సూర్యగ్రహ జననం నాల్గవ భాగము
శ్రీ మహావిష్ణువు లక్ష్మిని శేషతల్పం వైపు నడిపించాడు. ఆమెను కూర్చోబెట్టి , పక్కనే కూర్చున్నాడు.
శ్రీదేవి ముఖపద్మాన్ని తన రెండు అరచేతుల మధ్య ఇమిడ్చి పట్టుకుని , సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు శ్రీమహావిష్ణువు. ఆమె విశాల నేత్రాలలోకి ఆయన నేత్రాలు తదేకంగా చూశాయి.
“ఒక జ్యోతి వెలుగును తీసుకువెళ్ళి , దానితో రెండవ జ్యోతిని వెలిగించినప్పటికీ , మొదటి జ్యోతిలోని కాంతి తరిగిపోలేదు. అంటే అక్కడ కాంతి ”వ్యయం” కాలేదు. కాదు కూడా ! అది అవ్యయం ! మూలరూపాలు కూడా అంతే ! అవ్యయాలే ! వేరొక అవతారాన్ని ధరించాక మూల రూపంలో కొరత ఏర్పడదు. దాని శక్తి తగ్గదు; చేవ తరగదు !”
“స్వామీ !” లక్ష్మి భావావేశంతో అంది.
విష్ణువు చిన్నగా నవ్వాడు. “నువ్వే చూస్తావుగా దేవీ ! భవిష్యత్తులో నువ్వూ , మేమూ ఎన్నో అవతారాలు ధరిస్తాం ! కానీ మన ఈ ”మూలరూపాలు” ఇలాగే వుంటాయి !”
మెరుస్తున్న శ్రీలక్ష్మి కళ్ళకి తోడుగా , ఆమె పెదవులు కూడా చిరునవ్వుతో మెరిశాయి. “కాబట్టి , ఇక్కడ సూక్ష్మరూపంలో మీ నయన కమలాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు – అక్కడ స్థూల శరీరంతో కూడా ప్రకాశిస్తూ వున్నాడు. స్వామీ , అంతేకదా ?”
“అంతే కదా ? లక్ష్మి ప్రశ్నకు విష్ణువు ప్రశ్న సమాధానం చెప్పింది. “స్వామీ ! మీ నయన సూర్యుడు ఎక్కడ , ఎవరికి జన్మించాడు ? ఎందుకు జన్మించాడు ?” లక్ష్మి కుతూహలంగా అడిగింది.
“కశ్యప ప్రజాపతి సతి అదితికి ప్రియ పుత్రుడుగా జన్మించాడు ! నరుల ఆరాధనా సౌలభ్యం కోసం అంతరిక్షంలో సూక్ష్మ రూపాలలో ఉన్న ”నవగ్రహాలు” స్థూలదేహాలు ధరించి అవతరించాలనీ , గ్రహదేవతలను ప్రసన్నం చేసుకుని ప్రాణులు తరించాలనీ మేం సంకల్పించాం. సూర్యుడి జననంతో మా సంకల్పానికి అంకురార్పణ జరిగింది !” శ్రీమహావిష్ణువు కంఠంలో తృప్తి ధ్వనించింది.
“దివ్య సంకల్పం స్వామీ , మీది !” లక్ష్మి ఉత్సాహంగా అంది. “అయితే మిగిలిన గ్రహదేవతలు ఎప్పుడు ఎవరెవరికి జన్మిస్తారు ?”
“ఎప్పటి మాటో ఇప్పుడెందుకు దేవీ ?” విష్ణువు చిరునవ్వుతో అన్నాడు. శ్రీలక్ష్మి ఏదో అనబోయింది. అయితే , ”నారాయణ !” అనే నారదుడి కంఠధ్వని ఆమెకు అడ్డు తగిలింది. నారాయణ నామ ధ్వనిని వెంబడిస్తూ నారదుడు ప్రవేశించాడు.
“నమో నమః ! నమో నమః !” నారదుడు ఆదిదంపతులకు చేతులెత్తి నమస్కరించాడు. “నారదా ! కుశలమా ?” శ్రీమహావిష్ణువు పలకరింపుగా అన్నాడు.
“సర్వకాల సర్వావస్థల్లో నా నాలుక మీద నాట్యం చేసే నీ దివ్య నామం నాకు రక్షగా వుందిగా , నారాయణా ! నీది నిర్హేతుక కృప కదా ! కారణం లేకుండా కరుణించే అమృత తత్వం కదా నీది ! నా తండ్రి గారి శాపాన్ని స్వీకరించి , నీ నామస్మరణ యాగం ప్రారంభించిన వెంటనే మహత్తర సంగీత సాధనమైన ఈ ”మహతి”ని బహూకరించావు. ఇంక ఈ నారదుని క్షేమానికి కొరత ఎక్కడ !” నారదుడు నవ్వుతూ అన్నాడు. “ఊ ! నీ ”కుశలము” నకూ కొరత లేదు. ”కౌశలము” నకూ కొరత లేదు” శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.
“నారాయణ !నారాయణ!”
“రాక రాక వచ్చావు ! రాకలో ఏదైనా రహస్యముందా ?” లక్ష్మి చిరునవ్వుతో అడిగింది.
“చిత్తం ! ఒక శుభవార్త విన్నవించే కోరికతో వచ్చాను మాతా ?” నారదుడు. ఉత్సాహంగా “అయితే ఆ వార్త మాకు అందలేదనుకుంటున్నావా , నారదా ?” శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.
“మీకు తెలియని దేముంటుంది ? పాపం… చెప్పనివ్వండి స్వామీ !” లక్ష్మి మందలింపుగా అంది.
“సరే ! మంచిమాట మాటిమాటికీ వినడం మంచిదే ! వినిపించు , నారదా !” విష్ణువు చిరునవ్వు నవ్వాడు.
“ధన్యోస్మి ! సాధ్వీమణి అదితికి పుత్రుడు జన్మించాడు… కశ్యప ప్రజాపతి జాతకర్మ , నామకరణ మహోత్సవాలకు సంకల్పించాడు…”
“శుభం ! చతుర్ముఖుని , త్రినేత్రుణ్ణి , ఇంద్రాదులనూ ఆహ్వానించు , నారదా ! సూర్య జననం అందరికీ హర్షం కలిగించేదే !” విష్ణువు అన్నాడు. “నారాయణ ! అలాగే !” నారదుడు నమస్కరించి నిష్క్రమించాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹