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా సంక్షేపంగా గజాననుని మహిమను నీకు వర్ణించాను! విస్తారంగా చెప్పటానికి త్రిమూర్తులకుగాని ఆదిశేషునికిగాని తరంకాదు! ఇక ఇతరులెంతటివారు? అందుచేత సర్వకార్యములయందూ గజాననుడు తప్పక పూజించితగినట్టి మహ నీయుడు! ఎవరు ఆ దేవదేవుని పూజించక అలక్ష్యం చేస్తారో అట్టి దురాత్ముల కెన్నడూ కార్యసిద్ధి కలుగనేరదు!

అప్పుడు వ్యాసమునీంద్రుడిలా ప్రార్ధించాడు. “ఓ చతురాననా! ఆ ప్రసిద్ధమైనట్టి, అనంతఫలప్రదములైనట్టి ద్వాదశనామాలను చెప్పు! వేటిని పఠించటంవల్ల, వినటంవల్లా నిర్విఘ్నతను సులభంగా పొంద గలరో? అనగానే బ్రహ్మ యిలా అన్నాడు.

(1) సుముఖుడు

(2) ఏకదంతుడు

(3) కపిలుడు

(4) గజకర్ణుడు

(5) లంబోదరుడు

(6) వికటుడు

(7) విఘ్ననాశనుడు

(8) గణాధిపుడు

(9) ధూమ్రకేతుడు

(10) గణాధ్యక్షుడు

(11) ఫాలచంద్రుడు

(12) గజాననుడు

ఈ పన్నెండూ విశేషప్రభావంగల గణేశుని ద్వాదశనామాలు! ఈ నామాలనూ విన్నా, పఠించినా, విద్యారంభములోనూ, కార్యప్రవేశము లోనూ, ప్రయాణ సమయంలోనూ, సంగ్రామ సమయంలోనూ, ఆపత్సమ యాలలోనూ దీనిని విన్నా, పఠించినా విఘ్నములన్నీ సమూలంగా నశిస్తాయి!

తెల్లని వస్త్రమును ధరించి, చంద్రుని వర్ణముతో కూడినట్టివాడూ నాల్గు చేతులు కల్గిన అనుగ్రహమూర్తిగా ఆ దేవదేవుని ధ్యానిస్తే సకల విఘ్నములనూ హరిస్తాడు!

కోటియజ్ఞముల ఫలంకానీ, కోటివ్రతాచరణవల్ల కల్గిన ఫలంగాని, తపస్సుగాని యిందులో నూరోవంతు ఫలాన్నికూడా యివ్వలేవు!ఉదయాన్నే ఈ నామములను ఎవరు శ్రద్ధతో పఠిస్తారో అట్టివారి కెన్నడూ కార్యవిఘ్నములు కలుగవు! అట్టివారియొక్క సకల కార్యములూ సిద్ధిస్తాయి! అట్టివారిని దర్శించినంతనే లోకాలన్నీ పవిత్రమౌతాయి.

అందుచేతనే ఓ వ్యాసమునీంద్రా! సౌర, శైవ, శాక్త, వైష్ణవ సాంప్రదాయికులంతా ఈ గణేశ ద్వాదశనామాలను ఉచ్ఛరించి, ఆ తరువాతనే తమ స్వకర్మలను నిర్వర్తిస్తున్నారు. ఈ పవిత్ర నామోచ్ఛరణవలన కార్యసిద్ధి తప్పక కలుగుతుంది!

“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా ద్వాదశనామముల మహిమనూ నీకు పూర్తిగా వివరించాను. పావనుడైన గణేశుని ఉపాసించుటవల్ల కలిగే ఫలితాన్ని నాకు వీలైనంతమేర వర్ణించాను.

ఈ గణేశోపాసన యొక్క అంత్యముగురించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుగూడా ఎరుగజాలడు!” అంటూ ముగించాడు.

అప్పుడు భృగుమహర్షి సోమకాంతమహారాజుతో యిలా అన్నాడు. “ఓ సోమకాంతమహారాజా! ఈ విధంగా గజాననునియొక్క అద్భుతమైన అనంత మహిమలనన్నిటినీ నీకు సోదాహరణ పూర్వకంగా వివరించాను! దీన్ని గతంలో చతురాస్యుడైన బ్రహ్మ వ్యాసమునీంద్రునికి ఉపదేశించాడు!”

అలా ఈ గణేశ పురాణాన్ని శ్రద్ధతో ఆలకించినట్టి సోమకాంత మహారాజు యొక్క పూర్వజన్మ తాలూకు దుష్కర్మయావత్తూ నశించి ఆతడికి శరీర స్వస్థతను చేకూర్చింది!

అప్పుడు సూతమహర్షి శౌనకాది మహర్షులతో యిలా అన్నాడు: “ఓ మహర్షులారా! గణేశుని ఉపాసనాఖండమును యావత్తూ నానావిధ ఆఖ్యానాలతోవర్ణించిచెప్పాను! నా గురుదేవుడైన వేదవ్యాసునికి బ్రహ్మ ఏవిధంగా ఉపదేశించాడో, అలాగే యావత్ వృత్తాంతాన్నీ మీకు వివరించాను.

ఈ గణేశపురాణాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో, వింటారో, అట్టివారు తమ సర్వసంకటములనుండీ ఆపదలనుండీ విముక్తులై ఇహలోకంలో పుత్రపౌత్రాభివృద్ధినీ (వంశవృద్ధినీ) ఆయురారోగ్యైశ్వర్యాలనూ బడసి, జ్ఞానవంతులై పునరావృత్తిరహితమైనట్టి మోక్షాన్ని పొందుతారు!

ఈ కధను పరమఆదరంతో విన్నట్టి సోమకాంత మహారాజెట్టి శుభములు పొందాడో,అట్టి శుభ ఫలితాలనూ గణేశుని పరమానుగ్రహాన్నీ పొందగలరు!

స్వస్తి! శుభం!

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని బ్రహ్మ, వ్యాస,సోమకాంత వాద రూపమైన ”గజాననమహిమా నిరూపణం” అనే తొంబై రెండవ అధ్యాయం సంపూర్ణం!!!

ఉపాసనాఖండం సమాప్తం!

సర్వం శ్రీ గజాననార్పణమస్తు!!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment