అనిరుద్ధచరిత్ర
వ్యాసుడిట్లనియె:-
శ్రీకృష్ణునికి రుక్మిణియందు గల్గిన ప్రద్యుమ్నాదులగు పుత్రులం దెల్పితిని. సత్యభామయందు భానువు మొదలగు కుమారులు గల్గిరి. దీప్తిమంతుడు ప్రవక్షుడు మున్నగువారు రోహిణియందు గల్గిన తనయులు. సాంబాదులు జాంబవతి కుదయించిరి. నాగ్నజితియందు భద్రవిందాదులు పుట్టిరి. శైబ్యయందు సంగ్రామజిత్తు మొదలయిన కొడుకులుగల్గిరి. మాద్రికుమారులు వృకాదులు. లక్ష్మణ గాత్రవంతుడు మొదలగువారిం గనెను. కాళిందికి శ్రుతాదులుదయించిరి. మఱియి ఇతర భార్యలందు చక్రికి ఎనిమిదయుతములు నూరువేలును కుమారులు జనించిరి. (అయుతము పదివేలుx8=8000+100000=అనగా ఒకలక్షయెనుబదివేల మంది హరివంశమన్నమాట) అందరిలో రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు మొదటివాడు. అతనివలన అనిరుద్దుడుదయించెను. అతనికి వజ్రుడు పుట్టెను. యుద్ధములందు అనిరుద్ధుడు=నిరోధింపబడనివాడు. కావున అనిరుద్ధుడను పౌరుష నామమునందిన ఆతడు బలిపౌత్రిని బాణుని కుమార్తెను ఉషను పెండ్లాడెను. ఆ సందర్భముననే హరిహరులకు ఘోరయుద్ధమై బాణాసురుని వేయిబాహువులు చక్రిచే తెగగొట్టబడినవి.
మునులువిని ఉషానిమిత్తముగనైన ఆ యుద్ధ విశేషముల పూర్తిగ దెల్పుము. విన కుతూహలమగుచున్నది అన వ్యాసులిట్లనిరి.
బాణుని కూతురు ఉష శంకరునితో క్రీడించు పార్వతింగని తనలో తానెంతో ముచ్చట పడెను. అంతగౌరి అందరి డెందముల నెఱింగినది కావున తాపపడకు! నీవును మగనితో నిట్లేక్రీడింతువు లెమ్మనియె. అదివిని ఆ ముగ్ధ అప్పుడు నా మగడెవ్వడన మరల పార్వతి వైశాఖశుక్ల ద్వాదశినాడు కలలో నీకు అభిభవము=తిరస్కారమును (మానభంగమును) జేయునో యతడో రాచకన్నియ! నీకు భర్తకాగలడనియె.
చెలిచిత్రలేఖ మెల్లన లాలించు విశ్వాసము గల్గించినంత ఉషాదేవి గౌరి పలికినది పలికినట్లు చెలికత్తెకుందెలిపి వాని కుపాయము సేయమనియె. అంతట చిత్రలేఖపటమునందు సురలను దైత్యులను గంధర్వులను ప్రధానముగా మనుష్యులను లిఖించి చూపెను. ఆ బాలిక యందఱందలగించి మనుష్యుల చిత్తర్వులందు జూపుంచెను. వారిలోగూడ ఆంధక వృష్ణివంశములందు దృష్టిపెట్టెను. అందును కృష్ణుని బలరామునింగని సిగ్గుదొలకి కన్నులు విప్పార ప్రద్యుమ్నునిం జూడ లజ్జనిండినచూపును ప్రసరింపజేసెను. అవ్వల అనిరుద్ధుని గాంచి ఆ సిగ్గు ఎటు పోయెనో అతడే ఈతడు నాకని (నాకు కనబడినవాడని బాహ్యార్థము) నాకు గావలసినవాడని చెప్పగా సఖియగు ఆ చిత్రరేఖ నెచ్చెలినోదార్చి యోగశక్తిచే ద్వారవతికేగెను.
ఇది బ్రహ్మపురాణమున అనిరుద్ధచరిత్రమను తొంబై తొమ్మిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹