Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ఎనిమిదవ అధ్యాయము

యమలోక మార్గ స్వరూప వర్ణనము

మునులిట్లనిరి. ”వ్యాసమహాముని! మీముఖముచే గానముచేయబడిన పుణ్యధర్మములనెడి గానామృతమునకు దృప్తి జెందలేకున్నాము. భూతముల యొక్క పుట్టుక ప్రళయము కర్మగతి యంతయు నెరుగుదువు. అందువలన నిన్నడుగుచున్నాము. యమలోకమార్గము దుఃఖక్లేశములను గల్గించునని సర్వభూత భయంకరమని మిక్కిలి దుర్లభమని విన్నాము. అదారి వెంట నరులు యమసదనమునకెట్లు వెళ్ళుదురు. ఆదారియొక్క దూరమెంత? నరక దుఃఖములను బొందకుండుటకు ఉపాయము, దాన ధర్మ నియమాదులెట్టివి? నరులు స్వర్గమెట్లు పొందుదురు. ఆరెంటికిని స్థానములెన్ని? పుణ్యాత్ములెట్లు వెళ్ళుదురు. పాపులెట్లు వెళ్ళుదురు? స్వర్గమునుకు గొని పోబడు జీవునియొక్కయు నరకమునకు గొని పోబడు జీవునియొక్క ఆకారము రంగు ప్రమాణములెట్టివి?” అన వ్యాసుడిట్లనియె.

”సంసార చక్రము అజరము. అనగ నదియెన్నిటికిని శిథిలముకానిది. నిలుకడలేక తిరుగుచునే యుండును. ప్రాణోత్ర్కమణము జరిగినది మొదలు జీవుడు పయనించు యమమార్గ స్వరూపము నేను జెప్పెదను. మఱియొకడు చెప్పలేడు. యమలోకమునకు మనుష్య లోకమునకు నడుమగల అంతరము ఎనుబది ఆరువేల యోజనములు. కాలిన రాగివలెనది క్రాగుచుండును. జీవులు తప్పక ప్రయాణము జేయవలసిన దారియది. పుణ్యులు పుణ్యలోకమునకు పాపులు నరకమునకు పోవుదురు. యముని రాజధానిలో ఇరువదిరెండు నరకములున్నవి. వానిపేర్లు స్పష్టము.

ఆ దారిలో చెట్టునీడ చెరువులు సరస్సులు బావులు చలివెందలి విశ్రమించుటకు గృహముగాని ఉండవు. ఆ దారిలో నదులు పర్వతములు కొంచెము విశ్రమించుటకు చోటు లుండవు. మరణకాలము వచ్చినంతట బంధుమిత్రాదులను వదలి సర్వజీవులు సర్వవేళల చిన్న పెద్ద అనకుండ గర్భములోనున్న శిశువుసైతము ఏ స్థితిలోనున్నను తుదకు నిద్రావస్థలోనున్నను ప్రాణములు విడిచిన జీవి ఇహమునందు నిర్దిష్టమైయున్న ఆయుర్దాయమును అనుభవించి తుదకాదారింబడి ఏగవలసినదే. వద్దన్నను అదితప్పదు. జలాగ్నులు విషశస్త్రములు ఆకలి పర్వతమునుండి పడుట మొదలగు నేదో నిమిత్తమున దేహి ప్రాణములను వదలి ఈ పాంచభౌతిక మహా శరీరము నిక్కడ విడుచును.

తాను జేసిన కర్మానుసారము యాతనాశరీరమును సుఖదుఃఖములను అనుభవించుటకు మఱొక ధృడమైన దానిని స్వీకరించును. ఆ శరీరముతో పాపి పాపము పుణ్యుము అనుభవించును. ప్రాణము పోవునపుడు తీవ్రమైన వాయువుచే రగుల్కొల్పబడి శరీరమందు నూక్ష్మముగనున్న అగ్ని ప్రకోపించును. అది కట్టెలులేకుండగనే మండు అగ్నివలె రగుల్కొని ఆయువు పట్టులను(మర్మస్థానములు)బ్రద్దలు కొట్టును. అవ్వలనుదానవాయువుమీదికి లేచును. ఆజీవి తిన్న ఆహారము త్రాగిననీరు క్రిందికిపోకుండ నిరోధించును. ఎవడు బ్రతికియుండగా మంచినీళ్ళిచ్చి ఎవరికేని అన్నరసము బెట్టెనో వానికి ఆ ఆపద సమయమందు హాయిగల్గును. శ్రద్ధా పవిత్రమైన మనస్సుతో అన్నము బెట్టినవాడు ఆ యమమార్గమున అన్నము లేకుండగనే తృప్తి నొందును. అనృతమాడనివాడు ఎదుటవాని ప్రీతికి భంగము చేయనివాడు ఆస్తికుడు శ్రద్ధావంతుడు సుఖమైన మరణము నొందును. దేవబ్రాహ్మణ పూజానిరతులు అసూయారహితులు శుక్లులు (అచ్చము పుణ్యములు చేసినవారు) దాతలు హ్రీమంతులు (తప్పుపని చేయుటకు గల్గెడి సంకోచము హ్రీయనబడును) వీరు సుఖమృత్యువులు. (అనాయాసమరణులు.) కామోద్రేకద్వేషములకు వశుడుగాక ధర్మము తప్పక చెప్పినట్లు చేయుచు సౌమ్యుడైయుండువాడు సుఖమైన చావొందును. దప్పికకు నీళ్ళు ఆకలికి అన్నముల బెట్టిన నరులు సుఖమరణమందుదురు. ధనదాతలు యమమార్గములో జలిని యింతురు. మంచి గంధమిచ్చినవారు తాపమునొందరు. ఇతరుల యుద్వేగమమును సహించినవారు ప్రాణోత్క్రమణ వేదనను బొందరు. జ్ఞాన (విద్య)దాతలు దీపమిచ్చినవారు మోహములోబడరు. కూటసాక్షియ సత్యవాది గురుశిక్షనొందనివాడు వెదనిందకుడు మృత్యు సమయములోమూర్ఛలోబడుదురు.

ప్రాణముపోవు జీవునకు భయంకరులు పాడుకంపుగొట్టువాడు బడితలు బల్లెములు దుడ్లు చేతబట్టినవారు క్రూరులు యమకింకరులెదురు వత్తురు. వాండ్రుకంటబడగానే ఈ ప్రాణికి కంపరము పుట్టును. మొర్రోయని బంధువుల కొఱకేడ్చును. ఆ మాటకూడ స్ఫుటముగా అన్ని అక్షరములు ఏక రూపమున వినిపించును. బెదరున జూపు బెదరును. కంఠములో గురగుర పుట్టును. అంతట వేదనామయమైన ఆ శరీరము జీవుడు వదలును.

వాయువు ననుసరించి (వ్రాతప్రకోపముచే) కర్మయాతనా అనుభవమునకు తల్లితండ్రుల వలన ఏర్పడిన శరీరమునుగాక అదే రూపముననున్న శరీరమును సరిగా అదే ప్రమాణము అదే బాల్యాద్యవస్థ గల అవయవములతో బొందును. అవ్వల యమదూత పాశములచే గట్టివేయును. మరణవేదన పడుచు గాలమురాగా పంచభూతములు దేహమును విడచి పెట్టును. ప్రాణము కంఠగతమైన సమయమున జీవుడు శరీరమునుండి విడదీయబడి యెద్దువలె రంకెలు వేయును. షాట్కౌశికమైన ఆనందమయ ( అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ) వాయుస్వరూపమున నిర్గమించును. తల్లి దండ్రి మొదలగు సర్వసంబంధులచేత విడువబడును. బిక్కమొగములు బెట్టి కన్నీళ్ళుగార్చుచు వారు చూచుచుండ తన శరీరమును (గూడును) విడిచి వాయురూపుడైపోవును.

అంధకార బంధురము చుట్టు చీకటి ఆవరించినది సుఖ దుఃఖప్రదము దుస్సహము దురంతము దురాసదము దుర్నీరీక్ష్యము, దుర్గమమునై యాదారింబట్టి పాపాత్ములు వెళ్ళుదురు.

యమకింకరులు పాశములచే గట్టి ముద్గరములచే గొట్టుచు లాగికొనిపోవుదురు. (ముద్గరము=పొట్టియినుపదుడ్డు) యమదూతలు జీవుని ఆయుర్దాయమయినట్లు తెలిసికొని బల్లూకములు, పెద్దపులులు,గాడిదలు,ఒంటెలు, కోతులు,మండ్రగబ్బలు,తోడేళ్ళు, గుడ్లగూబలు,పాములు, పిల్లులు,గ్రద్దలు, డేగలు, నక్కలు, నెక్కివత్తురు. పెక్కువికృత రూపములతో అనగా పందులు, కుక్కలు, పశువులు,దున్నలు, మొదలగు రూపములతో వత్తురు. భయంకరమూర్తులు వంకర ముక్కులు, మూడుకళ్ళు, పెద్దదవడలు,దీర్ఘాండములు, వ్రేలాడు పెదవులుగల్గి రక్తమాంసములు అలమిన శరీరములతో భయంకరమైన కోరలతో మండుచున్న నాలికలతో పాతాళమువంటి ముఖములతో వికృతములైన నేత్రములతో పిల్లులు గుడ్లగూబలు మిణుగురు వురుగులు ఆర్ద్రపురుగులట్లున్న తిరుగుడువడుచున్న కన్నులతో మెల్లకళ్ళతో నిప్పులట్లు మెఱయు చూపులతో ఆ యమదూతలు కనిపింతురు. భయంకరమైన పాములట్లుండు అయోమయములైన భూషణములతో పుర్రెల మాలలు ధరించి బుసలుకొట్టు నల్లతాచుల కంఠములకు చుట్టుకొని అగ్ని మంటలట్లున్న నిక్కిన తలవెంట్రుకలతో నూర కదలు రాగిరంగు, గోరోచనపురంగులోనున్న వ్రేలాడు గడ్డములతో కొందరికి రెండు నాలుగు పదహారు పది, ఇరువది మఱియు లెక్కలేనన్ని చేతులతో కొందరు వేయిచేతులతో మంటలుజిమ్ము వివిధాయుధములతో పాశములతో ఇనుపగొలుసులతో దండములతో వచ్చి హడలగొట్టుదురు. యముని ఆజ్ఞగొని జీవుల సర్వమూహరించి కొనిపోయి యమసదనము జేర్తురు. తడబడుచు,ఏడ్చుచు బొబ్బలిడుచు,అమ్మనాన్న కొడుకాయని జుట్టాలను బిలిచి ఏడ్చుచున్న కర్మచే చెడినవానిని శూలములచే బొడుచుచు నఇనుప గుదియలచే నడచుచు వజ్రసమానములైన దండములచే బాదుచు కత్తులచే నరకుచు బెల్లుగ నార్చుచు గృద్ధులైన కింకరులీడ్చుకొని పోవుచుండ నా జీవుడు దుఃఖమున కుమిలి మూర్ఛవడియుడుకెత్తి పోవ నిట్టటు లాగుచు సూదులట్లు గ్రుచ్చికొను గుశకంటకముల నీడ్చుచు పుట్ణల దొర్లించుచు శంకుపాషాణముల దొరలించుచు గులకరాళ్ళ కెరలించుచు కణకణ మండు మంటలలో కాలెడి ఎండలో ఒకవంక నక్కలు తినుచుండ జీవుడు నరకమార్గమున బోవును. ఇట పాపులు బెదరి బెదరి తడబడి ఆక్రందనము చేయుచు ఆ దారిని జనుచుందురు. కాలిన నేలపై ముండ్ల కంచెలలో కాలుచు దానముజేయని పిసినిగొట్టులు పయనింతురు. జీవఘాతకులు రక్తము రసి మొదలగువాని పాడుకంపుతో గొట్టు మేకపోతు శరీరముతో చర్మము కాలుచుండ వెళ్ళును. మఱియు పులుగులవలె గూయుచు నాక్రందించుచు వికృతముగ నాక్రోశించుచు వేదనకు గురియై వివిధాయుధములచే నరకబడుచు పొడువబడుచు జీవఘాతకులాదారిని పోవుదురు. మాంసము మెక్కిన జీవులు బల్లెములచే బొడవబడుచు ఱంపములచే గోయబడుచు ఎడ్లు దున్నలు మొదలగు వానిచే బొడవబడుచు పందులచే గీరబడుచు సూదులచే బొడవబడుచు కందిరీగలు కుట్ట మధుఘాతకులు (ఇతరుల నోటియందలి మధురమైన కూడు పడగొట్టినవారు) స్వామిద్రోహము జేసినవారు మిత్రఘాత స్త్రీఘాత చేసినవారు యమకింకరుల శస్త్రముల దెగి పోవలసియుండును. నిరపరాధములైన సాధుజంతుఘాత చేసినవారిని రాక్షసులాదారిలో కొరుక్కొని తినుచుందురు. పరస్త్రీల వస్త్రములపహరించినవారు ప్రేతలై దిగంబరులై యమాలయమునకు బరువులెత్తుదురు. గృహక్షేత్ర సువర్ణ వస్త్ర ధాన్యాదులను దొంగిలించిన పాపులు పాషాణములచే బడితెలచే బాదబడుచు గీలుకీలు పట్టువిడి రక్తములు గార ఆ దారివెంట పోవలసియుండును. బ్రాహ్మణుల కొట్టి ఘోష పెట్టించినవారు ఎండిన కాష్ఠములకు వేసి కట్టబడి కన్ను ముక్కు చెవులు గోయబడ చీము నెత్తురుచే నలముకొనబడి కాలుని గ్రద్దలచె నక్కలచే పీక్కొని తినబడుచు దండములచే బాదబడుచు మొరవెట్టుచు ఆ తెరవునందు బోవుదురు. ఇట్టి ఘోరమైన జ్వాలామయమైన రౌరవమను నరకము మానవుల కేర్పడినది.

కాలిన రాగివలె మంటలు జిమ్ముచు మిణుగురులు చెదర ముళ్ళజెముడు డొంకలతో నిండిన నిప్పుల యిసుకతో నిండి వహ్నికీటకమైన మార్గమున (వహ్ని=నిప్పుచేత కీటకము = నిష్ఠురము) మండుటెండ గాయు దారిని బాసి చనవలసియుండును. ఇట్లెంతో దూరము గడచినమీద రాగి యినుముతో నిర్మితమై లక్ష యోజనముల వైశాల్యము గల్గి నలుచదరముగా నాలుగు ద్వారములు గల యమనగరము వచ్చును. పదివేల యోజనములు ఎత్తైన బంగారు ప్రాకారములు దానికి గలవు. ఇంద్రనీలాది మణులచే అది శోబించుచుండును. దాని తూర్పుద్వారమున దేవ దానవ యక్ష రాక్షస పన్నగాది గణములుండును. వందలకొలది పతాకములెగురుచుండును. గంధర్వ అప్సరసలట నాడుచు పాడుచుందురు. ఆ తూర్పుద్వారమున ప్రవేశము దేవ ఋషి యోగి బృందములకు. యక్ష సిద్ధాదర విద్యాధరులకు మాత్రమే. ఉత్తరద్వారమున గంటలు మ్రోయుచుండును. ఛత్ర చామరాదులు సొంపు నింపుచుండును. అది నానా రత్నాలంకృతము. వీణా వేణు మృదంగాది మంగళధ్వనులు వినిపించుచుండును. ఋగ్యజుస్సామ వేద ఘోషముతో మునిబృందమందము గొలుపుచుండును. ఆ ద్వారమువెంట ప్రవేశము గలవారు ధర్మజ్ఞులు, సత్యవ్రతులు,వేసవిలో మంచినీరిచ్చినవారు, చలికాలమున వెచ్చదనమిచ్చినవారు, అలసటవడిన వారికి విశ్రాంతి నిచ్చినవారు, ప్రియభాషణము చేసినవారు, దానశూరులు, మాతా పితృసేవా తత్పరులు, గురుశుశ్రూష చేసినవారు, అతిథిపూజకులు,వీరికి ఉత్తర ద్వారము ప్రవేశద్వారము. ఇక పడమటి ద్వారము రత్నభూషితము. రంగురంగుల రత్నాల మెట్లుతొమరములు అచట రాణించును. భేరీ మృదంగ శంఖాదుల ధ్వనులు కాహళముల మేళవింపు (కాహళం = బాకా) వినిపించును. హర్షభరితులై శుభప్రదులైన సిద్దులయొక్క బృందములచే నది మారుమ్రోయుచుండును. ఆదారిని ప్రవేశమానంద భరితులకు భక్తులకు సర్వతీర్థస్నానము జేసినవారికి. పంచాగ్నుల సేవించినవారికి పుణ్యతీర్థ యాత్రలందు కాలంజర పర్వతములందు అగ్నియందు మరణించినవారికి శత్రునాశనము చేసికొన్నవారికి స్వామి (యజమాని) స్నేహితుడు, గోవులు, మొదలైనవానిరక్షణకొరకు హతులైన శూరులకు తపోధనులకు పశ్చిమద్వారమున ప్రవేశమీయబడును.

ఆ నగరమునకు దక్షిణద్వారము మహాభయంకరము, సర్వప్రాణి భయంకరము. హాహాకారమెత్తుచుండును. అంధకారబంధురము. సూదిమొనగల శిఖరములు ముళ్ళు తేళ్ళు వజ్రకీటములు (కర్రలదొలుచు పురుగులు) వీనిచే నడుగిడుటకు వీలుండదు. తోడేళ్ళు పులులు నక్కలతో సింహములు పిల్లులు గ్రద్దలు కణకణమండు ముఖములతో జరించు నాద్వారమున సర్వాపకారులైనవారికి ప్రవేశము. గోబ్రాహ్మణ వృద్ధులను బాధలలో నున్నవానిని శరణు జొచ్చినవానిని స్త్రీని మిత్రుని ఆయుధము చేతిలో లేనివానిని చంపినవారికిది ప్రవేశద్వారము. పొందరాని గురుపత్ని మొదలైన స్త్రీలను బొందినవారు మూఢులు పరద్రవ్యాహారకులు దాచనిచ్చిన వస్తువులు హరించినవారు విషము బెట్టిన వాండ్రు నిప్పంటినవారు పరభూగృహశయ్యా వస్త్ర భూషణాపహరులు పరుల లోపములనే వెదకు క్రూరులు అనృతవాదులు గ్రామమునకు రాష్ట్రమునకు పురమునకు దుఃఖము కల్గించినవారు అబద్ధసాక్ష్య మిచ్చినవారు కన్యల నమ్ముకొన్నవారు అభక్ష్య భక్షణ ప్రియులు కోడలిని కూతురును బొందినవాడ్రు తల్లిని దండ్రిని కటువుగ మాట్లాడినవారు మరి మహాపాతకులుగ చెప్పబడిన అందరు దక్షిణద్వారమున యమపురము ప్రవేశింతురు.

ఇది బ్రహ్మపురాణమున యమలోకమార్గ స్వరూపాఖ్యానమను నూట ఎనిమిదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment