Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ఒకటవ అధ్యాయము

పౌండ్రక వాసుదేవ వధ

మునులిట్లనిరి.

మానుషమూర్తియై శౌరి ఇంద్రుని శంకరుని సర్వదేవతలను లీలామాత్రముగ గెలిచి మహత్కార్యము నొనరించెను. దేవతలు తెలియక చేసిన చేతలకు విఘాతము సేసిన హరి యింకను జేసిన లీలలను దెలుపుము. మాకు విన వేడుకయగుచున్నదన వ్యాసులిట్లనిరి.

”మునివరులారా ! తెలుపుచున్నాను. ఆదరముతో వినుడు. కృష్ణుడు నరావతారమున వారణాసి నగరమును గాల్చివైచెను. పౌండ్రకవాసుదేవుడు వ్రజలుతనతో వాసుదేవుడొకడు భూలోకమున సంచరించు చున్నాడు. నిజముగ అవతరించిన వాడవు నీవెయని పలుకుచుండవాడు వాసుదేవుడను నేనే. అవని నవతరించితినిననుకొనెను. దాన స్మృతి దప్పి వాడు విష్ణుచిహ్నములైన శంఖ చక్ర గదాదులను అయోమయముగ చేయించుకొని పెట్టుకొని కృష్ణునకు దూతను గూడ బంపెను.

ఆ పంపబడిన దూత వాని మాటలగ కృష్ణునికిట్లు చెప్పెను. ”ఓ మూఢ! చక్రాది చిహ్నములను నీ పెట్టుకున్న వాసుదేవడనెడి నా పేరును సర్వమును విడిచి నీవు బ్రతుకదలతువేని నాకు ప్రణతుడవగుము”. అన నవ్వి దూతతో భగవంతుడు ”నా చిహ్నమగు చక్రమును నీ యెడల విడిచెదను. అని అంటినని నా మాటగ నీవేగి పౌండ్రకునికి జెప్పుము. నీ మాటలోని మంచితనము నాకు తెలిసినది. చేయదగినదేదో చేయుము నేను నా చిహ్నములను దాల్చియే నీ పురమునకు వచ్చేదను. నా చిహ్నమయిన చక్రమును నీకొఱకు వదలెదను గూడ. సందేహము లేదు. ఆజ్ఞాపూర్వకముగ రమ్మని నీవన్న మాటను రేపే విలంబములేకుండ నీ కప్పగించెదను. నీ శరణము (దిక్కు)న కేతెంచి నీవలన మఱి యే కొంచెము భయము లేకుండ జేయవలసినపని చేసెదను.” అని పరిహాస గర్భముగ తెలుపబడి దూత చనినంతట స్మరణ మాత్రమున వచ్చి వ్రాలిన గరుత్మంతు నెక్కి త్వరితముగ హరి తత్ పురమున కేగెను.

కాశిరాజు హరి ప్రయత్నమును విని అపుడు పౌండ్రకుని పక్షమున సర్వసైన్య పరివారముతో పార్ణిగ్రాహియై (మడమలం ద్రొక్కికొని) వచ్చెను. ఆంతట నీ పౌండ్రక వాసుదేవుడు పెనుబలముతో కాశిరాజు బలముతోడను కేశవునకెదురు నిలిచెను. హరి ఉన్నత రథమందున్న వానిని శంఖచక్ర గదాహస్తుడైన వానిని ఒక హస్తమున పద్మముం బట్టిన వానిని వనమాలాధరుని శార్జమను విల్లు చేకొన్నవానిని బంగారపు నగిషీ చెక్కిన టెక్కముగల వానిని ఉరమున శ్రీవత్సచిహ్నమును దాల్చినవానిని (శ్రీవత్సాకారముగ పచ్చబొట్టు పొడిచికొన్నాడని యర్ధము) కిరీటకుండలధారిని పీతాంబరుని పౌండ్రకుని గని మధువైరి భావగంభీరముగ నవ్వెను.

చతురంగబలముతో గదాశూల శక్త్యాది సర్వాయుధములతో నెదిరించినవానితో కృష్ణుడు యుద్ధము జేసెను. శార్గ ధనుర్ముక్తములైన అగ్నిజ్వాలలచే ధారుణములైన గదాచక్ర పాతములచే క్షణములో వాని సైన్యమును హతమొనర్చెను. కాశిరాజు సత్వమును గూడ క్షయింపజేసి తన చిహ్నములం దాల్చియున్న ఆ మూఢునితో భగవంతుడిట్లనియె.

పౌండ్రక! దూతముఖమున నీవు పంపిన కబురంతయు విన్నాను. నా చక్రాదిచిహ్నములను వదలుమనికదా నీ యాజ్ఞ. అది యట్లే నిర్వహించినాను. ఇదిగో చక్రము. గద యిదిగో వదలుచున్నాను. గరుత్మంతుడిడుగో. నీ ధ్వజమిందెక్కుగాక! అని పలికి పలికిన క్షణమున హరివదలిన చక్రముచే వాడు చీల్చబడెను గదచేహతుడై పడెను. గరుత్మంతునిచే గరుత్మంతుడయ్యెను. అనగా రెక్కలు వచ్చినట్లై ఆకశమున కెగిరిపోయెనన్నమాట. అంతట లోకము హాహాకార మొనరించెను. మిత్రున కుపకారముగ కృతజ్ఞతగ కాశిరాజు వాసుదేవునితో తలపడెను. హరి శారఙ్గధనుర్ముక్తములైన అమ్ములచే వాని శిరమునరికి లోకమునకచ్ఛేరువు గల్గించుచు హరి కాశిపురికి విసరివెసెను. శౌరి పౌండ్రకుని గూల్చి పరివారముతో కాశిరాజుం జంపి ద్వారవతికి వచ్చి స్వర్గమున కేతెంచిన అమరుడట్లు విలసిల్లెను.

కాశిపతి రాజధానియందు బడిన వాని తలంజూచి యిదేమి యెపనిచేతనైనది యని జనము విస్మయమందెను. వాసుదేవునిచే ఆ కాశిరాజు హతుడయ్యెనని ఎరిగి వానికొడుకు పురోహితునితోనేగి విశ్వేశ్వరుని సంతోషపరచెను. (స్తుతించెను) శంకరుడు ఆవిముక్తమహాక్షేత్రమున వానిచే తోషితుడై ఆ రాజుసుతుని వరము గోరుకొమ్మనియె. వాడు స్వామి! నాతండ్రిం గడతేర్చిన కృష్ణుని గడతేర్పుటకు మహేశ్వర! నీయనుగ్రహమున కృత్యయను దారుణశక్తి లేచుగాక యనెను. ఇట్లేయగునని యనినంత వాని యగ్నిహోత్రశాలయందలి దక్షిణాగ్నినుండి మహాకృత్యలేచెను. అగ్నిజ్వలా భయంకరమైన ముఖముమంటలెగయుచున్న కేశకలాపముతో కృష్ణా! కృష్ణా!అని కోపముతో నది ద్వారవతి వంక జనెను. ఆరౌద్రమూర్తిని వికృతమగుకన్నులదానిని ద్వారకావాసిజనమెల్ల జూచి జగములకెల్ల శరణమైన మధువైరిని శరణొందెను.

కాశిరాజు వృషభధ్వజు నారాధించి యీమహాకృత్యను గృష్ణునిచంపుటకు బుట్టించెను. అగ్నిజ్వాలలతోడి జడలచే నాకులయైన ఆ ఉగ్రశక్తిని సంహరింపుము. అను జనఘోష చదరంగమాడుచు విని అటగ నగ్ని మాలాజటిలయై జ్వాలలంగ్రక్కుచునున్న అతిభీషణమైన ఆ కృత్యను విష్ణుచక్రము సుదర్శనము వెనుదరిమెను. మహేశ్వరదేవతాకయగు ఆకృత్య హరిచక్రవిధ్వన్తయై వేగమున బరువెత్తెను. దానిని చక్రము వెంబడించెను. అపుడా కృత్య విష్ణుచక్రముచే ప్రభావము గోల్పడి నది వారాణసిం బ్రవేశించెను.

అవ్వల కాశిరాజుసైన్యము అంతువడని ప్రమథ గణసైన్యము సర్వశస్త్రాస్త్రములతో చక్రమున కెదురుసనెను. శస్త్రాస్త్రాఘాతబహుళమైన ఆ సైన్యమునెల్ల దహింపజేసి అశేష కాశీ నగరమును నిండచతురంగ బలముతో రాజభృత్యులతో పౌరులతో దుర్గములతో కోష్ఠములతో గాల్చి గృహప్రాకార తోరణములందు మంటలు అలముకొన సత్వరము ఆ చక్రము వారణాసిని గాల్చెను. అక్షీణమైన కసితో సాద్యసాధనకారకములు శేషింప ఆ సుదర్శనా యుధము దీప్తిమంతమై విష్ణుహస్తమున కేతెంచెను.

ఇది బ్రహ్మపురాణమున పౌండ్రకవధ కాశీదాహమను నూట ఒకటవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment