Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట నాల్గవ యధ్యాయము

కృష్ణ నిర్యాణ కథనము

వ్యాసుడిట్లనియె:-

ఇట్లుకృష్ణుడు బలదేవుని సాయమున విశ్వరక్షణకునై దుష్టరాజన్యశిక్షణము సేసెను. ఫల్గునునితో గూడి నారాయణుడు అక్షౌహిణులన్నింటిని గూల్చి భూదేవి బరువుందించెను. ఇటుసేసి విప్రులిచ్చిన శాపము నెపమున యదుకులముంగూడ ఉపసంహరించెను. ద్వారకను వదలి మానవ ఆకారము విడిచి ఆ స్వయంభువు నిజాంశమున తిఱిగి నిజస్థానమును విష్ణుపదమును బ్రవేశించెను.

మునులడిగిరి. ఆతడు విప్రశాప మిషన స్వకులము నెట్లు ఉపసంహరించెను. మనుష్యదేహమును ఎట్లు వదలెను?.అన వ్యాసుడిట్లు పలుక దొడంగెను.

యదుకుమారులు పిండారకమను తీర్థమున కణ్వ, నారద, విశ్వామిత్రులను గాంచిరి. నడిప్రాయంపు మదముచేత భావికార్యప్రేరణము చేతను జాంబవతీ పుత్రుడు సాంబునికి ఆడు వేషము వేసి సాగినడచి ప్రణామపూర్వకముగ వారిని గూర్చి ఈవిడ కొడుకు కావలయును అనుచున్నది. స్వామీ! పుత్రుని కనగలదా? అనిరి. యదుబాలురచే వంచితులై ఆ మునులు దివ్యజ్ఞాన సంపన్నులు గావున సువ్రతులు గావున వారి నాశనమునకప్పుడు శాపమిచ్చిరి. కుపితులై ఈమె ముసలమును కన గలదనిరి. దాన అఖిల యాదవకులము విచ్ఛిన్నము కాగలదనిరి. ఇట్లు శపింపబడి ఆ యాదవబాలురు పోయి యుగ్రసేనునికి యథాతథముగా తెలిపిరి. సాంబుని కడుపునందుండి ముసలము పుట్టెను.

ఉగ్రసేనుడు ఆ ముసలము ఇనుపరజనుగా గొట్టించెను. అది సముద్రమునందు పడవేయబడి మేక పెంటికలట్లు పొడియయ్యె. ఇనుపరోకలి అదిచూర్ణితమై ఇనుపగుదియగా (తోమరముగా) తయారయ్యెగాని దానిని మఱివారు పొడిసేయలేని దానినిగూడ కడలింబడవేసినంత ఒకచేప దానిని మ్రింగెను. ఆ చేపను చంపి దానికడుపునుండి ఇయినుపగుదియ ఒక జాలరి గైకొనెను. మధువైరి భగవంతుడు ఆ నిజమెఱింగియు విధివశుడై దానిని మఱొకలాగున జేయుట కిచ్ఛగింపడయ్యె.

దేవతలు పంప నొక దూతవచ్చి కేశవునికి ప్రణతిసేసి ఏకాంతమందు నేను దేవదూతను ఏలినవారి కడకు దేవతలంప వచ్చితిని. వసువులు అశ్వినులు మరలత్తులు రుద్రాదిత్యులు సాధ్యులంగూడి ఇంద్రుడు తమకిట్లు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇదె వినుండు త్రిదశుల ప్రార్థనచే భూభారహరణమునకై నూరేండ్లకుపైని భగవంతుడవీ ధరణి నవతరించితివి. దుష్టదైత్యులు నీచే హతులైరి భూమి బరువు దింపబడినది. ముక్కోటి దేవతలిప్పుడు సనాథులైరి. (దిక్కుగల వారైరి) దేవాధిపత్య మందుదురుగాక! జగన్నాథ! నూరేండ్లు గడచినవి. తమకభిమతమేని ఇపుడు స్వర్గమునకు దయచేయ వలయును, మఱియు నీకు ఇక్కడ (భూలోకమందు ) అభిలాషయేని ఇక్కడనె ఉండనగును. ఏలిన వారిసేవకులము మేమిట్లు సేయుమని చెప్పదగినవారము గాము.

అంతట భగవంతుడిట్లనియె. నీవన్నదంతయు నేనెఱుంగుదును. కాని యాదవులయొక్క క్షయముగూడ నాచే ఆరంభింపబడినది. ఎవ్వరికిం జంపరాని యాదవులచేగూడ భూమికి బరువు అనునది తప్పదు. దీనిని ఏడురాత్రులలో సత్వరము దింపెదను. సముద్రమునకు గొంపోబడిన ద్వారకను తిఱిగి కొనివచ్చి యాదవులను ఉపసంహరింపజేసి స్వర్గమును అలంకరింతును. మానవదేహము వదలి సంకరక్షణునితో అటకువచ్చినాడననియె ఇంద్రుడు దేవతలును అనుకొనవలసినది. భూభార కారణమైన జరాసంధాదులు హతులైరి. వారివలన వసుధభారము యాదవులపైకి ఎత్తబడినది. ఆ ఈ భారమును నేనుదింపి అమరలోక పరిపాలనమునకు రాగలను. ఇట్లు వాసుదేవునిచే తెలుపబడి దేవదూత ఆయనకు ప్రణమిల్లి దేవయానమున ఇంద్రుని సన్నిధికేగెను.

భగవంతుడునప్పుడు దివ్యభౌమాంతరిక్షములైన ఉత్పాతములంగని వెంటనే ప్రభాస తీర్థమునకు ఏగుదమనియె. అప్పుడు పరమ భాగవతుడు (భగవద్భక్తుడు) ఉద్ధవుడు ప్రణతుడై హరితో నిట్లనియె. ఇప్పుడు నే చేయవలసిన పని సెలవిమ్ము. ఏలినవారిప్పుడు యదుకుల మెల్ల ఉపసంహరింతురని తోచుచున్నది. యదుకుల నాశనము కాగల నిమిత్తములను చూచుచున్నాను. అన భగవంతుడిట్లనియె.

ఉద్ధవా ! నా ప్రసాదముచే నీవు దివ్యగమనమున గంధమాదన పర్వతమందున్న పుణ్యమగు బదరికాశ్రమమునకు జనుము. మహీతలమంతటిని పవిత్రముసేయు నా నరనారాయణ స్థానమందు నాపై మనసుంచి నా ప్రసాదమున అక్కడ నీవు సిద్ధినందగలవు. నేను కులమెల్ల ఉపసంహరించి స్వర్గమునకేగుదును. నేను విడిచిన ద్వారకను సముద్రుడు ముంచును. అనిపలుక విని ఉద్ధవుడు పదముల వ్రాలి నారాయణానుమోదితుడై నరనారాయణ స్థానమునకు ఏగెను.

అవ్వల ఆ యాదవులు అందరు శీఘ్రగములైన రథములనెక్కి కృష్ణ బలరాములతో ప్రభాసమునకు జనిరి. కుకురాంధకులువారు నియమము పూని వాసుదేవునని ఆమోదమున సురాపానమొనరించిరి. అట్లు తప్పద్రావిన వారికి అన్యోన్య సంఘర్షణమున కలహాగ్నిరేగి యాదవవంశ క్షయహేతువయ్యెను. వారు దైవముచే బలాత్కరింపబడిన వారై శస్త్రాస్త్రముల నొండొరులను కొట్టుకొనిరి. శస్త్రములయిపోయి దగ్గరనున్న ఏరకమును (గుంద్రమూలాతృణమును గడ్గిపోచను) బట్టిరి. వారది పట్టినంత వజ్రమట్లు కనిపించెను. దానితో మిగుల దారుణముగ నొకరినొకరు గొట్టుకొనిరి. ప్రద్యుమ్న, సాంబాదులు, కృతవర్మ,సాత్యకి, అనిరుద్ధాదులు, పృధువు, విపృధువు,చారువర్మ, చారువు, అక్రూరుడు,ఏరకా రూపమైన వజ్రములచే గొట్టికొనిరి.

హరివారిని వారుహరిని వారించుకొనిరి. హరి సాయపడవచ్చినాడనుకొని ఒండొరుల గొట్టుకొనిరి. కృష్ణుడును కుపితుడై యేరకాతృణ పుంజము గుప్పిటబట్టెను. అది యాదవవధకనువైన ముసలము. (గుప్పెడు ఇనుపదుడ్డు)అయ్యెను. ఆతతాయులై దానిచే యాదవులను హరి నిశ్శేషముగా గొట్టెను. వారుం త్వరగా వచ్చి ఒండొరులం బాదుకొనిరి.

అటుపై నర్ణవమధ్యమునుండి చక్రాయుధుని జైత్రరధము(జయశీలమైన యరదము) దారుకుడు (సారథి) చూచుచుండగనే ఆశ్వములచే గొంపోబడెను. చక్రము గద(కౌమోదకి)శారఙ్గ(హరివిల్లు) తూణము (అమ్ములపొది) శంఖము(పాంచజన్యము) కత్తి(నందకము) హరికి ప్రదక్షిణముసేసి ఆదిత్యమండల మార్గముంబట్టి యేగెను. (స్వరాదిత్యే అనుశ్రుతిననుసరించి స్వర్గమాదిత్యమండలమని రహస్యము) ఒక్కక్షణములోనే అట యాదవవంశ క్షయమయ్యెను. మహాశూరులొక్క కృష్ణుడు దారుకుడును (రథసారధి) మిగిలిరి.

ఒక చెట్టు మొదట ఆసనమువైచికొని కూర్చుండియున్న బలరామునిదరికి చేరి వారిద్దరునాతని ముఖమునుండి వెడలుచున్న మహాసర్పముం దర్శించిరి. ఆసర్పము పెద్దపడగలతో ఆతనిమొగము వెలువడి సిద్ధులు నాగులు పూజింప సముద్రమునకేగెను. సముద్రుడర్ఘ్యముంగొని ఎదురేగెను. మహేంద్రులచే పూజితుడై ఆనీటను ప్రవేశించెను. బలరామ స్వామి నిర్యాణమును గని హరి దారుకునితో నిట్లనియె.

బలరాముని నిర్యాణము యాదవకుల క్షయము ఇదియెల్ల నీవు వసుదేవునికి ఉగ్రసేనునికి తెల్పుము. నేనును యోగసమాధి నిలిచి ఈ కళేబరమును విడిచితినని ద్వారకావాసి జనమునకు చెప్పుము. ఈ ద్వారకా నగరమును సముద్రుడు ముంచివేయును. అందువలన సిద్ధముగా పూన్పబడిన రథములతో అర్జునుని రాకకు ఎదురుచూడుడు. పాండవుడాతడు నిష్క్రమింపగా ద్వారకా మధ్యమందు మీరు ఉండవలదు. అతడెటకేగునో అటకాతనితో మీరు నేగవలయు. నీవేగి కుంతీ కుమారుని అర్జునునకు నాvచెప్పినమాట చెప్పుము. నా పరిగ్రహము (భార్యావర్గము) నీవు నీశక్తికొలది పాలింపదగినది. అని పలికి అర్జునునితో గూడి నీవు ద్వారవతియందలి జనమును గొని వెశ్లుదువుగాక! వజ్రుడు యాదవులకు రాజుగాగలడు.

ఇది శ్రీబ్రహ్మపురాణమున శ్రీకృష్ణచరితమందు శ్రీకృష్ణునిజధామగమనము అను నూట నాల్గవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment