Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – పదిహేడవ అధ్యాయం

సూర్యగ్రహ జననం ఎనిమిదవ భాగము

సూర్యుడు సంపత్ని స్వీకరించడానికి అంగీకరించాడు. విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి అదితి దంపతులను కలుసుకున్నారు.

త్రిమూర్తులూ , ఇతర దేవతలూ , మానస పుత్రులూ విశ్వకర్మ మందిరానికి విచ్చేశారు. అందరి సమక్షంలో సంజ్ఞాసూర్యుల వివాహం వైభవంగా జరిగింది. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలనీ , సంతానవంతులు కావాలనీ త్రిమూర్తులు దీవించారు.

అంతరిక్షంలో జ్యోతిర్మండలంలో ఉన్న సూర్య మండలంలో సూర్యుడి కోసం స్వర్ణ మందిరం నిర్మించమని శ్రీమహావిష్ణువు విశ్వకర్మకు సూచించాడు.

అద్భుతమైన స్వర్ణ మందిరాన్ని అల్లుడికి కానుకగా వెంటనే నిర్మించి ఇస్తానన్నాడు. విశ్వకర్మ. సంజ్ఞ , సూర్యుల కళ్యాణానికి సంధానకర్తగా వ్యవహరించిన నారదుణ్ణి త్రిమూర్తులు మెచ్చుకున్నారు.

అత్తవారింట కొన్ని రోజులు గడిపాడు సూర్యుడు.

సూర్యుడు సంజ్ఞను తీసుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. కశ్యపపత్నులందరూ సంజ్ఞను చూసి మురిసిపోయారు. అచిరకాలంలో సూర్యుడు తమను వదిలి , ధర్మపత్నితో ప్రత్యేకంగా జీవించబోతాడన్న ఆలోచన అదితికి విచారాన్ని కలిగించింది.

సూర్యుడి జననంలోని ఉద్దేశాన్నీ , భవిష్యత్తులో అతడిని వరించబోయే గ్రహరాజ పదవి లక్ష్యాన్నీ , సూర్యుడి ద్వారా జరగాల్సిన లోకోపకారాన్నీ వివరించి చెప్తూ , కశ్యపుడు అదితిని ఓదార్చాడు. “లోక బాంధవుడుగా విరాజిల్లే పుత్రుడు కావాలని కోరినప్పుడే నువ్వు తల్లిగా నీ స్వార్థాన్ని త్యాగం చేశావు ! మన సూర్యుడు ఎక్కడున్నా ఇక్కడున్నట్లే , అదితీ !” అన్నాడు కశ్యప ప్రజాపతి.

సూర్యమండలంలో మందిర నిర్మాణం పూర్తయ్యాక , విశ్వకర్మ కశ్యపాశ్రమానికి వచ్చాడు. నూతన మందిర ప్రవేశం చేయమని అల్లునికి విన్నవించాడు.

సూర్యుడు తల్లి దగ్గరా , తండ్రి దగ్గరా , పిన తల్లుల దగ్గరా సెలవు తీసుకున్నాడు. సంకల్పించిన క్షణంలో సన్నిధిలో ఉంటాననీ , విచారించవద్దనీ అమ్మను అనునయించాడు.

శ్రీమహావిష్ణువు ఆదేశాన్ని పాటించడం అందరి కర్తవ్యం అన్నాడు.. విశ్వకర్మ కూతురినీ , అల్లుడినీ తాను స్వయంగా నిర్మించిన ప్రత్యేక భవనంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.

సంజ్ఞ , సూర్యుల దాంపత్య జీవనం ప్రారంభమైంది. ఒకరికి , ఒకరుగా , ఇద్దరూ ఒకరుగా ఆకాశమందిరంలో , ఉద్యానవనంలో ఆనందయాత్ర సాగిస్తున్నారు. సూర్యపులు.

సంజ్ఞ ఎటు తిరిగితే సూర్యుడి కళ్ళు అటు తిరుగుతున్నాయి. తీగలాంటి శరీరం. మెరిసే శరీర వర్ణం. ప్రణయ కాంతుల్ని వెదజల్లే పెద్ద పెద్ద కళ్ళు. నడకని నాట్యంగా మార్చివేసే అందాల అందెల పాదాలు. ముఖవర్ణాన్నీ , సౌందర్యాన్నీ హెచ్చవేత వేసే జుత్తు. అడుగు అడుగుకూ అందంగా నర్తించే అందాల వాలుజడ. అన్నిటినీ మించి చిరుగాలికి కదిలే చిగురుటాకుల్లా ప్రణయోద్రేకంతో స్పందించే ఎర్రటి పెదవులు.

సంజ్ఞ అందం సూర్యుణ్ణి ఆమె కనుసన్నల్లో మెలిగేలా చేసింది…

సంజ్ఞ ప్రణయతికలా సమ్మోహనకరంగా నడుస్తూ , సూర్యుడిని సమీపించింది. ఆయన పాదాల ముందు కూర్చుని , అద్దంలాంటి ముఖాన్ని పైకెత్తి తదేకంగా చూసింది. సంజ్ఞ చూపులు సూర్యుడి కళ్ళల్లోకి దూసుకెళ్తున్నాయి.

“స్వామీ… మిమ్మల్ని ఏదో కోరాలనిపిస్తోంది ! ఇస్తారా ?” అంది మెల్లగా.

“నువ్వు కోరకుండానే అన్నీ నీకు ఇవ్వాలనుకున్నాను. కోరితే ఎందుకివ్వను ?” సూర్యుడు చిరునవ్వు నవ్వాడు.

“నాకు… నాకు… సంతానం కావాలి… ముగ్గురు !” సంజ్ఞ కంఠంలో నునుసిగ్గు తారట్లాడుతోంది.

“ముగ్గురా ?” సూర్యుడి కంఠంలో ఆశ్చర్యం..

“ఔను… ఇద్దరు కుమారులూ , ఒక కుమార్తే !” సంజ్ఞ ఆశగా అంది.

“అనుగ్రహిస్తారా ?”

“గ్రహించానుగా !” సూర్యుడు నవ్వుతూ అన్నాడు , పాదాల వద్ద నుండి ఆమెను పైకి లేవదీస్తూ.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment