నరకాసురవధ
వ్యాసులిట్లనియె:- ”ఇంద్రుడు ఐరావతమెక్కి ద్వారవతియందున్న కృష్ణుని చూడవచ్చి అతనికి నరకాసురుని చర్యలను తెలిపెను. దేవతలకు దిక్కయిన నీవు మనుష్యరూపమున నుండియు సర్వదుఃఖ ప్రశమనము చేసినావు. తపశ్శాలుర రక్షణకు అరిష్టుడు మొదలుగా కంసునిపరకు గల జగదుపద్రవమైన వారిని నశింపజేసితివి. నీ బాహుదండము చేతను ప్రబోధముచేతను త్రిభువనములు రక్షణముబొంది దేవతలు యజ్ఞములందు హవిర్భావములారగించి తృప్తులగుచున్నారు. నేనిపుడు ఎందులకు వచ్చితినో విని ప్రతిక్రియకు యత్నింపుడు. భూమిపుత్రుడు నరకుడనువాడు ప్రాగ్జ్యోతిష పురాధిపతి సర్వభూతములకు బాధచేయుచున్నాడు. దేవసిద్ధులు సురులు మొదలగువారి కన్యకల హరించి తనయింట నిర్భంధించినాడు. ఉదకమును స్రవించు వరుణుని యొక్క గొడుగును వాడు హరించెను. మణులకు ఆకరమైన మందర పర్వత శిఖరమును గొనిపోయినాడు. మాతల్లి అదితియొక్క కుండలములను అమృతము స్రవించు వానిని కాజేసినాడు. ఇపుడు ఐరావతము కావలెననుచున్నాడు . వాని దుష్కృత్యము నీకు నివేదించినాను. ఇందు జేయవలసిన ప్రతిక్రియ నీవు స్వయముగా విమర్శింపుము.
అనవిని భగవంతుడు దేవకీసుతుడు అల్లన నవ్వి ఇంద్రునిజేత పట్టుకొని పీఠమునుండి లేచెను. తలచినంతన వచ్చిన గరుత్మంతునిపై సత్యభామను ఎక్కించి ప్రాగ్జ్యోతిష పురమునకేగెను. ఇంద్రుడు ఐరావతమునెక్కి ద్వారకావాసులు చూచుచుండ స్వర్గమున కేగెను.
ప్రాగ్జ్యోతిష పురము చుట్టునూ నూరు యోజనములు భయంకరములైన పాశములచే జుట్టబడి యుండెను. పరసైన్య నిరోధమునకు ఏర్పడిన ఆ పాశములను సుదర్శనాయుధము విసరి హరి ఖండించెను. అవ్వల మురాసురుడు ఎదిరింపరాగ హరి వానిని గడతేర్చెను. మరియు వాని కొడుకులను ఏడువేలమందిని మిడుతలను వలె చక్రధారాగ్ని దగ్ధులను జేసెను. అచ్చటనే హయగ్రీవుని చంపి బుద్దిశాలియగు హరి తొందరతో ప్రాగ్జ్యోతిషపురమునకు పరుగెత్తెను. అచ్చట నరకునితో మహాసైన్యముతో ఘోర యుద్ధమయ్యెను. గోవిందుడు వేలకొలది దైత్యులను గూల్చెను. అవ్వల శస్త్రాస్త్రములను వర్షించుచున్న భౌముని మీకిది చక్రాయుధమును విసరి దైతేయచక్రసంహారి వానిని రెండుగ జేసెను. నరకుడు కూలగా భూదేవి అదితి ఇచ్చిన కుండలములు గొని జగన్నాధు సన్నిధికి వచ్ఛి యిట్లనియె.
భూమికృత కృష్ణస్తుతి
”స్వామి! వరాహమూర్తివై ననుద్ధరించినపుడు ఆ నీ స్పర్శవలన నీ పుత్రుడు పుట్టినాడు. నీవు ఇచ్చినవాడు వీడు. నీ చేతిలో కూలినాడు. ఈ కుండలములను గైకొనుము. ఈ నరకుని సంతానమును రక్షింపుము. నా భారమును దింపుటకు నీవీ లోకమున అంశావతార మెత్తినావు. అనుగ్రహ సుముఖుడవు గమ్ము. నీవు కర్తవు. వికర్తవు. (వేరు చేయువాడవు) సంహర్తవు. సృష్టిహేతువవు. జగత్స్వరూపుడవు.నిన్ను నేనెక్కడ స్తుతింపగలను , వ్యాపించువాడవు. వ్యాపింపబడువాడవు. చేయువాడవు. చేయనగు పని చేయుటయు నీవె. సర్వ భూతములకు ఆత్మ స్వరూపుడవు. నేనెక్కడ స్తుతింతును. ఆత్మ (జీవుడు) భూతాత్మ (భూత స్వరూపము) పరమాత్మవు నీవె. నరకుడు చేసిన దానిని దప్పిదము కాకుండ క్షమింపుము. ప్రసన్నుడవు కమ్ము. వీడు నా కుమారుడు. కూల్పబడినాడు.” అని భూదేవి హరిని స్తుతించెను.
కృష్ణుడు ధరణితో నట్లేయని నరకునింటనున్న రత్నములను దీసికొనెను. (రత్నములనగ మణులేకాదు ఆయా వస్తువులలోకెల్ల నుత్తమమయిన యెల్ల వస్తువులను) అంతఃపురమున పదహారువేలు పైన నూర్గురునగు కన్యకలను గూడ గైకొనెను. నాలుగు దంతములుగల ఆరువేల ఏనుగులనచట జూచెను. కాంభోజ దేశీయములైన గుఱ్ఱములు ఇరువదియొక్క నియతముల సంఖ్యగలవి వానియింట నున్నవి. నరకుని కింకరులచే అప్పటికప్పుడు గోవిందుడు ద్వారకాపురికి తరలింపజేసెను. వారుణచ్ఛత్రమట గనిపించెను. అట్లే మణి పర్వతమును. హరిదానిని ఖగరాజు గరుడనెక్కించెను. సత్యభామతో తాను అధిష్ఠించి అదితికి కుండలములిచ్చుటకు ద్రిదశపురికేగెను.
ఇది బ్రహ్మపురాణమున నరకాసురవధయను తొంబై ఆరవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹