రుక్మిణ్యాదులు పరలోకమునకేగుట
వ్యాసుడిట్లనియె.
అర్జునుడప్పుడు కృష్ణ బలరామ శరీరములను వెదకి వానికిని మఱి ఇతర శరీరములకు సంస్కారమును గావించెను. మఱియును అష్టమహిషులు రుక్మిణి మొదలగువారు హరి శరీరమునదు పుట్టిన అగ్నియందు బ్రవేశించిరి. రేవతియు బలరాముని దేహము కౌగలించుకొని తత్స్పర్శవలన కలిగిన ఆనందముచే చల్లబడిన అగ్నియందు ప్రవేశించెను. ఆపై అర్జునుడు వారికి ప్రేతకృత్యములను యథావిధిగ జరిపి తక్కిన జనమును వజ్రుని తీసికొని వెళ్ళెను.
ద్వారవతి నుండి బయలుదేరిన వేలకొలది కృష్ణ భార్యలకు వజ్రునికి నతడు రక్షణ ఇచ్చి ఆదరించెను. కృష్ణునిచే భూమికి కొనిరాబడిన సుధర్మయను దేవసభ పారిజాత వృక్షము స్వర్గమునకు వెళ్ళిపోయెను. హరి మేదినిని విడిచి స్వర్గారోహణము చేసిననాడే కలి నల్లని శరీరముతో భూమికి దిగెను. మహాసముద్రము నిర్జనమైన ద్వారకను ముంచి వేసెను. ఒక్క కృష్ణ గృహమును మాత్రము ముంచలేదు. ఆ గృహమందెపుడును భగవంతు డీనాటికిని ఉండుటచే నేడును సముద్రుడు తన హద్దుదాటి దాని నాక్రమింపడు. అది మహాపుణ్యస్థానము సర్వపాపహరము. విష్ణువు క్రీడించిన స్థానము. దానిని దర్శించిన పాపము వోవును.
పార్ధుడు ధాన్యధన సమృద్ధమైన పంచనద దేశమందు యాదవ జనమున కంతకు నివాస మేర్పరచెను. అవ్వల కలిప్రభావముచేత మానవులలో లోభగుణ మంకురించెను. భర్తలను గోల్పోయిన స్త్రీలు చోరులకు సంబంధించిన వారిని ధనుర్ధారియైన యొక్క అర్జునుడు తీసికొనిపోయి రక్షణ యిచ్చుట చూచి లోభవశులై పాపులైన ఆ భీరులు (అడవిమూకలు) పొగరుగొని ఒండొరులిట్లు ఆలోచించిరి. ఈ అర్జునుడొక్కడు విల్లుగొని భర్తలు చనిపోయిన స్త్రీజనమును గొనిపోవుచున్నాడు. మనలను లెక్కచేయుటలేదు. కనుక మనబలము జూపింతము. భీష్మద్రోణ జయద్రధ కర్ణాది వీరులను జంపి గర్వమెక్కి గ్రామవాసులగు మన బలమేదో యెరుగకున్నాడు. బలాఢ్యులగు పెక్కు గ్రామముల వారినందరిని అవమానించుచున్నాడు. మీరెవ్వరును బదులు పలుకవలదు. అన కర్రలు కత్తులు గొని దస్యులు (గూండాలు) వేలకొలది పరువులెత్తిరి. అంత అర్జునుడు వెనుదిరిగి అయ్యాభీరులం గని మీరు బ్రతుకదలతురేని వెనుకకు పొండు” అన నాతని మాటను ధిక్కరించి వాండ్రెల్ల స్త్రీలను కృష్ణభార్యలను అర్జునునిచెంత నుండి లాగికొనిపోయిరి.
అంత అర్జునుడు యుద్ధమందు వమ్మువోయి గాండీవము నెక్కుపెట్ట బూనెను. కాని అతనికశక్యమయ్యె. కష్టముమీద నెక్కుపెట్టినను క్షణములో నది శిథిలమైపోయెను. దివ్యాస్త్రము లతనికి జ్ఞాపకమే రాలేదు. చేతనున్న తక్కిన అస్త్రములను వారిపై విసరెను. కాని అవి యన్నియు కృంగిపోయి శత్రుభేదమును చేయవయ్యెను. ఖాండవవనదహన సమయమున అగ్ని ఇచ్చిన అక్షయ బాణములు కూడ అప్పుడు క్షయించిపోయినవి. గోపాలురతో పోరుచున్న అర్జునునికి హైన్యస్థితి వచ్చెను. అపుడర్జునుడు శరజాలముచే బలాఢ్యులగు రాజులను నేను గెలుచుట కృష్ణునియొక్కబలమే యని తలంచెను. అతడు చూచుచుండగనే ఉత్తమస్త్రీ వర్గమును ఆభీరులు లాగికొనిపోయిరి. కొందరు స్త్రీలు తమంతనే కామప్రవృత్తితో ఆ మూకవెంట పడిపోయిరి. ఆర్జునుడు శస్త్రాస్త్రములచే గొట్టుచుండ వాండ్రు పకపక నవ్వుచుండిరి. ఇట్లు ఆ మ్లెఁచ్ఛులు పార్థుడు చూచుచుండగనే వృష్ణ్యంధక కులాంగనలనందరను గొనిపోయిరి.
ఆంతట జిష్ణువగు (అర్జునుడు) కష్టము! కష్టమనుచు భగవంతునిచే విడువబడితినని యేడ్చెను. అదే ధనుస్సు అవే అమ్ములు అదే రథము అవే గుఱ్ఱములు. వేదవిదుడు వేదానుష్ఠాతయు కాని వానికి చేసిన దానమువలె ఒక్క అడుగులో సర్వము వమ్మైపోయినది. ఆహా! విధి యెంత బలీయము. ఆ మహానుభావుడు లేనంతట వట్టి చేతగాని దద్దమ్మనై పనికిమాలినవారిచే అవమానింపబడితిని. అవే బాహువులు అదే పిడికిలి. అదేచోటు. ఆ అర్జునుడనే యైయున్నాను. పుణ్యముతో నాస్వామితో నెడబాటుననంతయు నిస్సారమైపోయినది. నా యర్జునత్వము భీముని భీమత్వము కృష్ణుని వలన నీయబడినవే. నిజము. ఆయన లేమి నీ చచ్చుగొల్లలకు నేను బెండువడితిని.
ఇట్లర్జునుడు పలుకుచు ఇంద్రప్రస్థమునకేగి యాదవ కుమారుడగు వజ్రుని యందు రాజును గావించెను. అవ్వల అడవిలోనున్న వ్యాసుని మహానుభావుని దర్శించి సమీపించి నమస్కరించెను. అట్లు మ్రొక్కిన అర్జునుని వ్యాసభనవానులు తేరి పార జూచి అర్జునుడేయని నిశ్చయమునకు వచ్చి పార్ధా! ఈవిధముగ మిక్కిలి వన్నెదరిగి యున్నాడవేమి? గొర్రెలపరాగము వెంబడింపవలసి వచ్చెనా? బ్రహ్మహత్యకు పాల్పడితివా? గెలుపునందాశాభంగమై దుఃఖము గల్గెనా! విన్నవోయి యున్నాడవు. నిన్ను యాచింపవచ్చిన సాంతానికాదులను లేదని నిరాకరించి పంపితివా! (సాంతానికుడు = పుత్రుడు మొదలగు వాడు) అగమ్యా గమనము జేసితివా! (కూడని స్త్రీతో సంగమము) ప్రభదరిగియుండుటకు గారణమేమి! విప్రులకు బెట్టక నీవొక్కడవే మధురాన్నములను దింటివా? కాక దీనుల ధనములను హరించితివా? సూర్యవాతమునకు (వడదెబ్బకు) గురికాలేదు కదా! ఎట్లు శోభ గోల్పోయితివి? దృష్టిదోషము తగిలెనా నభోదక స్పర్శ కల్గినదా! (గోళ్లయొక్క స్పర్శ కల్గిన యుదకమశుచి యన్నమాట) మట్టికుండ నీటిచే ప్రోక్షింపబడితివా! (తడుపబడితివా) నీకన్న తక్కువవారిచే గెలువబడితివా ! ఇట్లు ఛాయదరిగియున్నావేమి?
పార్థుడంతట నిట్టూర్పు పుచ్చి భగవంతుడ! వినుము అని తన పరాభవ వృత్తాంతమును జరిగినది జరిగినట్లిట్లు చెప్పెను.
మాబలము మాతేజస్సు మావీర్యము మాపరాక్రమము మాసిరి మాకాంతి యెవరో యట్టిహరి మమ్మువీడివెళ్ళినాడు. చిరునవ్వుతో ముచ్చటించు మాస్వామి ఆ మహానుభావుడు అన్యుడట్లు మమ్ము విడిచివెళ్ళినాడు. దానిచే నా సర్వాయుధములు తృణప్రాయములైనవి. అస్త్రములు శస్త్రములు గాండీవముయొక్క మూర్తీభవించిన సారమెల్ల తానైన ఆ పురుషోత్తముడు వెళ్ళిపోయినాడు. ఎవని చూపున మమ్ములను శ్రీ జయము సంపత్సమృద్ధి విడువలేదో అట్టి గోవిందుడు భగవంతుడు విడిచి వెళ్ళినాడు. భీష్మద్రోణులు అంగరాజు (కర్ణుడు) దుర్యోధనాదులు ఏ ప్రభువు ప్రభావముచే సమూలము నిర్దగ్ధలైరో అట్టి కృష్ణుడు భూమిం బాసినాడు. వనము బాసి హతశ్రీయై వన్నె దరిగి చక్రాయుధుని విరహము వలన నేనొక్కడనే కాదు ఈ పృథివి కుములుచున్నది. ఏస్వామి అనుభవము వలన లీలవలన నేనను అగ్నియందు భీష్మాదులు మిడుతలైరో అట్టి కృష్ణుని బాసి గొల్లలతో ఓడి పోయితిని. ఎవ్వని అనుభవముచే త్రిలోకు ప్రసిద్ధమైనదో యట్టి గాండీవము కృష్ణుడు లేమిని గొల్లల బడితెలకు లొంగిపోయినది. హరిలేమిని ఎన్నో వేలమంది స్త్రీలు ఆనాధలు వట్టి కట్టెలతో దొంగలచే గొనిపోబడినారు. నా బలమును ధిక్కరించి గొల్లలు నేను గొనివచ్చుచున్న కృష్ణుని అంతఃపురమంతయు కర్రలతో నదలించి తోలికొని పోబడినారు. నేను సిరి గోల్పోవుట వింతగాదు. బ్రతికియుండుట అదే అత్యద్భుతము. నీచులవలని అవమానమను ఱొంపిని బూసికొని తాత! దిక్కుమాలి సిగ్గుమాలినవాడనైతిని.
అర్జునుని దుఃఖమువిని దీనుడై యేడ్చుచున్న మహాత్ముడైన ఆ పాండవునియొక్క అమ్మాటవిని నేనిట్లంటిని. వ్యాసుడు. పార్థ! సిగ్గుపడవలదు. ఏడువకుము. సర్వభూతములయెడల కాలముయొక్కగతి యిట్టిదని యెఱుంగుము. భూతముల పుట్టుకకు గిట్టుటకు కాలము కారణము. ఇది కాలనిమిత్తము అనియెరిగి స్థైర్యము నొందుము. నదులు సముద్రములు పర్వతములు వసుథ మనుష్యులు పశువుల చెట్లు పాములు కాలముచే సృజింపబడి కాలముచేతనే క్షయించును. సర్వమును కాలస్వరూపముగ దెలిసి శాంతినొందుము. ధనంజయ! కృష్ణప్రభావము నీవన్నది యంతయు నంతే. భారహరణమునకు భూమియం దత డవతరించినాడు. భూదేవి భారవశయైమున్ను దేవతలందరి కేగినది. అందులకే కామరూపియైన భగవంతు డవతరించి ఆపని జరిపినాడు. రాజులను గూల్చినాడు. తుదకు తాను జన్మించిన వృష్ణ్యంధకకులము గూడ నుపహరించినాడు. ఇతనికింక నీ భూతలమున జేయవలసినది కొంచెము కూడలేదు, అందుచే కృతకృత్యుడై భగవంతుడు యథేచ్ఛగా నిర్గమించినాడు. సృష్టిస్థితిలయములు మూడును శ్రీహరిలీలలే. పార్థ! పరాభవమునకు సంతాపవడకుము. పురుషుల పరాక్రమములు కాగలకాలములందగుచుండును. బీష్మద్రోణాదులు నీచే గూలుట కాలమువలననే. పరమాత్మ అను భావముననే వారి పరాభవము. తక్కువవారివలన నీకు పరాభవము. ఆదేవుడు స్థితిలయములు చేయునపుడు అన్యశరీరములందావేశించుచుండును. కాగలప్పుడు హరి నీకు సహాయుడయ్యెను. కానపుడు నీశత్రువులు హరి దృష్టిలో పడినారు. నీవు గాంగేయునితోడి కౌరవులనెల్ల గూల్చితివన్న నెవడునమ్మును? అట్లే యెందులకుగాని యాభీరుల కోడితివన్నను నెవడునమ్మును? ఇవి సర్వభూతములయందు హరియొక్క విలాసము. అతని చేష్ట. నీచే గౌరవులు ధ్వంసమగుట యాభీరులకు నీవోడుట నీరక్షణలోనున్న స్త్రీలు దొంగలచేబడుటయను విషయములో జరిగినది నీకుచెప్పుచున్నాను వినుము.
అష్టావక్రకథ
మున్ను సనాతన బ్రహ్మోపాసనము జేయుచు అష్టావక్రుడు పెక్కేండ్లు నీటనే నివాసముండెను. ఆసురులోడిన తరువాత మేరువుపై పెద్ద ఉత్సవమయ్యెను. అదిచూడనేగుచు దేవతాస్త్రీలు ఆతనింజూచిరి. రంభా తిలోత్తమ మొదలైన వారు నూర్లువేలుగ నమ్మహాత్ముని స్తుతించిరి. ప్రశంసించిరి. అతడు కంఠమువరకు మునిగి పెనుజడలు దాల్చియుండ వినయమున నమరాంగనలు మ్రొక్కిన బ్రసన్నుడై యిట్లనియె.
నేను ప్రసన్నుడనైతిని. తామేది కోరిన అది ఇచ్చెదను కోరుకొనుడన రంభ, తిలోక్తమ మొదలైనవారు నీవు ప్రసన్నుడవైన మేము పడయని భాగ్యమేమున్నదనిరి. కాని వారిలో కొందరు ప్రసన్నుడవైతివేని నిన్ను భర్తగా కోరెదమనిరి. అట్లేయగునని యతడు నీళ్ళనుండిలేచెను. అయ్యెడ నాతని నెనిమిది వంకరలుగల వికృత రూపునిగా జూచిరి. చూచి చాటువడుచున్నయయ్యింతుల పరిహాసమాతనికి స్పష్టమయ్యెను. దాన గోపించి అతడు నా విరూపము చూచి హసించి యవమానముచేసితిరి కావున నాదయ చేతనే పురుషోత్తముని భర్తగ బొంది నాశాపముచే దొంగలచేత జిక్కెదరనెను. దాని కడలి వారు బ్రతిమాల ఆ ముని ఇంద్రలోకమునకు నామీద నేగుదురని యనుగ్రహించెను. ఇట్లు అష్టావక్రుని శాపమువలన జరిగిన దానికి నీవు కొంచెముకూడ శోకింపబనిలేదు. ఈ సంహారమేకాదు కొలదికాలములో మీరు నుపసంహరింపబడుదురు. పుట్టినవానికి గిట్టుటయు మీదనుండుటయు సంచయము క్షయము (ప్రోగుచేయుట పోగొట్టుకొనుట) గలిసి విడివడుటయుం దప్పదు. స్వభావమని దీనినెరింగిన పండితులు క్రుంగరు పొంగరు. అట్టి పండితుల నడవడిని అలవరుచుకొన్నవారుకూడ వారివలెనే యున్నవారునుగలరు.
కావున నరశ్రేష్ఠ! సోదరులతో నిది యెఱింగి రాజ్యము విడిచి తపముసేయ వనమునకు వెళ్ళదగును. ఈ నా మాటను ధర్మరాజునకు జెప్పుము. ఎల్లుండి సోదరులతోగూడనుత్తమగతిమహాప్రస్థానముజేయుడు. అని తెలుపబడి పార్థుడు ధర్మరాజు దగ్గరకువచ్చి యదంతయుతెల్పెను. వారందరు అర్జునుని వచనమువిని పరీక్షిత్తును రాజ్యమున నుంచి వనమునకు జనిరి. ఓ మునిశ్రేష్ఠులార! విస్తరముగా నిట్లు యదువంశమునందు బుట్టిన వాసుదేవునియొక్క చరిత్రము మీకు దెలిపితిని.
ఇది బ్రహ్మపురాణమున శ్రీకృష్ణచరిత్ర సమాప్తి కథనమను నూట ఆరవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹