ఇంద్రకృష్ణసంవాదము
వ్యాసుడిట్లనియె:-
భగవంతుడిట్లు దేవేంద్రునిచే బొగడొంది భావగంభీరముగ నవ్వి ఇట్లుపలికెను. జగన్నాథా!నీవు దేవప్రభుడవు. నేను ఇంద్రుడను . నే చేసిన అపరాధము నీవు క్షమింపవలయు, ఈ పారిజాతతరువును యథాస్థానమునకుగొంపొమ్ము. సత్యభామవచనానుసారము నేనిద్ధానింగొనివచ్చితిని. నీచే విసరబడిన ఈ వజ్రాయుధము పూజనీయము. దీనిని నీవే చేకొనుము. శత్రువులంజీల్చు నీప్రహరణము (ఆయుధము) నీదే. అన నింద్రుడిట్లనియె. స్వామి! నేను మర్త్యుడననిపలికి నన్ను తబ్బిబ్బు జేయనేల? భగవంతుడగునీవలని అనంత సౌఖ్యమును నెఱిగిన (రుచిమఱగిన) మేము నిన్నెఱుగదుము. జగన్నాథ! నీవెవ్వడవోయాతడే యగుదువుగాక! (నీస్వరూపమునుగూర్చి తర్కింప పనిలేదన్నమాట) అయినను ప్రవృత్తియందున్నావు. (నివృత్తియందు కేవలమునీవు సాక్షివి. కూటస్థ బ్రహ్మమయినను) జగత్కంటకుల నిష్కర్షను (= పెల్లగించివేయుటను) జేయుచున్నావు (దుష్టసంహారము కొఱకవతరించితివన్నమాట) కావున ఈపారిజాతమును ద్వారవతికిం గొంపొమ్ము. మర్త్య లోకమునీవు విడిచినతర్వాత నీవృక్షమటనుండదు. అన హరియు ఇంద్రునితో నట్లుకానిమ్మని ఆతనితోడి సిధ్ధగంధర్వులు ఋషులునుం గొనియాడ భూలోకమున కేతెంచి ద్వారకానగరముపై నుండి శంఖముం పూరించి పురవాసుల కానంద మొదవించెను.
అవ్వల సత్యభామతో గరుడుని దిగి పారిజాత తరువును సత్యభామ పెరటిలో నాటించెను. నగరమందలి జనమాన్వర్గ తరవుందర్శించి పూర్వ జన్మస్మృతినందిరి. ఆపారిజాతముయొక్క పూవులవాసనచే మూడు యోజనములదాక పరిమళించుట మఱియు యాదవులెల్లరు నాతరువునందు అద్దమందువలె తమ ముఖ దర్శనము సేయుటయేగాదు దేవగంధర్వ మానుషుల నెల్లరనందు దర్శించిరి. ప్రాగ్జ్యోతిషమునుండి నౌకరులు గొనివచ్చిన ఏనుగులు గుఱ్ఱములు ధనము స్త్రీలను కృష్ణుడు నరకుని పరిగ్రహమునుండి గ్రహించెను. అవ్వలనొక సుమూహుర్తమందు నరకుని చెఱనుండి విడిచి రప్పింపబడిన ఆ కన్యలందఱను (అవివాహితలనన్నమాట) తన కుల ధర్మానుసారము పదునాఱువేలమీద ఒకవందమందిని యథాశాస్త్రముగా పాణిగ్రహణ మొనరించుకొనెను. అయ్యెడ భగవంతుడు ఆతడందరకు అన్నిరూపములందాల్చెను. అకన్యకలును నెక్కొక్కతె కొక్కొక్కనిగా కృష్ణుంభావించి ఎవరిమట్టుకువారు గోవిందుడు నాపాణియే గ్రహించి నాచేతినే చేనెసని అనుకొనిరి.రాత్రులందు జగత్సృష్టికర్తయగు మాధవుడు యోగీశ్వరేశ్వరుండు గావున విశ్వరూపధరుండై అందఱియిండ్ల అన్నిరూపుల తానొక్కడే సంచరించెను.
ఇది బ్రహ్మపురాణమున కృష్ణచరిత్రమందు ఇంద్రకృష్ణ సంవాధము షోడశసహస్ర స్త్రీ పరిగ్రహము అను తొంబై ఎనిమిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹