బలదేవ మాహాత్మ్య వర్ణనము
బలరామ ప్రభావము
మునులనిరి.
ధీశాలి బలభద్రుని పరాక్రమము శౌర్యమును గూర్చి వినగోరెదము. యమునానదీ సమాకర్షణము మొదలగునవి విన్నాము. అతడు మఱియేమిసేసె నన వ్యాసుడు అనంతుడు భూమిని మోయునాదిశేషుడు నగు బలరామమూర్తి లీలలు వినుండు
స్వయంవరమున దృష్టివెట్టుకున్న దుర్యోధనుని కూతురును జాంబవతి కుమారుడు సాంబుడు బలాత్కారముగ హరించెను. దాన కోపించి కర్ణ దుర్యోధనాదులు భీష్మద్రోణాదులును వానిని బోరనోడించి బంధించిరి. అది విని యాదవులు దుర్యోధనాదులందు కోపము గొని వారిని గడతేర్తుమని ప్రతిక్రియకు బూనుకొనిరి. వారిని వారించి బలరాముడు సగర్వముగ నేనొక్కడను యేగెద. నామాటచే వానిని విడచెదరని నాగసము అను పురికేగి వెలుపలి యుద్యానవనమందు విడిసెను. నగరములోని కేగడయ్యె. బలభద్రుడు వచ్చెనని తెలిసి దుర్యోధనాదులు హలికి గోవును పాద్యార్ఘ్యములను నొసంగిరి. అవి స్వీకరించి కౌరవులతో ఉగ్రసేనుని ఆజ్ఞ యిది. సాంబుని వెంటనే విడువుడు. ఆన భీష్మద్రోణాదులు కర్ణదుర్యోధనులును విని కోపించిరి. బాహ్లికాదులతో నందరును యదువంశము రాజ్యార్హము కాదని చూచి ముసలాయుధునితో నిట్లనిరి.
బలభద్ర! నీయన్నమాట యిదేమి? ఉత్తమ వంశమందు బుట్టిన వారికొక యాదవుడెవ్వడు ఆజ్ఞ యిచ్చుటా? ఉగ్రసేనుడు గూడా కౌరవుల కాజ్ఞ సేయునేని రాజుల కుచితమైన శ్వేతచ్ఛత్రమింకెందులకు. అలంకారప్రాయములివి యెందులకు? బలభద్ర ! నీవు సనుము. అన్యాయవర్తనుని సాంబుని నీ యొక్కకాని ఉగ్రసేనుని యొక్కకాని యాజ్ఞను విడిచిపెట్టము. కుకురాంధకాదులు రాజులు మాకు ప్రణతులైనారు. అట్టి ప్రణతిసేయకపోగా పైని స్వామికి భృత్యుడిచ్చినట్లు ఆజ్ఞ సేయుటయేమి? సహాసన సహపంక్తి భొజనములచే మీరు గర్వమెక్కింపబడినారు. మీ తప్పేమి! ఓ బల! నీ చెప్పిన యీ ఉగ్రసేనుడు మాకు పూబనీయుడగుట ప్రేమచేతనే. కులమును బట్టి కాదు. ఈ మా మర్యాద మీ కులమునకు దగదు. అని కౌరవులందురు హరికుమారుని సాంబుని విడువరైరి. అందరూ ఏకనిశ్చయమున గజసానగరముం జొచ్చిరి.
అదిక్షేపముచే గల్గిన కోపముచే మత్తుగొని ఘూర్ణించుచు లేచి నేలను మడమలం ద్రొక్కి తాటించెను. దాన నీ భూమి పగిలిపోయెను. పెద్దధ్వని దిక్కుల బిక్కటిల్ల హలి బాహువులంజరచి కనులెఱ్ఱవడ కనుబొమలుముడిపడి మొగము కుటిలము గాగ బలదేవుం డిట్లనియె – అహో! వట్టి నీరసులు దురాత్ములైనవారి కేమిపొగరిది! మాపై కౌరవుల పెత్తనము కాల ప్రభావము. ఉగ్రసేను నానతి యనుల్లంఘనీయము (దాటగూడనిది) అని యనుకొనరే. ఆయనయాజ్ఞను దేవతలతో గూడ శచీపతి సధర్మముగ గైకొనునే. శచీప్రియుని ఆ సుధర్మాసభను ఉగ్రసేనుడేవేళ నధిష్ఠించుచున్నాడు. ఛీ ఛీ! నూరుగురు మనుష్యుల యుచ్ఛిష్టమైన రాజాసనమునందు వీరికి సంతుష్టియట. పారిజాతతరుపుష్ప మంజరులను ఎవ్వని బంట్రౌతుల అబలాజనము కొప్పులందురుముకొందుఱో అట్టి ఉగ్రసేనుడు గూడ వీరికి దొరగాడట.సమస్త సార్వభౌములకు అధినాథుడైన ఉగ్రసేనుండట్లుండుత! ఇప్పుడు ఉర్వినెల్ల నిష్కౌరవ మొనర్చి ఆ పురికే నేగెదను. కర్ణుని దుర్యోధను ద్రోణుని యిప్పుడే భీష్ముని బాహ్లికుని దుశ్శాసనాదులను భూరిశ్రవస్సును సోమదత్తుని శలుని భీముని అర్జునుని యాధిష్ఠిరునితో కవలను (నకుల సహదేవులను) మరియుంగల కౌరవులను సాశ్వరథకుంజరముగ హత మొనర్చెదను. ఆ మీద సాంబుని సభార్యకముగ జేకొని యాపురి కేగెదెను. ద్వారక కేగి ఉగ్రసేనాది బంధువులం జూచెదను. లేదా! ఎల్ల కురువర్గముతో కౌరవులభారము హరింప దేవాధీశు ప్రేరణమున శీఘ్రముగ నాగసమను నా నగరమును భాగీరథిలోనికి విసరివైచెదను. అని యిట్లు కోపమున నెఱువువారిన చూవులతో దాలాంకుడుగ ప్రాకారవ్రప్రముస అధోముఖముగ నాగలి (క్రిందు ముఖముగ) గ్రుచ్చి లాగెను. అతట కౌరవులు గగ్గోలువడి యిట్లు గోలవెట్టిరి.
రామ! రామ! మహావీర! క్షమింపు క్షమింపుము. కోపము నుపసంహరింపుము. ప్రసన్నుడవగుము! ఇడుగో సాంబుడు పత్నితో నిదె వెలువరింపబడినాడు : నీ ప్రభావ మెఱుగని అపరాధులను క్షమింపుము. అని కౌరవులు త్వరగ తమపురమున కేగి భార్యతో సాంబుని విడిచిరి. బలవంతులకెల్ల బలవంతుడగు బలుడు భీష్మ ద్రోణ కృపాచార్యాదులకు ప్రణామములు చేసి శాంతుడనైతినని పలికెను. ఇప్పటికిని ద్వారక పెల్లగిలినది పెల్లగిలినట్లు కనబడుచున్నది. ఇది బలశౌర్యశాలి బలరాముని ప్రభావము. ఓ ద్విజులార! అవ్వల కౌరవుల సాంబుని హరిసహితంబుగ పూజించి పెండ్లికానుకలు సారె చీరలు వెట్టి భార్యతో ద్వారకకు బంపిరి.
ఇది శ్రీ బ్రహ్మపురాణమున శ్రీకృష్ణచరిత్రమందు బలరామ ప్రభావమును నూట రెండవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹